
ఎస్‌హెచ్‌జీలకు సబ్సిడీపై అందజేతకు ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇప్పటికే వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వాలు..తాజాగా డ్రోన్ల ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని నిర్ణయించాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో స్వయం సహాయక సంఘాలను (ఎస్‌హెచ్‌జీ) ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా..వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల వినియోగంలో వీరికి అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు.
వ్యవసాయ రంగానికి, రైతులకు సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా, సబ్సిడీ రేట్లపై ఈ సంఘాలకు డ్రోన్ల అందజేతకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టు సాధించే విజయాలు, మహిళా సాధికారతకు డ్రోన్ల అందజేత ఏ మేరకు దోహదపడుతుందనే అంశాన్ని పరిశీలించిన తర్వాత మిగతా జిల్లాలకు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారు.
ఒక్కో మండలంలో ఒక్కో ఎస్‌హెచ్‌జీకి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మండలానికి చెందిన ఒక గ్రూపును ఎంపిక చేసి జాతీయ పథకం కింద అమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలుస్తోంది. ఎస్‌హేచ్‌జీల్లోని మహిళా సభ్యులకు ఉపాధి అవకాశాల కల్పన ద్వారా ఆర్థిక స్వావంబనతో పాటు రైతులకు తోడ్పాటును అందించాలనేది ఈ పథకం ముఖ్యోద్దేశం. వ్యవసాయ రంగంలో డ్రోన్ల సాంకేతికత వినియోగానికి కేంద్రం ప్రాచుర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఎస్‌హేచ్‌జీలకు 80 శాతం సబ్సిడీతో డ్రోన్లను అందజేయనున్నారు.
కేంద్రం ఒక్కో డ్రోన్‌కు రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తుండగా...అందులో 80 శాతం అంటే రూ.8 లక్షలు సబ్సిడీగా కవర్ కానుంది. మిగతా రూ.2 లక్షలు మండల మహిళా సంఘాలు భరించాల్సి ఉంటుంది. డ్రోన్లను సరైన పద్ధతుల్లో ఉపయోగించేలా ఎస్‌హేచ్‌జీలకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. డ్రోన్లు కేటాయించిన తర్వాత మహిళా సంఘాలు వీటిని రైతులకు అద్దెకు అందుబాటులో ఉంచుతాయి. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది.
కూలీల సమస్యకు చెక్
డ్రోన్లతో వరి, మామిడి, పత్తి, ఇతర పంటలకు ఎరువులు, పురుగు మందులు చల్లించడం ద్వారా రైతులకు కూలీల సమస్య ఏర్పడకుండా ఉంటుంది. ఇతర కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తారు. గతేడాది ఓ ప్రైవేట్ ఎన్జీవో సంస్థ...నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండలానికి చెందిన ఇద్దరు మహిళలకు డ్రోన్లను అందజేయగా.. వాటిని వారు విజయవంతంగా నిర్వహిస్తూ రాబడిని పెంచుకున్న ఉదంతాన్ని ఓ అధికారి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌హేచ్‌జీలకు డ్రోన్లను అందజేయడం వల్ల మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మహిళా సాధికారతకు అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment