తీపి కబురు | Snacks Food Distributors For Tenth Students In Medak | Sakshi
Sakshi News home page

తీపి కబురు

Published Fri, Feb 1 2019 10:58 AM | Last Updated on Fri, Feb 1 2019 10:58 AM

Snacks Food Distributors For Tenth Students In Medak - Sakshi

జిల్లాలోని పదోతరగతి విద్యార్థులకు తీపి కబురు అందింది.   పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కలెక్టర్‌ ధర్మారెడ్డి వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సాయంత్రం వేళల్లో స్నాక్స్‌ అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ  కార్యక్రమం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్చి 14 వరకు కొనసాగనుంది. సాయంత్రం వేళల్లో అల్పాహారంతో వారి ఆకలి తీరడంతో చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే వీలుంది.  దీంతో పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే 
అవకాశం ఉంది

పాపన్నపేట (మెదక్‌): జిల్లాలో 175 ప్రభుత్వ పాఠశాలలు, 67 ప్రైవేట్‌ పాఠశాలల్లో 11,361 మంది విద్యార్థులు ఈ యేడు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. గత ఏడాది  పరీక్షల్లో 90 శాతం ఫలితాలతో జిల్లా 9వ స్థానంలో నిలిచింది. కాగా ఈ విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు కలెక్టర్‌ ధర్మారెడ్డి, డీఈఓ రవికాంతరావు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జులై నెల నుంచి అన్ని పాఠశాలల్లో ‘లిటిల్‌ టీచర్‌ – లిటిల్‌ లీడర్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి తరగతిలో పది మంది విద్యార్థులకు ఒక గ్రూపును తయారు చేసి అందులో నుంచి ఒక లిటిల్‌ టీచర్, ఒక లిటిల్‌ లీడర్‌ను ఏర్పాటు చేస్తారు.

ఆరోజు జరిగిన పాఠ్యాంశానికి సంబంధించి ప్రశ్నలు తయారు చేసి సమాధానాలు రాస్తారు. అలాగే తెలియని విషయాలపై చర్చ కొనసాగిస్తారు. గ్రూపులోని విద్యార్థులంతా ప్రతిరోజూ ప్రత్యేక తరగతులకు వచ్చేలా లిటిల్‌ లీడర్‌ చర్యలు తీసుకుంటారు. సాధారణంగా తమకు వచ్చిన సందేహాలను ఉపాధ్యాయుడిని అడిగేందుకు కొంత మంది విద్యార్థులు వెనుకడుగు వేస్తుంటారు. ఈ పద్ధతిలో లిటిల్‌ లీడర్‌ ఆధ్వర్యంలో జరిగే చర్చ ద్వారా విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కలుగుతుంది. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 గంటల నుంచి 5.45 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వీటికి తోడు జిల్లా విద్యాశాఖ ప్రవేశపెట్టిన స్పెషల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఎలాగు అమలు చేస్తున్నారు.

ఆకలి తీర్చేందుకు.. స్నాక్స్‌...
ఉదయం ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులు సాయంత్రం 5.45 గంటల వరకు పాఠశాలల్లోనే ఉండాల్సి వస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం చేసే విద్యార్థులకు సాయంత్రం అయ్యే సరికి ఆకలి వేస్తుంది. ముఖ్యంగా పొరుగు గ్రామాల నుంచి వచ్చే విద్యార్థినీవిద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లే సరికి రాత్రి 7 గంటలు అవుతుంది. దీంతో వారు ఆకలికి తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందిని తీర్చడానికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్నాక్స్‌ ఇవ్వాలని  కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం వండే వంట ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు బిస్కెట్లు, బెబ్బర్లు, పెసర్లు, ఉప్మా, పల్లీలు, అటుకులు, పండ్లు  లాంటి అల్పాహారాన్ని అందించాలని తెలిపారు. ఇందుకు గాను ప్రతి విద్యార్థికి రూ.5 చొప్పున బడ్జెట్‌ మంజూరు చేయనున్నారు.

మార్చి 14వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ పథకం ద్వారా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 3,928 మంది బాలురు, 3,579 మంది బాలికలు ప్రయోజనం పొందనున్నారు. రెండేళ్ల క్రితం ఇలా పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్‌ పంపిణీ చేశారు. అలాగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు రూ.74.02 లక్షల వ్యయంతో 2 వేల డెస్క్‌లను 57 పరీక్ష కేంద్రాలకు పంపిణీ చేశారు.

చాలా ఆనందంగా ఉంది..
నేను పాపన్నపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను. ప్రతిరోజు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని చిత్రియాల నుంచి పాపన్నపేటకు సైకిల్‌పై వస్తున్నాను. ఉదయం 8.30 గంటలకే తరగతికి రావాల్సి ఉండటంతో తినకుండానే వస్తున్నాను. తిరిగి ఇంటికి వెళ్లే సరికి రాత్రి 6.30 గంటలవుతోంది. దీంతో సాయంత్రం 5 గంటల నుంచే ఆకలి వేస్తోంది.  కలెక్టర్‌ స్నాక్స్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది.  –తహమీద్, పదో తరగతి విద్యార్థి,  చిత్రియాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement