
ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో
పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల మీదుగా ఫ్యూచర్ సిటీకి..
పెద్ద గోల్కొండ, బహదూర్‌గూడల్లో అధునాతన మెట్రో స్టేషన్లు
ముందుచూపుతో ఓఆర్‌ఆర్‌లో మెట్రోకు స్థలం కేటాయించిన దివంగత సీఎం వైఎస్
నలభై కిలోమీటర్లలో చాలావరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణమే..
డీపీఆర్ కోసం క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎన్విఎస్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కేవలం 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్స్ యూనివర్సిటీ వరకు నిర్మించనున్న 40 కిలోమీటర్ల మెట్రో కారిడార్ అత్యాధునిక సదుపాయాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన నగరాల్లోని మెట్రో ప్రయాణ అనుభవాలు స్ఫురించే విధంగా ఈ కారిడార్‌లో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు.
40 కి.మీ ఫోర్త్ సిటీ మెట్రోలో చాలావరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. హెచ్‌ఎండీఏ నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో కొంతభాగంలో మాత్రం ఎట్‌గ్రేడ్ మెట్రో (భూతలంపైన) నిర్మాణం చేపట్టనున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భవిష్యత్ దార్శనిక దృష్టి మేరకు.. ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్డు మార్గంలో మెట్రో అందుబాటులోకి రానుందని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి తెలిపారు.
ఓఆర్‌ఆర్ నిర్మాణంలో భాగంగా భవిష్యత్తులో నిర్మించే మెట్రో అవసరాలకు అనుగుణంగా ఆయన ఓఆర్‌ఆర్‌లో 20 మీటర్లు మెట్రో కోసం కేటాయించిన విషయం గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ మార్గంలోనే మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు.
సర్వే పనుల పరిశీలన
మెట్రో రెండో దశలో ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపకల్పనలో భాగంగా ఎన్విఎస్ రెడ్డి.. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ అధికారులతో కలిసి ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి మీర్‌ఖాన్‌పేట్‌లో నిర్మాణంలో ఉన్న స్కిల్స్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డీపీఆర్ తయారు చేసేందుకు జరుగుతున్న సర్వే పనులను పరిశీలించారు.
కొంగర కలాన్ దాటిన తర్వాత రోడ్డు లేకపోవడంతో కాలినడకనే కొండలు, గుట్టలు దాటుతూ పర్యటన కొనసాగించారు. ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా ఆవిష్కృతం కానున్న ఫోర్త్‌సిటీ మెట్రో సేవలు కూడా అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. సుమారు 15 వేల ఎకరాల్లో విస్తరించనున్న భవిష్య నగరిని కాలుష్య రహిత నగరంగా రూపొందించాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పమని చెప్పారు.
ఫ్యూచర్ సిటీ కారిడార్ ఇలా...
» శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ టెరి్మనల్ నుంచి మొదలై కొత్తగా నిర్మించనున్న మెట్రో రైల్ డిపో పక్క నుంచి ఎయిర్‌పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గం నిర్మించనున్నారు.
» మన్సాన్‌పల్లి రోడ్డు మార్గంలో 5 కిలోమీటర్లు ముందుకు సాగిన తర్వాత పెద్ద గొల్కోండ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్‌కు చేరుతుంది. బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండలలో రెండు మెట్రో స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకర్షణీయంగా నిర్మించనున్నారు.
» పెద్ద గోల్కొండ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల్ ఎగ్జిట్ వరకు సుమారు 14 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్ మెట్రో కారిడార్‌గా నిర్మించనున్నారు.
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుపై ‘ఎట్ గ్రేడ్ మెట్రో’
» రావిర్యాల్ ఎగ్జిట్ నుండి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్స్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగర కలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగుడా, మీర్‌ఖాన్ పేట్ వరకు హెచ్‌ఎండీఏ 100 మీటర్లు ( 328 అడుగులు) వెడల్పున గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనుంది.ఈ రోడ్డు మధ్యలో 22 మీటర్లు (72 అడుగులు) మెట్రోరైల్‌కు కేటాయించారు. ఇక్కడ భూ తలంపై (ఎట్ గ్రేడ్) మెట్రో అభివృద్ధి చేయనున్నారు.
» ఈ విశాలమైన రోడ్డు మధ్యలో అదే ఎత్తులో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా మూడు లేన్ల ప్రధాన రహదారి ఉంటుందని, మెట్రోను, ప్రధాన రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేస్తామని, ప్రధాన రహదారికి ఇరువైపులా రెండు సర్వీ స్ రోడ్లు ఉంటాయని ఎనీ్వఎస్ రెడ్డి వివరించారు.
వైఎస్ భవిష్యత్ దృష్టి
ఓఆర్‌ఆర్ నిర్మాణ సమయంలో మెట్రో రైల్‌కు కొంతభూమిని కేటాయించాలన్న తన ప్రతిపాదన మేరకు అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఓఆర్‌ఆర్‌లో అంతర్భాగంగా 20 మీటర్లు మెట్రోకు కేటాయించారని ఎన్వి ఎస్ రెడ్డి చెప్పారు. అయితే ఓఆర్‌ఆర్, మెట్రో వంటి బృహత్ ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయని, ఆచరణ సాధ్యం కాదంటూ అపహా స్యం చేశారని, కానీ ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌తోపాటు, మెట్రో కూడా కార్యరూపం దాల్చిందన్నారు.
సుమారు రూ.22 వేల కోట్లతో మొట్టమొదటి పీపీపీ ప్రాజెక్టుగా 69 కిలోమీటర్ల మెట్రో మొదటి దశను విజయవంతంగా నిర్మించామని, అదేవిధంగా సీఎం రేవంత్‌రెడ్డి దార్శనికత మేరకు హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా రెండో దశ నిర్మాణం చేపడతాయని చెప్పారు. నార్త్ సిటీలోని మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్లతో పాటు, ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్‌ను మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment