ఆరు ప్రాంతాల్లోని రైల్వే మార్గాలను క్రాస్ చేయనున్న ఔటర్ రింగ్ రైలు
ఈ ఆరుచోట్లా ఇంటర్‌ఛేంజ్ రైల్ ఓవర్ రైలు వంతెనలు
హైదరాబాద్ నగరానికి 75 కి.మీ దూరంలో నిర్మాణం దిశగా అడుగులు
కొత్తగా చేపట్టే ట్రిపుల్ ఆర్‌కు ఆవల 2–4 కి.మీ దూరంగా రింగు రైలు లైన్
ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి.. లైడార్ ద్వారా ప్రాథమిక అలైన్‌మెంట్ సిద్ధం
ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంటు తేలాక ఫైనల్ రూటు ఖరారు
ప్రాజెక్టు వ్యయం రూ.13,500 కోట్ల వరకు అవుతుందని ప్రాథమిక అంచనా
జూన్ నాటికి రైల్వే బోర్డుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక.. త్వరలో ఫైనల్ ట్రాఫిక్ సర్వే
సాక్షి, హైదరాబాద్: దేశంలో మరెక్కడా లేనివిధంగా హైదరాబాద్ నగరానికి 75 కి.మీ దూరంలో తొలి ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. కొత్తగా చేపట్టబోయే రీజినల్ రింగు రోడ్డుకు అవతల దీన్ని చేపట్టనున్నారు. ఆరు ప్రాంతాల్లోని రైల్వే లైన్లను ఇది క్రాస్ చేస్తుంది. అంటే ఆరు రైలు మార్గాలు దీనితో అనుసంధానమవుతాయన్న మాట. ఈ ప్రాజెక్టును గతంలోనే ప్రతిపాదించినా సాధ్యాసాధ్యాలను తేల్చటంలో జాప్యం జరిగింది.\
దీంతో ఈ ప్రతిపాదన నిలిచిపోయిందనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేసిన రైల్వే శాఖ, దాని అలైన్‌మెంటు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కసరత్తు ప్రారంభించింది. జూన్ నాటికి డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు సమర్పించనుంది. ఫైనల్ లొకేషన్ సర్వేలో భాగంగా ఇప్పటికే లైడార్ (కాంతి కిరణాల) ఆధారిత సర్వే పూర్తి చేసి ప్రాథమిక అలైన్‌మెంటును సిద్ధం చేసింది. దీని ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.13,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.
గూడ్స్ రైళ్లన్నీ ‘ఔటర్’ నుంచే..
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండా, వెలుపలి నుంచే వెళ్లిపోయేలా ట్రిపుల్ ఆర్‌ను నిర్మించనున్న విషయం తెలిసిందే. అదే తరహాలో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల రైళ్లలో కొన్ని నగరంలోని ప్రధాన స్టేషన్లలోకి వచ్చేలా, సరుకు రవాణా లాంటి రైళ్లు వెలుపలి నుంచే వెళ్లిపోయేలా ఔటర్ రింగు రైలు ప్రాజెక్టుకు ప్రణాళిక సిద్ధం అయ్యింది. ప్రతిపాదిత ట్రిపుల్ ఆర్‌కు అవతలి వైపు 2 కి.మీ నుంచి 4 కి.మీ దూరంలో దీన్ని నిర్మించేలా.. తాజాగా హెలీకాప్టర్ ద్వారా లైడార్‌తో ఓ ప్రాథమిక అలైన్‌మెంటును రైల్వే శాఖ రూపొందించింది.
రింగు రోడ్డుకు అవతలి వైపు రింగ్ రైలు మార్గం నిర్మించాల్సి ఉన్నందున, ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంటు కూడా తేలాక దీని అలైన్‌మెంటు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం లైడార్ ఆధారంగా పూర్తి మ్యాప్ సిద్ధం చేశారు. ఆ మ్యాపు ఆధారంగా తదుపరి కచ్చితమైన అలైన్‌మెంటును రూపొందించనున్నారు. ఫైనల్ లొకేషన్ సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం రూ.12.64 కోట్లను గత బడ్జెట్‌లో మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
394– 420 కి.మీ నిడివితో సింగిల్ లైన్
⇒ ఔటర్ రింగ్ రైలు నిడివి 394 కి.మీ నుంచి 420 కి.మీ వరకు ఉండనుంది. ఇందుకు 70 నుంచి 80 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తారు. భూసేకరణ ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించనున్నాయి. భూసేకరణకు దాదాపు రూ.7 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
⇒ ప్రస్తుతానికి సింగిల్ లైన్ మాత్రమే నిర్మించాలని నిర్ణయిస్తున్నందున, దాని నిర్మాణ వ్యయం రూ.6,500 కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు.
⇒ ఈ మార్గంలో దాదాపు 23 నుంచి 25 వరకు రైల్వేస్టేషన్లు ఉండే అవకాశం ఉంది. ఇంకా స్టేషన్లను గుర్తించలేదు.
⇒ కీలక ప్రాంతాల్లో గూడ్సు రైళ్ల కోసం సరుకు రవాణా యార్డులు నిర్మిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఒక మెయిన్ లైన్, రెండు లూప్ లైన్లు, సరుకు రవాణా పరిమాణం అధారంగా ఒకటి నుంచి రెండు గూడ్సు లైన్లు ఏర్పాటు చేస్తారు.
⇒ రైలు మార్గంతో పాటే విద్యుదీకరణను కూడా పూర్తి చేస్తారు.
⇒ ఆరు ఇంటర్‌ఛేంజ్ ఆర్‌ఓఆర్ వంతెనలతో పాటు నదులపై ఐదు వంతెనలు, రోడ్లను, కాలువలను దాటేందుకు 400 చిన్న వంతెనలు నిర్మించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
⇒ రేట్ ఆఫ్ రిటర్న్స్ 10 శాతానికి పైగా ఉండాలని నిర్ధారించారు. అంటే ప్రాజెక్టుకు పెట్టే పెట్టుబడిపై ఖర్చులు పోను కనీసం 10 శాతానికి పైగా అదనపు ఆదాయం ఉండాలన్నమాట.
⇒ గతంలో నిర్వహించిన ప్రిలిమినరీ ఇంజినీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వేలో సానుకూల ఫలితమే వచ్చింది. త్వరలో డీటెయిల్డ్ ట్రాపిక్ సర్వే నిర్వహించి దీనిపై కచ్చితమైన అంచనాను తేల్చనున్నారు.
అనుసంధానంఇక్కడే..
⇒ వలిగొండ వద్ద సికింద్రాబాద్–గుంటూరు రైల్వేలైన్‌ను,
⇒ వంగపల్లి వద్ద సికింద్రాబాద్–వరంగల్ లైన్‌ను,
⇒ గుల్లగూడ వద్ద సికింద్రాబాద్–తాండూరు లైన్‌ను,
⇒ మాసాయిపేట వద్ద సికింద్రాబాద్–నిజామాబాద్ లైన్‌ను,
⇒ బాలానగర్ వద్ద కాచిగూడ–మహబూబ్‌నగర్ లైన్‌ను
⇒ గజ్వేల్ వద్ద సికింద్రాబాద్–సిద్దిపేట లైన్‌ను రింగ్ రైలు మార్గం క్రాస్ చేస్తుంది.
⇒ ఈ ఆరు ప్రాంతాల్లోని రైల్వే లైన్లను ఔటర్ రింగ్ రైలు క్రాస్ చేసే చోట రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జీలను నిర్మిస్తారు.
భూసేకరణ పెద్ద సవాల్
ట్రిపుల్ ఆర్‌కు భూములిచ్చేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ససేమిరా అంటున్నారు. కొన్నిచోట్ల ప్రజలను అతి కష్టంమీద ఒప్పించారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రైల్‌కు కొత్తగా భూసేకరణ అంటే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. రకరకాల ప్రాజెక్టులతో పలు దఫాలుగా భూములు కోల్పోయామని, ఇక కొత్తగా ఏ ప్రాజెక్టుకూ భూములిచ్చేది లేదని చాలా గ్రామాల్లో ప్రజలు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో రింగ్ రైలుకు భూములు సేకరించటం కత్తిమీద సామే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment