British Council
-
యూకే కోర్సుకు 15 మంది తెలంగాణ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: యూకేలో స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సు చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రెండు వారాల కాలవ్యవధితో అందించే ఈ కోర్సుకు అయ్యే ఖర్చును బ్రిటిష్ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లోంచి పూర్తిగా మెరిట్ ప్రాతిపదికగా 15 మందిని ఎంపిక చేశారు. హైదరాబాద్ విద్యాభవన్‌లో శనివారం కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, బ్రిటిష్ కౌన్సిల్ ప్రతినిధులు భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘స్కాలర్షిప్ ఫర్ ఔట్‌స్టాండింగ్ అండర్ గ్రాడ్యుయేట్ టాలెంట్ (స్కాట్)’ ప్రోగ్రామ్ వివరాలను బ్రిటిష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాథన్ వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులు యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో ‘హౌ టు బీ మోర్ రేషనల్ క్రియేటివ్ థింకింగ్, లాజిక్ అండ్ రీజనింగ్ (హేతుబద్ధంగా ఉండటం ఎలా? విమర్శనాత్మకత, తర్కం, హేతువాదన) అనే అంశాలపై మార్చి, ఏప్రిల్‌లలో రెండు వారాలపాటు కోర్సు చేస్తారని తెలిపారు. విద్యార్థులకు అవసరమయ్యే వీసా, ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, యూకేలో కోర్సు ఫీజులు, వసతి, ఇతర ఖర్చులను బ్రిటిష్ కౌన్సిల్ భరిస్తుందని తెలిపారు. రాష్ట్రాన్ని ఆధునిక విజ్ఞాన కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. -
బ్రిటిష్ కౌన్సిల్‌తో తెలంగాణ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యువతకు విద్యారంగంలో విశ్వవ్యాప్తంగా అవకాశాలు కల్పించే లక్ష్యంతో గతంలో ఉన్న భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ ఇంగ్లండ్‌కు చెందిన బ్రిటిష్ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగుతుంది. ఇందులో భాగంగా తెలంగాణ, యూకేలోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల మధ్య సమన్వయం కోసం తెలంగాణ ప్రభుత్వ సంస్థ రిచ్ (రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్), బ్రిటిష్ కౌన్సిల్ సంయుక్తంగా కృషి చేస్తాయి. అంతరిక్షం, రక్షణ, జీవ, ఔషధ, ఆహారం, వ్యవసాయం, ఆంగ్లం, సుస్థిరాభివృద్ధి వంటి రంగాల్లో రిచ్‌తో పాటు బ్రిటిష్ కౌన్సిల్ నాలెడ్జ్ పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. తెలంగాణ యువతకు అవసరమైన నైపుణ్యాలు, ఉత్తమ విధానాల్లో శిక్షణ కోసం అవసరమయ్యే ఆవిష్కరణలపై యూకే, రిచ్ కలిసి పనిచేస్తాయి. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రిచ్ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్, తెలంగాణ, ఏపీ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, దక్షిణ భారత విభాగం బ్రిటిష్ డైరెక్టర్ జనక పుష్పనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ మహిళలకు రూ.9.4 కోట్ల స్కాలర్షిప్
లండన్: బ్రిటన్‌లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం(స్టెమ్) సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ చేయాలనుకునే భారతీయ మహిళలకు రూ.9.49 కోట్ల(మిలియన్ పౌండ్లు) స్కాలర్షిప్ అందజేస్తున్నట్లు బ్రిటిష్ కౌన్సిల్ తెలిపింది. ఈ మొత్తాన్ని బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో 2019–20 విద్యాసంవత్సరంలో మాస్టర్స్ కోర్సులో చేరే 70 మంది భారతీయ మహిళలకు ఇస్తామని వెల్లడించింది. 2018–19 విద్యా సంవత్సరంలో స్టెమ్స్ కోర్సుల్లో చేరిన 104 మంది భారతీయ మహిళలకు స్కాలర్షిప్లు ఇచ్చామని కౌన్సిల్ భారత డైరెక్టర్ అలెన్ గెమ్మెల్ తెలిపారు. వీరంతా ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లో ఉన్న 43 ప్రతిష్టాత్మక విశ్వవిద్యాయాల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారని వెల్లడించారు. బ్రిటన్‌లోని ఏ విశ్వవిద్యాలయంలో అయినా 2019, జనవరి 30 నాటికి సీటు పొందిన అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతేడాది స్టెమ్ కోర్సులు పూర్తిచేసిన భారతీయ యువతుల్లో 50 శాతం కంటే ఎక్కువమంది భారత్‌లోని టైర్–2, టైర్–3 నగరాల నుంచే ఉన్నారని తెలిపారు. గతేడాది దాదాపు 18,000 మంది భారతీయులు ఉన్నతవిద్య కోసం బ్రిటన్ వర్సిటీల్లో చేరారు. బ్రిటన్ సైన్యంలో భారతీయులు.. త్రివిధ బలగాల్లో సిబ్బంది కొరతకు చెక్ పెట్టేందుకు బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, కెన్యా సహా 53 కామన్వెల్త్ దేశాలకు చెందిన యువతను సైన్యంలో చేర్చుకునేందుకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. ఇందుకోసం బ్రిటన్‌లో ఐదేళ్ల పాటు స్థిరనివాసం ఉండాలన్న నిబంధనను తొలగించనున్నారు. ప్రస్తుతం బ్రిటన్ త్రివిధ దళాల్లో 8,200 మంది సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ దేశాల నుంచి ఈ ఏడాది 1,350 మందిని విధుల్లోకి తీసుకునేలా రూపొందించిన ప్రతిపాదనను రక్షణశాఖ పార్లమెంటుకు సమర్పించింది. బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా త్రివిధ దళాల్లో చేరేందుకు యువతులకు అవకాశం ఇస్తున్నారు. బ్రిటన్ సైన్యంలో పనిచేసేందుకు నేపాల్ గుర్ఖాలకు, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ప్రజలకు ఇప్పటికే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. -
కోల్‌కతా కోటలో చందమామ
సాక్షి, కోల్‌కతా : తారల మధ్య తళుకులీనే చందమామ నేలరాలింది. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ లాన్స్‌లో కొలువుతీరింది. త్రీడీ చందమామను అమర్చిన ఆ ప్రాంతమంతా వీక్షకులతో కిక్కిరిసిపోయింది. నాసా లూనార్ రీకనైసెన్స్ ఆర్బిటర్ కెమెరా ఇమేజరీ ఉపయోగించి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడంతో చిన్నాపెద్దా కళ్లముందు నిలిచిన చందమామను కళ్లింతలు చేసుకుని చూశారు. బ్రిటష్ కౌన్సిల్ చేపట్టిన మ్యూజియం ఆఫ్ ద మూన్ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని చారిత్రక విక్టోరియా మెమోరియల్ హాల్లో త్రీడీ ఇన్స్టలేషన్ను ఉంచారు. బెంగళూర్, ముంబయి, ఉదయ్పూర్లలోనూ గతంలో మ్యూజియం ఆఫ్ ది మూన్‌ను ప్రదర్శనకు ఉంచారు. నిజమైన చందమామ కంటే అయిదు లక్షల రెట్లు చిన్నదిగా ఈ నకలు చందమామ ఉంటుంది. 23 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ మూన్ చిన్నారులు, యువతను అమితంగా ఆకట్టుకుంది. బ్రిటిష్ ఆర్టిస్ట్ ల్యూక్ జెర్రామ్ ఈ మూన్‌ను నేలపై నిలిపారు. శాస్త్రం, కళల సమ్మేళనంతో ఈ ఆవిష్కరణ సాధ్యమైందని, ఇది బ్రిటిష్ కౌన్సిల్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని అధికారులు పేర్కొన్నారు. -
భారత విద్యార్థుల కోసం బ్రిటన్ స్కాలర్షిప్స్
హైదరాబాద్: భారత విద్యార్థుల్ని ఆకర్షించే లక్ష్యంతో మిలియన్ పౌండ్ల స్కాలర్షిప్ను బ్రిటిష్ కౌన్సిల్ ప్రకటించింది. బ్రిటన్‌లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల్లో 198 మందికి గ్రేట్ బ్రిటన్ స్కాలర్షిప్స్– ఇండియా 2017 పేరిట ఈ స్కాలర్షిప్లు అందనున్నాయి. ఆర్ట్స్, డిజైనింగ్, ఇంజనీరింగ్, లా, మేనేజ్మెంట్ తదితర కోర్సుల్ని బ్రిటన్‌లో అభ్యసించే విద్యార్థులకు వీటిని అందించనున్నట్లు దక్షిణ భారత బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ మీ క్వీయ్ బార్కర్ సోమవారం వెల్లడించారు. వీటిలో 29 అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లు, మిగతా 169 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఐదు లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారని, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని బార్కర్ అన్నారు. బ్రిటన్‌లో చదువుకోవాలనుకునే ఔత్సాహికుల కోసం నేడు హైదరాబాద్‌లో ‘స్టడీ యూకే: డిస్కవర్ యూ’ పేరిట ఓ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. దీనిలో పాల్గొని విద్యార్థులు బ్రిటన్‌లో విద్యపై తమ సందేహాలు తీర్చుకోవచ్చని సూచించారు. ఈ సదస్సుకి యూకేకి చెందిన 20 ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. -
భారతీయ విద్యార్థులకు బ్రిటన్ స్కాలర్షిప్లు
కోల్‌కతా: విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు బ్రిటన్ ‘గ్రేట్ క్యాంపెయిన్ పేరిట 2017లో 198 మంది భారతీయ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించనుంది. ఇందుకోసం రూ. 85 కోట్లను కేటాయించినట్లు బ్రిటిష్ కౌన్సిల్ ఈస్ట్ ఇండియా సంస్థ డైరెక్టర్ దేవాంజన్ చక్రవర్తి తెలిపారు. ఇంజినీరింగ్, లా, డిజైన్, మెనేజ్ మెంట్ కోర్సుల్లో 29 అండర్ గ్రాడ్యుయేట్, 169 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. -
బుజ్జి రాకుమారుడిపై విమర్శలు!
బ్రిటన్ రాజవంశానికి చెందిన బుజ్జి రాకుమారుడు జార్జ్‌పై ఫేస్బుక్లో బ్రిటిష్ కౌన్సిల్ సీనియర్ ఉద్యోగిని చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజవంశానికి చెందినవాడు కావడంతో ఏ కాయకష్టం చేయకుండా ప్రజలసొమ్ముపై ఆధారపడి ప్రిన్స్ జార్జ్ బతుకుతున్నాడని బ్రిటిష్ కౌన్సిల్ గ్లోబల్ చారిటీ హెడ్ ఏంజెలా గిబన్స్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. ఆ చిన్నారి గురించి కొన్ని అనుచితమైన దూషణలు చేశారు. జార్జ్‌లో ఇప్పటికే తాను రాజవంశానికి చెందిన సంపన్నుడినన్న గర్వం కనిపిస్తున్నదని, అదే మూడేళ్ల సిరియా శరణార్ధి పిల్లాడు జార్జ్లా గర్వంగా ఎదగగలడా అని ఆమె ప్రశ్నించారు. అయితే, ఈ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని బ్రిటిష్ కౌన్సిల్ స్పష్టం చేసింది. తమ ఉద్యోగి తన వ్యక్తిగత ఫేస్బుక్ అకౌంట్లో చేసిన ఈ వ్యాఖ్యలపై విచారణ జరుపుతామని తెలిపింది. బ్రిటిష్ కౌన్సిల్ దాదాపు వందదేశాల్లో ఇంగ్లిష్ భాష కోర్సులను అందజేస్తున్నది. -
భారత విద్యార్థులకు స్కాలర్షిప్లు
రూ.15 కోట్లు ప్రకటించిన బ్రిటిష్ కౌన్సిల్ సాక్షి, హైదరాబాద్: యూకేలో చదవాలనుకున్న భారతీయ విద్యార్థుల కోసం రూ.15 కోట్ల స్కాలర్షిప్లను బ్రిటిష్ కౌన్సిల్ ప్రకటించింది. ఇంజనీరింగ్, లా, ఆర్ట్ అండ్ డిజైన్, ఐటీ తదితర రంగాల్లోని 59 అండర్ గ్రాడ్యుయేట్, 232 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ల్లో 291 మంది భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించనున్నట్లు బ్రిటిష్ కౌన్సిల్ ప్రతినిధులు ప్రకటించారు. హైదరాబాద్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లోని 45 యూకే ఇన్స్టిట్యూట్స్లో అభ్యసించే వారికి స్కాలర్షిప్లు దక్కనున్నాయని చెప్పారు. సాంస్కృతిక, ద్వైపాక్షిక సంబంధాలు దృఢపడాలన్న ఉద్దేశంతో ‘గ్రేట్ బ్రిటన్ స్కాలర్షిప్స్-ఇండియా 2016’ ప్రవేశపెట్టినట్లు వారు వివరించారు. 9న యూకే ఎడ్యుకేషన్ ఫెయిర్.. యూకేలో విద్యావకాశాల గురించి తెలుసుకోవాలనుకునే ఔత్సాహిక విద్యార్థుల కోసం ఈనెల 9న ‘ఎడ్యుకేషన్ యూకే ఎగ్జిబిషన్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బేగంపేటలోని తాజ్ వివంతా హోటల్లో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు ఇది కొనసాగుతుంది. కోర్సుల ఎంపిక, వీసా అప్లికేషన్లు, స్కాలర్షిప్లు, వసతి, ఫీజులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణ భారత డెరైక్టర్ మీ-క్వీ బార్కర్, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెకల్లిస్టర్ మాట్లాడారు.