
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం అఖిలపక్షం అధ్వర్యంలో ఢిల్లీలో నిరసనపై కేబినెట్ చర్చించనుంది. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా, కొత్త రేషన్ కార్డుల జారీ వేగవంతం అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది. మెప్మాను సెర్ప్‌లో విలీనం చేసే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వేసవి కాలంలో తాగు నీటి ఇబ్బందులు రాకుండా చేపట్టవలసిన చర్యలపై కూడా కేబినెట్ చర్చించనుంది.

కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసే విషయమై నిన్న(బుధవారం).. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ జరిగింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పాటించాల్సిన మార్గదర్శకాలపై చర్చించారు.
మొత్తం నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఒకవేళ సీపీఐకి ఒక స్థానం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుందామనే కోణంలో చర్చించారు. ఏ సామాజికవర్గానికి, ఏ జిల్లాకు ఎలాంటి పదవులు ఇవ్వాలి.. ఎమ్మెల్సీలుగా ఎవరిని పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై ఓ అభిప్రాయానికి వచ్చారు. అయితే, ఎమ్మెల్సీలతోపాటు ఇతర అన్ని పదవుల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకుగాను ఈనెల 7వ తేదీన ఢిల్లీకి రాష్ట్ర నాయకత్వం వెళ్లనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment