
వీడిన గృహిణి శిరీష హత్య కేసు మిస్టరీ
దిండుతో అదిమి చంపిన ఆడపడుచు
కేసు తారుమారుకు యతి్నంచిన భర్త సహా ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. గుండెపోటుతో తన భార్య చనిపోయిందని చెప్పి ఆమె మృతదేహాన్ని తరలించడానికి భర్త చేసిన యత్నాన్ని భగ్నం చేసిన చాదర్‌ఘాట్ పోలీసులు.. శిరీషను ఆమె ఆడపడుచు (భర్త సోదరి) హత్య చేసినట్లు గుర్తించారు. శిరీషను హత్య చేసిన ఆడపడచు, సహకరించిన భర్త, అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బుధవారం మలక్‌పేట ఏసీపీ శ్యాంసుందర్ ఈ వివరాలు వెల్లడించారు. 2016లో శిరీష హయత్‌నగర్‌లోని ఓ హాస్పిటల్‌లో పనిచేసే సమయంలో సరిత అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలో సరిత తన సోదరుడు సింగం వినయ్‌కుమార్‌ను పెళ్లి చేసుకోవాలని కోరగా..అందుకు అంగీకరించి పెళ్లి చేసుకుంది. తరువాత శిరీష కాచిగూడలోని మరో హాస్పిటల్‌లోనూ పని చేసి అక్కడ కూడా రిజైన్ చేశారు. అనంతరం 2024 నవంబర్‌లో శిరీష హయత్‌నగర్‌లోని మరో హాస్పిటల్‌లో నర్సింగ్ సూపర్‌వైజర్‌గా చేరింది.
అదే హాస్పిటల్‌లో సరిత కూడా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా పనిచేస్తుంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 28న శిరీష తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ మరుసటి రోజు (మార్చి 1న) రాత్రి జమునా టవర్స్‌లోని నివాసానికి వచ్చిన సరిత ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశావని శిరీషతో గొడవ పడింది. ఈ క్రమంలో ఆమెను కొట్టి, కింద పడేసి అప్పటికే తన దగ్గర ఉన్న హైడోస్ మత్తు మందును బలవంతంగా శిరీషకు ఎక్కించింది. స్పృహ కోల్పోయిన శిరీష ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేయడంతో శిరీష మృతి చెందింది.
అక్కను రక్షించాలని యత్నించి...
మరుసటి రోజు (మార్చి 2) ఉదయం శిరీష మృతి చెందిన విషయాన్ని సోదరుడు వినయ్, తన మరో సోదరి కుమారుడైన నిహాల్‌కు తెలిపింది. ముగ్గురూ కలిసి సాక్ష్యాధారాలను చెరిపేశారు. అక్కను కేసు నుంచి రక్షించాలని నిశ్చయించుకున్న తరువాత వినయ్ కుమార్ 108కి ఫోన్ చేసి తన భార్య శిరీషకు గుండె నొప్పి వచ్చిందని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పడంతో మృతదేహాన్ని దహనం చేయడానికి వెంటనే అంబులెన్స్‌లో దోమలపెంటలోని సొంతూరుకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న శిరీష మేనమామ మధుకర్ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారి నాటకానికి తెర పడింది. పోలీసుల సూచనలతో అంబులెన్స్ డ్రైవర్ మృతదేహాన్ని తిరిగి నగరానికి తీసుకు వచ్చాడు.
పోస్ట్‌మార్టం రిపోర్టులోనూ అమె ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దాంతో చాదర్‌ఘాట్ పోలీసులు శిరీషను హత్య చేసిన ఆడపడచు సరిత, భర్త వినయ్‌కుమార్, అల్లుడు నిహాల్‌ను అరెస్ట్ చేశారు. వారి నుండి మూడు సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన దిండు, బెడ్ షీట్, ఐరన్ క్రషర్‌లను స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్ ఎం.రాజు, డీఐ భూపాల్‌గౌడ్, ఎస్‌ఐ డి.రవిరాజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment