భీమవరం బీసీ హాస్టల్‌లో భోజనం చేస్తున్న విద్యార్థులు
సాక్షి, భీమవరం: రాష్ట్రంలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అండగా నిలుస్తోంది. తాజాగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇచ్చే డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంపుదల చేస్తూ జీఓలను విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 1 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయి.
ఇందుకోసం అదనంగా డైట్ చార్జీలకు రూ.132 కోట్లు, కాస్మోటిక్ చార్జీలకు రూ.48 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, తదితర సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం 2012లో మెస్ చార్జీలను పెంచింది. గత ఎన్నికలకు ముందు (2018) టీడీపీ ప్రభుత్వం హడావుడిగా నామమాత్రంగా డైట్ చార్జీలను పెంచినా అవి అమల్లోకి రాలేదు.
నాటి నుంచి ఇప్పటివరకూ హాస్టల్ విద్యార్థులకు పాత చార్జీలనే అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
67 హాస్టళ్లు.. 2,500 మంది విద్యార్థులు
జిల్లాలో 38 ఎస్సీ, 29 బీసీ హాస్టళ్లలో సుమారు 2,500 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఎస్సీ హాస్టళ్లలో 1,251 మంది, బీసీ హాస్టళ్లలో 1,321 మంది ఉన్నారు. వీరందరికీ చార్జీల పెంపు వల్ల ప్రయోజనం కలుగుతుంది.
అలాగే హాస్టళ్లలో చేరేందుకు పేద విద్యార్థులు మరింత ఆసక్తి చూపుతారని అధికారులు అంటున్నారు. పేదల చదువులకు అన్నివిధాలా అండగా ఉంటున్న సీఎం జగన్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది
హాస్టళ్లలో విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచడం ద్వారా రానున్న విద్యాసంవత్సరం నుంచి వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం పెంచిన చార్జీలు వచ్చే జూన్ నుంచి అమలులోకి రానున్నాయి.
–జీవీఆర్‌కేఎస్‌ఎస్ గణపతిరావు, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment