AP: చక్కదిద్దారు! | CM Jagan spent more than Rs 71 thousand crores for educational reforms | Sakshi
Sakshi News home page

ఏపీ: చక్కదిద్దారు!

Published Thu, Dec 28 2023 4:21 AM | Last Updated on Thu, Dec 28 2023 3:02 PM

CM Jagan spent more than Rs 71 thousand crores for educational reforms - Sakshi

బ్లాక్‌ బోర్డుపై రాసేందుకు నాలుగు సుద్ధ ముక్కల కోసం కూడా వెతుక్కో­వాల్సిన దుస్థితి నుంచి ఏకంగా ట్యాబ్‌లు, ఐఎఫ్‌పీ స్క్రీన్స్, స్మార్ట్‌ టీవీలతో మన ప్రభుత్వ స్కూళ్లు సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి. 

పగిలిన గోడలు.. పెచ్చులూడే శ్లాబులు.. చెట్ల కింద వానా­కాలం చదువులు అనే దురవస్థ నుంచి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. నాలుగంటే నాలుగేళ్లలోనే సాకారమైన మార్పులు ఇవన్నీ! 

సాక్షి, అమరావతి: చదువుకునేందుకు లక్షలు ధారపోయాల్సిన పరిస్థితి నుంచి పిల్లలు సర్కారు బడికొస్తే చాలు ఎదురు డబ్బులిచ్చి మరీ ప్రోత్స­హిస్తోందీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. మనసుంటే మార్పు వచ్చి తీరుతుందని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంస్క­రణల బాటతో మన విద్యా వ్యవస్థ 2019కి ముందు.. ఆ తర్వాత అని దేశమంతా చర్చించుకునేలా చేశారు. విద్యా­రంగంపై వెచ్చిస్తున్న వ్యయాన్ని భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం పెట్టు పెట్టుబడిగా దృఢంగా విశ్వసించారు. కార్పొరేట్‌ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్‌ బోధన బాట పట్టించారు.

అక్షరానికి అగ్రాసనం వేస్తూ పేదింటి పిల్లలను అక్కున చేర్చుకున్నారు. నాడు – నేడు ద్వారా ఇప్పటికే రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తెచ్చారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ మీడియం బోధన, 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్‌ విధానం, 1,000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సాధ్యమైంది. మధ్యాహ్నం ప్రతి విద్యార్థి సంతృప్తిగా భుజించేలా రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద అమలు చేస్తున్నారు. ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.6,995.34 కోట్ల బడ్జెట్‌ను పిల్లల భోజనం కోసం కేటాయించింది.

వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు, మూడు రోజులు రాగిజావ, బెల్లం చిక్కీను అందచేస్తూ పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధను అత్యుత్తమ చర్యగా విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. సర్కారు స్కూళ్లలో ప్రాథమిక స్థాయి నుంచే టోఫెల్‌ శిక్షణతో పాటు 2025–26 నుంచి ఐబీ సిలబస్‌ను సైతం అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. కేవలం విద్యారంగంలో సంస్కరణల కోసమే నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం రూ.71 వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం. 

అమ్మ ఒడి నుంచి ఆణిముత్యాలు.. 
విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పాఠశాల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్య సంస్కరణలను అమలు చేసింది. ‘మనబడి నాడు–నేడు’ ద్వారా మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులను సమకూర్చింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా మారుస్తూ నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరందరికీ అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20లోనే ప్రభుత్వం సంస్కరణలు ప్రారంభించింది. నవరత్నాలు పథకంలో భాగంగా పిల్లలను బడికి పంపించే తల్లికి రూ.15 వేలు చొప్పున తొలిసారి 42,33,098 మంది ఖాతాల్లో రూ.6,349.6 కోట్లు జమచేసి ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే కాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మ ఒడి అమలు చేసి 2022–23 వరకు రూ.25,809.50 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం అండగా నిలిచింది. 

ప్రతిభకు ప్రోత్సాహం..
విద్యా రంగ సంస్కరణల కొనసాగింపు, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో చదివి ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 ఇంటర్, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్‌ బ్రిలియన్స్‌ అవార్డులు అందుకున్నారు. 

సదుపాయాలు.. 
విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో నేర్చుకునేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు ద్వారా శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 సదుపాయాలను కల్పించింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, తాగునీరు, మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్‌ ల్యాబ్, కాంపౌండ్‌ వాల్, కిచెన్‌ షెడ్, అదనపు తరగతి గదులు నిర్మించింది. నాడు–నేడు మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో సౌకర్యాలు కల్పించారు.

రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు వడివడిగా చేపట్టారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్‌తో పాటు 62 వేల ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లతో 3డీ డిజిటల్‌ పాఠాలను బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 33 వేల స్మార్ట్‌ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్‌ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్‌ వరకు బైజూస్‌ పాఠాలను ఉచితంగా అందించడం గమనార్హం. దేశంలో 25 వేల ఐఎఫ్‌పీలు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లోనే 62 వేల డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో విప్లవంగా నిలిచిపోయింది. 

డిజిటల్‌ శకం..
ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉత్తమ కంటెంట్‌ ఉచితంగా అందించేందుకు అతిపెద్ద ఎడ్‌ టెక్‌ కంపెనీ బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్‌ను ఇంటర్‌ విద్యార్థులకు కూడా అందిస్తుండడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్‌ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్స్‌ ఇచ్చి ఇంటి వద్ద కూడా డిజిటల్‌ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది.

ఏపీ ఈ పాఠశాల మొబైల్‌ యాప్, దీక్ష వెబ్‌సైట్, డీటీహెచ్‌ చానెళ్లు, యూట్యూబ్‌ చానెల్‌ లాంటి వాటి ద్వారా విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. విద్యార్థుల సందేహాల నివృత్తికి ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్‌ క్లియరెన్స్‌ బాట్‌’ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్‌ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను ఇది సునాయాసంగా నివృత్తి చేస్తుంది. 

సబ్జెక్టు టీచర్లు.. టోఫెల్‌ శిక్షణ
పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే ఇంగ్లిష్‌ భాషపై పట్టు ఎంతో అవసరం. అందుకోసం ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ మీడియం బోధనను ప్రవేశపెట్టడంతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ (ఈటీఎస్‌)తో ప్రభుత్వం టోఫెల్‌ శిక్షణ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 3 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్‌ శిక్షణనిస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమించి ఉత్తమ బోధన అందుబాటులోకి తెచ్చింది.

పాఠ్యాంశాల సంస్కరణ..
విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేందుకు ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. మూస పద్ధతిలో ఉన్న పాఠాలను 2020–21 నుంచి సమూలంగా మార్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించేందుకు క్లాస్‌రూమ్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌ను అమలు చేస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలలను ఫౌండేషన్, ఉన్నత పాఠశాలలుగా మార్చింది. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాన్ని తీర్చేలా భారీగా పదోన్నతులు కల్పించారు. బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్‌ఈ బోధనకు అనుగుణంగా ‘టీచర్‌ కెపాసిటీ బిల్డింగ్‌’ శిక్షణనిచ్చింది. ఇందుకోసం ఇఫ్లూ, రివర్‌సైడ్‌ లెర్నింగ్‌ సెంటర్లలో ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చారు. 

సీబీఎస్‌ఈ.. మండలానికో కాలేజీ
ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధనను ప్రారంభించింది. ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్‌ జూనియర్‌ కళాశాలలను గరŠల్స్‌ జూనియర్‌ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అందుబాటులోకి వచ్చింది. 

టెక్నాలజీపై శిక్షణ
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను టెక్‌ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 నుంచి ఫ్యూచర్‌ స్కిల్స్‌ కోర్సులను ప్రవేశపెడుతోంది. ఆరు నుంచి ఇంటర్‌ వరకు మూడు దశల్లో ఫ్యూచర్‌ స్కిల్‌ శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), 3డీ ప్రింటింగ్, గేమింగ్‌ లాంటి పది విభాగాల్లో శిక్షణ ఇస్తారు.

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కోసమే దాదాపు రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నాస్కామ్, జేఎన్‌టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆర్టీ, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్‌ చివరి ఏడాది విద్యార్థులను ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఫెసిలిటేటర్స్‌గా నియమిస్తున్నారు.

ఐబీ దిశగా అడుగులు..
‘మన పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలి. ప్రపంచానికి దిక్సూచిగా మారాలి’ అన్న సీఎం జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ (ఐబీ) బోధన  ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దేశంలో 210 వరల్ట్‌ క్లాస్‌ కార్పొరేట్‌ స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ‘ఐబీ’ బోధనను ప్రభుత్వ స్కూళల్లోకి తెచ్చి పేద పిల్లలకు ఉచితంగా అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్‌ అడుగులు ముందుకు వేశారు.

2025 – 26 నుంచి ఐబీ బోధన ప్రవేశపెట్టి ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుతూ + 2 వరకు అందించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల్లో క్రిటికల్‌ థింకింగ్, లేటరల్‌ థింకింగ్, డిజైన్‌ థింకింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ లాంటి నైపుణ్యాలకు సాన పెట్టడంతోపాటు అంతర్జాతీయంగా అత్యుత్తమ స్థాయిలో ఉద్యోగాలుయ పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే ఇన్ని అద్భుతమైన సంస్కరణలు తవిద్యారంగంలో తేవడం చరిత్రాత్మకమని, ఇది ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు.

విద్యా సాధికారత.. 
స్కూళ్లలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులతో పాటు ఆంగ్ల మాధ్యమం వల్ల విద్యా సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రాథమిక స్థాయి నుంచి బలమైన పునాదులను నిర్మిస్తోంది. ఇప్పడు మన ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉత్తమ విద్యతో నైపుణ్యం గల మానవ వనరులను సృష్టించడం సాధ్యమేనని బలంగా నమ్ముతున్నా. 
– ప్రొఫెసర్‌ కె.శ్రీరామమూర్తి, ఏయూ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కాలేజీ రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌

పదేళ్లలో అద్భుతాలు సృష్టిస్తారు..
గతంలో నేను ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు పుస్తకాలు, యూనిఫారం లాంటివి డొనేట్‌ చేసేవాడిని. ఈ ప్రభుత్వం వచ్చాక నోటు పుస్తకాల నుంచి యూనిఫారం, బూట్లు వరకు ఆ అవసరం లేకుండా అన్నీ ఉచితంగా అందిస్తోంది. స్వేచ్ఛ న్యాప్కిన్స్‌ ఇస్తున్నారు. ఆటలు ఆడిస్తున్నారు. పిల్లలకు నేర్పే విధానం, నేర్చుకునే విధానం సంపూర్ణంగా మారింది. ప్రభుత్వ విద్యలో ఇదో గొప్ప సంస్కరణ. కార్పొరేట్‌ స్కూళ్లలోనూ ఇన్ని వసతులు లేవు. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు మరో 10 ఏళ్లలో అద్భుతాలు సృష్టిస్తారనడంలో సందేహం లేదు. 
– డాక్టర్‌ రాజశేఖర్, గైనకాలజిస్ట్, కర్నూలు

ఆ ఇబ్బందులు తొలగించారు..
ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు లేకపోవడం బాలికలకు అతి పెద్ద సమస్య. ఈ ప్రభుత్వం ఆ సమస్యను దూరం చేసింది. బాలికలకు స్వేచ్ఛ పేరుతో శానిటరీ ప్యాడ్స్‌ ఉచితంగా ఇస్తున్నారు. గతంలో ఈ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారు. నాడు–నేడుతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ఇంగ్లిష్‌ మీడియం, టోఫెల్‌ శిక్షణ, రక్తహీనత నివారణకు బెల్లం చిక్కీతో పాటు ఐరన్‌ మాత్రలు ఇవ్వడం ప్రశంసనీయం.
– వడిశెట్టి గాయత్రి, పీజీ లెక్చరర్, పిఠాపురం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement