Welfare hostels students
-
హాస్టల్ విద్యార్థులకు శుభవార్త
సాక్షి, భీమవరం: రాష్ట్రంలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అండగా నిలుస్తోంది. తాజాగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇచ్చే డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంపుదల చేస్తూ జీఓలను విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 1 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయి. ఇందుకోసం అదనంగా డైట్ చార్జీలకు రూ.132 కోట్లు, కాస్మోటిక్ చార్జీలకు రూ.48 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, తదితర సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం 2012లో మెస్ చార్జీలను పెంచింది. గత ఎన్నికలకు ముందు (2018) టీడీపీ ప్రభుత్వం హడావుడిగా నామమాత్రంగా డైట్ చార్జీలను పెంచినా అవి అమల్లోకి రాలేదు. నాటి నుంచి ఇప్పటివరకూ హాస్టల్ విద్యార్థులకు పాత చార్జీలనే అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. 67 హాస్టళ్లు.. 2,500 మంది విద్యార్థులు జిల్లాలో 38 ఎస్సీ, 29 బీసీ హాస్టళ్లలో సుమారు 2,500 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఎస్సీ హాస్టళ్లలో 1,251 మంది, బీసీ హాస్టళ్లలో 1,321 మంది ఉన్నారు. వీరందరికీ చార్జీల పెంపు వల్ల ప్రయోజనం కలుగుతుంది. అలాగే హాస్టళ్లలో చేరేందుకు పేద విద్యార్థులు మరింత ఆసక్తి చూపుతారని అధికారులు అంటున్నారు. పేదల చదువులకు అన్నివిధాలా అండగా ఉంటున్న సీఎం జగన్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది హాస్టళ్లలో విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచడం ద్వారా రానున్న విద్యాసంవత్సరం నుంచి వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం పెంచిన చార్జీలు వచ్చే జూన్ నుంచి అమలులోకి రానున్నాయి. –జీవీఆర్‌కేఎస్‌ఎస్ గణపతిరావు, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి, భీమవరం -
టెన్త్ విద్యార్థులకు దిల్కుష్..!
సాక్షి, హైదరాబాద్ : సంక్షేమ వసతిగృహాల్లోని పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తోంది. పాఠశాలలో ఇప్పటికే పాఠ్యాంశ బోధన పూర్తి కాగా పునఃశ్చరణ కార్యక్రమాలు జోరందుకున్నాయి. పాఠశాల నుంచి హాస్టల్‌కు వచ్చిన తర్వాతా రివిజన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించిన సంక్షేమ శాఖలు ఈ మేరకు ప్రత్యేక తరగతులకు తెరలేపాయి. గతేడాది నిర్వహించిన స్పెషల్ స్టడీ అవర్స్ అత్యుత్తమ ఫలితాలు ఇవ్వగా.. ఈసారి మరింత శ్రద్ధతో వీటిని నిర్వహించేందుకు ఉపక్రమించాయి. ఇప్పటికే ఎస్సీ అభివృద్ధి శాఖ స్పెషల్ స్టడీ అవర్స్‌ను నిర్వహిస్తుండగా.. పండుగ సెలవులు పూర్తయిన తర్వాత వెనుకబడిన తరగతుల, గిరిజన సంక్షేమ శాఖలు కూడా ప్రారంభించనున్నాయి. అదనపు శక్తి కోసం.. ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల తర్వాత భోజనం అనంతరం ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. రాత్రి 11 గంటల వరకు ఈ తరగతులు కొనసాగుతాయి. ప్రతి 45 నిమిషాలకు ఒక సబ్జెక్టు చొప్పున 4 సబ్జెక్టులను పునఃశ్చరణ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సందేహాలు తలెత్తితే వాటిని నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా ట్యూటర్ల ఏర్పాటుకు సంక్షేమ శాఖలు వెసులుబాటు కల్పించాయి. ఇందులో స్థానికంగా ఉన్న యువకులను భాగస్వామ్యం చేసుకోవచ్చని సూచించాయి. అదేవిధంగా విశ్రాంత ఉపాధ్యాయుడు లేదా సేవా దృక్పథం ఉన్న ఉపాధ్యాయులను కూడా భాగస్వామ్యం చేయవచ్చని స్పష్టం చేయడంతో చాలాచోట్ల యువతకు అవకాశం కల్పించారు. రాత్రి భోజనం తర్వాత దాదాపు 3 గంటలకు పైగా విద్యార్థులు మేలుకోవాల్సి ఉండటంతో వారికి అదనపు శక్తి కోసం స్నాక్స్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిధులిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ మేరకు బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 నుంచి రూ.20 వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించింది. విద్యార్థులకు టీతోపాటు స్నాక్స్ కింద దిల్కుష్, దిల్పసంద్, సమోసా, జిలేబీ, మిర్చీ, ఎగ్ పఫ్, కర్రీ పఫ్ తదితరాలను పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ స్నాక్స్ శుభ్రమైన, తాజాగా ఉన్న వాటినే ఇవ్వాలని నిబంధన విధించడంతో క్షేత్రస్థాయిలో వసతిగృహ సంక్షేమాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నూరు శాతం ఫలితాలు సాధిస్తాం స్పెషల్ స్టడీ అవర్స్ అత్యుత్తమ ఫలితాలు ఇస్తున్నాయి. గతేడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 2017–18 విద్యా సంవత్సరంలో హాస్టల్ విద్యార్థుల ఉత్తీర్ణత 90 శాతం ఉండగా.. 2018–19లో 97.26 శాతానికి పెరిగింది. ఈ ఏడాది నూరు శాతం ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. ఆ మేరకు వసతిగృహ సంక్షేమాధికారులకు ఆదేశాలు జారీ చేశాం. తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉంది. – పి.కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు -
చలికాలం..చన్నీళ్లు..
గ్రామీణ ప్రాంత విద్యార్థుల సంక్షేమానికిపెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలుచెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగాకనిపిస్తోంది.అన్నిచోట్ల సమస్యలే తాండవిస్తున్నాయి. చలికాలంలో చన్నీటి స్నానంతో వణికి పోవడంఒక ఎత్తయితే.. దుప్పట్లు లేక రాత్రి గజగజలాడిపోతున్నారు. కాస్మొటిక్ చార్జీలు అందలేదు..మరుగుదొడ్ల సమస్యలు వెంటాడుతున్నాయి..ఆరుబయట చన్నీళ్ల స్నానం తలుచుకుంటేనేభయమేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాఒక్కటేమిటీ? హాస్టళ్లలోఎక్కడ చూసినా సంక్షేమం గాలిలోదీపంలా తయారైంది. సాక్షి కడప : పేద విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా వెలసిన హాస్టళ్లలో సం‘క్షామం’ వెంటాడుతోంది. కాలాలు మారుతున్నా.. పాలకులు ప్రత్యేక చట్టాలు తీసుకు వస్తున్నా విద్యార్థుల జీవితాలు మాత్రం బాగుపడటం లేదు.ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనత వెరసి విద్యార్థుల సౌకర్యాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. హాస్టళ్లపైసంబంధిత అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించకపోవడంతో అక్కడ ఇష్టారాజ్యం కొనసాగుతోంది. చలికాలంలో ఉదయాన్నే ప్రజలు సైతం బయటికి రావడానికి జంకుతున్నారు. హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు ఉదయాన్నే....ఆరుబయట చన్నీళ్ల స్నానం చేయాలంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటేనే వణుకు ప్రారంభమవుతుంది. మరికొన్ని హాస్టళ్లలో దుప్పట్ల సమస్య వెంటాడుతుండగా, ఇంకొన్ని చోట్ల మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి...ప్రాథమిక చికిత్స కిట్లు లేవు. ఇరుకైన గదుల్లో పడుకున్న పరిస్థితులు దర్శనమిస్తున్నాయి.అంతేకాదు కాస్మోటిక్ చార్జీలు మొదలుకొని కొన్నేళ్లవుతున్నా పాత ట్రంకు పెట్టెలు, కంచాల్లోనే విద్యార్థులు భోజనాన్ని ఆరగిస్తున్నారు. జిల్లాలో బీసీ, ఎస్సీ ఎస్టీ హాస్టళ్లు 147 ఉండగా, అందులో దాదాపు 15 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం చలి కాలం ప్రారంభమైంది. దుప్పట్ల సంగతి పక్కన పెడితే పాఠశాలకు వెళ్లాలంటే పొద్దునే స్నానం చేయాలి. కొంతమంది బాత్రూముల్లో చేస్తే మరికొంతమంది ఆరుబయట చేయాల్సిన పరిస్థితి. విద్యార్థులు గజగజ వణికి పోతున్నారు. వేడినీళ్లు లేకపోవడంతో వారు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ప్రభుత్వం కనీసం పెద్ద అండాలు (పాత్రలు) అందించి వేడినీళ్లు కాచుకునే అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. చాలాచోట్ల కనిపించని దుప్పట్లు చలికాలం వచ్చిందంటే రాత్రి సమయంలో దుప్పటి ఉండాల్సిందే! చాలాచోట్ల దుప్పట్లు లేని పరిస్థితి.జమ్మలమడుగులోని ఎస్సీ బాలుర, బాలికల హాస్టళ్లలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న వారు ఉంటున్నారు. వీరికి దుప్పట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చిట్వేలిలోని బాలికల హాస్టల్లో కూడా దుప్పట్లు ఇవ్వలేదు.రాత్రిళ్లు అవస్థలు తప్పడం లేదు. కనిపించని మెడికల్ కిట్లు జిల్లాలోని చాలా హాస్టళ్లలో మెడికల్ కిట్లు కనిపించడం లేదు. రైల్వేకోడూరు పరిధిలోని కొర్లకుంట వద్దనున్న హాస్టళ్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారికి సమస్య ఏర్పడితే 13 కిలోమీటర్లలో ఉన్న ఓబులవారిపల్లె పీహెచ్‌సీకి వెళ్లాలి. ఇదొక్క హాస్టలే కాదు..చాలాచోట్ల ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అదికారులు ముందుజాగ్రత్తగా మెడికల్ కిట్లను ఉంచాలని పలువురు కోరుతున్నారు. కంచాలు, ట్రంకుపెట్టెలు ఏవీ! జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో పేదరికంలో మగ్గుతున్న విద్యార్థులే ఎక్కువమంది చదువుతుంటారు. వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి విద్యార్థులకు అందించే ట్రంకు పెట్టెలు, గ్లాసులు, ప్లేట్లు మార్చి కొత్తవి అందించాల్సి ఉంది. ఇప్పటికి ఏడేళ్లు దాటినా ఇంతవరకు వారి గురించి పట్టించుకోలేదు. ప్లేట్లు నొక్కులు పడినా.... చిలుం పట్టినా వాటిల్లోనే తినాల్సివస్తోంది. గ్లాసులది కూడా ఇదే స్థితి. మరుగుదొడ్లు, బాత్రూములకు సమస్యలు జిల్లాలోని హాస్టళ్లలో బాలికలతోపాటు బాలురు చదువుతున్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండటంతో అవస్థలు తప్పడం లేదు. బద్వేలులోని బీసీ–1, బీసీ–2 హాస్టళ్లకు సంబంధించి రెండూ ఒకే చోట ఉండడంతో వసతి సమస్య వెంటాడుతోంది. మరుగుదొడ్లకు సంబంధించి విద్యుత్ లేకపోవడంతో రాత్రిపూట తిప్పలు పడతున్నారు. రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు ఇలా అన్నిచోట్ల మరుగుదొడ్లు తగినన్ని లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిటికి తలుపులు, కిటికీలు లేవు. కాస్మొటిక్స్ చార్జీల విషయంలోనూ ఆలస్యం కొనసాగుతోంది. జూన్ నుంచి ఇప్పటివరకు కాస్మొటిక్ ఛార్జీలు అందించలేదు. దాదాపు రెండు నెలలుగా విద్యార్థులు వాటికోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతినెల అందిస్తేనే సబ్బు, నూనె, పౌడర్, ఇతర సామాగ్రి కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అందులోనూ గతంలో నెలకు రూ. 60 ఇచ్చేవారు. ప్రస్తుతం అంతో ఇంతో పెంచినప్పటికీ అది కూడా సక్రమంగా ఇస్తేనే ప్రయోజనం. ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్మోటిక్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అద్దె భవనాల్లో హాస్టళ్లు ప్రభుత్వం ఖర్చులు పెరుగుతున్నాయని.. విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని, నాణ్యమైన విద్య కోసం రెసిడెన్సియల్ తరహాలో సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎన్ని చెబుతున్నా...ఇప్పటికీ జిల్లాలో చాలాచోట్ల హాస్టళ్లన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వేలకు వేలు నెలనెల బాడుగలు చెల్లిస్తున్నారే తప్ప నూతన భవనాల నిర్మాణాలు చేపట్టలేదు. జిల్లాలో 147 హాస్టళ్లు ఉండగా, 47 హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పైగా అక్కడ ఇరుకిరుకు గదుల్లోనే విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. అంతేకాకుండా అద్దె భవనాల్లో సౌకర్యాలు కూడా అంతంత మాత్రమేనని చెప్పవచ్చు. -
రెసిడెన్షియల్ విద్యార్థులను తీర్చిదిద్దండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని, దేశంలోని ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు లభించేలా బోధన జరగాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. అర్హులైన ప్రతి విద్యార్థికి రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశం దక్కేలా చూడాలన్నారు. గురువారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లు, కళాశాలలు, పాఠశాలలకు గ్రేడింగ్ విధానం రూపొందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధుల వ్యయం పెంచాలని, స్టడీ సర్కిళ్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇవ్వాలన్నారు. భూ పంపణీ పథకం లబ్ధిదారులు వ్యవసాయం చేసేలా సహకారం అందించాలని సూచించారు. వ్యవ సాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నందున ఈ వేసవిలో 17 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా తట్టుకునేలా విద్యుత్ అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. -
సంక్షామం
సంక్షేమ వసతిగృహాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణం, ఇరుకు గదులు, సరైన తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు లేకపోవడం తదితర సమస్యలతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపర్చడంపై ప్రభుత్వం ఏమాత్రమూ శ్రద్ధ చూపడం లేదు. వాటి నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. దీంతో సిబ్బంది ‘ఆడిందే ఆట..పాడిందే పాట’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. ప్రస్తుతం చలితీవ్రతకు విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. వారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. అయినా ఎవరూ వారి బాగోగుల గురించి పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంలోని జాయింట్ కలెక్టర్ నివాసానికి కూతవేటు దూరంలో బీసీ, డీఎన్టీ (నిమ్నజాతుల) వసతి గృహాలు ఉన్నాయి. వీటిని స్థానిక బీ క్యాంప్‌లోని ఆర్అండ్బీ క్వార్టర్లలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. దీంతో విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వర్షాకాలం, చలి కాలంలో ఇబ్బందులు రెట్టింపవుతున్నాయి. గదులకు తలుపులు ఉంటే కిటికీలు లేవు.. కిటికీలుంటే తలుపులు లేవు. పలు గదుల కిటికీలకు రెక్కలు లేకపోవడంతో చలిగాలి లోపలికి ప్రవేశిస్తోంది. గోనెసంచులు, దుప్పట్లు అడ్డం పెడుతున్నా..ప్రయోజనం ఉండడం లేదు. కార్పెట్లు, బెడ్షీట్లు సరఫరా చేసినా.. గదులు సక్రమంగా లేకపోవడంతో నిద్ర కరువవుతోందని విద్యార్థులు వాపోతున్నారు. జిల్లాలోని చాలా హాస్టళ్లలో దాదాపు ఇవే పరిస్థితులు ఉన్నాయి. కర్నూలు(అర్బన్): జిల్లా వ్యాప్తంగా మొత్తం 175 వసతిగృహాలు (కళాశాల హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు కలిపి) ఉన్నాయి. వీటిలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 75, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 78, గిరిజన సంక్షేమ శాఖ కింద 22 నడుస్తున్నాయి. అద్దె భవనాల సంగతి దేవుడెరుగు కానీ.. సొంత భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాల్లోనూ కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఇరుకు గదుల్లో ఉండటానికి విద్యార్థులు అవస్థ పడుతున్నారు. తిరగని ఫ్యాన్లు, తలుపులు లేని వాకిళ్లు, రెక్కలు లేని కిటికీలు దర్శనమిస్తున్నాయి. సరైన విద్యుత్, తాగునీటి సౌకర్యం కూడా లేదు. అనేక హాస్టళ్లలో విద్యార్థులు దోమలతో సావాసం చేస్తూ అనారోగ్యాలకు గురవుతున్నారు. కిటికీలకు మెష్ కూడా లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణం కారణంగా దోమలు విపరీతంగా వస్తున్నాయి. వీటి వల్ల అనేక మంది విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. పలుచోట్ల డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. మురికినీరు హాస్టల్ ప్రాంగణంలోనే నిల్వ ఉంటోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్లు లేని చోట బహిర్భూమికి వెళ్తున్నారు. కొన్నిచోట్ల టాయిలెట్లు ఉన్నా, నీటి సమస్యతో నిరుపయోగంగా మారాయి. దోమతెరల ఊసే లేదు హాస్టల్ విద్యార్థులకు ప్రతియేటా ఒక కార్పెట్, ఒక బెడ్‌షీట్ చొప్పున ఇస్తున్నారు. అయితే.. దోమతెరల ప్రతిపాదన ఏదీ లేదు. ఎవరైనా దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి అందించాల్సి ఉంది. కిటికీలకు మెష్‌ల విషయంలోనూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రతిపాదనలకు మోక్షమేదీ? బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన 27 వసతి గృహాల్లో మరమ్మతుల కోసం రూ. 3,41,40,000 అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే 51 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులకు రూ.2,27,35,000 అవసరమని ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రతిపాదనలు పంపించారు. ఇంతవరకు ఎలాంటి నిధులు విడుదల కాలేదు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆలూరు, ఆళ్లగడ్డ, పాలెంచెరువు ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పలు మరమ్మతులు చేపట్టేందుకు రూ.2.50 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే.. ఆలూరు, ఆళ్లగడ్డలో కొత్తగా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6.50 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు సమాచారం. పాలనా అనుమతులు మాత్రం ఇంతవరకు లభించలేదు. మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో పలు మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాం. గత ఏడాది పంపిన ప్రతిపాదనలకు సంబంధించి రూ.69 లక్షలు విడుదల కాగా, ఈ నిధులతో ఇంగల్దహాల్, కోడుమూరు బాలికలు, కళాశాల వసతి గృహాల్లో పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది 27 వసతిగృహాల్లో పలు పనులు చేపట్టేందుకు రూ.3.41 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నిధులు విడుదలైన వెంటనే కిటికీలకు రెక్కలు, మెష్, వాకిళ్లకు తలుపులు ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తాం. –బి.సంజీవరాజు, జిల్లా బీసీ సంక్షేమాధికారి -
సంక్షోభ హాస్టళ్లు!
