షార్ట్‌సర్క్యూట్‌తో ల్యాండ్రి దగ్ధం
-
– భారీగా ఆస్తి నష్టం
ఆత్మకూరురూరల్ : విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతో ల్యాండ్రి దగ్ధమైన సంఘటనలో విలువైన దుస్తులతో పాటు పట్టు చీరలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన ఆత్మకూరులో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు... పట్టణంలోని బీఎస్‌ఆర్ సెంటర్‌లో ఆర్.గురవయ్య 20 ఏళ్లుగా ల్యాండ్రి షాపు నిర్వహిస్తున్నాడు. చిరపరిచితుడు కావడంతో ల్యాండ్రిలో అధిక మంది ఉద్యోగులు, ఎల్‌ఆర్‌పల్లి, జేఆర్‌పేటలోని గృహస్తులు దుస్తులు ఇస్తుంటారు. శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో 1000కి పైగా పట్టు చీరలు రోలింగ్, ఇస్త్రీ కోసం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతో దుకాణం అగ్నికి ఆహుతైంది. రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆత్మకూరు పోలీసులు 1.30 గంటల సమయంలో దుకాణం నుంచి మంటలు వస్తుండడాన్ని గమనించి గురవయ్యకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న విలువైన వస్త్రాలు, పట్టుచీరలు అగ్నికి ఆహుతి కావడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు గురవయ్య వాపోతున్నాడు.