ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మరో రెండు జనరల్ కోచ్‌లు
నవంబర్‌లో దేశవ్యాప్తంగా వేయి బోగీలు
ద.మ.రైల్వే జోన్‌కు 165 కోచ్‌లు అందుబాటులోకి..
వచ్చే రెండేళ్లలో 6 వేల అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు
తీరనున్న అన్‌రిజర్వ్‌డ్ ప్రయాణికుల కష్టాలు
జనరల్ కోచ్‌లలో ప్రయాణ కష్టాలపై గతంలో సాక్షి వరుస కథనాలు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలని నిర్ణయించిన రైల్వే శాఖ.. ఆ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. అల్పాదాయ వర్గాల ప్రయాణికుల కోసం ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనంగా రెండు జనరల్ క్లాస్ కోచ్‌లను జత చేస్తున్నారు. దీంతో ఇక నుంచి ప్రతి ఎక్స్‌ప్రెస్ రైల్‌కు నాలుగు జనరల్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. నవంబర్ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా వేయి జనరల్ కోచ్‌లు అందుబాటులోకి రానుండగా.. దక్షిణ మధ్య రైల్వేకు 165 కేటాయించారు. దేశవ్యాప్తంగా అన్ రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న అంశంపై సాక్షి మీడియా పలు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే.
అన్నీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లే..
ప్రస్తుతం దేశంలో సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌ల తయారీని రైల్వే శాఖ నిలిపేసింది. వాటి స్థానంలో తక్కువ బరువుండే, ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణనష్టం తగ్గించే రీతిలో ఉండే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే తయారు చేస్తోంది. ఈ కోచ్‌ల తయారీ పెరుగుతున్నకొద్దీ సంప్రదాయ కోచ్‌లను తొలగిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్లకు మొత్తం 5,748 కోచ్‌లున్నాయి. వీటిల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల సంఖ్య 2,181. మొత్తం జోన్ పరిధిలో 272 రైళ్లు ఉంటే, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లున్న రైళ్ల సంఖ్య 88. మరో ఏడు జతల రైళ్లకు ఈ ఏడాది ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా.. అన్నీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే సరఫరా చేస్తున్నారు.
అవసరమైతే రిజర్వ్‌డ్ కోచ్‌లు తగ్గించి..
దేశవ్యాప్తంగా ఏసీ కోచ్‌ల సంఖ్య పెంచుతూ సాధారణ ప్రజలు వినియోగించే జనరల్ కోచ్‌ల సంఖ్య తగ్గిస్తున్నారంటూ కొంతకాలంగా రైల్వేశాఖపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది వాస్తవం కాదు అని ఎప్పటికప్పుడు ఖండిస్తున్న రైల్వేశాఖ.. ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అన్ రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణికుల అవస్థలను పరిశీలించేందుకు సర్వే చేసింది. అన్ రిజర్వ్‌డ్ కోచ్‌లలో నిలబడేందుకు కూడా స్థలం లేక ప్రయాణికులు టాయిలెట్ల వద్ద కూర్చుని ప్రయాణిస్తున్న వాస్తవాలను గుర్తించింది. రిజర్వేషన్ చార్జీలను భరించే స్తోమత లేక అలాగే ఇబ్బందులతో ప్రజలు ప్రయాణిస్తున్నారు.
దీంతో వెంటనే జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లకే ఈ నిర్ణయం వర్తించనుంది. క్రమంగా ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే రైళ్లకు జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచుతారు. సాధారణంగా ఒక ఎక్స్‌ప్రెస్ రైలులో 24 కోచ్‌లుంటాయి. వాటిల్లో రెండు జనరల్ కోచ్‌లుంటాయి. ఇప్పుడు అదనంగా రెండు జనరల్ క్లాస్ కోచ్‌లను అనుసంధానించటం కుదరదు. చేరిస్తే అప్పుడు ఆ రైలు కోచ్‌ల సంఖ్య 26కు పెరుగుతుంది. అన్ని రూట్లు అంత పొడవైన రైలు నడిచేందుకు అనువుగా ఉండవు. దీంతో రెండు రిజర్వ్‌డ్ కోచ్‌లను తగ్గించి వాటి స్థానంలో రెండు జనరల్ కోచ్‌లను చేర్చాలని నిర్ణయించారు. ఫలితంగా ఎక్కువ మంది అన్ రిజర్వ్‌డ్ ప్రయాణికులకు ప్రయాణ వెసులుబాటు కలగటమే కాకుండా, టాయిలెట్ల వద్ద కూర్చుని ప్రయాణించే సమస్య కొంతమేర తగ్గుతుంది.
నవంబర్‌లో వేయి కోచ్‌లు
నవంబర్ మాసం చివరి నాటికి దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా వేయి జనరల్ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఇలా పదివేల కోచ్‌లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీటిలో 6 వేలు అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు కాగా.. మిగతా 4 వేలు నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లు ఉండనున్నాయి. రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే పదివేల జనరల్ కోచ్‌లలో అదనంగా రోజుకు మరో 8 లక్షల మంది రైళ్లలో ప్రయాణించగలరని అంచనా వేశారు.
అంకెల్లో భారతరైల్వే
⇒ 4 ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారత్ స్థానం
⇒ 2023 నాటికి మొత్తం రైల్వే ట్రాక్ 1,32,310 కి.మీ రైల్వేలో మొత్తం ఉద్యోగులు 12 లక్షల మందికి పైగా
⇒ ఇండియన్ రైల్వేలో మొత్తం జోన్లు 17 దేశంలో మొత్తం రైల్వే స్టేషన్లు 7,325
⇒ దేశంలో రోజూ నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లు 13,000
⇒ దేశంలో రైళ్లలో రోజూ ప్రయాణిస్తున్న ప్రయాణికులు 2.40 కోట్ల మంది రోజూ దేశంలో నడుస్తున్న రైళ్లలో ప్యాసింజర్ కోచ్‌ల సంఖ్య 84,863
⇒ 2024 మార్చి నాటికి (2023ృ24) ఇండియన్ రైల్వే ఆదాయం రూ.2.40 లక్షల కోట్లు రోజువారీ రైల్వే ఆదాయం రూ.600 కోట్లు
⇒ రైలు ప్రమాదాలను నివారించడానికి ఇప్పటిదాకా కవచ్‌ను ఏర్పాటు చేసిన రైల్వే ట్రాక్ 37 వేల కి.మీ
⇒ దేశంలో రోజూ నడుస్తున్న సరుకు రవాణా రైళ్లు 8,000
⇒ 2024 అక్టోబర్ నాటికి దేశంలో నడుస్తున్న వందే భారత్ రైళ్లు 66 వచ్చే మూడేళ్లలో ప్రవేశపెట్టనున్న వందే భారత్ రైళ్ల సంఖ్య 400
⇒ 2024, మార్చి నాటికి దేశంలో విద్యుత్ రైల్వే మార్గాలు 62,119 కి.మీ
⇒ 202-24 లెక్కల ప్రకారం సగటున ఆన్‌లైన్‌లో రోజుకు బుక్ అవుతున్న రైల్ టికెట్లు 12.38 లక్షలు
⇒ ఆన్‌లైన్‌లో నిమిషానికి బుక్ అవుతున్న రైల్ టికెట్లు 28,000
⇒ రోజుకు రైళ్లలో అందిస్తున్న భోజనాలు 16 లక్షలు
⇒ కేటరింగ్ ద్వారా ఆదాయం రూ.1,947.19 కోట్లు
⇒ ఐఆర్‌సీటీసీ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారు 12.21 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment