ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్ : సంక్షేమ వసతిగృహాల్లోని పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తోంది. పాఠశాలలో ఇప్పటికే పాఠ్యాంశ బోధన పూర్తి కాగా పునఃశ్చరణ కార్యక్రమాలు జోరందుకున్నాయి. పాఠశాల నుంచి హాస్టల్‌కు వచ్చిన తర్వాతా రివిజన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించిన సంక్షేమ శాఖలు ఈ మేరకు ప్రత్యేక తరగతులకు తెరలేపాయి. గతేడాది నిర్వహించిన స్పెషల్ స్టడీ అవర్స్ అత్యుత్తమ ఫలితాలు ఇవ్వగా.. ఈసారి మరింత శ్రద్ధతో వీటిని నిర్వహించేందుకు ఉపక్రమించాయి. ఇప్పటికే ఎస్సీ అభివృద్ధి శాఖ స్పెషల్ స్టడీ అవర్స్‌ను నిర్వహిస్తుండగా.. పండుగ సెలవులు పూర్తయిన తర్వాత వెనుకబడిన తరగతుల, గిరిజన సంక్షేమ శాఖలు కూడా ప్రారంభించనున్నాయి.
అదనపు శక్తి కోసం..
ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల తర్వాత భోజనం అనంతరం ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. రాత్రి 11 గంటల వరకు ఈ తరగతులు కొనసాగుతాయి. ప్రతి 45 నిమిషాలకు ఒక సబ్జెక్టు చొప్పున 4 సబ్జెక్టులను పునఃశ్చరణ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సందేహాలు తలెత్తితే వాటిని నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా ట్యూటర్ల ఏర్పాటుకు సంక్షేమ శాఖలు వెసులుబాటు కల్పించాయి. ఇందులో స్థానికంగా ఉన్న యువకులను భాగస్వామ్యం చేసుకోవచ్చని సూచించాయి. అదేవిధంగా విశ్రాంత ఉపాధ్యాయుడు లేదా సేవా దృక్పథం ఉన్న ఉపాధ్యాయులను కూడా భాగస్వామ్యం చేయవచ్చని స్పష్టం చేయడంతో చాలాచోట్ల యువతకు అవకాశం కల్పించారు.
రాత్రి భోజనం తర్వాత దాదాపు 3 గంటలకు పైగా విద్యార్థులు మేలుకోవాల్సి ఉండటంతో వారికి అదనపు శక్తి కోసం స్నాక్స్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిధులిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ మేరకు బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 నుంచి రూ.20 వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించింది. విద్యార్థులకు టీతోపాటు స్నాక్స్ కింద దిల్‌కుష్, దిల్‌పసంద్, సమోసా, జిలేబీ, మిర్చీ, ఎగ్ పఫ్, కర్రీ పఫ్ తదితరాలను పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ స్నాక్స్ శుభ్రమైన, తాజాగా ఉన్న వాటినే ఇవ్వాలని నిబంధన విధించడంతో క్షేత్రస్థాయిలో వసతిగృహ సంక్షేమాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నూరు శాతం ఫలితాలు సాధిస్తాం
స్పెషల్ స్టడీ అవర్స్ అత్యుత్తమ ఫలితాలు ఇస్తున్నాయి. గతేడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 2017–18 విద్యా సంవత్సరంలో హాస్టల్ విద్యార్థుల ఉత్తీర్ణత 90 శాతం ఉండగా.. 2018–19లో 97.26 శాతానికి పెరిగింది. ఈ ఏడాది నూరు శాతం ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. ఆ మేరకు వసతిగృహ సంక్షేమాధికారులకు ఆదేశాలు జారీ చేశాం. తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉంది.
– పి.కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment