విద్యార్థులతో ముఖాముఖి.. సీఎం రేవంత్‌ కీలక పిలుపు | CM Revanth Reddy Interact With Students In Hyderabad | Sakshi
Sakshi News home page

విద్యార్థులతో ముఖాముఖి.. సీఎం రేవంత్‌ కీలక పిలుపు

Published Wed, Nov 6 2024 6:01 PM | Last Updated on Wed, Nov 6 2024 6:21 PM

CM Revanth Reddy Interact With Students In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా మధిర, వైరా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అందరికి విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు.

‘‘21 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. దేశ నిర్మాణంలో మీరు భాగస్వామ్యం కావాలి. సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. వచ్చే అకడమిక్ ఇయర్‌లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయి. అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం’’ అని సీఎం రేవంత్‌ తెలిపారు.

టాటా ఇనిస్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం. సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోంది. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇవాళ్టి విద్యార్థులు రేపటి పౌరులుగా మారి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. సచివాలయం రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఉన్నత చదువులు చదివి భవిష్యత్‌లో మీరు సచివాలయంలో అడుగు పెట్టాలని.. పరిపాలనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సీఎం చెప్పారు.

‘‘గంజాయి, డ్రగ్స్ ఎక్కడ కనిపించినా 100కు డయల్ చేసి సమాచారం అందించండి. వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనం అవుతాయి. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతను అలవరచుకోవాలి. నవంబర్‌ 14న 15 వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. అదే రోజు ఫేజ్-2 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేయబోతున్నాం’’ అని సీఎం రేవంత్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement