లండన్: బ్రిటన్‌లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం(స్టెమ్) సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ చేయాలనుకునే భారతీయ మహిళలకు రూ.9.49 కోట్ల(మిలియన్ పౌండ్లు) స్కాలర్‌షిప్ అందజేస్తున్నట్లు బ్రిటిష్ కౌన్సిల్ తెలిపింది. ఈ మొత్తాన్ని బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో 2019–20 విద్యాసంవత్సరంలో మాస్టర్స్ కోర్సులో చేరే 70 మంది భారతీయ మహిళలకు ఇస్తామని వెల్లడించింది. 2018–19 విద్యా సంవత్సరంలో స్టెమ్స్ కోర్సుల్లో చేరిన 104 మంది భారతీయ మహిళలకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చామని కౌన్సిల్ భారత డైరెక్టర్ అలెన్ గెమ్మెల్ తెలిపారు.
వీరంతా ఇంగ్లండ్, స్కాట్‌లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లో ఉన్న 43 ప్రతిష్టాత్మక విశ్వవిద్యాయాల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారని వెల్లడించారు. బ్రిటన్‌లోని ఏ విశ్వవిద్యాలయంలో అయినా 2019, జనవరి 30 నాటికి సీటు పొందిన అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతేడాది స్టెమ్ కోర్సులు పూర్తిచేసిన భారతీయ యువతుల్లో 50 శాతం కంటే ఎక్కువమంది భారత్‌లోని టైర్–2, టైర్–3 నగరాల నుంచే ఉన్నారని తెలిపారు. గతేడాది దాదాపు 18,000 మంది భారతీయులు ఉన్నతవిద్య కోసం బ్రిటన్ వర్సిటీల్లో చేరారు.
బ్రిటన్ సైన్యంలో భారతీయులు..
త్రివిధ బలగాల్లో సిబ్బంది కొరతకు చెక్ పెట్టేందుకు బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, కెన్యా సహా 53 కామన్‌వెల్త్ దేశాలకు చెందిన యువతను సైన్యంలో చేర్చుకునేందుకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. ఇందుకోసం బ్రిటన్‌లో ఐదేళ్ల పాటు స్థిరనివాసం ఉండాలన్న నిబంధనను తొలగించనున్నారు. ప్రస్తుతం బ్రిటన్ త్రివిధ దళాల్లో 8,200 మంది సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో కామన్‌వెల్త్ దేశాల నుంచి ఈ ఏడాది 1,350 మందిని విధుల్లోకి తీసుకునేలా రూపొందించిన ప్రతిపాదనను రక్షణశాఖ పార్లమెంటుకు సమర్పించింది. బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా త్రివిధ దళాల్లో చేరేందుకు యువతులకు అవకాశం ఇస్తున్నారు. బ్రిటన్ సైన్యంలో పనిచేసేందుకు నేపాల్ గుర్ఖాలకు, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ప్రజలకు ఇప్పటికే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment