చరిత్ర ఎరుగని వినూత్న నమూనాలు | Sakshi Guest Column On AP CM Jagan Govt School Students | Sakshi
Sakshi News home page

చరిత్ర ఎరుగని వినూత్న నమూనాలు

Published Fri, Feb 23 2024 12:40 AM | Last Updated on Fri, Feb 23 2024 12:40 AM

Sakshi Guest Column On AP CM Jagan Govt School Students

వైఎస్‌ జగన్‌ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత, గత 75 ఏళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి నమూనాను మార్చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర మానవాభివృద్ధికి బలమైన పునాది వేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. పిల్లల నాణ్యమైన విద్య కోసం ఖర్చు చేయడం మానవ వనరుల అభివృద్ధికి ఖర్చు చేయడమే తప్ప మరొకటి కాదు. దేశంలోని వికృతమైన విద్యా వ్యవస్థలో ఇది అత్యంత కష్టతరమైన సంస్కరణ. పాఠశాలలు, కళాశాలలపై దృష్టి సారించే మానవశక్తి అభివృద్ధి నమూనాను ఇంతవరకూ ఏ మూడవ ప్రపంచ దేశంలోనూ ప్రయత్నించలేదు. అలాగే, ప్రతి సంక్షేమ పథకాన్నీ పర్యవేక్షించడానికీ వాలంటీర్లను నియమించడం కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో పూర్తిగా కొత్త ఆలోచన.

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్సార్‌సీపీకీ, చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ, భావోద్వేగ సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీలకూ మధ్య పోటీ నెలకొంది. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు తమిళనాడులో వలె నామమాత్రపు ఆటగాళ్లుగా ఉన్నాయి. ఆసక్తికరంగా, బీజేపీ రాష్ట్ర శాఖకు చంద్రబాబు వదిన పురందేశ్వరి నాయకత్వం వహిస్తుండగా, కాంగ్రెస్‌ రాష్ట్ర శాఖను జగన్‌మోహన్‌ రెడ్డి చెల్లెలు షర్మిల నడిపిస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు, తమ సమీప బంధువులైన ప్రాంతీయ పార్టీల అధినేతలను ఇబ్బంది పెట్టేందుకు మహిళా అధ్యక్షులను ఎంపిక చేశాయి. ఇలాంటి పరిస్థితి  దేశంలో ఎక్కడా లేదు. 

2014 ఎన్నికల నుంచి జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి చంద్రబాబు పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 102 సీట్లు గెలుచుకున్న చంద్రబాబు, 2019లో కేవలం 23 సీట్లు గెలుచుకుని జగన్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అందుకే ఇప్పుడు ఆయన జనసేన, బీజేపీతో పొత్తుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇది కచ్చితంగా బాబులో ఉన్న అలజడిని తెలియజేస్తోంది.

2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీపై చంద్రబాబు దూషణలు చేసినందున, ప్రధాని ఆయనకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ‘అందితే జుట్టు... అందకపోతే కాళ్ళు’ అనే తెలుగు సామెత చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు రాజకీయ జీవితం. ఇప్పుడు చంద్రబాబు రాజకీయ స్థితిని మోదీ చక్కగా ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే, ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు చాలా కీలకమైనవి. ఎందు కంటే వైఎస్‌ జగన్‌ 175 సీట్లలో 151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత, గత 75 ఏళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ప్రయత్నించని విధంగా రాష్ట్ర అభివృద్ధి నమూనాను మార్చేశారు. రాష్ట్రంలోని పాఠశాల, విశ్వవిద్యాలయ విద్య ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడం ద్వారా వైఎస్‌ జగన్, భౌతిక అభివృద్ధి అని పిలుచుకునే అభివృద్ధి నమూనాను మానవ అభివృద్ధి నమూనాగా మార్చారు. గత ఐదేళ్లలో రాష్ట్ర మానవాభివృద్ధికి బలమైన పునాది వేయడానికి జగన్‌ అనేక చర్యలు తీసుకున్నారు.

ఆయన తీసుకున్న మొదటి అడుగు – ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టడం. భారతదేశంలోని వికృతమైన విద్యా వ్యవస్థ చరిత్రలో ఇది అత్యంత కష్టతరమైన సంస్కరణ. పట్టణ పేదల పిల్లలను, వ్యవసాయ రంగంలోని శ్రామిక జనాల పిల్లలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటూ కదలలేని ప్రాంతీయ భాషా విద్యా విధానంలో ఉంచాయి. భాషాప్రయుక్త రాష్ట్రాల ఆలోచన పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల మెడకు చుట్టుకుంది. ధనవంతులు తమ పిల్లలను ప్రైవేట్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో చేర్పిస్తే, గ్రామీణ ప్రజలలో మాత్రం ప్రాంతీయ భాషావాదం ప్రచారం చేశారు.

పాఠశాల మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, ఆర్థిక స్థోమత లేని పిల్లలకు మంచి ఆహారం కోసం బడ్జెట్‌ను ఖర్చు చేయడానికి ఏ ప్రభుత్వమూ కూడా సిద్ధపడలేదు. పిల్లల నాణ్యమైన విద్య కోసం ఖర్చు చేయడం మానవ వనరుల అభివృద్ధికి ఖర్చు చేయడమే తప్ప మరొకటి కాదు. అసెంబ్లీల బడ్జెట్‌ సమావేశాల్లో చర్చలన్నీ రోడ్లు, భవ నాలు, అప్పుడప్పుడు డ్యామ్‌లకు మాత్రమే డబ్బు ఖర్చు చేసే విధంగా సాగుతుంటాయి. ఇలాంటి భౌతిక అభివృద్ధిలో భారీ మొత్తంలో డబ్బులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళతాయి. 

పాఠశాల విద్యకూ, విశ్వవిద్యాలయ విద్యకూ; పేద పిల్లల తల్లిదండ్రుల ఖాతాలకు నగదు బదిలీ పథకాలకూ గణనీయమైన మొత్తంలో బడ్జెట్‌ను కేటాయించడం ద్వారా ఆ నమూనాను జగన్‌ ప్రభుత్వం మార్చింది. ఇది దళారుల పాత్రను రూపుమాపింది. ఈ మార్పు అంతరార్థం ఏమిటంటే దళారీ వ్యవస్థ బలహీనపడుతుంది. తాము పొరపాటున అధికారంలోకి వచ్చినా, పాత భౌతిక వనరుల అభివద్ధి నమూనా వైపు తిరిగి వెళ్లలేమన్నది ప్రతిపక్ష పార్టీల ఆందో ళన. అదే వైఎస్‌ జగన్‌ తిరిగి అధికారంలోకి వస్తే, సంస్కరణలు మరింత లోతుగా సాగుతాయి.

పది పదిహేనేళ్లలో మంచి విద్యావంతులు, ఆత్మవిశ్వాసం ఉన్న గ్రామీణ యువత సామాజిక–రాజకీయ వ్యవస్థలోకి వస్తారు. మానవ వనరుల అభివృద్ధికి అలవాటు పడిన ఆర్థిక వ్యవస్థను మార్చడానికి వారు అనుమతించరు. పైగా ఉద్యోగ స్వామ్యంతో పనిలేని అవినీతి రహిత కార్యకలాపాల కోసం పని చేస్తారు.
వివిధ స్థాయుల పరిపాలనలో ‘సివిల్, పోలీసు నియంతల’ వలె పని చేయాలనుకునే అవినీతి ఉద్యోగులు, ఉన్నత స్థాయి బ్యూరో క్రాట్లు కూడా ఈ మానవ అభివృద్ధి నమూనాకు మద్దతు ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ నగదు బదిలీ జీవితాన్ని రుచి చూసిన పేద గ్రామీణ, పట్టణ ప్రజలు కొత్త వ్యవస్థకు కచ్చితంగా మద్దతు ఇస్తారు.

