
సదరు వ్యక్తికి నోటీసులు జారీ
రూ.1,000 జరిమానా విధించిన జలమండలి
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు తరహాలో తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తే మన జలమండలి కొరడా ఝుళిపించనుంది. బుధవారం ఇలా నగరంలో తొలిసారిగా జరిమానా విధించిన ఘటన జూబ్లీహిల్స్ చోటుచేసుకుంది. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై వెళ్తుండగా.. రోడ్ నెంబర్– 78లో నేలపై నీరు పారుతుండటాన్ని చూసి పైపులైన్ లీకయినట్లు భావించారు.
ఈ విషయంపై ఆరా తీయాలంటూ స్థానిక జీఎంను ఆయన ఆదేశించారు. దీంతో డివిజన్ జీఎం హరిశంకర్ స్థానిక మేనేజర్‌తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. రోడ్డు పక్కన ఉన్న ఇంటి ముందు ఓ యువకుడు తాగునీటితో బైక్ వాషింగ్ చేస్తుండగా గమనించారు. ఈ విషయం ఎండీ దృష్టి తీసుకెళ్లారు. దీంతో ఎండీ ఆగ్రహం వ్యక్తం చేసి.. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించడం చట్ట విరుద్ధమని, తక్షణమే సదరు వ్యక్తికి జరిమానా విధించాలని సంబంధిత జనరల్ మేనేజర్‌ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి తొలిసారి తప్పుగా భావించి రూ.1000 జరిమానా విధించారు.
జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించద్ధని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే.. తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే బెంగళూర్‌లో తాగునీటిని వాహనాలను కడగడం, గార్డెనింగ్, నిర్మాణాలకు, వినోద కార్యక్రమాలకు వినియోగించడాన్ని నిషేధించింది. తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తే తొలిసారి గుర్తిస్తే రూ.5 వేలు జరిమానా.. ఆ తర్వాత కూడా వృథా చేస్తుంటే రోజుకు అదనంగా మరింత జరిమానా విధిస్తోంది.
సుదూర ప్రాంతాల నుంచి..
మహా నగర తాగునీటి అవసరాల కోసం జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సుదూరు ప్రాంతాల నుంచి నీటి తరలించి శుద్ధి చేసి సరఫరా చేస్తోంది. తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. రానున్న మూడు నెలలు నీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రజలు తాగునీటిని వృథా చేయకూడదని సూచిస్తోంది.