చదువు కోవాలనే ఆశయంతో తల్లిదండ్రులకు దూరంగా.. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. శిథిలమైన భవనాలు..విరిగిన తలుపులు, కిటికీలు..ఊడిపోయిన గచ్చుల మధ్యే కాలాన్ని నెట్టుకొస్తున్నారు. అయినా పిల్లల బాగోగుల గురించి పాలకులు పట్టించుకోవడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ..ఇలా ఏ హాస్టల్ చూసినా ఇదే పరిస్థితి. తాగునీరు, మరుగుదొడ్లు లేకపోయినా సర్దుకుపోతున్న పిల్లలకు సకాలంలో యూనిఫాం, దుప్పట్లు కూడా పాలకులు అందించలేకపోయారు. శీతాకాలం ప్రారంభం కావడంతో రాత్రి పూట విద్యార్థులు చలితో గజగజ వణికిపోతున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: సంక్షేమ వసతి గృహాలు సంక్షోభంగా మారుతున్నాయి. విద్యార్థుల సంక్షేమానికి నిధులు వెచ్చిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో కనిపించడం లేదు. దీంతో విద్యార్థులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. సాంఘిక, బీసీ వసతి గృహాలకు చెందిన అనేక భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరి కొన్నింటికి ఏకంగా కిటికీలు, తలుపుల్లేవు. కనీసం కిటీకీలకు మెస్లేక విద్యార్థులు చలిలో వణుకుతూ, దోమలతో సావాసం చేస్తూ రోగాల బారిన పడుతున్నారు. సకాలంలో అందని యూనిఫాం: ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడిచినా, ఇప్పటికీ పలు వసతి గృహాల విద్యార్థులకు యూనిఫారాలు అందలేదు. ప్రీమెట్రిక్‌లో ఉన్నవారికి ఒక విద్యార్థికి నాలుగు జతలు యూనిఫాం అందజేయాలి. అయితే సాంఘిక సంక్షేమ విద్యార్థుల కు పూర్తిగా అందజేశారు. బీసీ సంక్షేమ విద్యార్థులకు సంబంధించి కొన్ని వసతి గృహాల్లో నాలుగు జతలు, మరికొన్ని వసతి గృహాల్లో సగం మాత్రమే అందజేశారు. మిగిలినవి కుట్టు పనులో స్థాయిలో ఉన్నాయి. జిల్లాలో వసతి గృహాల పరిస్థితి: బీసీ వసతి గృహాలు: బీసీ సంక్షేమ శాఖ పరి«ధిలో 94 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో ప్రీమెట్రిక్ 73, పోస్టు మెట్రిక్ 21 ఉన్నాయి. ప్రీమెట్రిక్ వసతి గృహాలు 73లో బాలురుకి 62, బాలికలకు 11 ఉన్నాయి. వీటిలో బాలురు 5,889 మంది కాగా బాలికలు 1280 మంది ఉంటున్నారు. పోస్టు మెట్రిక్ వసతి (కళాశాల) గృహాలు 21 ఉన్నాయి. వీటిలో పురుషులకు 10, మహిళలకు 11 ఉన్నాయి. వీటిలో పురుషులు 1131, మహిళలు 1682 మంది చదువుతున్నారు. అద్దె భవనాలే దిక్కు: బీసీ సంక్షేమ శాఖలో ఉన్న పోస్టుమెట్రిక్‌లో ఒకటి మినహా మిగిలిన వన్ని అద్దెభవనాల్లోనే నడుస్తున్నాయి. ప్రీమెట్రిక్ వసతి గృహాలు 73 ఉండగా 51 హాస్టళ్లకు మాత్రమే సొంత భవనాలు ఉండగా.. 17 అద్దె భవనాల్లో, అయిదు తుఫాన్ షెల్టర్లలో నడుస్తున్నాయి. సొంత భవనాలు కూడా పాతవి కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. కిటికీలు, తలుపులు, ద్వారాలు పుచ్చుపోయి, విరిగిపోయాయి. మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. వీటి మరమ్మతులకు ఇటీవల 3.80 కోట్ల రూపాయల నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. సాంఘిక సంక్షేమ శాఖలో..: జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 42 వసతి గృహాలు నడుస్తున్నాయి. వీటిలో ప్రీమెట్రిక్ విభాగంలో 26, పోస్టుమెట్రిక్‌లో 16 ఉన్నాయి. ప్రీమెట్రిక్‌లో బాలురుకి 15, బాలికలకు 11 వసతి గృహాలు ఉండగా.. బాలురు 1582 మంది, బాలికలు 1155 ఉంటున్నారు. పోస్టు మెట్రిక్ విభాగంలో 16 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 9 పురుషులు, 7 మహిళలకు కేటాయించారు. వీటిలో 612 మంది పురుషులు, 494 మంది మహిళలు ఉంటున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలన్నీ సొంత భవనాలే. అయితే కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిలో 31 వసతి గృహాలకు మరమ్మతులు అవసరం ఉంది. ఇందుకోసం రూ. 2.90 కోట్లు కేటాయించారు. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. -
చలించరా ?
అమ్మగోరుముద్దలు, నాన్న మురిపాల ముద్దులతో ఆనందంగా కేరింతలు కొట్టాల్సిన విద్యార్థులు చదువుల చట్రంలో, హాస్టళ్ల బందిఖానాలో నలిగిపోతున్నారు. అధికారులను అడిగినా, పాలకులను కదిలించినా ఒకటే సమాధానం.. ప్రభుత్వ హాస్టళ్లలో అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఇది నిజమేనా అని జిల్లా వ్యాప్తంగా సాక్షి గురువారం రాత్రి తొమ్మిది గంటలకు హాస్టళ్లను విజిట్ చేసింది. అక్కడ సరైన దుప్పట్లు లేక, చలికి తాళలేక చిన్నారులు మూడంకె వేసి పడుకున్నారు. వసతి గృహాలకు రక్షణ గోడలు లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సరిపడా మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత, రాత్రి కాపలా ఇలా ఏ ఒక్క వసతీ కన్ను పొడిచినా కనిపించ లేదు. ఈ సమస్యలు రోజూ చూస్తున్న అధికారులు ఇప్పటికైనా ‘చలి’స్తారా ?. సాక్షి, అమరావతి బ్యూరో/ కొరిటెపాడు: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో తలదాచుకుంటున్నారు. తలుపులు, కిటికీలు పగిలిపోవడంతో రాత్రి వేళ చలికి గజగజ వణికిపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన చాలీచాలని దుప్పట్లు చలి నుంచి విద్యార్థులను కాపాడలేకపోతున్నాయి. ఇరుకు గదులు కావడంతో పడుకునేందుకు స్థలం సరిపోక అల్లాడుతున్నారు.. తలుపులు, కిటికీలకు మెస్‌లు లేకపోవడంతో దోమల్లో విలవిలలాడుతున్నారు. కొన్ని హాస్టళ్లలో దోమ తెరలు సరఫరా చేయలేదు. శ్లాబ్‌లకు పెచ్చులూడిపోతున్నాయి. బాలికల హాస్టల్లో సైతం సరిపడా మరుగుదొడ్లు లేవు. కొన్ని చోట్ల తాగేందుకు నీరు సక్రమంగా అందుబాటులో లేదు. కొన్ని హాస్టల్లో విద్యార్థులకు కాస్మిటిక్ ఛార్జీలు సక్రమంగా అందటలేదు. మెను ప్రకారం భోజనం వడ్డించడం లేదు. దొడ్డు బియ్యం కావడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. మొత్తం మీద విద్యార్థులు అసౌకర్యాల మధ్య ఆవేదన చెందుతున్నారు. దోమతెరలు లేవు గుంటూరు వెస్ట్ పరిధిలో దుప్పట్లు, దోమల ఖీంకరింపులు, అపరిశుభ్ర వాతావరణం మధ్య విద్యార్థులు విలవిలలాడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడింది. నగరంలోని లాడ్జి సెంటర్ కూడలిలో ఎస్సీ, బీసీ, ఏటీ అగ్రహారంలోని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు ఎక్కువయ్యాయి. దోమ తెరలు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇరుకు గదుల్లో.. గుంటూరువారితోటలోని ప్రభుత్వ కాలేజీ బాలుర వసతి గృహం ఇరుకైన అద్దె భవనంలో కొనసాగుతుంది. విద్యార్థులు ఇరుకైన గదుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం రూ. లక్షలు వెచ్చించి అద్దె చెల్లిస్తున్నా విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాజాగారితోటలో ఉన్న ఎస్సీ వసతి గృహంలో 176 మంది విద్యార్థులు ఒక వసతి గృహంలో, మరో వసతి గృహంలో 160 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరూ ఆరుగదుల్లో బస చేయాల్సి రావడంతో సరిపోక వరండాలో పడుకుంటున్నారు. ఇక్కడ ఆర్వో పాంటు మరమ్మతులకు గురికావడంతో నీరు సక్రమంగా అందడం లేదు. ఈ ఏడాది సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు రూ. 367.67 లక్షలు, బీసీ సంక్షేమ హాస్టళ్లకు రూ. 754.01 లక్షలు, ఎస్సీ హాస్టళ్లకు రూ.689 లక్షలు మాత్రమే కేటాయించారు. అద్దె భవనాల్లో అగచాట్లు చిలకలూరిపేట సాంఘిక వసతి గృహం అద్దె భవనంలో కొనసాగుతోంది. పట్టణంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో నాలుగు నెలల క్రితం బోర్వెల్ మరమ్మతులకు గురైంది. ఇప్పటికీ వాటిని తయారు చేయించకపోవడంతో నాలుగు రోజులకొకసారికి వచ్చే ట్యాంకరు నీటిపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇక్కడ 99 మంది విద్యార్థులుడున్నారు. బీసీ హాస్టల్లో ఒకే మరుగుదొడ్డి ఉంది. దుప్పట్లు లేవు నరసరావుపేటలో ఓకే గదిలో పది మందికిపైగా విద్యార్థులు నిద్రిస్తున్నారు. దోమల బెడదకు తోడు ఫ్యాన్లు తిరగక, దుప్పట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం గౌడోన్కు ఉపయోగించే షెడ్డును హాస్టల్‌గా మార్చారు. నరసరావుపేట రూరల్ పరిధిలోని రెడ్డినగర్ ఎస్టీ హాస్టల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. కిటికీలకు, తలుపులకు మెష్‌లు లేకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. తలుపులకు మెష్‌లు లేవు పొన్నూరు బీసీ వసతి గృహంలో 70 మంది విద్యార్థులున్నారు. రూముల శ్లాబు బాగా దెబ్బతింది. వసతి గృహాల్లో ఉన్న బాత్రూము, మరుగుదొడ్లకు తలుపులు లేవు. ఫ్యాన్లు తిరగడం లేదు. కిటికీలు, తలుపులు ఊడడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. చేబ్రోలు కళాశాల బీసీ బాలికల వసతి గృహంలో అద్దె రేకుల షెడ్డులోనే కొనసాగుతోంది. పెదకాకాని బీసీ బాలికల వసతి గృహంలో 110 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ వాటర్ పైపులైను లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. రేపల్లెలో పట్టణంలోని బాలికల వసతి గృహాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాస్మెటిక్స్ అందడం లేదు సత్తెనపల్లిలో కాస్మెటిక్ సక్రమంగా అందడం లేదు. చలి నుంచి రక్షణ కవచం లేక వణికిపోతున్నారు. విరిగిన ట్రంక్కు పెట్టేలే వీరికి దిక్కు. ఆహారానికి రేషన్ బియ్యం వాడడంతో కొంత మంది కడుపు నొప్పితో అనారోగ్యానికి గురవుతున్నారు. బాలికలకు నాఫ్తీన్లను సరఫరా చేయడం లేదు. మరుగుదొడ్లు అధ్వానం తుళ్లూరు మండలంలో ఉన్న వసతి గృహాలను నిర్వీర్యం చేసి విద్యార్థులను మంగళగిరి, గుంటూరు ప్రాంతాలకు తరలించారు. తాడికొండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అద్దె భవనంలో నడుస్తుండటంతో విద్యార్థులకు సరైన వసతులు లేవు. ఫిరంగిపురం బీసీ హాస్టల్లో మరుగుదొడ్లు, బాత్రూములు అధ్వానంగా మారాయి. వార్లెన్లు ఎక్కడ ? తెనాలిలో వార్డెన్లు అందుబాటులో ఉండటం లేదు. గదులకు తలుపులు, కిటికీలు లేవు. కొన్ని గదుల్లో ఫ్లోరింగ్ లేకపోవడం, గదులపై భాగాన పెచ్చులూడి ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మంచినీళ్లు లేవు వినుకొండ వసతి గృహంలో కిటికీలకు, తలుపులకు మరమ్మతులు లేవు. ఈపూరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, బాలుర వసతి గృహాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో ఆరుబయటకు వెళుతున్నారు. వినుకొండ సాంఘిక సంక్షేమ గిరిజన బాలుర వసతి గృహంలో మంచినీరు లేవు. సరైన వెలుతురు లేదు గురజాలలో ఊరి చివర పంట పొలాల్లోని అద్దె భవనాల్లో హాస్టల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ మరుగుదొడ్డి, బాత్రూములు లేవు. పిడుగురాళ్ల బాలుర, బాలికల వసతి గృహాలు అధ్వానంగా మారాయి. మాచవరంలో చదువుకునేందుకు కనీసం లైటింగ్ సౌకర్యం లేదు. దాచేపల్లిలోని బీసీ హాస్టల్ గృహంలో తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మెనూ పాటించడం లేదు మాచర్ల రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న బీసీ బాలికల ఉన్నత హాస్టల్, ఎస్సీ బాలికల హాస్టల్, సీసీ రోడ్డులోని ఎస్సీ బాలికల ఉన్నత హాస్టల్లో విద్యార్థులు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మెనూ ప్రకారం భోజనం సక్రమంగా వడ్డించకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు. వేమూరులోని ప్రభుత్వ బీసీ హాస్టల్లో మరుగుదొడ్లు లేక బాలికలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 70 మంది విద్యార్థినులకు ఒకే మరుగుదొడ్డి ఉంది. కాస్మెటిక్ చార్జీలు నాలుగు నెలలకు కూడా ఇవ్వడం లేవు. -
నిద్రలేని రాత్రులు గడుపుతున్న విద్యార్థులు
సాక్షి, ఖమ్మం: రెండురోజులుగా చలి తీవ్రత పెరగడంతో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు వణికిపోతున్నారు. వసతిగృహాల్లో ఊడిన తలుపులు, కిటికీలకు మరమ్మతులు చేయకపోవడంతో హాస్టల్ గదుల్లో విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మరోవైపు దోమల స్వైర విహారంతో వారికి కంటిమీద కునుకు ఉండడం లేదు. అధికారులు మాత్రం దుప్పట్లు పంపిణీ చేశామని చెబుతున్నారు. మంగళవారం ‘సాక్షి’ పరిశీలన లో మాత్రం పలుచోట్ల విద్యార్థులకు సరిపడా దుప్పట్లు లేనట్లు బయటపడింది. జిల్లాలోని 63 బీసీ హాస్టళ్లలో 5,977 మంది విద్యార్థులు, 71 ఎస్సీ హాస్టళ్లలో 5,620 మంది, 121 ఎస్టీ, ఆశ్రమ పాఠశాలల్లో 35 వేల మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. బీసీ హాస్టళ్లు చాలా వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అసౌకర్యాల నడుమే విద్యార్థులు ఈ హాస్టళ్లలో ఉంటున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. చాలీచాలని గదులు, అరకొర మరుగుదొడ్లు, ఆరుబయట స్నానాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చలికాలం ముంచుకొచ్చినా విద్యార్థులకు సరిపడా దుప్పట్లు పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పలుచోట్ల స్నానాల గదులు సరిపడా లేకపోవడంతో విద్యార్థులు షిప్టుల వారీగా స్నానాలు చేస్తూ కనిపించారు. చలి కాలం ప్రారంభానికి ముందే విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలి. కానీ ఇప్పటి వరకు పలు హాస్టళ్లలో దుప్పట్లు పంపిణీ కాకపోవడం గమనార్హం. పలు హాస్టళ్ల గదుల తలుపులు, కిటికీలు ఊడివున్నాయి. వీటికి నిధులు మంజూరైనా మరమ్మతులు మాత్ర ం చేయడం లేదు. చలి నేరుగా గదుల్లోకి వస్తుండడంతో విద్యార్థులు వణికిపోతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కిటికీలు, తలుపుల మరమ్మతులకు జిల్లాలోని ఎస్టీ హాస్టల్స్‌కు రూ.3.55 లక్షలు, బీసీ హాస్టల్స్‌కు రూ. 6 లక్షలు మంజూరయ్యాయి. కానీ నేటికీ ఈ నిధులతో మరమ్మతలు మాత్రం చేయించలేదు. విద్యార్థులు తమ గోడు చెప్పుకుందామన్నా పలువురు హాస్టల్ వార్డెన్లు స్థానికంగా..అందుబాటులో ఉండటం లేదు. స్థానికంగా ఉండని వార్డెన్లు నిబంధనల ప్రకారం సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు వసతిగృహాల్లోనే రాత్రి బస చేయాలి. కానీ పలు హాస్టళ్ల వార్డెన్లు రాత్రి వేళల్లో వసతిగృహాల్లో బస చేయకుండా సమీపంలోని పట్టణ కేంద్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రి వేళలో విద్యార్థులకు ఏమైనా జరిగినా పట్టించుకునే వారే లేరు. టేకులపల్లిలోని బీసీ బాలుర వసతి గృహానికి వాచ్‌మనే విద్యార్థులకు తోడుగా హాస్టల్లో బస చేస్తున్నాడు. ఖమ్మం నగరంలోని ఎస్టీ బాలికల హాస్టల్లో కూడా వార్డెన్ సక్రమంగా రాకపోవడంతో విద్యార్థులు తమ అవసరాలను ఆయాలకే చెప్పుకోవాల్సి వస్తోంది. మణుగూరు, పినపాక మండలాల్లోని హస్టల్ వార్డున్లు విద్యార్థులకు అందుబాటులో ఉండడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా మంది వార్డెన్లు ఇలానే రాకపోకలు చేస్తున్నారు. ఇటీవల విద్యార్థులు విష జ్వరాల బారిన పడుతున్నా వార్డెన్లు మాత్రం ఇంకా నిద్రావస్థలోనే ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పలు హాస్టళ్లలో పరిస్థితి ఇలా.. బయ్యారం ఎస్టీ హాస్టల్లో పలు గదులకు కిటికీలు, తలుపులు లేవు. మండల కేంద్రంలోని ఎస్టీ హస్టల్లో 78 మంది విద్యార్థులు ఉన్నారు. హాస్టల్ గదులకు కిటికీలు, తలుపులు లేకపోవడంతో రాత్రి వేళ చలిగాలి వీస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గార్ల మండల కేంద్రంలో నైజాం కాలంలో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరింది. ఈ భవనంలోనే బీసీ బాలికల వసతిగృహాన్నీ నిర్వహిస్తున్నారు. ఇది వర్షాలకు కురుస్తుండడం, స్లాబు పై పెచ్చులు ఊడుతుండడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సత్తుపల్లి ఎస్పీ బాలుర హాస్టల్లో దుప్పట్లు ఉన్నా విద్యార్థులు పడుకునే గదుల కిటికీలకు రెక్కలు లేవు. అసలే చలితీవ్రత పెరగడంతో కిటికీలకు రెక్కలు లేక విద్యార్థులు వణికిపోతున్నారు. పెనుబల్లి, వేంసూరు హాస్టళ్లలో కూడాఇదే పరిస్థితి. భద్రాచలంలో ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. ఉన్న మరుగుదొడ్లు సరిగా పనిచేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదువుకోవటానికి ఏర్పాటు చేసిన ఇన్వర్టర్లు పనిచేయకపోవడంతో కరెంట్‌లేని సమయంలో విద్యార్థులు అంధకారంలోనే ఉంటున్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో వెంకటాపురం గిరిజన బాలుర వసతి గృహంలో ఐటీడీఏ, నాబార్డు నిధులతో రూ. కోటి ఖర్చు చేసి నూతన భ వనాన్ని నిర్మించి ఇచ్చారు. కానీ ఆ వసతిగృహంలో విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. ఖమ్మంలోని కాల్వొడ్డు గిరిజన బాలుర వసతిగృహంలో దుప్పట్లు, గదులకు కిటికీలు సరిగా లేక విద్యార్థులు చలికి వణుకుతున్నారు.