ప్రతి సంక్షేమ పథకాన్నీ పర్యవేక్షించడానికీ వాలంటీర్లను నియమించడం ప్రజాస్వామ్య పరిపాలనలో పూర్తిగా కొత్త ఆలోచన. వృద్ధులకు, రోగులకు ప్రభుత్వం నుండి వృద్ధాప్య పింఛన్‌ అందేలా లేదా రేషన్‌ వంటి ప్రయోజనాలను ఇంటి వద్దే ఇచ్చేలా వీరు సాయపడుతున్నారు. మధ్య, ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్లు గ్రామాల్లో ఉన్న స్వచ్ఛంద సేవకులపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక గ్రామంలోని వాలంటీర్‌ ప్రతి గ్రామస్థునికీ ఒక సహాయ హస్తం!

పాఠశాలలు, కళాశాలలపై దృష్టి సారించే మానవశక్తి అభివృద్ధి నమూనాను ఇంతవరకూ ఏ మూడవ ప్రపంచ దేశంలోనూ ప్రయత్నించలేదు. ఉదాహరణకు, చైనా... విద్య, ఆరోగ్య వ్యవస్థలలో ఒక రకమైన సారూప్య వ్యవస్థను ప్రయత్నించింది. వారు పెద్ద సంఖ్యలో కాలినడక వైద్యులను నియమించారు. మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థ లతో కూడిన అసమానమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను కూడా జగన్‌ కల్పించారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించడంలో ఇది ఎంతో సహాయపడింది. ఆరోగ్య రంగంలో కూడా గ్రామ వాలంటీర్లు చక్కటి పని చేస్తున్నారు. ఈ కొత్త ప్రయోగాలన్నీ దేశంలోని కాంట్రాక్టర్‌ వర్గాన్ని ఆశ్చర్యపరిచాయి.

కాంట్రాక్టర్‌ వర్గం భౌతికాభివృద్ధిని కోరుకుంటుంది కానీ భారీ స్థాయి మానవ శక్తి అభివృద్ధిని కాదు. తెలంగాణలో నా చిన్నతనంలో స్థానిక భూస్వాములు ఊరి స్కూల్‌ టీచర్లను చదువు చెప్పవద్దనీ, జీతం తీసుకుని ఇంట్లో సంతోషంగా ఉండమనీ అనేవారు. పల్లెటూరి పిల్లలందరూ చదువుకుంటే తమ పశువుల చుట్టూ బాలకార్మికులుగా ఎవరు పని చేస్తారు, పెద్దయ్యాక జీతగాళ్లుగా ఎవరు పని చేస్తారన్నది వారి తర్కం.

ఆ సమయంలో భూస్వాములు విద్య ద్వారా మానవ శక్తిని అభివృద్ధి చేయడాన్ని భూస్వామ్య వ్యతిరేకతగా చూశారు. ఇప్పుడు ఏపీలో ఇంగ్లీషు విద్యావంతులైన మానవశక్తిని అభివృద్ధి చేయడాన్ని కాంట్రాక్ట్‌ వ్యతిరేక పెట్టుబడిగా చూస్తున్నారు. కాంట్రాక్ట్‌ పెట్టుబడికీ, ప్రైవేట్‌ విద్యా రంగానికీ, చంద్రబాబుకూ చాలా దగ్గరి సంబంధం ఉంది.2024 ఎన్నికలలో జగన్‌ గెలిస్తే ఈ మోడల్‌ దాని మూలాలను మరింత లోతుగా పాతుకుపోయేలా చేస్తుంది. పైగా దానిని ఎవరూ మార్చలేరు. ఇది జాతీయ విద్యావ్యవస్థపై కూడా ప్రభావం చూపు తుంది.


ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement