సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ట్యూషన్, రవాణా, ఇతర ఫీజులు చెల్లిస్తే తప్ప పరీక్ష ఫీజు కట్టించుకోమని తేల్చిచెబుతున్నాయి. ఈ నెల 15కల్లా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది.
కొన్ని పాఠశాలలు కోవిడ్ కాలంలో పెండింగ్‌లో ఉన్న ఫీజుల కోసం ఒత్తిడి తెస్తున్నాయి. ట్యూషన్ ఫీజు సగం చెల్లించిన వారికీ తిప్పలు తప్పడం లేదు. టెన్త్ పరీక్షల తర్వాత విద్యార్థులు పాఠశాలను విడిచి వెళ్తారని, అప్పుడు వసూలు చేయడం కష్టమని యాజమాన్యాలు భావిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఫలానా తేదీకల్లా మొత్తం ఫీజు చెల్లిస్తామని స్థానిక పెద్దల సమక్షంలో కొన్ని స్కూళ్లు హామీ పత్రాలు రాయించుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ వెసులుబాటు ఇచ్చేందుకు బడులు సుముఖంగా లేవు. వచ్చే మార్చిలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య 5 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో 3 లక్షల మంది ప్రైవేటు బడుల విద్యార్థులు ఉన్నారు.
సర్కారీ బడుల్లోనూ...
ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించడం కూడా కష్టంగా ఉంటోంది. వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాల్లో ప్రభుత్వమే ఈ ఫీజు చెల్లిస్తుంది. కానీ కొన్ని మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థలు పరీక్ష ఫీజులు చెల్లిస్తున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం విద్యార్థులు చెల్లించాల్సి వస్తోంది.
అయితే, వాస్తవ ఫీజుకు అదనంగా రూ.75 అధికంగా వసూలు చేస్తున్నారని కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఫిర్యాదులొచ్చాయి. పరీక్షలకు సంబంధించి జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లాల్సి రావడంతో అదనంగా వసూలు చేయాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నిర్ణీత ఫీజు కన్నా ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఇటీవల జిల్లా అధికారులను హెచ్చరించారు.
నిబంధనలు గాలికి..
వాస్తవానికి టెన్త్ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.125. దీన్ని బ్యాంకు చలాన్ ద్వారా సమర్పించే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. అయితే, ప్రైవేటు స్కూళ్లు మాత్రం ఫీజు తమకే చెల్లించాలని పట్టుబడుతున్నాయి. అది కూడా ప్రభుత్వం ప్రకటించిన ఫీజు కాకుండా రూ. వెయ్యి నుంచి రూ. 2 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. తాము బోర్డుకు చెల్లించే సమయంలో అనేక ఖర్చులుంటాయని యాజమాన్యాలు కుంటిసాకులు చెబుతున్నాయి.
ప్రభుత్వ గుర్తింపునకు అయ్యే ఖర్చు కూడా ఇందులోనే ఉంటుందని బుకాయిస్తున్నారు. పరీక్ష ఫీజుకు మాత్రం ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ క్రమంలో పెండింగ్ ఫీజుల విషయంలోనూ యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల నుంచి డొనేషన్లు, ట్యూషన్ ఫీజుల రూపంలో స్కూల్‌ను బట్టి రూ.30 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. పాఠశాల ప్రారంభంలో సగం ఫీజు వసూలు చేసిన యాజమాన్యాలు ఇప్పుడు మిగతా సగం కోసం ఒత్తిడి చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment