సాక్షి, హైదరాబాద్: యూకేలో స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సు చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రెండు వారాల కాలవ్యవధితో అందించే ఈ కోర్సుకు అయ్యే ఖర్చును బ్రిటిష్ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లోంచి పూర్తిగా మెరిట్ ప్రాతిపదికగా 15 మందిని ఎంపిక చేశారు. హైదరాబాద్ విద్యాభవన్‌లో శనివారం కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, బ్రిటిష్ కౌన్సిల్ ప్రతినిధులు భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ‘స్కాలర్‌షిప్ ఫర్ ఔట్‌స్టాండింగ్ అండర్ గ్రాడ్యుయేట్ టాలెంట్ (స్కాట్)’ ప్రోగ్రామ్ వివరాలను బ్రిటిష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాథన్ వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులు యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో ‘హౌ టు బీ మోర్ రేషనల్ క్రియేటివ్ థింకింగ్, లాజిక్ అండ్ రీజనింగ్ (హేతుబద్ధంగా ఉండటం ఎలా? విమర్శనాత్మకత, తర్కం, హేతువాదన) అనే అంశాలపై మార్చి, ఏప్రిల్‌లలో రెండు వారాలపాటు కోర్సు చేస్తారని తెలిపారు.
విద్యార్థులకు అవసరమయ్యే వీసా, ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, యూకేలో కోర్సు ఫీజులు, వసతి, ఇతర ఖర్చులను బ్రిటిష్ కౌన్సిల్ భరిస్తుందని తెలిపారు. రాష్ట్రాన్ని ఆధునిక విజ్ఞాన కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment