![Railways increasing Vande Bharat without Kavach: Telangana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/VANDE-BHARAT--1.jpg.webp?itok=44fIapmT)
కవచ్ వ్యవస్థతో ఇంకా కాని అనుసంధానం
దేశంలో ఒకే వందేభారత్ రైలుకు కవచ్
తెలంగాణలోని ఐదు రైళ్లు ప్రమాద జోన్‌లోనే..
లోకోమోటివ్‌లలో మాత్రమే కవచ్ పరికరం
ట్రాక్, స్టేషన్లలో లేకపోవటంతో అవి నిరుపయోగమే
కవచ్ లేకుండానే వందేభారత్‌లను పెంచుతున్న రైల్వే శాఖ
కుదుపులు లేని వేగవంతమైన ప్రయాణం, ఆధునిక కప్లింగ్ సిస్టం వల్ల కోచ్‌ల మధ్య సమన్వయం, ‘కవచ్’(Kavach)ఏర్పాటుతో ప్రమాదాలకు అతి తక్కువ ఆస్కారం.. వందేభారత్ రైళ్ల(Vande Bharat) గురించి రైల్వే శాఖ చెప్పే విశేషాలివి. నిజానికి ఈ రైళ్లు హై రిస్క్ జోన్‌లో పరుగు పెడుతున్నాయి. ఒక్క ప్రాంతంలో తప్ప మరెక్కడా రైలు ప్రమాదాలు నివారించే కవచ్ వ్యవస్థ ఈ రైళ్లలో లేదు. ఢిల్లీ–ఆగ్రా, మధుర–పల్వాల్ సెక్షన్ల మధ్య 86 కి.మీ. నిడివిలో మాత్రమే వందేభారత్ రైళ్లు సురక్షితంగా ప్రయాణిస్తాయి.
మిగతా ప్రాంతాల్లో సాధారణ రైళ్లకు ఉన్న ప్రమాద భయం వీటినీ వెంటాడుతోంది. గంటకు 50 – 70 కి.మీ. సగటు వేగంతో ప్రయాణించే సాధారణ రైళ్లు నిరంతరం ‘రిస్క్’లో ఉంటే.. 100 కి.మీ. సగటు వేగం (గరిష్టం 130 కి.మీ.)తో దూసుకెళ్లే వందేభారత్ రైళ్లు హై రిస్కులో ఉన్నాయని స్పష్టమవుతోంది. తెలంగాణ మీదుగా నడుస్తున్న ఐదు వందేభారత్ రైళ్లు ప్రమాదకరంగానే పరుగు పెడుతున్నాయి. పట్టాలపై రైళ్ల అధిక సాంద్రత, సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించకపోవటం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్
ఆ పరికరం నిరుపయోగమే..
ప్రస్తుతం వందేభారత్ రైళ్లలో కవచ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. లోకో పైలట్ నిర్లక్ష్యంగా ఉన్నా, తప్పుడు సిగ్నల్‌తో వేరే రైళ్లకు చేరువగా దూసుకెళ్లినా రైలు తనంతట తానుగా బ్రేక్ వేసుకుంటుందనే భావన చాలా మందిలో ఉంది. కానీ, రైళ్ల లోకోమోటివ్‌లలో మాత్రమే కవచ్ యంత్రం ఉంటే నిరుపయోగమే. కవచ్ వ్యవస్థ పనిచేయాలంటే, రైలు ఇంజిన్లలో కవచ్ పరికరం ఉండటంతో పాటు, ప్రతి స్టేషన్‌లో కవచ్ వ్యవస్థ ఉండాలి.
అక్కడి ట్రాక్ వెంట ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్స్ ఏర్పాటు చేయాలి. ట్రాక్ వెంట ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉండాలి. వీటిని అనుసంధానిస్తూ ఆ మార్గంలో నిర్ధారిత నిడివిలో టెలికం టవర్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ అనుసంధానమై పనిచేసినప్పుడే రైళ్లు వాటంతట అవి ప్రమాదాన్ని నివారించుకోగలవు. లోకో పైలట్లను కవచ్ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. మిగతావి ఏవీ లేకుండా కేవలం ఇంజిన్లలో కవచ్ పరికరంతో పరుగుపెట్టే వందేభారత్‌లు ప్రమాదాన్ని నివారించుకోలేవని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
ఒకే మార్గంలో..
ఢిల్లీ–ఆగ్రా మధ్య దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ పరుగు పెడుతోంది. దీని వేగం గంటకు 160 కి.మీ.. ఈ వేగాన్ని సాధారణ ట్రాక్ తట్టుకోలేదన్న ఉద్దేశంతో ఆ మార్గంలో 125 కి.మీ. ప్రత్యేక ట్రాక్ నిర్మించారు. అదే మార్గంలోని మధుర–పల్వాల్ సెక్షన్ల మధ్య 86 కి.మీ. మేర పూర్తిస్థాయి కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. ఆ మార్గంలో మాత్రమే రైళ్లు కవచ్ రక్షణతో ఉన్నట్టు. ఆ మార్గంలో ఒకే ఒక వందేభారత్ రైలు నడుస్తోంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లింగంపల్లి–వికారాబాద్–వాడీ సెక్షన్ల మధ్య 245 కి.మీ. మేర కవచ్ ఏర్పాటైంది. కానీ ఆ మార్గంలో వందేభారత్ రైలు తిరగటం లేదు. మన్మాడ్–ముధ్ఖేడ్–డోన్ మధ్య 959 కి.మీ... బీదర్–పర్బణి మధ్య 241 కి.మీ. మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. నార్తర్న్ రైల్వే పరిధిలో కూడా కొంతమేర ఉంది. మొత్తంగా 1,548 రూట్ కి.మీ. మేర మాత్రమే ఇది ఏర్పడింది. మరో 3 వేల కి.మీ.లో పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం వందేభారత్ రైళ్లను పెంచటంపై ప్రదర్శిస్తున్న వేగం.. కవచ్ వ్యవస్థ ఏర్పాటులో చూపటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment