చదువు కోవాలనే ఆశయంతో తల్లిదండ్రులకు దూరంగా.. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. శిథిలమైన భవనాలు..విరిగిన తలుపులు, కిటికీలు..ఊడిపోయిన గచ్చుల మధ్యే కాలాన్ని నెట్టుకొస్తున్నారు. అయినా పిల్లల బాగోగుల గురించి పాలకులు పట్టించుకోవడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ..ఇలా ఏ హాస్టల్ చూసినా ఇదే పరిస్థితి. తాగునీరు, మరుగుదొడ్లు లేకపోయినా సర్దుకుపోతున్న పిల్లలకు సకాలంలో యూనిఫాం, దుప్పట్లు కూడా పాలకులు అందించలేకపోయారు. శీతాకాలం ప్రారంభం కావడంతో రాత్రి పూట విద్యార్థులు చలితో గజగజ వణికిపోతున్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: సంక్షేమ వసతి గృహాలు సంక్షోభంగా మారుతున్నాయి. విద్యార్థుల సంక్షేమానికి నిధులు వెచ్చిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో కనిపించడం లేదు. దీంతో విద్యార్థులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. సాంఘిక, బీసీ వసతి గృహాలకు చెందిన అనేక భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరి కొన్నింటికి ఏకంగా కిటికీలు, తలుపుల్లేవు. కనీసం కిటీకీలకు మెస్‌లేక విద్యార్థులు చలిలో వణుకుతూ, దోమలతో సావాసం చేస్తూ రోగాల బారిన పడుతున్నారు.
సకాలంలో అందని యూనిఫాం: ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడిచినా, ఇప్పటికీ పలు వసతి గృహాల విద్యార్థులకు యూనిఫారాలు అందలేదు. ప్రీమెట్రిక్‌లో ఉన్నవారికి ఒక విద్యార్థికి నాలుగు జతలు యూనిఫాం అందజేయాలి. అయితే సాంఘిక సంక్షేమ విద్యార్థుల కు పూర్తిగా అందజేశారు. బీసీ సంక్షేమ విద్యార్థులకు సంబంధించి కొన్ని వసతి గృహాల్లో నాలుగు జతలు, మరికొన్ని వసతి గృహాల్లో సగం మాత్రమే అందజేశారు. మిగిలినవి కుట్టు పనులో స్థాయిలో ఉన్నాయి.
జిల్లాలో వసతి గృహాల పరిస్థితి: బీసీ వసతి గృహాలు: బీసీ సంక్షేమ శాఖ పరి«ధిలో 94 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో ప్రీమెట్రిక్ 73, పోస్టు మెట్రిక్ 21 ఉన్నాయి. ప్రీమెట్రిక్ వసతి గృహాలు 73లో బాలురుకి 62, బాలికలకు 11 ఉన్నాయి. వీటిలో బాలురు 5,889 మంది కాగా బాలికలు 1280 మంది ఉంటున్నారు. పోస్టు మెట్రిక్ వసతి (కళాశాల) గృహాలు 21 ఉన్నాయి. వీటిలో పురుషులకు 10, మహిళలకు 11 ఉన్నాయి. వీటిలో పురుషులు 1131, మహిళలు 1682 మంది చదువుతున్నారు.
అద్దె భవనాలే దిక్కు: బీసీ సంక్షేమ శాఖలో ఉన్న పోస్టుమెట్రిక్‌లో ఒకటి మినహా మిగిలిన వన్ని అద్దెభవనాల్లోనే నడుస్తున్నాయి. ప్రీమెట్రిక్ వసతి గృహాలు 73 ఉండగా 51 హాస్టళ్లకు మాత్రమే సొంత భవనాలు ఉండగా.. 17 అద్దె భవనాల్లో, అయిదు తుఫాన్ షెల్టర్లలో నడుస్తున్నాయి. సొంత భవనాలు కూడా పాతవి కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. కిటికీలు, తలుపులు, ద్వారాలు పుచ్చుపోయి, విరిగిపోయాయి. మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. వీటి మరమ్మతులకు ఇటీవల 3.80 కోట్ల రూపాయల నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాలేదు.
సాంఘిక సంక్షేమ శాఖలో..: జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 42 వసతి గృహాలు నడుస్తున్నాయి. వీటిలో ప్రీమెట్రిక్ విభాగంలో 26, పోస్టుమెట్రిక్‌లో 16 ఉన్నాయి. ప్రీమెట్రిక్‌లో బాలురుకి 15, బాలికలకు 11 వసతి గృహాలు ఉండగా.. బాలురు 1582 మంది, బాలికలు 1155 ఉంటున్నారు. పోస్టు మెట్రిక్ విభాగంలో 16 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 9 పురుషులు, 7 మహిళలకు కేటాయించారు. వీటిలో 612 మంది పురుషులు, 494 మంది మహిళలు ఉంటున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలన్నీ సొంత భవనాలే. అయితే కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిలో 31 వసతి గృహాలకు మరమ్మతులు అవసరం ఉంది. ఇందుకోసం రూ. 2.90 కోట్లు కేటాయించారు. పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment