certificate course
-
యూకే కోర్సుకు 15 మంది తెలంగాణ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: యూకేలో స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సు చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రెండు వారాల కాలవ్యవధితో అందించే ఈ కోర్సుకు అయ్యే ఖర్చును బ్రిటిష్ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లోంచి పూర్తిగా మెరిట్ ప్రాతిపదికగా 15 మందిని ఎంపిక చేశారు. హైదరాబాద్ విద్యాభవన్‌లో శనివారం కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, బ్రిటిష్ కౌన్సిల్ ప్రతినిధులు భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘స్కాలర్షిప్ ఫర్ ఔట్‌స్టాండింగ్ అండర్ గ్రాడ్యుయేట్ టాలెంట్ (స్కాట్)’ ప్రోగ్రామ్ వివరాలను బ్రిటిష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాథన్ వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులు యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో ‘హౌ టు బీ మోర్ రేషనల్ క్రియేటివ్ థింకింగ్, లాజిక్ అండ్ రీజనింగ్ (హేతుబద్ధంగా ఉండటం ఎలా? విమర్శనాత్మకత, తర్కం, హేతువాదన) అనే అంశాలపై మార్చి, ఏప్రిల్‌లలో రెండు వారాలపాటు కోర్సు చేస్తారని తెలిపారు. విద్యార్థులకు అవసరమయ్యే వీసా, ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, యూకేలో కోర్సు ఫీజులు, వసతి, ఇతర ఖర్చులను బ్రిటిష్ కౌన్సిల్ భరిస్తుందని తెలిపారు. రాష్ట్రాన్ని ఆధునిక విజ్ఞాన కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. -
ఐసీసీ లెవెల్-1 క్రికెట్ కోచ్ కోర్సు పూర్తి చేసిన తెలంగాణ ముద్దుబిడ్డ
ఐసీసీలో లెవెల్-1 క్రికెట్ కోచ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేసిన తొలి మహిళా కోచ్‌గా తెలంగాణకు చెందిన బుర్రా లాస్య చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో బుర్రా లాస్యను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు ప్రత్యేక విజన్ తో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను తయారు చేయడం కోసం సుమారు 8500 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామన్నారు. క్రీడా పాలసీ లో క్రీడాకారులకు, కోచ్ లకు పెద్దపీట వేస్తున్నామన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలపై సర్టిఫికెట్ కోర్సులు
సాక్షి, సిద్దిపేట: యాసంగిలో వరి వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రత్యామ్నాయంగా ఎలాంటి పంటలు వేయాలన్నదానిపై రైతులు ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో రైతులకు సాయపడేందుకు వ్యవసాయ శాఖ నడుంబిగించింది. ఇందులో భాగంగా రైతులకు కొత్త రకాల పంటలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ ఉద్యాన వన విశ్వవిద్యాలయం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా వివిధ పంటల విధానంపై ముఖ్యంగా యువ రైతులకు సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 పరిశోధన స్థానాలు, రెండు పాలిటెక్నిక్‌లు, రెండు బోధన కళాశాలలు, ఒక కృషి విజ్ఞాన కేంద్రం కొనసాగుతున్నాయి. తొలుత రెండు పరిశోధనా స్థానాల్లో మూడు సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. కూరగాయల సాగు, పూల మొక్కల పెంపకంపై రెండు కోర్సులను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పరిశోధన స్థానంలో, అయిల్ పామ్ పెంపకం, నిర్వహణపై ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని పరిశోధన స్థానంలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి బ్యాచ్‌లో 20 మందికి శిక్షణ ఇస్తారు. ఈ కోర్సుల్లో థియరీతో పాటు ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే స్టడీ మెటీరియల్ సైతం అందించనున్నారు. ఒక్కో కోర్సులో 20 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ కోర్సులకు నామమాత్రపు ఫీజు వసూలు చేయనున్నారు. త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభించనున్నారు. జనవరి మొదటివారంలో ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తామని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ బి.నీరజ ప్రభాకర్ తెలిపారు. -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సర్టిఫికెట్ కోర్సు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో ఆన్లైన్లో సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ ఎస్కే షహాబుద్దీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: పేదల వకీల్ తరిమెల బాలిరెడ్డి కన్నుమూత వ్యాపార ప్రణాళికలు, ఆర్థిక కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహించడం, మార్కెటింగ్, బ్రాండింగ్, ప్రాజెక్ట్ సమగ్ర నివేదిక (డీపీఆర్), బ్యాంకుల స్కీంలు తదితర అంశాలపై ఆయా రంగాల్లోని నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, మహిళలు, యువతీ యువకులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. వివరాలకు 80085 79624, 93914 22821నంబర్లలో సంప్రదించాలని కోరారు. చదవండి: AP: అరుదైన ఆలయం.. భారతమాతకు వందనం -
జర్నలిజంలో సర్టిఫికెట్ కోర్సు
సాక్షి, అమరావతి/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జర్నలిస్టులకు ఉపయుక్తంగా మూడు నెలల కాల పరిమితితో జర్నలిజం సర్టిఫికెట్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. యూజీసీ నిబంధనలను అనుసరించి ప్రెస్ అకాడమీ సొంతంగా నాలుగు సబ్జెక్టులతో కోర్సు రూపొందించినట్టు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇంటర్ ఉత్తీర్ణులై కోర్సులో చేరే జర్నలిస్టులకు 50 శాతం ఫీజు రాయితీతో కేవలం రూ.1500 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి జర్నలిజంపై ఆసక్తి ఉన్న యువత కూడా పూర్తి ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందొచ్చన్నారు. అనంతరం కోర్సు బ్రోచర్‌ను విడుదల చేశారు. కోవిడ్ దృష్ట్యా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమసింహపురి వర్సిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం(నేటి) నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ప్రెస్‌అకాడమీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచినట్టు శ్రీనాథ్ వివరించారు. విక్రమసింహపురి వర్సిటీ రిజిస్ట్రార్ విజయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, సెప్టెంబర్ రెండో వారం నుంచి తరగతులు ప్రారంభించి, డిసెంబర్ మొదటి వారంలో తుది పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు 91541 04393 నంబర్‌ను, pressacademycontact@gmail.comను సంప్రదించాలని సూచించారు. -
యూనివర్సిటీలో ఆదర్శ కోడలు సర్టిఫికేట్
భోపాల్: విశ్వ విద్యాలయాల్లో వివిధ కోర్సులు ప్రవేశపెట్టడం చూస్తునే ఉన్నాం. కానీ వాటన్నంటికి భిన్నంగా మధ్యప్రదేశ్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం ఓ కొత్త కోర్సును తీసుకురావడానికి ముందుకొచ్చింది. కొత్తగా పెళ్లైన అమ్మాయిలు అత్తగారి ఇళ్లలో ఎలా నడుచుకోవాలో తెలిపేందుకు ఆదర్శ్ బాహు(సంస్కారవంతమైన కోడలు) పేరుతో కోర్సును ప్రవేశపెట్టనుంది. మూడు నెలల వ్యవధితో కూడిన ఈ కోర్సు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. మహిళల్లో సాధికారత పెంపొందిచడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. దీనిపై యూనివర్సిటీ వైస్ చాన్సలర్ మాట్లాడుతూ.. ‘పెళ్లైన తర్వాత అమ్మాయిలు ఓ కొత్త వాతావరణంలోకి అడుగుపెడతారు. అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవడం.. అందుకు తగ్గట్టుగా నడుచుకోవడం వారికి తొలుత కష్టతరంగా ఉంటుంది. అందుకోసమే మేము ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నాం. మాకు సమాజం పట్ల బాధ్యత ఉంది.. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ కోర్సులో సోషియాలజీ, సైకాలజీతో పాటు కుటుంబ విలువలు, బంధాల గురించి యువతులకు తెలియజేస్తాం. తొలి బ్యాచ్‌లో 30 మంది యువతులను ఈ కోర్సులో చేర్చుకుంటాం. దీని ద్వారా సమాజంలో మంచి మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. కోర్సు పూర్తిచేసుకున్నాక తాము ఆదర్శ్ బాహు పేరిట సర్టిఫికేట్‌ను అందజేస్తామ’ని తెలిపారు. కాగా దీనిని కొంతమంది విద్యావేత్తలు వ్యతిరేకిస్తున్నారు. ముందు బర్కతుల్లా యూనివర్సిటీ విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతో పాటు, తరగతులు, పరీక్షలు సక్రమంగా నిర్వహించడంపై దృష్టి సారించాలని అంటున్నారు. -
కొత్తగా జీఎస్టీ సర్టిఫికెట్ కోర్సు
భోపాల్: వస్తుసేవల పన్ను(జీఎస్టీ)పై గ్రాడ్యుయేట్లలో పూర్తి అవగాహన కల్పించడమే లక్ష్యంగా వారి కోసం జీఎస్టీ సర్టిఫికెట్ కోర్సును కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రి త్వ శాఖ (ఎంఎస్డీఈ) ప్రారంభించనుంది. 100 గంటలు క్లాసులు బోధించే ఈ కొత్త కోర్సును పైలట్ ప్రాజెక్టుగా ఈ నెల 15 నుంచి భోపాల్, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో మొదలుపెట్టనున్నారు. అన్ని విభాగాల్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులంతా ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త పన్నుల విధానమైన జీఎస్టీలో పన్ను రేట్లు, జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్లు, ఏఏ పద్ధతుల్లో పన్నులను ఎలా గణిస్తారో.. తదితరాలను కోర్సులో బోధిస్తారు. పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లకు ప్రిన్సిపాల్స్‌గా పనిచేస్తూ శిక్షణాభివృద్ధి కోసం విశేష కృషిచేస్తున్న వారి పేర్లను పద్మశ్రీ అవార్డు కోసం సిఫార్సుచేయనున్నట్లు ఆ శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. ఎరువుల ధరల సవరణకు అనుమతి న్యూఢిల్లీ: జీఎస్టీ అమల్లోకి రాకముందు తయారైన ఎరువుల ధరలు సవరిం చుకు నేందుకు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో దాదాపు 10 లక్షల టన్నుల పాత ఎరువుకు కంపెనీలు జీఎస్టీ ప్రకారం ధరలు ముద్రిం చుకోవచ్చు. జీఎస్టీలో ఎరువులపై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఎరువుల రిటైల్ ధరలు తగ్గనున్నాయి. -
సెరికల్చర్‌లో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం
హిందూపురం రూరల్ : ఇందిరాగాంధీ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశోధన సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెరికల్చర్ సర్టిఫికెట్ కోర్సును మంగళవారం ప్రారంభించారు. కిరికెర పట్టు పరిశోధన కేంద్రంలో ఆరునెలల పాటు శిక్షణ అందిస్తారు. మొదటి బ్యాచ్‌కు కోర్సుకు సంబంధించిన పుస్తకాలు అందించారు. కార్యక్రమంలో ఇగ్నో ఆర్డీ రాజగోపాల్, పట్టు పరిశోధన కేంద్రం రీజినల్ డైరెక్టర్ పీజే రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉతికి ఆరేస్తే.. రూ.2 లక్షల కోట్లు
♦ దేశంలో సంఘటిత పరిశ్రమ వాటా 5 వేల కోట్లు ♦ నాలుగేళ్లలో ఇది రూ.80వేల కోట్లకు: కేపీఎంజీ ♦ కార్పొరేట్ రూపాన్ని సంతరించుకుంటున్న లాండ్రీ, డ్రైక్లీనింగ్ ♦ లాండ్రీ సేవలకు ప్రత్యేక అకాడమీ; సర్టిఫికెట్ కోర్సు ♦ భారీగా నిధుల వెల్లువ.. పోటీ సంస్థల కొనుగోళ్లు ♦ సేవల్లో హైదరాబాదీ సంస్థలు కూడా.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ రూపాన్ని సంతరించుకుంటున్న కులవృత్తుల్లో లాండ్రీ కూడా చేరిపోయింది. చేరిపోవటమే కాదు.! జ్యోతిఫ్యాబ్రిక్స్, వాస్సాప్ వంటివి ఇతర కంపెనీల్ని కొనేస్తూ మంచి దూకుడు మీదున్నాయి. వీటితో పాటు స్టార్టప్‌లూ వేగంగా వస్తున్నాయి. ఎందుకంటే... లాండ్రీ, డ్రైక్లీనింగ్ పరిశ్రమ విలువ అక్షరాలా రూ.రెండు లక్షల కోట్లు. దీన్లో సంఘటిత రంగ వాటా కేవలం 2 శాతం. 2020 నాటికి సంఘటిత వాటా 40 శాతానికి, ఆన్లైన్ 25 శాతానికి చేరుతుందనేది కేపీఎంజీ తాజా నివేదిక సారాంశం. ఈ భవిష్యత్తును చూసి... ఈ రంగంలోకి పెట్టుబడులూ వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో లాండ్రీ పరిశ్రమలో 7,67,000 సంస్థలున్నాయి. వీటిలో 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్నవి 98% ఉండొచ్చనేది లండన్ కేంద్రంగా పనిచేస్తున్న యూరో మానిటర్ ఇంటర్నేషనల్ అంచనా. అయితే లాండ్రీ పరిశ్రమలో ఆఫ్‌లైన్ సంస్థలదే ఆధిపత్యం. అవి కూడా అత్యధికం దుస్తువులు, దుప్పట్ల వాషింగ్కే పరిమితం. జ్యోతిఫ్యాబ్రిక్స్, విలేజ్ లాండ్రీ సర్వీస్ పదేళ్ల కిందట ఆన్లైన్ వేదికగా ఈ రంగంలోకొచ్చాయి. లాండ్రీ, డ్రైక్లీనింగ్‌తో పాటు షూ, బ్యాగుల మరమ్మతు, కార్పెట్లు, సోఫాసెట్ల క్లీనింగ్... అది కూడా హోమ్ డెలివరీ చేయటం వీటి ప్రత్యేకత. జ్యోతి ఫ్యాబ్రిక్స్, వాస్సాప్, పిక్ మై లాండ్రీ, ఆప్ కా దోబీ వంటివి కాస్త పేరున్నవి కాగా... దాదాపు 40కి పైగా స్టార్టప్‌లు ఇపుడు ఆన్లైన్ సేవలందిస్తున్నాయి. ఇవెలా పనిచేస్తాయంటే... సంబంధిత వెబ్సైట్ లేదా యాప్‌లో శుభ్రం చేయాల్సిన దుస్తులు, డ్రైక్లీనింగ్ వివరాల్ని నమోదు చేయాలి. ఇంటికి ఆ సంస్థ ఉద్యోగులొచ్చి కస్టమర్ల ముందే దుస్తుల్ని తూకం వేస్తారు. డ్యామేజీ ఉందా? అనేది చెక్ చేసి తమతో తీసుకెళతారు. తరవాత తమ ఫెసిలిటీ కేంద్రంలో దుస్తులకు జాగ్రత్తగా ట్యాగ్స్ వేస్తారు. ఎందుకంటే దుస్తుల రంగు, తీరును బట్టి ఉతికే విధానంలోనూ తేడా ఉంటుంది కనక. కావాలనుకుంటే ఇస్త్రీ కూడా చేస్తారు. రెగ్యులర్ డెలివరీ అయితే 4 రోజుల్లో, ఎక్స్‌ప్రెస్ అయితే 24 గంటల్లో కస్టమర్లకు వాటిని తిరిగి ఇస్తారు. తూకం లెక్కనే చార్జీలు... మామూలుగా దుస్తుల్ని ఐటమ్‌ల లెక్కన ఇస్త్రీచేసి ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ సంస్థలు మాత్రం కిలోల లెక్కన ఛార్జీ వసూలు చేస్తాయి. కస్టమర్ల పరంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఐటీ ఉద్యోగులు, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసేవారిని, బ్యాచిలర్లను లక్ష్యంగా చేసుకొని సేవలందిస్తే... సంస్థల పరంగా గెస్ట్‌హౌస్‌లు, స్టార్ హోటళ్లు, ఆసుపత్రులు, వసతి గృహాలు, విద్యా సంస్థలు, రైలు, బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో దుస్తులను ఉతికేందుకుగాను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాషింగ్ మిషన్లు, డిటర్జెంట్లు, కండీ షనర్స్, కలర్ బ్లీచ్‌లు వాడుతున్నారు. కొన్ని సంస్థలు ప్రతి నెలా నిర్దిష్ట సంఖ్యలో దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేసి ఇచ్చేందుకు నెలవారీ ప్యాకేజీలు కూడా అందిస్తున్నాయి. ఉతకటానికైతే కిలోకు రూ.50-70, ఇస్త్రీ కూడా ఉంటే రూ.75-100 వసూలు చేస్తున్నాయి. ప్రీమియం లాండ్రీకైతే రూ.130కి పైగా చార్జీలున్నాయి. ప్రత్యేక అకాడమీ, సర్టిఫికెట్ కోర్సు కూడా... విశేషమేంటంటే దేశంలోనే తొలి సారిగా లాండ్రీ, డ్రైక్లీనింగ్ సేవలపై శిక్షణకు ప్రత్యేక అకాడమీ ఏర్పా టైంది. ఇందులో ఏడాది పాటు సర్టిఫికెట్ కోర్సు ఉంది. దుస్తుల నాణ్యత దెబ్బతినకుండా ఎలా శుభ్రం చేయాలి? ఎక్కువ మన్నేలా ఎలాంటి డిటర్జెంట్లు, లిక్విడ్స్‌ను వాడాలి? వంటి అంశాల్లో శిక్షణనిచ్చేందుకు కర్ణాటకలో ‘వాస్సాప్ అకాడమీ ఫర్ లాండ్రీ’ ఏర్పాటైంది. దీన్ని కర్ణాటక ఐటీఐతో కలిసి వాస్సాప్ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో పరిశ్రమలోని ఉద్యోగులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సర్టిఫికెట్ కోర్సును ఆఫర్ చేస్తున్నట్లు వాస్సాప్ వ్యవస్థాపకుడు బాలచందర్ ‘సాక్షి’తో చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఉందన్నారు. ‘‘మేం ఫ్రాంచైజీ మోడల్ కింద రూ.6 లక్షల పెట్టుబడితో 100 చ.అ.ల్లో లాండ్రీ షాపును పెట్టిస్తున్నాం. బెంగళూరులో 6 ఔట్లెట్లు ప్రారంభించాం. మాతో ఒప్పందం చేసుకున్న దోబీ కుటుంబాల పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వటంతో పాటు వారికి జీవిత బీమా కూడా కల్పిస్తున్నాం. ఇప్పటికే ఈ కార్యక్రమంలో 12 మంది దోబీలు చేరారు’’ అని బాలచందర్ చెప్పారు. హైదరాబాద్ సంస్థలూ ఉన్నాయ్... గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఈజీవాష్కేర్ ప్రస్తుతం మాదాపూర్, గచ్చిబౌలి సహా నాలుగు ప్రధాన ప్రాంతాల్లో సేవలందిస్తోంది. వెయ్యికి పైగా కస్టమర్లున్నట్టు ఫౌండర్ కలిశెట్టి నాయుడు చెప్పారు. నల్లగండ్ల, కొండాపూర్, తార్నాక, నాగోల్, కొత్తపేట్ ప్రాంతాల్లో సేవలందిస్తున్న సేఫ్ వాష్.. దుస్తులతో పాటు తివాచీలు, కిటికీ పరదాలు, షూలు, హ్యాండ్ బ్యాగులు, సాఫ్ట్‌టాయ్స్ కూడా శుభ్రం చేస్తుంది. మూడు వేల మంది వినియోగదారులతో పాటు ల్యాంకో, ఎన్సీసీ అర్బన్ వంటి గేటెడ్ కమ్యూనిటీల్లోనూ సేవలందిస్తోంది. ఏడాదిన్నరలో కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుకున్నట్లు సేఫ్‌వాష్ ఫౌండర్ దీక్షిరెడ్డి చెప్పారు. ఆన్లైన్వాషింగ్.కామ్, జెట్వాష్.ఇన్, అర్బన్దోబీ కూడా సేవలందిస్తున్నాయి. భారీగా వస్తున్న నిధులు.. ♦ వాస్సాప్ ఇప్పటివరకు 2 రౌండ్లలో రూ.8 కోట్ల నిధులను సమీకరించింది. ♦ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న డోర్‌మింట్... హీలియన్ వెంచర్స్, కలారీ క్యాపిటల్ నుంచి 3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ♦ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పిక్ మై లాండ్రీలో జీహెచ్‌వీ యాక్సలేటర్ లక్ష డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ♦ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న టూలర్ రూ.70 లక్షలు సమీకరించింది. ♦ ముుంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రెస్టూ 3.94 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ♦ బెంగళూరు కేంద్రంగా అగ్రిగేటర్ సేవలందిస్తున్న మై వాష్‌లో గతేడాది ఓరిస్ వెంచర్స్ మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ♦ విలేజ్ లాండ్రీ సర్వీసెస్ ఫ్లాగ్షిప్ బ్రాండ్ అయిన చమక్‌ను, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈజీవాష్ను ఈక్విటీ రూపంలో వాస్సాప్ సొంతం చేసుకుంది. మరో మూడు కంపెనీల కొనుగోళ్లకు కూడా చర్చలు జరుపుతున్నట్లు బాలచందర్ చెప్పారు.