భారత విద్యార్థుల కోసం బ్రిటన్ స్కాలర్‌షిప్స్
హైదరాబాద్: భారత విద్యార్థుల్ని ఆకర్షించే లక్ష్యంతో మిలియన్ పౌండ్ల స్కాలర్‌షిప్‌ను బ్రిటిష్ కౌన్సిల్ ప్రకటించింది. బ్రిటన్‌లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల్లో 198 మందికి గ్రేట్ బ్రిటన్ స్కాలర్‌షిప్స్– ఇండియా 2017 పేరిట ఈ స్కాలర్‌షిప్‌లు అందనున్నాయి. ఆర్ట్స్, డిజైనింగ్, ఇంజనీరింగ్, లా, మేనేజ్‌మెంట్ తదితర కోర్సుల్ని బ్రిటన్‌లో అభ్యసించే విద్యార్థులకు వీటిని అందించనున్నట్లు దక్షిణ భారత బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ మీ క్వీయ్ బార్కర్ సోమవారం వెల్లడించారు. వీటిలో 29 అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు, మిగతా 169 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు ఉన్నట్లు తెలిపారు.
ప్రస్తుతం బ్రిటన్‌లో ఐదు లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారని, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని బార్కర్ అన్నారు. బ్రిటన్‌లో చదువుకోవాలనుకునే ఔత్సాహికుల కోసం నేడు హైదరాబాద్‌లో ‘స్టడీ యూకే: డిస్కవర్ యూ’ పేరిట ఓ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. దీనిలో పాల్గొని విద్యార్థులు బ్రిటన్‌లో విద్యపై తమ సందేహాలు తీర్చుకోవచ్చని సూచించారు. ఈ సదస్సుకి యూకేకి చెందిన 20 ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు.