ఉతికి ఆరేస్తే.. రూ.2 లక్షల కోట్లు | kpmg lounches new loundry and dry cleaning course | Sakshi
Sakshi News home page

ఉతికి ఆరేస్తే.. రూ.2 లక్షల కోట్లు

Published Fri, Apr 15 2016 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

ఉతికి ఆరేస్తే.. రూ.2 లక్షల కోట్లు

దేశంలో సంఘటిత పరిశ్రమ వాటా 5 వేల కోట్లు
నాలుగేళ్లలో ఇది రూ.80వేల కోట్లకు: కేపీఎంజీ
కార్పొరేట్ రూపాన్ని సంతరించుకుంటున్న లాండ్రీ, డ్రైక్లీనింగ్
లాండ్రీ సేవలకు ప్రత్యేక అకాడమీ; సర్టిఫికెట్ కోర్సు
భారీగా నిధుల వెల్లువ.. పోటీ సంస్థల కొనుగోళ్లు
సేవల్లో హైదరాబాదీ సంస్థలు కూడా..

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ రూపాన్ని సంతరించుకుంటున్న కులవృత్తుల్లో లాండ్రీ కూడా చేరిపోయింది. చేరిపోవటమే కాదు.!  జ్యోతిఫ్యాబ్రిక్స్, వాస్సాప్ వంటివి ఇతర కంపెనీల్ని కొనేస్తూ మంచి దూకుడు మీదున్నాయి. వీటితో పాటు స్టార్టప్‌లూ వేగంగా వస్తున్నాయి. ఎందుకంటే... లాండ్రీ, డ్రైక్లీనింగ్ పరిశ్రమ విలువ అక్షరాలా రూ.రెండు లక్షల కోట్లు. దీన్లో సంఘటిత రంగ వాటా కేవలం 2 శాతం. 2020 నాటికి సంఘటిత వాటా 40 శాతానికి, ఆన్‌లైన్ 25 శాతానికి చేరుతుందనేది కేపీఎంజీ తాజా నివేదిక సారాంశం. ఈ భవిష్యత్తును చూసి... ఈ రంగంలోకి పెట్టుబడులూ వచ్చిపడుతున్నాయి.

 ప్రస్తుతం దేశంలో లాండ్రీ పరిశ్రమలో 7,67,000 సంస్థలున్నాయి. వీటిలో 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్నవి 98% ఉండొచ్చనేది లండన్ కేంద్రంగా పనిచేస్తున్న యూరో మానిటర్ ఇంటర్నేషనల్ అంచనా. అయితే లాండ్రీ పరిశ్రమలో ఆఫ్‌లైన్ సంస్థలదే ఆధిపత్యం. అవి కూడా అత్యధికం దుస్తువులు, దుప్పట్ల వాషింగ్‌కే పరిమితం. జ్యోతిఫ్యాబ్రిక్స్, విలేజ్ లాండ్రీ సర్వీస్ పదేళ్ల కిందట ఆన్‌లైన్ వేదికగా ఈ రంగంలోకొచ్చాయి. లాండ్రీ, డ్రైక్లీనింగ్‌తో పాటు షూ, బ్యాగుల మరమ్మతు, కార్పెట్లు, సోఫాసెట్ల క్లీనింగ్... అది కూడా హోమ్ డెలివరీ చేయటం వీటి ప్రత్యేకత. జ్యోతి ఫ్యాబ్రిక్స్, వాస్సాప్, పిక్ మై లాండ్రీ, ఆప్ కా దోబీ వంటివి కాస్త పేరున్నవి కాగా... దాదాపు 40కి పైగా స్టార్టప్‌లు ఇపుడు ఆన్‌లైన్ సేవలందిస్తున్నాయి.

 ఇవెలా పనిచేస్తాయంటే...
సంబంధిత వెబ్‌సైట్ లేదా యాప్‌లో శుభ్రం చేయాల్సిన దుస్తులు, డ్రైక్లీనింగ్ వివరాల్ని నమోదు చేయాలి. ఇంటికి ఆ సంస్థ ఉద్యోగులొచ్చి కస్టమర్ల ముందే దుస్తుల్ని తూకం వేస్తారు. డ్యామేజీ ఉందా? అనేది చెక్ చేసి తమతో తీసుకెళతారు. తరవాత తమ ఫెసిలిటీ కేంద్రంలో దుస్తులకు జాగ్రత్తగా ట్యాగ్స్ వేస్తారు. ఎందుకంటే దుస్తుల రంగు, తీరును బట్టి ఉతికే విధానంలోనూ  తేడా ఉంటుంది కనక. కావాలనుకుంటే ఇస్త్రీ కూడా చేస్తారు. రెగ్యులర్ డెలివరీ అయితే 4 రోజుల్లో, ఎక్స్‌ప్రెస్ అయితే 24 గంటల్లో కస్టమర్లకు వాటిని తిరిగి ఇస్తారు.

 తూకం లెక్కనే చార్జీలు...
మామూలుగా దుస్తుల్ని ఐటమ్‌ల లెక్కన ఇస్త్రీచేసి ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ సంస్థలు మాత్రం కిలోల లెక్కన ఛార్జీ వసూలు చేస్తాయి. కస్టమర్ల పరంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఐటీ ఉద్యోగులు, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసేవారిని, బ్యాచిలర్లను లక్ష్యంగా చేసుకొని సేవలందిస్తే... సంస్థల పరంగా గెస్ట్‌హౌస్‌లు, స్టార్ హోటళ్లు, ఆసుపత్రులు, వసతి గృహాలు, విద్యా సంస్థలు,  రైలు, బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు.

పెద్ద మొత్తంలో దుస్తులను ఉతికేందుకుగాను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాషింగ్ మిషన్లు, డిటర్జెంట్లు, కండీ షనర్స్, కలర్ బ్లీచ్‌లు వాడుతున్నారు. కొన్ని సంస్థలు ప్రతి నెలా నిర్దిష్ట సంఖ్యలో దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేసి ఇచ్చేందుకు నెలవారీ ప్యాకేజీలు కూడా అందిస్తున్నాయి. ఉతకటానికైతే కిలోకు రూ.50-70, ఇస్త్రీ కూడా ఉంటే రూ.75-100 వసూలు చేస్తున్నాయి. ప్రీమియం లాండ్రీకైతే రూ.130కి పైగా చార్జీలున్నాయి.

 ప్రత్యేక అకాడమీ, సర్టిఫికెట్ కోర్సు కూడా...
విశేషమేంటంటే దేశంలోనే తొలి సారిగా లాండ్రీ, డ్రైక్లీనింగ్ సేవలపై శిక్షణకు ప్రత్యేక అకాడమీ ఏర్పా టైంది. ఇందులో ఏడాది పాటు సర్టిఫికెట్ కోర్సు ఉంది. దుస్తుల నాణ్యత దెబ్బతినకుండా ఎలా శుభ్రం చేయాలి? ఎక్కువ మన్నేలా ఎలాంటి డిటర్జెంట్లు, లిక్విడ్స్‌ను వాడాలి? వంటి అంశాల్లో శిక్షణనిచ్చేందుకు కర్ణాటకలో ‘వాస్సాప్ అకాడమీ ఫర్ లాండ్రీ’ ఏర్పాటైంది. దీన్ని కర్ణాటక ఐటీఐతో కలిసి వాస్సాప్ సంస్థ నిర్వహిస్తోంది.

ఇందులో పరిశ్రమలోని ఉద్యోగులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సర్టిఫికెట్ కోర్సును ఆఫర్ చేస్తున్నట్లు వాస్సాప్ వ్యవస్థాపకుడు బాలచందర్ ‘సాక్షి’తో చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఉందన్నారు. ‘‘మేం ఫ్రాంచైజీ మోడల్ కింద రూ.6 లక్షల పెట్టుబడితో 100 చ.అ.ల్లో లాండ్రీ షాపును పెట్టిస్తున్నాం. బెంగళూరులో 6 ఔట్‌లెట్లు ప్రారంభించాం. మాతో ఒప్పందం చేసుకున్న దోబీ కుటుంబాల పిల్లలకు స్కాలర్‌షిప్స్ ఇవ్వటంతో పాటు వారికి జీవిత బీమా కూడా కల్పిస్తున్నాం. ఇప్పటికే ఈ కార్యక్రమంలో 12 మంది దోబీలు చేరారు’’ అని బాలచందర్ చెప్పారు.

హైదరాబాద్ సంస్థలూ ఉన్నాయ్...
గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఈజీవాష్‌కేర్ ప్రస్తుతం మాదాపూర్, గచ్చిబౌలి సహా నాలుగు ప్రధాన ప్రాంతాల్లో సేవలందిస్తోంది. వెయ్యికి పైగా కస్టమర్లున్నట్టు ఫౌండర్ కలిశెట్టి నాయుడు చెప్పారు. నల్లగండ్ల, కొండాపూర్, తార్నాక, నాగోల్, కొత్తపేట్ ప్రాంతాల్లో సేవలందిస్తున్న సేఫ్ వాష్.. దుస్తులతో పాటు తివాచీలు, కిటికీ పరదాలు, షూలు, హ్యాండ్ బ్యాగులు, సాఫ్ట్‌టాయ్స్ కూడా శుభ్రం చేస్తుంది. మూడు వేల మంది వినియోగదారులతో పాటు ల్యాంకో, ఎన్‌సీసీ అర్బన్ వంటి గేటెడ్ కమ్యూనిటీల్లోనూ సేవలందిస్తోంది. ఏడాదిన్నరలో కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుకున్నట్లు సేఫ్‌వాష్ ఫౌండర్ దీక్షిరెడ్డి చెప్పారు. ఆన్‌లైన్‌వాషింగ్.కామ్, జెట్‌వాష్.ఇన్, అర్బన్‌దోబీ కూడా సేవలందిస్తున్నాయి.

భారీగా వస్తున్న నిధులు..
వాస్సాప్ ఇప్పటివరకు 2 రౌండ్లలో రూ.8 కోట్ల నిధులను సమీకరించింది.

ముంబై కేంద్రంగా పనిచేస్తున్న డోర్‌మింట్... హీలియన్ వెంచర్స్, కలారీ క్యాపిటల్ నుంచి 3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది.

ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పిక్ మై లాండ్రీలో జీహెచ్‌వీ యాక్సలేటర్ లక్ష డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న టూలర్ రూ.70 లక్షలు సమీకరించింది.

ముుంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రెస్‌టూ 3.94 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది.

బెంగళూరు కేంద్రంగా అగ్రిగేటర్ సేవలందిస్తున్న మై వాష్‌లో గతేడాది ఓరిస్ వెంచర్స్ మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

విలేజ్ లాండ్రీ సర్వీసెస్ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ అయిన చమక్‌ను, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈజీవాష్‌ను ఈక్విటీ రూపంలో వాస్సాప్ సొంతం చేసుకుంది. మరో మూడు కంపెనీల కొనుగోళ్లకు కూడా చర్చలు జరుపుతున్నట్లు బాలచందర్ చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement