మీరెప్పుడైనా ప్యాంట్ జేబులో డబ్బులు పెట్టి మరచిపోయారా? అలాగే ఉతికేందుకు ఇచ్చేశారా? ఇంట్లోనైతే ఫర్వాలేదు కానీ... బయట లాండ్రీకి ఇస్తే? ఇక అంతే సంగతులు. ఆ డబ్బులను శాశ్వతంగా మరచిపోవచ్చు. ఇదీ మన అనుభవం కానీ మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి వ్యక్తి ఒకరికి దీనికి భిన్నమైన అనుభవం ఎదురైంది. జేబులో ఉంచి మరచిపోయిన డబ్బు అంతకు అంతా తిరిగి వచ్చింది. లాండ్రీవాడి నిజాయితీ పుణ్యం! వివరాలు ఏమిటంటే...
మధ్యప్రదేశ్‌లోని శివపురిలోని సంతోషి మాత ఆలయానికి సమీపంలో సూపర్ లాండ్రీ దుకాణం ఉంది. ఈ షాపులో పనిచేస్తున్న డ్రై క్లీనర్ పంచమ్ రజక్‌కు కొన్ని దుస్తులు డ్రైక్లీనింగ్‌కు వచ్చాయి. వాటిని వాషింగ్ మెషీన్‌లోకి వేసేందుకు సిద్ధం చేస్తూండగా అందులో 500 రూపాయల నోట్ల కట్ట కనిపించింది. కట్టలో మొత్తం 50 వేల రూపాయలు ఉన్నట్లు స్పష్టమైంది. అంత డబ్బు చూసిన రజక్‌కు కాసేపు ఏం చేయాలో పాలుపోలేదు. నిజాయితీ పరుడు కావడంతో ఈ విషయాన్ని వెంటనే వినియోగదారుడికి తెలియజేశాడు. తరువాత పంచమ్ రజక్ ఆ కస్టమర్ ఇంటికి వెళ్లి, రూ.50 వేల మొత్తాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు. అతని నిజాయితీని గుర్తించిన కస్టమర్ అతనికి బహుమానంగా రూ.2100 అందజేశాడు. కాగా ఈ సంగతి తెలుసుకున్న స్థానికులు డ్రై క్లీనర్ పంచమ్ రజక్ నిజాయితీని మెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment