
అభిప్రాయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆర్థిక, సామాజిక, విద్య, కులాల వారీగా తీసిన లెక్కల గురించి కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీజేపీ కేంద్ర మంత్రులు పెద్ద రాద్ధాంతం చేసే సమస్య... ముస్లిం ఓబీసీలు. ఇతరులు చర్చనీయాంశం చేసేది... ఓసీ కులాల సంఖ్య.
56 ప్రశ్నలతో, వందలాది ఎనుమరేట ర్లతో 50 రోజులు చేయించిన సర్వే ఇది. 150 కుటుంబాలను ఒక బ్లాక్‌గా గుర్తించారు. అంటే ఒక్క ఎనుమరేటర్ ఆ బ్లాక్‌లో 50 రోజుల్లో ప్రశ్నావళిలో ఇచ్చిన కులాల పేర్ల ఆధారంగా 56 ప్రశ్నలకు సమాధానాలు తీసుకున్నారు. ప్రజల సంతకాలతో ప్రశ్నల చిన్న పుస్తకాన్ని కోడింగ్ సెంటర్లకు చేర్చారు. ఈ విధంగా తీసిన లెక్క లను, 4 ఫిబ్రవరి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ లెక్కలను, 2014లో అధికారంలోకి రాగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రోజులో ఇంటింటి సర్వే పేరుతో జరిపిన తంతుతో పోల్చి కొందరు చర్చల యుద్ధం చేస్తున్నారు.
ముస్లింలను విస్మరిస్తారా?
అందులో మొదటిది ఆనాటి లెక్కల్లో ముస్లింలంతా ఓసీలే. ఇప్పుడు 10.08 శాతం బీసీలు ఎట్లా అయ్యారు? ముస్లింల బీసీ–ఈ కులాల పేర్ల జాబితాను వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తయారు చేసింది! అందులో బీసీ–ఈ ముస్లింలను 14 గ్రూపులుగా విభజించి వారి కులాల పేర్లను లిస్టులో పొందుపర్చారు. అందులో అచ్చుకట్టలవాండ్లు, అత్తర్ సాయబులు, ధోభి ముస్లిమ్, ఫకీర్, బుడ్‌బుడ్కి, గుర్రాలవాళ్ళు, గోసంగి ముస్లింలు, నజావ్, నాయిలబ్బి, కటిక్, షేక్, సిద్ది, జింక సాయిబులు, తుర్క కాష వరకు దాదాపు 60 కులాలు ఉన్నాయి.
వీరంతా వివిధ దశల్లో, ముఖ్యంగా తెలంగాణలో నిజాం కాలంలో ముస్లింలుగా మారి బతుకుదెరువు వెతుక్కున్నవారు. ఇందులో చాలా కులాలు ఆరెస్సెస్/బీజేపీ వారు హిందువులుగా గుర్తించి, బీసీ కులాల్లాగా కులవృత్తులతో జీవించిన వారు. భిక్షాటన సంస్కృతితో జీవించే కులాలు కూడా ఇందులో ఉన్నాయి. గుడ్డేలుగులను ఆడించేవాళ్లు, ఊబిది పొగవేస్తూ ఇండ్లు తిరిగేవాళ్లు, దర్గాల దగ్గర పీర్‌సాయబులుగా బతికేవాళ్లు ఉన్నారు.
అందులో అతిపెద్ద కులం దూదేకులవాళ్లు. వీళ్లలో పింజారీలు కూడా ఒక భాగం. ఆంధ్ర ప్రాంతంలో ప్రఖ్యాత బుర్రకథ యోధుడు నాజర్ ఈ కులానికి చెందిన సాంస్కృతిక సారథి. ఆయన జీవిత చరిత్ర ‘పింజారి’ చదివితే ఆయన ఎంత కిందిస్థాయి నుంచి ఎదిగాడో అర్థమౌతుంది. ఆయన తల్లి తిండిలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది.
బీజేపీ వాళ్లు రేపు ఆంధ్రప్రదేశ్‌లో కులగణన చేస్తే రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తయారు చేసిన ఈ ముస్లిం కులాల లిస్టును పక్కన పెట్టి మొత్తం వారిని ఓసీల్లో చూపిస్తారా? వారికిచ్చే 4 శాతం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని తెలంగాణలో మోదీ, అమిత్ షా ఎన్నికల సమయంలో గొంతు చించుకొని మాట్లాడారు. ఇప్పుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి అదే అంశాన్ని పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో కూడా రచ్చ చేస్తారా? బతుకుదెరువు, విద్య లేని వారిని అభివృద్ధి చేయాల్సిన పథకాల్లో చేర్చకుండా వాళ్ళను ఆకలిచావులకు గురిచెయ్యాలా? మానవత్వ విలువలు కూడా ఈ దేశానికి లేకుండా చేద్దామా?
ఈ జనగణనలో 2.48 శాతం ముస్లింలు ఓబీసీలుగా తమను తాము ఐడెంటిఫై చేసుకోలేదు. వీరిలో పఠానులు, మొగలులు, షేక్‌లు, సయ్యద్‌లు ఉంటారు. వీళ్లు నిజాం కాలం నుండి ఫ్యూడల్, రాజరిక లక్షణాలతో బతుకుతున్నవాళ్లు. మత సమానత్వం మాట్లాడుతున్నప్పటికీ కుల అణచివేత, దోపిడీ ముస్లింలలో చాలా ఉంది. బీసీ ముస్లింలు తిరుగుబాటు చెయ్యకుండా, వారికి ఇంగ్లిష్ విద్య రాకుండా మతం ముసుగుతో ఈనాటికీ అణచివేస్తూనే ఉన్నారు. రాజ్యం వారిని విముక్తుల్ని చేసేందుకు రిజర్వేషన్లు, ఇంగ్లిష్ మీడియం విద్యను అందించాలి. ముస్లిమేతర బీసీ మేధావులు కూడా వారి రిజర్వేషన్‌కు అండగా నిలబడాల్సిన అవసరముంది.
ఓసీల జనాభా ఎందుకు పెరిగింది?
ఇక రెండో చర్చనీయాంశం ముస్లిమేతర బీసీలు 46.25 శాతమే ఎలా ఉంటారు? తెలంగాణలో ఓసీలు 13.31 శాతం ఎందుకు ఉంటారు అనేది బీసీ మేధావులు అడిగే ప్రశ్న. 2014 లెక్కల్లో టీఆర్‌ఎస్ ఓసీలు 7 శాతమన్నది కదా, ఇప్పుడు 13.31 శాతం ఎలా పెరిగిందని అడుగుతున్నారు. అసలు 2014 లెక్క పెద్ద బోగస్. ఒక్కరోజులో లెక్కలు తీశామని చెప్పి, బయటికి పర్సెంటేజీలు కూడా అధికారికంగా చెప్పలేదు. మొత్తం ముస్లింలను ఓసీలలో చూపించిన లెక్కల్లో బీసీ–ఈ కులాలు ఏమైనట్లు? ఈ విధంగా చర్చించడం బీజేపీని బలపర్చడమే. ఆనాడు టీఆర్‌ఎస్ బీజేపీలా వ్యవహరించింది.
తెలంగాణలో మొత్తం బీసీలు 46.25 శాతం మాత్రమే ఉంటారా అనేది ఎలా చూడాలి? 1931 జనాభా లెక్కల తరువాత తెలంగాణలో మొదటి కులగణన ఇది. 1931 నాటి లెక్కల అంచనా గానీ, టీఆర్‌ఎస్ 2014 లెక్కలు గానీ ఇప్పుడు చూడలేము. ఈ లెక్క తçప్పు అని చెప్ప డానికి ఆధారం ఏంది? కొన్ని దశాబ్దాలుగా కుల నాయకులు, మేధా వులు ఇష్టమొచ్చిన లెక్కలు చెప్పుకొంటున్నారు. తెలంగాణ కులాల లెక్కలు విడుదల అయ్యాక కూడా ‘మా కులం గింతేనా?’ అని వాదించడం ఉంటుంది. 1980 దశకంలో మండల్ కమిషన్ దేశంలోని అన్ని శూద్ర కులాలను... రెడ్డి, వెలమ, కమ్మ, కాపులతో సహా
– 52 శాతం ఓబీసీలు అని అంచనా వేసింది. ఇప్పుడు రిజర్వేషన్ బయట ఉన్న ముస్లిమేతర ఓసీ కులాలు 13.31 శాతం. అయితే ఓసీలు 7 నుండి 13.31 శాతం ఎలా అయ్యారు అనేది కొందరి ప్రశ్న. అసలు సరిగ్గా వాళ్ళది 7 శాతమే ఉండింది అని పూర్తి సర్వే ఎవరు చేశారు? అదొక ఊహాజనిత సంఖ్య. టీఆర్‌ఎస్ సర్వే, సర్వే కాదు.
ఇకపోతే 2014 నుండి 2025 నాటికి హైదరాబాద్‌కు బయట రాష్ట్రాల నుండి వలస వచ్చిన ఓసీ కులాల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ప్రశ్నపత్రంలోని 31వ పేజీలో అయ్యర్/అయ్యంగార్ నుండి మొదలుకొని వెలమల వరకు అక్షరక్రమంలో 18 కులాల పేర్ల ద్వారా ఎనుమరేషన్ జరిగింది. 2014 ఒక్క రోజు లెక్కల డ్రామాలో కులాల పేర్లు అడుగలేదు. ఎనుమరేటర్లకు కులాల పేర్ల లిస్టు ఇవ్వ లేదు.
అలాంటిది ఒక జాతీయ పార్టీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసు కొని జనాభా లెక్కలు తీయిస్తే బీసీ మేధావులే ఇది బూటకపు లెక్క అని ప్రచారం చేస్తే ఎవ్వరికి మేలు జరుగుతుంది? అసలు 2021 నుండి ఇప్పటి వరకు దేశ జనాభా లెక్కలే చెయ్యని బీజేపీకి లాభం చెయ్యడానికే ఈ వాదనంతా పనికొస్తుంది. ఒకవేళ కోర్టుపై ఒత్తిడి తెచ్చి కులజనాభా లెక్కలు తీయిస్తే ఆ లెక్కలను, ఈ లెక్కలను పోల్చి చూడవచ్చు. ముందు తెలంగాణ కులగణన ఆధారంగా కేంద్రం మీద కదా ఒత్తిడి చేయాల్సింది! బీసీల కోసమే చేసిన ఈ కులగణనను తామే నిర్వీర్యం చెయ్యడం సరైంది కాదు.
ఈ లెక్కల ఆధారంగా ఆర్థిక రంగంలో, కాంట్రాక్టుల్లో, నిధుల కేటాయింపుల్లో, లోకల్ బాడీల్లో వాటా కావాలి అని అడగటం సమంజసం. తెలంగాణ రాష్ట్ర కులగణన దేశంలోనే రాజ్యాంగ రక్షణ, సామాజిక న్యాయరేటును పెంచడం అనే సిద్ధాంత పోరాటంలో భాగంగా చేసింది. ఇది అన్నింటికంటే కీలకం!
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు
Comments
Please login to add a commentAdd a comment