Laundry
-
ఉన్ని దుప్పటి... ఉతికేది నెలకోసారే!
సాక్షి, హైదరాబాద్: చూడ్డానికి అందంగా ఉంటాయి.. తాకితే మెత్తగా ఉంటాయి.. కానీ, కప్పుకొంటే మాత్రం కంపు కొడుతుంటాయి. రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు అందిస్తున్న దుప్పట్ల పరిస్థితి ఇది. ఈ ఉన్ని దుప్పట్లను వరు సగా 30 రోజులపాటు 30 మంది ప్రయాణికులు వాడుకున్నాకగానీ ఉతకడం లేదు. అయితే, వాటిని నిత్యం మడత నలగకుండా బ్రౌన్ కలర్ కవర్లో పెట్టి అందిస్తుండటంతో శుభ్రం చేసినవే అని ప్రయాణికులు భ్రమపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని శుభ్రం చేయకుండా 30 రోజులకంటే ఎక్కువే వాడాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేసే లాండ్రీ వ్యవస్థ లేకపోవటమే దీనికి కారణం.మూడు నెలల నుంచి నెలకోసారి..గతంలో ఉన్ని దుప్పట్లను మూడు నెలలకోసారి ఉతికేవారు. 2010లో దాన్ని రెండు నెలలకు మార్చారు. అవి అపరిశుభ్రంగా ఉంటున్నాయన్న ఫిర్యాదులతో కనీసం నెలకోసారి ఉతకాలన్న నిర్ణయం తీసుకుని అమలులోకి తెచ్చారు. ఉన్ని దుప్పట్లను కనీసం పక్షం రోజులకోమారైనా ఉతకాలన్నది రైల్వే బోర్డు సూచన. కానీ దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. పాడయ్యే అవకాశం.. ⇒ ఉన్ని దుప్పట్లను నిత్యం ఉతకటం సాధ్యం కాదు. అలా చేస్తే అవి వెంటనే పాడైపోతాయి. రెండు నెలలకోసారి ఉతికే పద్ధతి ఉన్న సమయంలో ఉన్ని దుప్పటి జీవితకాలాన్ని నాలుగేళ్లుగా లెక్కగట్టారు. నెలకోసారి ఉతకటంతో రెండేళ్లకు తగ్గించారు. 15 రోజులకోమారు ఉతికితే ఏడాదే మన్నుతుంది. ఈ కారణంతో ఉతకటం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే, డ్రైక్లీనింగ్తోపాటు ఇతర ఆధునిక పద్థతుల్లో నాణ్యత దెబ్బతినకుండా తరచూ శుభ్రం చేయాలన్న సూచనలను రైల్వే అధికారులు పట్టించుకోవటం లేదు. త్వరలో సమస్యకు పరిష్కారం: దక్షిణ మధ్య రైల్వే ⇒ భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో బెడ్‌రోల్స్ వినియోగించాల్సి రానున్నందున, వాటిని ఎప్పటికప్పుడు ప్రమాణాల మేరకు శుభ్రం చేసే వ్యవస్థను అందుబాటులోకి తేబోతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొత్తగా బీఓఓటీ పద్ధతిలో భారీ సామర్థ్యంతో ఆధునిక లాండ్రీలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్/సికింద్రాబాద్, కాచిగూడల్లో 48 టన్నుల సామర్థ్యంతో, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నర్సాపూర్‌లలో 10 టన్నుల సామర్థ్యంతో, తిరుపతిలో 22 టన్నులు, కాకినాడలో 6 టన్నులు, నాందేడ్, పూర్ణాలలో 8 టన్నుల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.‘సాధారణ బెడ్‌రోల్స్‌ను నిత్యం ప్రమాణాల ప్రకారం శుభ్రం చేసి అందిస్తున్నాం. శుభ్రపరిచే క్రమాన్ని సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నాం. ఉన్ని దుప్పట్లను మాత్రం నెలకోసారి శుభ్రం చేస్తున్నాం. అవి దుర్వాసనతో ఉన్నా, ఇతర అపరిశుభ్రతతో కనిపించినా వెంటనే శుభ్రం చేస్తున్నాం. రెండు బెడ్ïÙట్లు ఇస్తున్నందున.. వాటిల్లో ఒకదాన్ని ఈ దుప్పటితో కలిపి వాడటం వల్ల ఉన్ని దుప్పటి అంత తొందరగా అపరిశుభ్రంగా మారదు’అని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. శుభ్రమైన బెడ్ రోల్స్‌ను అందించేందుకు వాటి చార్జీని రైలు టికెట్ ధరలో భాగంగా వసూలు చేస్తుండటం కొసమెరుపు. ఎందుకీ పరిస్థితి?దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిత్యం 116 రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ఈ బెడ్ రోల్స్ సరఫరా చేయాల్సి ఉంది. నిత్యం ప్రతి బెర్త్‌కు రెండు బెడ్ïÙట్లు, ఒక టవల్, దిండు కవర్ అందిస్తారు. నిత్యం 38 వేల దుప్పట్లు, 1, 52,000 బెడ్‌షీట్స్ సరఫరా చేస్తున్నారు. వీటిని ఉతికించి శుభ్రపరిచేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏడు చోట్ల మెకనైజ్డ్ లాండ్రీలున్నాయి. రోజుకు 2 టన్నుల బెడ్‌రోల్స్‌ను శుభ్రపరిచే సామర్థ్యంతో సికింద్రాబాద్‌లో డిపార్ట్మెంటల్ లాండ్రీ ఉంది. ఇది రైల్వే సొంత లాండ్రీ. కాచిగూడలో 12 టన్నుల సామర్థ్యం, తిరుపతిలో 2.5 టన్నులు, కాకినాడలో 4 టన్నులు, విజయవాడలో 1.5 టన్నులు, నాందేడ్‌లో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన లాండ్రీలున్నాయి. ఇవన్నీ ప్రైవేట్ సంస్థలు బీఓఓటీ (బిల్ట్ ఓవన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) పద్ధతిలో ఏర్పాటు చేసినవి. అయితే, ఇవి దక్షిణ మధ్య రైల్వే అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇటీవల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే నడిపిన కొన్ని ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌లలో బెడ్ రోల్స్ సరఫరా చేయలేదు. ఈ విషయాన్ని ముందుగానే రైల్వేశాఖ ప్రకటించింది. క్రమంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో రైళ్ల సంఖ్య కూడా పెంచాల్సి వస్తోంది. ఇటీవల థర్డ్ ఏసీ ఎకానమి పేరుతో కొత్త క్లాస్‌ను సృష్టించటంతో రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్య పెరిగింది. ఫలితంగా బెడ్ రోల్స్ సంఖ్య కూడా పెంచాల్సి వచి్చంది. కానీ, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచే సామర్థ్యం లేకుండాపోయింది. -
ఫ్రీగా వచ్చిందని డిటర్జంట్ తినడంతో..
తైవాన్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. చిన్నపాటి పొరపాటు కూడా ప్రాణాలు పోయే పరిస్థితిని కల్పిస్తుందని ఈ ఉదంతం తెలియజేస్తోంది. తైవాన్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేసిన లాండ్రీ డిటర్జంట్‌ను ముగ్గురు వ్యక్తులు పొరపాటున తిన్నారు. ఆ తర్వాత వారు అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చేరారు. సకాలంలో చికిత్స అందడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తైవాన్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఉచితంగా లాండ్రీ డిటర్జెంట్ పంపిణీ చేశారు. దీనిని మిఠాయిగా బావించి, తిన్నవారు అనారోగ్యం పాలయ్యారు. సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం బాధితుల్లో ఒకరు తాను డిటర్జంట్‌ను పొరపాటున మిఠాయిగా భావించానని అన్నారు. ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన డిటర్జెంట్ ప్యాక్‌పై బట్టలు ఉతకడానికి అని స్పష్టంగా రాసి ఉంది. అలాగే ఒక్కో ప్యాకెట్‌పై దీనితో ఎనిమిది కిలోల వరకు దుస్తులను ఉతకవచ్చని రాసి ఉంది. ప్రచార సమయంలో జాతీయవాద ప్రచార కార్యాలయం సుమారు 4,60,000 ప్యాకెట్లను పంపిణీ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఘటన తర్వాత సెంట్రల్ తైవాన్‌లోని ఎన్నికల ప్రచార కార్యాలయ ప్రతినిధి క్షమాపణలు చెప్పారు. ఇకపై ఇలాంటి మెటీరియల్‌ను ప్రజలకు పంపిణీ చేయబోమని కార్యాలయ చీఫ్ ఒక వీడియో ద్వారా తెలిపారు. ఇది మిఠాయి కాదని, లాండ్రీ డిటర్జెంట్ అని కూడా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కాగా ఆసుపత్రిలో చేరిన వారిలో ఇద్దరు వృద్ధులున్నారని వార్తా సంస్థ తెలిపింది. చికిత్స అనంతరం వారిద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
బీఆర్ఎస్ సర్కార్ ధోబీ ఘాట్లకు కరెంటు బిల్లులు చెల్లించలేదు
సాక్షి, హైదరాబాద్: లాండ్రీలు, ధోబీఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిందని, అందుకయ్యే వ్యయాన్ని మాత్రం డిస్కంలకు చెల్లించలేదని మంత్రి పేర్కొన్నారు. అయితే బకాయిల పేరిట విద్యుత్ కనెక్షన్ తొలగించొద్దని డిస్కంలకు మంత్రి సూచించారు. ఈ విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించడానికి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కోరుతామన్నారు. ఈ ఏడాది జనవరి మూడోతేదీ వరకు వాషర్‌మె న్లో లబ్ధిదారులు 76,060 మంది కాగా, బకాయిలు రూ.78.55 కోట్లు అని, నాయీ బ్రాహ్మణ లబ్ధిదారులు 36,526 మంది కాగా, బకాయిలు రూ.12.34 కోట్లు ఉన్నాయన్నారు. -
రెండు నెలలు బట్టలు ఉతకలేదు, ఆపై...
కాన్బెర్రా: కరోనా కారణంగా ప్రస్తుతం చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీంతో పని భారం, ఒత్తిడి తగ్గుతాయని అందరూ అనుకున్నారు. అయితే కొందరికి మాత్రం పని భారం ఇంకా ఎక్కువైంది. స్కూళ్లు లేకపోవడం, పిల్లలు ఇంట్లోనే ఉండటంతో చాలా మందికి మాములుగా కంటే పని పెరిగింది. ఇలానే పని ఒత్తిడి పెరిగిన ఆస్ట్రేలియన్ మహిళ కోడీ క్విన్లివన్ బట్టలను ఉతకకుండా అన్నింటిని ఒక రూంలో పడేసింది. దీంతో బట్టలు ఉతికి రెండు నెలలకు పైగా కావడంతో కొండలా పేరుకుపోయాయి. ఇక చేసేది ఏం లేక ఆమె వాటిని లాండ్రీ షాపుకు పంపాలనుకుంది. అయితే దానికి ముందు ఆమె వాటిపై ఎక్కి కూర్చొని ఒక ఫోటోకు ఫోజ్ ఇచ్చింది. ఆ ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి ‘మౌంట్ ఫోల్డ్ మోర్’ అనే పేరు పెట్టింది. అయితే దీనిని చూసిన కొంత మంది ఆ ఫోటోలో ఆమె మహారాణిలా ఫోజ్ ఇచ్చింది అని కామెంట్ చేస్తున్నారు. ‘నేనొక్కదాన్నే కాదు ఇలా చాలా మంది ఉన్నందకు ఆనందంగా ఉంది’ అని కామెంట్ చేసింది. లాండ్రీకి పంపిన తరువాత వాటిని ఉతికి, ఐరన్ చేసి 50 సంచుల్లో కోడీకి అందించారు. చదవండి: నోరూరించే పీతల కూర.. సరోజ్ దీదీకి సాయం! -
షార్ట్‌సర్క్యూట్‌తో ల్యాండ్రి దగ్ధం
– భారీగా ఆస్తి నష్టం ఆత్మకూరురూరల్ : విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతో ల్యాండ్రి దగ్ధమైన సంఘటనలో విలువైన దుస్తులతో పాటు పట్టు చీరలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన ఆత్మకూరులో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు... పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్లో ఆర్.గురవయ్య 20 ఏళ్లుగా ల్యాండ్రి షాపు నిర్వహిస్తున్నాడు. చిరపరిచితుడు కావడంతో ల్యాండ్రిలో అధిక మంది ఉద్యోగులు, ఎల్‌ఆర్‌పల్లి, జేఆర్‌పేటలోని గృహస్తులు దుస్తులు ఇస్తుంటారు. శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో 1000కి పైగా పట్టు చీరలు రోలింగ్, ఇస్త్రీ కోసం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతో దుకాణం అగ్నికి ఆహుతైంది. రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆత్మకూరు పోలీసులు 1.30 గంటల సమయంలో దుకాణం నుంచి మంటలు వస్తుండడాన్ని గమనించి గురవయ్యకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న విలువైన వస్త్రాలు, పట్టుచీరలు అగ్నికి ఆహుతి కావడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు గురవయ్య వాపోతున్నాడు. -
లిక్విడ్ డిటర్జెంట్లతో పిల్లలకు ప్రమాదం!
అమెరికాః లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్ లతో పిల్లలకు ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. లిక్విడ్ డిటర్జెంట్ల లో భారీగా రసాయనాలను వినియోగిస్తారని అందుకే ఆ లిక్విడ్స్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు చూపించడమే కాక మరణానికి కూడ దారితీస్తాయని చెప్తున్నారు. డిటర్జెంట్ లిక్విడ్స్ వినియోగం పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులను వ్యాపింపజేయడంతోపాటు.. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆన్ లైన్ జనరల్ పిడియాట్రిక్స్ లో ప్రచురించిన తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. లిక్విడ్ డిటర్జెంట్లు పిల్లలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని అమెరికాలో నిర్వహించిన సర్వేలు చెప్తున్నాయి. జనవరి 2013 నుంచి డిసెంబర్ 2014 వరకు అమెరికాలోని పాయిజన్ కంట్రోల్ సెంటర్లు అందుకున్న సుమారు 62,254 ఫోన్ కాల్స్ ద్వారా ఎక్కువ శాతం లాండ్రీ, డిష్ వాష్ డిటర్జెంట్ ప్యాకెట్లతో ఆరేళ్ళలోపు పిల్లలకు తీవ్ర ఆనారోగ్యాలు చేకూరుతున్నట్లు తెలుసుకున్నారు. రెండేళ్ళ అధ్యయన కాలంలో ఈ సమస్య 17 శాతం పెరిగినట్లుగా కూడ చెప్తున్నారు. పాయిజన్ కంట్రోల్ సెంటర్లకు డిటర్జెంట్ లిక్విడ్లతో పిల్లలకు కలుగుతున్న నష్టాలపై రోజుకు 30 కన్నా ఎక్కువ కాల్స్ వచ్చేవని, లిక్విడ్ డిటర్జెంట్ లకు ఎక్స్పోజ్ అయిన పిల్లల్లో కనీసం రోజుకు ఒక్కరైనా ఆస్పత్రిలో చేరే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అంతేకాదు డిటర్జెంట్ల వల్ల ఏకంగా ఇద్దరు పిల్లల మరణాలు కూడ నమోదైనట్లు అధ్యయనకారులు కనుగొన్నారు. అయితే లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్లలో ప్రమాదకర రసాయనాలు ఉంటాయని, అవి పిల్లలకు హాని కలిగిస్తాయన్న విషయాన్ని చాలా కుటుంబాలు గుర్తించలేకపోయాయని, నేషన్వైడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ స్టడీ సహ రచయిత, టాక్సాలజీ ఛీఫ్ మార్సెల్ కాస్వెంట్ సూచించారు. ఆరేళ్ళ లోపు వయసున్న పిల్లలు ఇంట్లో ఉంటే వారు లాండ్రీ డిటర్జెంట్లకు ఎక్స్పోజ్ అవ్వకుండా ఆయా కుటుంబాలు శ్రద్ధ వహించాలని అధ్యయనకారులు సూచిస్తున్నారు. అంతేకాక తక్కువ టాక్సిక్ వినియోగించే సంప్రదాయ డిటర్జెంట్లను వినియోగించాలని సలహా ఇస్తున్నారు. అయితే డిటర్జెంట్లను మాత్రం పిల్లలకు సాధ్యమైనంత దూరంగానే ఉంచాలని హెచ్చరిస్తున్నారు. -
ఉతికి ఆరేస్తే.. రూ.2 లక్షల కోట్లు
♦ దేశంలో సంఘటిత పరిశ్రమ వాటా 5 వేల కోట్లు ♦ నాలుగేళ్లలో ఇది రూ.80వేల కోట్లకు: కేపీఎంజీ ♦ కార్పొరేట్ రూపాన్ని సంతరించుకుంటున్న లాండ్రీ, డ్రైక్లీనింగ్ ♦ లాండ్రీ సేవలకు ప్రత్యేక అకాడమీ; సర్టిఫికెట్ కోర్సు ♦ భారీగా నిధుల వెల్లువ.. పోటీ సంస్థల కొనుగోళ్లు ♦ సేవల్లో హైదరాబాదీ సంస్థలు కూడా.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ రూపాన్ని సంతరించుకుంటున్న కులవృత్తుల్లో లాండ్రీ కూడా చేరిపోయింది. చేరిపోవటమే కాదు.! జ్యోతిఫ్యాబ్రిక్స్, వాస్సాప్ వంటివి ఇతర కంపెనీల్ని కొనేస్తూ మంచి దూకుడు మీదున్నాయి. వీటితో పాటు స్టార్టప్‌లూ వేగంగా వస్తున్నాయి. ఎందుకంటే... లాండ్రీ, డ్రైక్లీనింగ్ పరిశ్రమ విలువ అక్షరాలా రూ.రెండు లక్షల కోట్లు. దీన్లో సంఘటిత రంగ వాటా కేవలం 2 శాతం. 2020 నాటికి సంఘటిత వాటా 40 శాతానికి, ఆన్లైన్ 25 శాతానికి చేరుతుందనేది కేపీఎంజీ తాజా నివేదిక సారాంశం. ఈ భవిష్యత్తును చూసి... ఈ రంగంలోకి పెట్టుబడులూ వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో లాండ్రీ పరిశ్రమలో 7,67,000 సంస్థలున్నాయి. వీటిలో 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్నవి 98% ఉండొచ్చనేది లండన్ కేంద్రంగా పనిచేస్తున్న యూరో మానిటర్ ఇంటర్నేషనల్ అంచనా. అయితే లాండ్రీ పరిశ్రమలో ఆఫ్‌లైన్ సంస్థలదే ఆధిపత్యం. అవి కూడా అత్యధికం దుస్తువులు, దుప్పట్ల వాషింగ్కే పరిమితం. జ్యోతిఫ్యాబ్రిక్స్, విలేజ్ లాండ్రీ సర్వీస్ పదేళ్ల కిందట ఆన్లైన్ వేదికగా ఈ రంగంలోకొచ్చాయి. లాండ్రీ, డ్రైక్లీనింగ్‌తో పాటు షూ, బ్యాగుల మరమ్మతు, కార్పెట్లు, సోఫాసెట్ల క్లీనింగ్... అది కూడా హోమ్ డెలివరీ చేయటం వీటి ప్రత్యేకత. జ్యోతి ఫ్యాబ్రిక్స్, వాస్సాప్, పిక్ మై లాండ్రీ, ఆప్ కా దోబీ వంటివి కాస్త పేరున్నవి కాగా... దాదాపు 40కి పైగా స్టార్టప్‌లు ఇపుడు ఆన్లైన్ సేవలందిస్తున్నాయి. ఇవెలా పనిచేస్తాయంటే... సంబంధిత వెబ్సైట్ లేదా యాప్‌లో శుభ్రం చేయాల్సిన దుస్తులు, డ్రైక్లీనింగ్ వివరాల్ని నమోదు చేయాలి. ఇంటికి ఆ సంస్థ ఉద్యోగులొచ్చి కస్టమర్ల ముందే దుస్తుల్ని తూకం వేస్తారు. డ్యామేజీ ఉందా? అనేది చెక్ చేసి తమతో తీసుకెళతారు. తరవాత తమ ఫెసిలిటీ కేంద్రంలో దుస్తులకు జాగ్రత్తగా ట్యాగ్స్ వేస్తారు. ఎందుకంటే దుస్తుల రంగు, తీరును బట్టి ఉతికే విధానంలోనూ తేడా ఉంటుంది కనక. కావాలనుకుంటే ఇస్త్రీ కూడా చేస్తారు. రెగ్యులర్ డెలివరీ అయితే 4 రోజుల్లో, ఎక్స్‌ప్రెస్ అయితే 24 గంటల్లో కస్టమర్లకు వాటిని తిరిగి ఇస్తారు. తూకం లెక్కనే చార్జీలు... మామూలుగా దుస్తుల్ని ఐటమ్‌ల లెక్కన ఇస్త్రీచేసి ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ సంస్థలు మాత్రం కిలోల లెక్కన ఛార్జీ వసూలు చేస్తాయి. కస్టమర్ల పరంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఐటీ ఉద్యోగులు, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసేవారిని, బ్యాచిలర్లను లక్ష్యంగా చేసుకొని సేవలందిస్తే... సంస్థల పరంగా గెస్ట్‌హౌస్‌లు, స్టార్ హోటళ్లు, ఆసుపత్రులు, వసతి గృహాలు, విద్యా సంస్థలు, రైలు, బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో దుస్తులను ఉతికేందుకుగాను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాషింగ్ మిషన్లు, డిటర్జెంట్లు, కండీ షనర్స్, కలర్ బ్లీచ్‌లు వాడుతున్నారు. కొన్ని సంస్థలు ప్రతి నెలా నిర్దిష్ట సంఖ్యలో దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేసి ఇచ్చేందుకు నెలవారీ ప్యాకేజీలు కూడా అందిస్తున్నాయి. ఉతకటానికైతే కిలోకు రూ.50-70, ఇస్త్రీ కూడా ఉంటే రూ.75-100 వసూలు చేస్తున్నాయి. ప్రీమియం లాండ్రీకైతే రూ.130కి పైగా చార్జీలున్నాయి. ప్రత్యేక అకాడమీ, సర్టిఫికెట్ కోర్సు కూడా... విశేషమేంటంటే దేశంలోనే తొలి సారిగా లాండ్రీ, డ్రైక్లీనింగ్ సేవలపై శిక్షణకు ప్రత్యేక అకాడమీ ఏర్పా టైంది. ఇందులో ఏడాది పాటు సర్టిఫికెట్ కోర్సు ఉంది. దుస్తుల నాణ్యత దెబ్బతినకుండా ఎలా శుభ్రం చేయాలి? ఎక్కువ మన్నేలా ఎలాంటి డిటర్జెంట్లు, లిక్విడ్స్‌ను వాడాలి? వంటి అంశాల్లో శిక్షణనిచ్చేందుకు కర్ణాటకలో ‘వాస్సాప్ అకాడమీ ఫర్ లాండ్రీ’ ఏర్పాటైంది. దీన్ని కర్ణాటక ఐటీఐతో కలిసి వాస్సాప్ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో పరిశ్రమలోని ఉద్యోగులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సర్టిఫికెట్ కోర్సును ఆఫర్ చేస్తున్నట్లు వాస్సాప్ వ్యవస్థాపకుడు బాలచందర్ ‘సాక్షి’తో చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఉందన్నారు. ‘‘మేం ఫ్రాంచైజీ మోడల్ కింద రూ.6 లక్షల పెట్టుబడితో 100 చ.అ.ల్లో లాండ్రీ షాపును పెట్టిస్తున్నాం. బెంగళూరులో 6 ఔట్లెట్లు ప్రారంభించాం. మాతో ఒప్పందం చేసుకున్న దోబీ కుటుంబాల పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వటంతో పాటు వారికి జీవిత బీమా కూడా కల్పిస్తున్నాం. ఇప్పటికే ఈ కార్యక్రమంలో 12 మంది దోబీలు చేరారు’’ అని బాలచందర్ చెప్పారు. హైదరాబాద్ సంస్థలూ ఉన్నాయ్... గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఈజీవాష్కేర్ ప్రస్తుతం మాదాపూర్, గచ్చిబౌలి సహా నాలుగు ప్రధాన ప్రాంతాల్లో సేవలందిస్తోంది. వెయ్యికి పైగా కస్టమర్లున్నట్టు ఫౌండర్ కలిశెట్టి నాయుడు చెప్పారు. నల్లగండ్ల, కొండాపూర్, తార్నాక, నాగోల్, కొత్తపేట్ ప్రాంతాల్లో సేవలందిస్తున్న సేఫ్ వాష్.. దుస్తులతో పాటు తివాచీలు, కిటికీ పరదాలు, షూలు, హ్యాండ్ బ్యాగులు, సాఫ్ట్‌టాయ్స్ కూడా శుభ్రం చేస్తుంది. మూడు వేల మంది వినియోగదారులతో పాటు ల్యాంకో, ఎన్సీసీ అర్బన్ వంటి గేటెడ్ కమ్యూనిటీల్లోనూ సేవలందిస్తోంది. ఏడాదిన్నరలో కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుకున్నట్లు సేఫ్‌వాష్ ఫౌండర్ దీక్షిరెడ్డి చెప్పారు. ఆన్లైన్వాషింగ్.కామ్, జెట్వాష్.ఇన్, అర్బన్దోబీ కూడా సేవలందిస్తున్నాయి. భారీగా వస్తున్న నిధులు.. ♦ వాస్సాప్ ఇప్పటివరకు 2 రౌండ్లలో రూ.8 కోట్ల నిధులను సమీకరించింది. ♦ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న డోర్‌మింట్... హీలియన్ వెంచర్స్, కలారీ క్యాపిటల్ నుంచి 3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ♦ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పిక్ మై లాండ్రీలో జీహెచ్‌వీ యాక్సలేటర్ లక్ష డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ♦ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న టూలర్ రూ.70 లక్షలు సమీకరించింది. ♦ ముుంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రెస్టూ 3.94 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ♦ బెంగళూరు కేంద్రంగా అగ్రిగేటర్ సేవలందిస్తున్న మై వాష్‌లో గతేడాది ఓరిస్ వెంచర్స్ మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ♦ విలేజ్ లాండ్రీ సర్వీసెస్ ఫ్లాగ్షిప్ బ్రాండ్ అయిన చమక్‌ను, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈజీవాష్ను ఈక్విటీ రూపంలో వాస్సాప్ సొంతం చేసుకుంది. మరో మూడు కంపెనీల కొనుగోళ్లకు కూడా చర్చలు జరుపుతున్నట్లు బాలచందర్ చెప్పారు.