అటకెక్కిన హైదరాబాద్ మెట్రో కోచ్‌ల పెంపు
ఒక్కో రైలుకు 3 నుంచి 6కు పెంచాలని ప్రణాళిక
అదనపు కోచ్‌లు కొనటానికి రూ.500 కోట్లు
నష్టాలు వస్తున్నాయని పక్కన పెట్టిన ఎల్ అండ్ టీ
నిత్యం రద్దీతో ప్రయాణికుల ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మెట్రో రైళ్లలో నిత్యం రద్దీ నెలకొంటోంది. ఏ స్టేషన్‌లో చూ సినా ప్రయాణికులు మెట్రో కోసం ఎదురుచూస్తూ కనిపిస్తున్నారు. కానీ అందుకు అనుగుణంగా కోచ్‌ల సంఖ్యను పెంచటం లేదు. ప్రయాణికుల రద్దీ మేరకు మెట్రో సర్వీసులను ఒక్కో రైలుకు 3 కోచ్‌ల నుంచి 6 కోచ్‌లకు పెంచేందుకు ఏడాది క్రితమే ప్రణాళిక రూపొందించారు. మహారాష్ట్రలోని నాగపూ ర్ మెట్రో నుంచి కోచ్‌లను తెప్పించాలనుకు న్నా.. ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదు.
రోజంతా రద్దీనే
రద్దీ ఎక్కువగా ఉన్న రాయదుర్గం–నాగోల్, మియాపూర్–ఎల్‌బీనగర్ రూట్లలో ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తున్నా ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో మాత్రమే కాదు, అన్ని సమయాల్లోనూ ఈ కారిడార్లలో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో ఐటీ కారిడార్లలో పనిచేసే ఉద్యోగులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసేవారు సకాలంలో కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నారు.
సాధారణంగా రద్దీ కారణంగా ఒక రైలు ఎక్కలేకపోయినా మరో రైలు ఉందిలే అనే భరోసా ఉంటుంది. కానీ ఆ తరువాత వచ్చే మరో రెండు రైళ్లలోనూ ప్రయాణం భారంగానే ఉంటుందని హబ్సిగూడ నుంచి నిత్యం హైటెక్‌సిటీకి ప్రయాణించే శ్రీకాంత్ వాపోయాడు.
పెరిగిన ప్రయాణికులు
ప్రస్తుతం మూడు కారిడార్లలో 59 మెట్రో రైళ్లు రోజుకు సుమారు 1,065 ట్రిప్పుల వరకు తిరుగుతున్నాయి. ప్రతి రోజూ సుమారు 5 లక్షల మంది మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఈ సంఖ్య 5.10 లక్షల వరకు కూడా ఉంటున్నది. నగరంలో మెట్రో సేవలను ప్రారంభించినప్పటి నుంచి 40 కోట్లకుపైగా ప్రజలు ఈ సేవలను వినియోగించుకున్నారు.
2017 నవంబర్‌లో మెట్రోరైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దశలవారీగా మెట్రో విస్తరణతో పాటే ప్రయాణికుల రద్దీ పెరిగింది. అందుకు అనుగుణంగా ట్రిప్పులు కూడా పెంచారు. కానీ కోచ్‌ల కొరత వల్ల ఎన్ని ట్రిప్పులు తిరిగినా ప్రయాణికుల రద్దీ మా త్రం తగ్గటంలేదు. ప్రస్తుత ప్రయాణికుల్లో ప్రతి రోజూ 1.20 లక్షల మంది విద్యార్థులు, 1.40 లక్షలకుపైగా సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు ఉంటున్నట్లు అంచనా.
నష్టాల నెపంతో...
మెట్రో రైళ్ల నిర్వహణలో భారీగా నష్టాలొస్తున్నాయనే కారణంతో కొత్త కోచ్‌ల కొనుగోలుపై వెనుకడుగు వేసినట్లు సమాచారం. ఒక కోచ్‌ను కొనాలంటే సుమారు రూ.10 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ లెక్కన 59 రైళ్లకు అదనంగా 3 చొప్పున కొనుగోలు చేయాలంటే రూ.500 కోట్లకుపైగా ఖర్చవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోచ్‌ల కొనుగోలు అసాధ్యమని అంటున్నారు.
మెట్రో నిర్వహణలో నష్టాలు వస్తున్నాయని చెప్తూ మెట్రో నిర్వహణ సంస్థ ఎల్‌అండ్‌టీ కోచ్‌ల పెంపుపై దాటవేత ధోరణి అవలంబిస్తోంది. ప్రభుత్వానికి సైతం ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.500 కోట్లు వెచి్చంచడం సాధ్యం కాకపోవచ్చునని అధికారులు అంటున్నారు. అద్దె ప్రాతిపదికన నాగపూర్ మెట్రో నుంచి అదనపు కోచ్‌లను తెప్పించే అవకాశం ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment