ఉన్ని దుప్పటి... ఉతికేది నెలకోసారే! | Rail AC coach: Soon huge laundries in BOOT method | Sakshi
Sakshi News home page

ఉన్ని దుప్పటి... ఉతికేది నెలకోసారే!

Published Sun, Dec 1 2024 6:14 AM | Last Updated on Sun, Dec 1 2024 6:14 AM

Rail AC coach: Soon huge laundries in BOOT method

కనీసం 30 మంది వాడిన తర్వాతే శుభ్రం 

కొత్తదానిలా రోజూ సీల్డ్‌ కవర్‌లో సరఫరా 

రైలు ఏసీ కోచ్‌లలో విడ్డూరం 

డిమాండ్‌కు తగ్గ లాండ్రీ సామర్థ్యం లేకనే..! 

త్వరలో బీఓఓటీ పద్ధతిలో భారీ లాండ్రీలు 

దక్షిణ మధ్య రైల్వే అధికారుల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: చూడ్డానికి అందంగా ఉంటాయి.. తాకితే మెత్తగా ఉంటాయి.. కానీ, కప్పుకొంటే మాత్రం కంపు కొడుతుంటాయి. రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు అందిస్తున్న దుప్పట్ల పరిస్థితి ఇది. ఈ ఉన్ని దుప్పట్లను వరు సగా 30 రోజులపాటు 30 మంది ప్రయాణికులు వాడుకున్నాకగానీ ఉతకడం లేదు. అయితే, వాటిని నిత్యం మడత నలగకుండా బ్రౌన్‌ కలర్‌ కవర్‌లో పెట్టి అందిస్తుండటంతో శుభ్రం చేసినవే అని ప్రయాణికులు భ్రమపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని శుభ్రం చేయకుండా 30 రోజులకంటే ఎక్కువే వాడాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేసే లాండ్రీ వ్యవస్థ లేకపోవటమే దీనికి కారణం.

మూడు నెలల నుంచి నెలకోసారి..
గతంలో ఉన్ని దుప్పట్లను మూడు నెలలకోసారి ఉతికేవారు. 2010లో దాన్ని రెండు నెలలకు మార్చారు. అవి అపరిశుభ్రంగా ఉంటున్నాయన్న ఫిర్యాదులతో కనీసం నెలకోసారి ఉతకాలన్న నిర్ణయం తీసుకుని అమలులోకి తెచ్చారు. ఉన్ని దుప్పట్లను కనీసం పక్షం రోజులకోమారైనా ఉతకాలన్నది రైల్వే బోర్డు సూచన. కానీ దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు.  

పాడయ్యే అవకాశం.. 
ఉన్ని దుప్పట్లను నిత్యం ఉతకటం సాధ్యం కాదు. అలా చేస్తే అవి వెంటనే పాడైపోతాయి. రెండు నెలలకోసారి ఉతికే పద్ధతి ఉన్న సమయంలో ఉన్ని దుప్పటి జీవితకాలాన్ని నాలుగేళ్లుగా లెక్కగట్టారు. నెలకోసారి ఉతకటంతో రెండేళ్లకు తగ్గించారు. 15 రోజులకోమారు ఉతికితే ఏడాదే మన్నుతుంది. ఈ కారణంతో ఉతకటం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే, డ్రైక్లీనింగ్‌తోపాటు ఇతర ఆధునిక పద్థతుల్లో నాణ్యత దెబ్బతినకుండా తరచూ శుభ్రం చేయాలన్న సూచనలను రైల్వే అధికారులు పట్టించుకోవటం లేదు.  

త్వరలో సమస్యకు పరిష్కారం: దక్షిణ మధ్య రైల్వే 
 భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో బెడ్‌రోల్స్‌ వినియోగించాల్సి రానున్నందున, వాటిని ఎప్పటికప్పుడు ప్రమాణాల మేరకు శుభ్రం చేసే వ్యవస్థను అందుబాటులోకి తేబోతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొత్తగా బీఓఓటీ పద్ధతిలో భారీ సామర్థ్యంతో ఆధునిక లాండ్రీలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్‌/సికింద్రాబాద్, కాచిగూడల్లో 48 టన్నుల సామర్థ్యంతో, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నర్సాపూర్‌లలో 10 టన్నుల సామర్థ్యంతో, తిరుపతిలో 22 టన్నులు, కాకినాడలో 6 టన్నులు, నాందేడ్, పూర్ణాలలో 8 టన్నుల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.

‘సాధారణ బెడ్‌రోల్స్‌ను నిత్యం ప్రమాణాల ప్రకారం శుభ్రం చేసి అందిస్తున్నాం. శుభ్రపరిచే క్రమాన్ని సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నాం. ఉన్ని దుప్పట్లను మాత్రం నెలకోసారి శుభ్రం చేస్తున్నాం. అవి దుర్వాసనతో ఉన్నా, ఇతర అపరిశుభ్రతతో కనిపించినా వెంటనే శుభ్రం చేస్తున్నాం. రెండు బెడ్‌ïÙట్లు ఇస్తున్నందున.. వాటిల్లో ఒకదాన్ని ఈ దుప్పటితో కలిపి వాడటం వల్ల ఉన్ని దుప్పటి అంత తొందరగా అపరిశుభ్రంగా మారదు’అని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. శుభ్రమైన బెడ్‌ రోల్స్‌ను అందించేందుకు వాటి చార్జీని రైలు టికెట్‌ ధరలో భాగంగా వసూలు చేస్తుండటం కొసమెరుపు.  

ఎందుకీ పరిస్థితి?
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిత్యం 116 రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ఈ బెడ్‌ రోల్స్‌ సరఫరా చేయాల్సి ఉంది. నిత్యం ప్రతి బెర్త్‌కు రెండు బెడ్‌ïÙట్లు, ఒక టవల్, దిండు కవర్‌ అందిస్తారు. నిత్యం 38 వేల దుప్పట్లు, 1, 52,000 బెడ్‌షీట్స్‌ సరఫరా చేస్తున్నారు. వీటిని ఉతికించి శుభ్రపరిచేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏడు చోట్ల మెకనైజ్డ్‌ లాండ్రీలున్నాయి. రోజుకు 2 టన్నుల బెడ్‌రోల్స్‌ను శుభ్రపరిచే సామర్థ్యంతో సికింద్రాబాద్‌లో డిపార్ట్‌మెంటల్‌ లాండ్రీ ఉంది. ఇది రైల్వే సొంత లాండ్రీ. కాచిగూడలో 12 టన్నుల సామర్థ్యం, తిరుపతిలో 2.5 టన్నులు, కాకినాడలో 4 టన్నులు, విజయవాడలో 1.5 టన్నులు, నాందేడ్‌లో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన లాండ్రీలున్నాయి.

 ఇవన్నీ ప్రైవేట్‌ సంస్థలు బీఓఓటీ (బిల్ట్‌ ఓవన్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిలో ఏర్పాటు చేసినవి. అయితే, ఇవి దక్షిణ మధ్య రైల్వే అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇటీవల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే నడిపిన కొన్ని ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌లలో బెడ్‌ రోల్స్‌ సరఫరా చేయలేదు. ఈ విషయాన్ని ముందుగానే రైల్వేశాఖ ప్రకటించింది. క్రమంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో రైళ్ల సంఖ్య కూడా పెంచాల్సి వస్తోంది. ఇటీవల థర్డ్‌ ఏసీ ఎకానమి పేరుతో కొత్త క్లాస్‌ను సృష్టించటంతో రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్య పెరిగింది. ఫలితంగా బెడ్‌ రోల్స్‌ సంఖ్య కూడా పెంచాల్సి వచి్చంది. కానీ, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచే సామర్థ్యం లేకుండాపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement