సాక్షి, ఖమ్మం: రెండురోజులుగా చలి తీవ్రత పెరగడంతో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు వణికిపోతున్నారు. వసతిగృహాల్లో ఊడిన తలుపులు, కిటికీలకు మరమ్మతులు చేయకపోవడంతో హాస్టల్ గదుల్లో విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మరోవైపు దోమల స్వైర విహారంతో వారికి కంటిమీద కునుకు ఉండడం లేదు. అధికారులు మాత్రం దుప్పట్లు పంపిణీ చేశామని చెబుతున్నారు. మంగళవారం ‘సాక్షి’ పరిశీలన లో మాత్రం పలుచోట్ల విద్యార్థులకు సరిపడా దుప్పట్లు లేనట్లు బయటపడింది.
జిల్లాలోని 63 బీసీ హాస్టళ్లలో 5,977 మంది విద్యార్థులు, 71 ఎస్సీ హాస్టళ్లలో 5,620 మంది, 121 ఎస్టీ, ఆశ్రమ పాఠశాలల్లో 35 వేల మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. బీసీ హాస్టళ్లు చాలా వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అసౌకర్యాల నడుమే విద్యార్థులు ఈ హాస్టళ్లలో ఉంటున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. చాలీచాలని గదులు, అరకొర మరుగుదొడ్లు, ఆరుబయట స్నానాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చలికాలం ముంచుకొచ్చినా విద్యార్థులకు సరిపడా దుప్పట్లు పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
పలుచోట్ల స్నానాల గదులు సరిపడా లేకపోవడంతో విద్యార్థులు షిప్టుల వారీగా స్నానాలు చేస్తూ కనిపించారు. చలి కాలం ప్రారంభానికి ముందే విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలి. కానీ ఇప్పటి వరకు పలు హాస్టళ్లలో దుప్పట్లు పంపిణీ కాకపోవడం గమనార్హం. పలు హాస్టళ్ల గదుల తలుపులు, కిటికీలు ఊడివున్నాయి. వీటికి నిధులు మంజూరైనా మరమ్మతులు మాత్ర ం చేయడం లేదు. చలి నేరుగా గదుల్లోకి వస్తుండడంతో విద్యార్థులు వణికిపోతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కిటికీలు, తలుపుల మరమ్మతులకు జిల్లాలోని ఎస్టీ హాస్టల్స్‌కు రూ.3.55 లక్షలు, బీసీ హాస్టల్స్‌కు రూ. 6 లక్షలు మంజూరయ్యాయి. కానీ నేటికీ ఈ నిధులతో మరమ్మతలు మాత్రం చేయించలేదు. విద్యార్థులు తమ గోడు చెప్పుకుందామన్నా పలువురు హాస్టల్ వార్డెన్‌లు స్థానికంగా..అందుబాటులో ఉండటం లేదు.
స్థానికంగా ఉండని వార్డెన్లు
నిబంధనల ప్రకారం సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు వసతిగృహాల్లోనే రాత్రి బస చేయాలి. కానీ పలు హాస్టళ్ల వార్డెన్లు రాత్రి వేళల్లో వసతిగృహాల్లో బస చేయకుండా సమీపంలోని పట్టణ కేంద్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రి వేళలో విద్యార్థులకు ఏమైనా జరిగినా పట్టించుకునే వారే లేరు. టేకులపల్లిలోని బీసీ బాలుర వసతి గృహానికి వాచ్‌మనే విద్యార్థులకు తోడుగా హాస్టల్‌లో బస చేస్తున్నాడు. ఖమ్మం నగరంలోని ఎస్టీ బాలికల హాస్టల్‌లో కూడా వార్డెన్ సక్రమంగా రాకపోవడంతో విద్యార్థులు తమ అవసరాలను ఆయాలకే చెప్పుకోవాల్సి వస్తోంది. మణుగూరు, పినపాక మండలాల్లోని హస్టల్ వార్డున్లు విద్యార్థులకు అందుబాటులో ఉండడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా మంది వార్డెన్లు ఇలానే రాకపోకలు చేస్తున్నారు. ఇటీవల విద్యార్థులు విష జ్వరాల బారిన పడుతున్నా వార్డెన్లు మాత్రం ఇంకా నిద్రావస్థలోనే ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పలు హాస్టళ్లలో పరిస్థితి ఇలా..
బయ్యారం ఎస్టీ హాస్టల్లో పలు గదులకు కిటికీలు, తలుపులు లేవు. మండల కేంద్రంలోని ఎస్టీ హస్టల్‌లో 78 మంది విద్యార్థులు ఉన్నారు. హాస్టల్ గదులకు కిటికీలు, తలుపులు లేకపోవడంతో రాత్రి వేళ చలిగాలి వీస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గార్ల మండల కేంద్రంలో నైజాం కాలంలో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరింది. ఈ భవనంలోనే బీసీ బాలికల వసతిగృహాన్నీ నిర్వహిస్తున్నారు. ఇది వర్షాలకు కురుస్తుండడం, స్లాబు పై పెచ్చులు ఊడుతుండడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
సత్తుపల్లి ఎస్పీ బాలుర హాస్టల్‌లో దుప్పట్లు ఉన్నా విద్యార్థులు పడుకునే గదుల కిటికీలకు రెక్కలు లేవు. అసలే చలితీవ్రత పెరగడంతో కిటికీలకు రెక్కలు లేక విద్యార్థులు వణికిపోతున్నారు. పెనుబల్లి, వేంసూరు హాస్టళ్లలో కూడాఇదే పరిస్థితి.
భద్రాచలంలో ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. ఉన్న మరుగుదొడ్లు సరిగా పనిచేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదువుకోవటానికి ఏర్పాటు చేసిన ఇన్వర్టర్లు పనిచేయకపోవడంతో కరెంట్‌లేని సమయంలో విద్యార్థులు అంధకారంలోనే ఉంటున్నారు.
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో వెంకటాపురం గిరిజన బాలుర వసతి గృహంలో ఐటీడీఏ, నాబార్డు నిధులతో రూ. కోటి ఖర్చు చేసి నూతన భ వనాన్ని నిర్మించి ఇచ్చారు. కానీ ఆ వసతిగృహంలో విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు.
ఖమ్మంలోని కాల్వొడ్డు గిరిజన బాలుర వసతిగృహంలో దుప్పట్లు, గదులకు కిటికీలు సరిగా లేక విద్యార్థులు చలికి వణుకుతున్నారు.
నిద్రలేని రాత్రులు గడుపుతున్న విద్యార్థులు
Published Wed, Dec 3 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement