మంచు కురిసే శీతకాలం ఎంత సరదాగా ఉంటుందో ప్రపంచానికి చూపించడంలో అమెరికావాసులు ఎప్పుడూ ముందే ఉంటారు. అందులో భాగంగానే మిన్నెసోటా రాష్ట్రం, సెయింట్ పాల్ నగరంలో ప్రతి ఏడాది పది రోజుల పాటు ఈ ‘వింటర్ కార్నివాల్ ఉత్సవాలు’ జరుగుతాయి. ఇవి అత్యంత పురాతనమైన సంబరాలు.
సెయింట్ పాల్‌ను 1885లో సందర్శించిన న్యూయార్క్ విలేఖరులు ‘ఈ సెయింట్ పాల్ నగరం మరో సైబీరియా లాంటిది. శీతకాలంలో మానవ నివాసానికి పనికిరాదు’ అని పత్రికల్లో రాశారు. ఆ రాతలకు సెయింట్ పాల్ వాసులు మనస్తాపం చెందారు. తమ ప్రాంతం గొప్పదనాన్ని ప్రపంచానికి వెల్లడించడానికి, ప్రపంచంలో తమదైన ప్రత్యేకతను నిలుపుకోవడానికి ఈ వినూత్న సంబరాలను మార్గంగా ఎన్నుకున్నారు.
అప్పటికే కెనడాలోని మాంట్‌రియల్ నగరంలో ఈ కార్నివాల్ ఉత్సవాలు జరుగుతుండేవి. వాటిని ప్రేరణగా తీసుకుని, 1886లో ఈ ఉత్సవాలకు నమూనాలు రూపొందించారు. ఇవి ప్రారంభమైన నాటి నుంచి కేవలం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తప్ప, ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఈ ఏడాది జనవరి 25 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు ఫిబ్రవరి 3తో ముగుస్తాయి. ఈ వేడుకలకు బోరియాస్ పురాణాన్ని ప్రామాణికంగా చెబుతారు. ఇక్కడి ప్రజలు శీతకాలపు దేవుడుగా బోరియాస్‌ను కొలుస్తారు. కళ్లు చెదిరేలా జరిగే ఈ వేడుకల్లో ఐస్ పాలస్, మంచు శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఈ వేడుకల్లో గడ్డాల పోటీలు, హాట్ డిష్ పోటీలు, ఐస్ రన్ పోటీలు ఇలా చాలానే నిర్వహిస్తుంటారు. కనువిందు చేసే ఈ మంచు వేడుకను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు. వివిధ దేశాల రాచ కుటుంబీకులు, ప్రముఖులు, అధికారులు ఇలా చాలామంది ఈ వేడుకకు ప్రత్యేకంగా హాజరవుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment