ఆధునిక సౌకర్యాలు
అత్యాధునిక వసతులు
దివ్యాంగుల కోసం ప్రత్యేక బెర్త్‌లు
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే గతిని మార్చిన ‘వందేభారత్’సిరీస్‌లో స్లీపర్ బెర్తులతో కూడిన రైలు త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లు.. ఇక వేయి కిలోమీటర్లను మించిన దూరంలో ఉన్న ప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై తొలి పరుగుకు సన్నద్ధమైంది. ఇప్పటి వరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
రైల్వే శాఖ మంత్రి అశ్వీనీవైష్ణవ్ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. త్వరలో దేశంలోని ప్రధాన ప్రాంతాల మధ్య ఇవి రాత్రి వేళ పరుగులు పెట్టబోతున్నాయి. 14 రూట్‌లలో వీటినే నడిపే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నారు. స్వదేశీ పరిజ్ఞానం, పూర్తిస్థాయి అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో ఈ రైలు రూపుదిద్దుకుంది.
⇒ ఈ రైలును ఆస్టెనిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందించారు. వందేభారత్ తరహాలో దీని వెలుపలి రూపు ఏరో డైనమిక్ డిజైన్‌తో కనువిందు చేయనుంది.
⇒ ఇంటీరియర్‌ను జీఎఫ్‌ఆర్‌పీ ప్యానల్‌తో రూపొందించారు.
⇒ అగ్ని నిరోధ వ్యవస్థ ఈఎన్ 45545 ప్రమాణ స్థాయితో రూపొందింది (హజార్డ్ లెవెల్:3).
⇒ దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు ఇందులో పొందుపరిచారు.
⇒ ఆటోమేటిక్ పద్ధతిలో తెరుచుకొని, మూసుకునే పద్ధతి గల డోర్‌లు ఏర్పాటు చేశారు. ఇవి సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్‌తో పనిచేస్తాయి.
⇒ దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు.
⇒ మొదటి శ్రేణి ఏసీ కోచ్‌లో వేడి నీటితో కూడిన షవర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.
⇒ కోచ్‌లలోని బెర్తుల వద్ద రీడింగ్ లైట్లు, యూఎస్‌బీ చార్జింగ్ వసతి ఉంటుంది.
⇒ అనౌన్స్‌మెంట్‌ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ, ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్ ఉంటుంది.
మొత్తం 16 కోచ్‌లు
ఈ ఆధునిక స్లీపర్ వందేభారత్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. అప్పర్ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. మిడిల్ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్ బెర్తులు గ్రే కలర్‌లో ఉంటాయి. అప్పర్ బెర్తులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్ బ్యాగు, మొబైల్ ఫోన్ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. లోకో పైలట్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment