విద్యుత్ రైలుకి వందనం | India is the country with the highest level of railway electrification | Sakshi
Sakshi News home page

విద్యుత్ రైలుకి వందనం

Published Mon, Feb 3 2025 3:37 AM | Last Updated on Mon, Feb 3 2025 3:37 AM

India is the country with the highest level of railway electrification

1925 ఫిబ్రవరి 3న దేశంలో తొలి విద్యుత్‌ రైలు పరుగులు

ముంబై–కుర్లా మార్గంలో మొదట వినియోగం 

1961 తర్వాత ఊపందుకున్న రైల్వే విద్యుదీకరణ 

పెద్ద దేశాల్లో రైల్వే విద్యుదీకరణ అత్యధికంగా జరిగిన దేశం మనదే..

కూ.. ఛుక్‌.. ఛుక్‌.. ఛుక్‌.. ఇది రైలు శబ్ద విన్యాసం..!గుప్పు.. గుప్పు.. వెలువడే పొగ బండి.. రైలును ఉద్దేశించి అనాదిగా చెప్పే మాట. ఇప్పుడా శబ్దం మారింది, ఆ పొగ మాయమైంది. అది విద్యుదీకరణ విప్లవం ఫలితం.. 
మనదేశ పట్టాల మీద ఆ విప్లవానికి బీజం పడి ఫిబ్రవరి 3వ తేదీకి సరిగ్గా వందేళ్లు కావస్తోంది.

1925 ఫిబ్రవరి 3వ తేదీ.. బొంబాయి (ప్రస్తుత ముంబై) నగరంలోని విక్టోరియా టెర్మినస్‌ (ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌) రైల్వేస్టేషన్‌ కిక్కిరిసి ఉంది. బ్రిటిష్‌ అధికారులు, పోలీసుల హడావుడి మధ్య నగర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో చుక్‌ చుక్‌మనే శబ్దం, గుప్పుమనే పొగ లేకుండానే మూడు కోచ్‌లతో కూడిన రైలు కామ్‌గా వచ్చి ఆగింది. అంతే చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగింది. గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులా రైల్వే హార్బర్‌ బ్రాంచి ఆ తొలి సబర్బన్‌ ఎలక్ట్రిక్‌ రైలును నడిపింది. – సాక్షి, హైదరాబాద్‌

ముంబై–కుర్లా మార్గంలో..
అప్పటికే పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలక్ట్రిక్‌ రైళ్లు పరుగుతీస్తున్నాయి. మన దేశంలో పెద్ద నగరమైన ముంబైలోనూ వాటిని ప్రవేశ పెట్టాలని నాటి బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ముంబై–కుర్లా మార్గాన్ని పూర్తి చేసింది. మన దేశంలో ప్రవేశపెట్టిన ఈ తొలి విద్యుత్‌ లోకోమోటివ్‌ను స్విస్‌ లోకోమోటివ్‌ అండ్‌ మెషీన్‌వర్క్స్‌ సంస్థ తయారు చేసింది. 

ఇంగ్లండ్‌లో ఉపయోగించిన న్యూపోర్ట్‌–షిల్డన్‌ విద్యుదీకరణ తరహా విధానాన్ని ఇక్కడ అనుసరించారు. దానికోసం 1,500 వోల్ట్స్‌ డీసీ విద్యుత్‌ను ఉప యోగించారు. ఈ రైలుకు మూడు కోచ్‌లను అనుసంధానం చేశారు. వాటిని ఇంగ్లండ్‌కు చెందిన కామెల్‌–లెయిర్డ్, జర్మనీకి చెందిన ఉర్డింగెన్‌ వ్యాగన్‌ ఫాబ్రిక్‌ సంస్థలు తయారు చేశాయి.

వరుసగా విద్యుత్‌ రైళ్లను ప్రారంభిస్తూ..
గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులా రైల్వేకు పోటీగా 1929లో బాంబే బరోడా– సెంట్రల్‌ ఇండియా రైల్వే బాంబే చర్చ్‌గేట్‌ నుండి బోరివలి వరకు 1500 వోల్ట్స్‌ డీసీ కరెంటును ఉపయోగించి ఈఎంయూ రైళ్లను నడపడం ప్రారంభించింది. గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులా రైల్వే 1928లో కొన్ని బ్యాటరీ– ఆపరేటెడ్‌ ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌లను దిగుమతి చేసుకుంది. ముంబై వీటీ నుంచి పుణె, ఇగత్‌పురి వరకు మార్గాన్ని 1929–30 నాటికి విద్యుదీకరించి కరెంటు రైళ్లను ప్రారంభించింది. 

ఆగస్ట్‌ 1927 నాటికి 41 స్విస్‌ క్రోకోడిల్‌ ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌లు ముంబైకి చేరుకున్నాయి. తర్వాతి తరం ఇంజన్లను ఇంగ్లండ్‌లో వల్కన్‌ ఫౌండ్రీ , మెట్రోపాలిటన్‌ వికర్స్‌ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ రెండో తరం ఇంజన్ల గరిష్ట వేగం అప్పట్లోనే గంటకు 136 కిలోమీటర్లు కావటం విశేషం. వాటిని 112 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు అనుమతించారు. కానీ మన దేశంలోని ట్రాక్‌ సామర్థ్యం దృష్ట్యా అవి 55 కిలోమీటర్ల వేగానికే పరిమితం అయ్యాయి.

1930 తర్వాత బ్రేక్‌ పడి..
దేశంలో వరుసగా విద్యుత్‌ రైళ్లను ప్రవేÔè పెడుతూ వచ్చిన బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం.. 1930 తర్వాత వేగం తగ్గించుకుంది. స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటమే దానికి కారణం. 1930 నుంచి 1947 మధ్య 388 కిలోమీటర్ల మార్గాన్ని మాత్రమే విద్యుదీకరించారు. ఇక స్వాతంత్య్రం తర్వాత తొలి ఐదేళ్లు రైల్వే మార్గాల విద్యుదీకరణ పూర్తిగా నిలిచిపోయింది. 1951–56 మధ్య 141 కి.మీ. 1956–61 మధ్య 246 కి.మీ. మేర విద్యుదీకరించారు. 1961 తర్వాత వేగం పుంజుకుంది. 

కొత్త మార్గాలన్నీ ఎలక్ట్రిక్‌ విధానంలో చేపడుతూ వచ్చినా అది పరిమితంగానే ఉండిపోయింది. దీంతో 90శాతం ప్రాంతాల్లో డీజి ల్‌ రైళ్లే నడుస్తూ వచ్చాయి. దక్షిణ భారత్‌కు సంబంధించి 1931లోనే మద్రాస్‌ బీచ్‌ స్టేషన్‌–తాంబారం స్టేషన్‌ మధ్య కరెంటు రైళ్లను నడిపారు. కానీ తర్వాత పురోగతి లేకుండా పోయింది. తిరిగి 1980 దశకంలో కదలిక వచ్చింది. ఆ సమయంలోనే ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో లైన్ల విద్యుదీకరణ మొదలైంది.

విజయవాడ – గూడూరు మధ్య తొలిసారిగా..
విజయవాడ–గూడూరు–చెన్నై సెక్షన్‌ విద్యుదీకరణ పనులతో తెలుగు నేలపై కరెంటు రైళ్ల వినియోగానికి బీజం పడింది. 1976లో ప్రారంభమైన పనులు 1980 నాటికి పూర్తయ్యాయి. తర్వాత వరుసగా విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. స్థానిక పరిస్థితులు, వాతావరణ కారణాలు, సాంకేతిక సమస్యలు.. వెరసి ఒక మార్గంలో కొంతదూరం విద్యుదీకరణ పనులు పూర్తయితే.. మిగతా మార్గంలో జరిగేవి కావు. 

దీనితో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు విద్యుదీకరణ ఉన్నంత వరకు కరెంటు ఇంజిన్లు వాడి, తర్వాత డీజిల్‌ ఇంజిన్‌ జత చేసి ముందుకు పంపేవారు. ఇటీవలి వరకు ఇది కొనసాగడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో తెలంగాణ, ఏపీ సహా 20 రాష్ట్రాల్లో మొత్తం లైన్లను విద్యుదీకరించారు. ప్రస్తుతం కొత్తగా చేపట్టే రైల్వే లైన్లతో సమాంతరంగా విద్యుదీకరణ పనులు కూడా జరుపుతారు.

మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ రైలును ధ్వంసం చేసిన కార్మికులు..
ప్రపంచంలో తొలి ఎలక్ట్రిక్‌ రైలు స్కాట్లాండ్‌లో రూపొందింది. అక్కడి అబెర్డీన్‌ నగరానికి చెందిన రసాయన శాస్త్రవేత్త రాబర్ట్‌ డేవిడ్‌సన్‌ 1837లో గాల్వానిక్‌ సెల్స్‌ (బ్యాటరీలు)తో నడిచే ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ను రూపొందించారు. అది ఫలితం ఇవ్వకపోవడంతో మార్పు లు చేసి మరో ఏడు టన్నుల బరువును లాగ గలిగిన లోకోమోటివ్‌ను అభివృద్ధి చేశారు.

 దాని వేగం గంటకు 6 కిలోమీటర్లు. ప్రయోగ పరీక్షలో ఆరు టన్నుల బరువును రెండున్నర కిలోమీటర్ల దూరం లాగింది. గ్లాస్గో రైల్వేలో దీనిని నడ పాలని నిర్ణయించారు. ఈలోపే తమ ఉద్యోగ భద్రతకు ముప్పు వస్తుందని ఆందోళన చెందిన రైల్వే కార్మికులు ఆ లోకోమోటివ్‌ను ధ్వంసం చేశారు.

» మొదటి ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ రైలును 1879లో బెర్లిన్‌లో వెర్నర్‌ వాన్‌ సిమెన్స్‌ ఆధ్వర్యంలో సిద్ధమైంది. 2.2 కిలోవాట్స్‌ శక్తి గల మోటారుతో నడిపారు. మూడు కోచ్‌లతో కూడిన ఆ రైలు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో నడిచింది.
»   సొరంగ మార్గాలు, కిక్కిరిసిన పట్టణ ప్రాంతాల్లో డీజిల్, బొగ్గు రైలు పొగతో జనం విసిగిపోయి ఎలక్ట్రిక్‌ రైళ్ల వైపు మొగ్గుచూపటం ప్రారంభించారు. కొన్ని పట్టణాలు అప్పట్లోనే పొగ రైళ్లను నిషేధించాయి.
»    అమెరికాలో తొలి ఎలక్ట్రిక్‌ రైలు 1895లో మొదలైంది. బాల్టిమోర్‌ ఒహియోను న్యూ యార్క్‌ మధ్య దాన్ని ప్రారంభించారు.

మన దేశంలో కరెంటు రైలు విశేషాలెన్నో..
»  మన దేశంలో ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్‌ లోకోమోటివ్‌లు 10,230, డీజిల్‌ ఇంజన్లు 4,560..
» చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌లో 1961లో మన దేశం సొంతంగా ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ను రూపొందించింది. డబ్ల్యూసీఎం–5 లోకమాన్య అని దానికి పేరు పెట్టారు. అయితే ఇప్పటికీ శక్తివంతమైన లోకోమోటివ్‌ల తయారీ కోసం మన దేశం విదేశీ కంపెనీలపై ఆధారపడుతోంది.
» 2015లో స్విస్‌ కంపెనీ ఆల్‌స్టామ్‌తో కేంద్రం ఒప్పందం చేసుకుని, బిహార్‌లోని మాధేపురాలో ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ల తయారీ యూనిట్‌ ప్రారంభించింది. ఇక్కడ 12,000 హార్స్‌పవర్‌ సామర్థ్యమున్న లోకోమోటివ్‌లు తయారు చేస్తున్నారు. 250 కంటే అధికంగా వ్యాగన్లు ఉండే సరుకు రవాణా రైళ్లకు ఈ లోకోమోటివ్‌లను వాడుతున్నారు.
»  ప్రపంచంలో తొలిసారిగా పాత డీజిల్‌ రైలు ఇంజన్‌ను ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌గా మార్చిన ఘనత మన రైల్వేదే. ఇప్పటికే ప్రయోగాత్మంగా మూడు ఇంజన్లను మార్చి వినియోగి స్తున్నారు. పాత డీజిల్‌ ఇంజన్లన్నీ ఎలక్ట్రిక్‌గా మార్చే ప్రతిపాదన ఉంది. అయితే ఏదైనా సమస్య ఏర్పడి ఎలక్ట్రిక్‌ రైళ్ల వినియోగంలో ఇబ్బందులు తలెత్తితే.. అత్యవసరంగా వినియోగించేందుకు వీలుగా 3 వేల డీజిల్‌ ఇంజన్లను సిద్ధంగా ఉంచాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement