బీద పిల్లల గురించి ఆలోచించండి! | Sakshi Guest Column On AP CM Jagan Govt Welfare To Poor Students | Sakshi
Sakshi News home page

బీద పిల్లల గురించి ఆలోచించండి!

Published Thu, May 9 2024 4:35 AM | Last Updated on Thu, May 9 2024 4:51 AM

Sakshi Guest Column On AP CM Jagan Govt Welfare To Poor Students

అభిప్రాయం

ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ వాళ్లు గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్‌ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను, ముఖ్యంగా హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో ఇంగ్లిష్‌ భాష, విదేశీ సిలబస్‌ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయకత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది. జగన్‌ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకూ వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. తెలుగుకు ప్రాధాన్యమంటూ ఇంగ్లిష్‌ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. జాగ్రత్తగా ఆలోచించి ఓటెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్‌ అంధకారమౌతుంది.

దేశంలో ఎన్నికలు మొదటిసారి ఓబీసీల (వెనుకబడిన తరగతుల) చుట్టూ తిరుగు తున్నాయి. ఓబీసీల్లో అన్ని శూద్ర కులాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని శూద్ర వ్యవసాయ కులాలు రిజర్వేషన్లలో లేకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు. ఉదాహరణకు రెడ్డి, కమ్మ, కోస్తా కాపు కులాలు రిజర్వేషన్లలో లేవు. కర్ణాటకలో, తమిళనాడులో అన్ని శూద్ర కులాలు రిజర్వేషన్లలో ఉన్నాయి. లింగాయత్, వక్కళిగ, నాయకర్‌ (పెరియార్‌ కులం) కులాలు కూడా ఆ రాష్ట్రాల్లో రిజర్వేషన్లలో ఉన్నాయి.

చారిత్రకంగా వర్ణ వ్యవస్థలో నాలుగవ వర్ణం శూద్రులు. వేద కాలంలో వారు బానిసలు. తరువాత వ్యవసాయ, కుటీర పరిశ్రమ, పశుపోషణ వంటి అన్ని ఉత్పత్తి పనులు చేసి దేశాన్ని ఈ స్థితికి తెచ్చింది ఈ కులాలే. క్రమంగా వీరి నుండి విడగొట్టబడి అంటరాని వారుగా అణగదొక్కబడ్డవారు దళితులు. వీరు కాక అరణ్య జీవనం నుండి అందరిలో కలిసే ప్రయత్నం చేస్తున్నవారు ఆదివాసులు.

ఇంగ్లిష్‌ మీడియం వంటి సమాన విద్యే ఈ కుల వ్యవస్థను కూల్చుతుందని మనకు ఈమధ్య కాలంలోనే అర్థమవుతోంది. అందుకు మంచి ఉదాహరణ ఈ సంవత్సరం 10వ తరగతిలో ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్నవారు ఆంధ్రలో 91 శాతం పాస్‌ అయితే, తెలంగాణలో 93 శాతం పాసయ్యారు. తెలుగు మీడియంలో చదువుకున్నవారు 80 శాతంగానే పాసయ్యారు.

రిజర్వేషన్ల మాటేమిటి?
అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం, అందులో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లను క్రమంగా ఎత్తివేసే సవరణ చెయ్యడం గురించి చర్చ జరుగుతోంది. ఈ భయం బీజేపీ బయట ఉన్న వారికే కాదు, బీజేపీలో ఉన్నవారికి కూడా ఉన్నది. అయితే మరి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఆయన బీసీ అని చెబుతున్నారు కనుక ఎలా తీసేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది? ఆరెస్సెస్‌ 1950లో రాజ్యాంగాన్ని డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆనాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌కు అందించి అమలు చేసిన నాటి నుండి ఎస్సీ, ఎస్టీలకు అందులో పొందుపర్చిన రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకతతో ఉంది. అంతకంటే ముఖ్యంగా 1955లో కాకా కాలేల్‌కర్‌ బీసీ రిజర్వేషన్‌ రిపోర్టును ఆనాటి నెహ్రూ ప్రభుత్వం తిరస్కరించినప్పుడు ఆరెస్సెస్‌ మంచి పని జరిగింది అనే ధోరణిలో ఉంది.

అయితే 1990లో వీపీ సింగ్‌ ప్రభుత్వం బీపీ మండల్‌ రిపోర్టును అమలు చేసినప్పుడు ఆరెస్సెస్‌/బీజేపీ వ్యతిరేకించాయి. ఆనాడు కాంగ్రెస్‌ కూడా వ్యతిరేకించింది. కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నాయకులు కొంతమందైనా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చేశారు. కానీ బీజేపీలో ఉన్న బీసీల్లో ఒక్క ఉమాభారతి తప్ప వేరే ఏ ఒక్క బీసీ లీడర్‌ కూడా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చెయ్యలేదు. నరేంద్ర మోదీ ఆనాడు రిజర్వే షన్లను సపోర్టు చెయ్యలేదు. ఆయన బీసీ అని కూడా ఎవ్వరికీ తెలియదు. గుజరాత్‌ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఆయన బీసీగా ప్రచారం ప్రారంభించారు.

2014 ఎన్నికలకు ముందు ఆ ప్రచారాన్ని బాగా పెంచారు. ప్రధానంగా ఆనాడు బీసీల ఓట్లతో ఆయన గెలిచారు. అందుకు ఫలితంగా ఆయనగానీ, బీజేపీ/ఆరెస్సెస్‌ ప్రభుత్వంగానీ గత పదేండ్లలో బీసీలకు ఏమి ఇచ్చారు? మొత్తం శూద్ర సమాజం బతికేది వ్యవసాయ రంగం మీద. దాన్ని మొత్తంగా గుజరాత్‌–ముంబయి బడా పెట్టుబడిదారులకు అప్పగించేందుకు ఘోరమైన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తెచ్చారు. శూద్ర/బీసీలు ఇంతో అంతో బతికేది వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ మార్కెట్ల మీద. 

వాటిని బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని చట్టాలు చేస్తే శూద్ర/బీసీ రైతులు ఎంత పోరాటం చేశారో వ్యవసాయదారులందరికీ తెలుసు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల స్కాలర్‌షిప్‌లు మొత్తం తగ్గించివేశారు. వీరు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్‌ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను ముఖ్యంగా సెంట్రల్‌ యూనివర్సిటీల్లో హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో కేవలం ఇంగ్లిష్‌ భాష, విదేశీ సిలబస్‌ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయ కత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది.

చాలా విచిత్రంగా ఈ ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లను తీసేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామంటున్నారు. మోదీ, అమిత్‌ షా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. అసలు ముస్లింలకు రిజర్వేషన్లు యూపీ  ఎస్సీలో ఉన్నాయా? కొన్ని రాష్ట్రాల్లో 4 శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక రంగాన్ని ప్రైవేటీకరిస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీల పిల్లల్ని ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోవడాన్ని వ్యతి రేకిస్తూ ముస్లింలకు తగ్గించేది ఎక్కడ? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేది ఎక్కడ?
ప్రధానమంత్రి బీసీని అని చెబుతూ నా సిద్ధాంతం ‘సనాతన ధర్మం’ అంటే ‘వర్ణధర్మం’ అంటున్నారు. 

బీసీలు శూద్ర వర్ణం వారు కదా! సనాతన ధర్మం వారిని దైవ పాదాల నుండి పుట్టించింది కదా! అయినా మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా శూద్రులందరినీ ఏ దేవుని పాదాల్లో పుట్టిస్తారు? ఈ రాజ్యాంగం ఆ పాదాల, తొడల, భుజాల, తల పుట్టుకను రద్దు చేసి అందరి పుట్టుకను సమానం చేసింది. బీసీ ప్రధానమంత్రి చిన్నప్పుడు చాయ్‌ అమ్మి ఉండవచ్చు. కానీ మట్టి మోసి, మనుషుల మలాన్ని ఎత్తివేసే పనులు చేసే పిల్లల్ని కనీసం చాయ్‌ వ్యాపారంలోకి కూడా రానియ్యలేదే! దళితులు చాయ్‌ చేస్తే ఈ దేశంలో పై కులాలు ఇప్పటికీ తాగడం లేదే! మానవ మను గడకు మూలం వ్యవసాయం; ఆ పని చేసేవారంతా శూద్ర బీసీలు. 

వారికి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఖత్రీలు, కాయస్తులతో సమాన విద్య, సమాన పని హక్కు కల్పించే ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా మళ్ళీ సనాతన ధర్మాన్ని స్థాపించడం సాధ్యం కాదు. ఇక్కడే బీసీలు జాగ్రత్తగా ఆలోచించాలి. మే 5న ఆంధ్రప్రదేశ్‌ బహిరంగ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రాగానే తెలుగుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలుగుకు ప్రాధాన్యమంటే, ఇంగ్లిషు మీడియం తీసేయడమా? మరి అమిత్‌ షా తన కొడుకు జయ్‌ షాను గుజరాతీ మీడియంలో ఎందుకు చదివించలేదు? అదే అమిత్‌ షా... ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్లో మరాఠీ/గుజరాతీ మీడియం ఎందుకు పెట్టించలేదు? ఆంధ్రప్రదేశ్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్‌ అంధకార మౌతుంది.

ఓటు వేసే ముందు... 
జగన్‌ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. ఇంగ్లిష్‌ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. అమిత్‌ షా ప్రకటన చాలా ప్రమాదకర హెచ్చరిక. ఈ మధ్య కాలంలోనే మోదీ తమ ఎంపీ అభ్యర్థులందరికీ ఉత్తరాలు రాస్తూ అమిత్‌ షాను ఆకాశానికి ఎత్తారు. మోదీ తరువాత అమిత్‌ షానే ప్రధానమంత్రి అనే డైరెక్షన్‌ ఇచ్చారు. ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లిష్‌ విద్య రానియ్యకూడదనే పట్టుదలతో ఉన్న వ్యక్తి.

ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. కానీ పెద్ద పెట్టుబడిదారులు వారి పిల్లల్ని ఇంగ్లిష్‌ తప్ప మరో భాష రాకుండా చూసుకుంటున్నారు. వీరి నేతృత్వంలో రేపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నడిస్తే, సమస్త భవిష్యత్‌ దెబ్బతింటుంది. గుజరాత్‌లో ఎప్పుడైనా ఆంధ్ర పాలకుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నడవగా చూశామా! ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి ఓటు వేసే ముందు మొత్తం ప్రజలు ఆలోచించాల్సింది ఇదే.


ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement