చలికాలం..చన్నీళ్లు.. | Hostel Students Suffering With Cold Water In YSR Kadapa | Sakshi
Sakshi News home page

చలికాలం..చన్నీళ్లు..

Published Sat, Nov 3 2018 1:33 PM | Last Updated on Sat, Nov 3 2018 1:33 PM

Hostel Students Suffering With Cold Water In YSR Kadapa - Sakshi

బద్వేలు ఎస్సీ వసతిగృహంలో చలిలో స్నానం చేస్తున్న విద్యార్థులు

గ్రామీణ ప్రాంత   విద్యార్థుల సంక్షేమానికిపెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలుచెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగాకనిపిస్తోంది.అన్నిచోట్ల సమస్యలే తాండవిస్తున్నాయి.
చలికాలంలో చన్నీటి స్నానంతో వణికి పోవడంఒక ఎత్తయితే.. దుప్పట్లు లేక రాత్రి గజగజలాడిపోతున్నారు. కాస్మొటిక్‌ చార్జీలు అందలేదు..మరుగుదొడ్ల సమస్యలు వెంటాడుతున్నాయి..ఆరుబయట చన్నీళ్ల స్నానం తలుచుకుంటేనేభయమేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాఒక్కటేమిటీ?   హాస్టళ్లలోఎక్కడ చూసినా సంక్షేమం గాలిలోదీపంలా తయారైంది.  

సాక్షి కడప : పేద విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా వెలసిన హాస్టళ్లలో సం‘క్షామం’ వెంటాడుతోంది. కాలాలు మారుతున్నా.. పాలకులు ప్రత్యేక చట్టాలు తీసుకు వస్తున్నా విద్యార్థుల జీవితాలు మాత్రం బాగుపడటం లేదు.ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనత వెరసి విద్యార్థుల సౌకర్యాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. హాస్టళ్లపైసంబంధిత అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించకపోవడంతో అక్కడ ఇష్టారాజ్యం కొనసాగుతోంది.   చలికాలంలో ఉదయాన్నే ప్రజలు సైతం బయటికి రావడానికి జంకుతున్నారు.  హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు ఉదయాన్నే....ఆరుబయట చన్నీళ్ల స్నానం చేయాలంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటేనే వణుకు ప్రారంభమవుతుంది.

మరికొన్ని హాస్టళ్లలో దుప్పట్ల సమస్య వెంటాడుతుండగా, ఇంకొన్ని చోట్ల మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి...ప్రాథమిక చికిత్స కిట్లు లేవు. ఇరుకైన గదుల్లో  పడుకున్న పరిస్థితులు దర్శనమిస్తున్నాయి.అంతేకాదు కాస్మోటిక్‌ చార్జీలు మొదలుకొని కొన్నేళ్లవుతున్నా పాత ట్రంకు పెట్టెలు,  కంచాల్లోనే విద్యార్థులు భోజనాన్ని ఆరగిస్తున్నారు.
 జిల్లాలో  బీసీ, ఎస్సీ ఎస్టీ హాస్టళ్లు 147 ఉండగా, అందులో దాదాపు 15 వేల మంది   విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం చలి కాలం ప్రారంభమైంది. దుప్పట్ల సంగతి పక్కన పెడితే పాఠశాలకు వెళ్లాలంటే పొద్దునే స్నానం చేయాలి. కొంతమంది బాత్‌రూముల్లో చేస్తే మరికొంతమంది ఆరుబయట చేయాల్సిన పరిస్థితి. విద్యార్థులు గజగజ వణికి పోతున్నారు. వేడినీళ్లు లేకపోవడంతో వారు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు.  ప్రభుత్వం కనీసం  పెద్ద అండాలు (పాత్రలు) అందించి వేడినీళ్లు కాచుకునే అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

చాలాచోట్ల కనిపించని దుప్పట్లు
 చలికాలం వచ్చిందంటే రాత్రి సమయంలో   దుప్పటి ఉండాల్సిందే! చాలాచోట్ల దుప్పట్లు లేని పరిస్థితి.జమ్మలమడుగులోని ఎస్సీ బాలుర, బాలికల హాస్టళ్లలో  ఇంటర్, డిగ్రీ చదువుతున్న వారు ఉంటున్నారు. వీరికి   దుప్పట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చిట్వేలిలోని బాలికల హాస్టల్‌లో కూడా దుప్పట్లు ఇవ్వలేదు.రాత్రిళ్లు అవస్థలు తప్పడం లేదు.

కనిపించని మెడికల్‌ కిట్లు
జిల్లాలోని చాలా హాస్టళ్లలో మెడికల్‌ కిట్లు కనిపించడం లేదు. రైల్వేకోడూరు పరిధిలోని కొర్లకుంట వద్దనున్న హాస్టళ్లలో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారికి  సమస్య ఏర్పడితే  13 కిలోమీటర్లలో ఉన్న ఓబులవారిపల్లె పీహెచ్‌సీకి వెళ్లాలి. ఇదొక్క హాస్టలే కాదు..చాలాచోట్ల ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అదికారులు ముందుజాగ్రత్తగా మెడికల్‌ కిట్లను ఉంచాలని పలువురు కోరుతున్నారు.

కంచాలు, ట్రంకుపెట్టెలు ఏవీ!
 జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో పేదరికంలో మగ్గుతున్న విద్యార్థులే ఎక్కువమంది చదువుతుంటారు. వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన ప్రభుత్వం   పట్టించుకుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి విద్యార్థులకు అందించే ట్రంకు పెట్టెలు, గ్లాసులు, ప్లేట్లు మార్చి కొత్తవి అందించాల్సి ఉంది.  ఇప్పటికి ఏడేళ్లు దాటినా ఇంతవరకు వారి గురించి పట్టించుకోలేదు. ప్లేట్లు  నొక్కులు పడినా.... చిలుం పట్టినా వాటిల్లోనే తినాల్సివస్తోంది. గ్లాసులది కూడా ఇదే స్థితి.  

మరుగుదొడ్లు, బాత్‌రూములకు సమస్యలు
జిల్లాలోని హాస్టళ్లలో బాలికలతోపాటు బాలురు చదువుతున్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండటంతో అవస్థలు తప్పడం లేదు. బద్వేలులోని బీసీ–1, బీసీ–2 హాస్టళ్లకు సంబంధించి రెండూ ఒకే చోట ఉండడంతో వసతి సమస్య  వెంటాడుతోంది. మరుగుదొడ్లకు సంబంధించి విద్యుత్‌ లేకపోవడంతో రాత్రిపూట  తిప్పలు పడతున్నారు. రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు ఇలా అన్నిచోట్ల మరుగుదొడ్లు తగినన్ని లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.  కొన్నిటికి  తలుపులు, కిటికీలు లేవు. కాస్మొటిక్స్‌ చార్జీల విషయంలోనూ ఆలస్యం కొనసాగుతోంది. జూన్‌ నుంచి ఇప్పటివరకు కాస్మొటిక్‌ ఛార్జీలు అందించలేదు. దాదాపు రెండు నెలలుగా విద్యార్థులు వాటికోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతినెల అందిస్తేనే సబ్బు, నూనె, పౌడర్, ఇతర సామాగ్రి కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అందులోనూ గతంలో నెలకు రూ. 60 ఇచ్చేవారు. ప్రస్తుతం అంతో ఇంతో పెంచినప్పటికీ అది కూడా సక్రమంగా ఇస్తేనే ప్రయోజనం. ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్మోటిక్‌ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అద్దె భవనాల్లో హాస్టళ్లు
ప్రభుత్వం ఖర్చులు పెరుగుతున్నాయని.. విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని, నాణ్యమైన విద్య కోసం రెసిడెన్సియల్‌ తరహాలో  సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎన్ని చెబుతున్నా...ఇప్పటికీ జిల్లాలో చాలాచోట్ల హాస్టళ్లన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వేలకు వేలు నెలనెల బాడుగలు చెల్లిస్తున్నారే తప్ప నూతన భవనాల నిర్మాణాలు చేపట్టలేదు.  జిల్లాలో 147 హాస్టళ్లు ఉండగా, 47 హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పైగా అక్కడ ఇరుకిరుకు గదుల్లోనే విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. అంతేకాకుండా అద్దె భవనాల్లో సౌకర్యాలు కూడా అంతంత మాత్రమేనని చెప్పవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement