వేడుకల సీజన్ వింటర్‌కు వీడ్కోలు
ఈ మాసమంతా నగరంలో కార్యక్రమాల హోరు
సోనూనిగమ్ లైవ్ పూర్తి, మరిన్ని లైవ్ పెర్ఫార్మెన్స్‌లు
వరుసగా విందు, వినోదం,విజ్ఞాన కార్యక్రమాలు
ఎంటర్‌టైన్మెంట్‌కు ‘నెల’వుగా ఫిబ్రవరి
విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా, వినోదాన్ని ఆశిస్తున్నారా? ‘సంత’కెళ్లి కొనాలి అనుకుంటున్నారా? సంగీతాన్ని కోరుకుంటున్నారా? ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా అన్నీ నగరంలోనే అన్నట్టు ఈ నెల మొత్తం విందు వినోదాల సంగమంగా మారనుంది నగరం. నవంబర్ నుంచి మొదలై అత్యధిక కార్యక్రమాలను అందించే వింటర్ సీజన్‌కు ముగింపు నెల కావడంతో ఫిబ్రవరి ఈవెంట్స్ ఫీవర్‌లో చిక్కుకుంది. వినోదాన్ని ఆస్వాదించే ఔత్సాహికుల నుంచి విద్యార్థుల వరకూ, వ్యాపారుల నుంచి క్రియేటర్స్ వరకూ.. అందరికీ ఉపకరించే ఈవెంట్స్‌కు నగరం ఆతిథ్యం ఇస్తోంది.
నగరంలో సాధారణంగా చలికాలం అన్ని విధాలా.. అన్ని రకాల కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. దీంతో వింటర్‌లో అత్యధిక సంఖ్యలో ఈవెంట్లు జరుగుతుంటాయి. అదే విధంగా ఫిబ్రవరి నెలతో వింటర్ ముగుస్తుంది కాబట్టి ఈ నెలలో ఈవెంట్లు హోరెత్తుతాయి. బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్ గత శనివారం (నిన్న) లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అదే విధంగా పలువురు గాయనీ గాయకులు కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో జరగనున్న కొన్ని విజ్ఞాన, వినోద కార్యక్రమాల విశేషాలివి..
డెస్టినేషన్ యుఎస్‌ఏ..
అగ్ర విశ్వవిద్యాలయ ప్రతినిధులను కలవడానికి వీసాలకు సంబంధించిన సందేహాల నివృత్తికి.. సలహాలు, సూచనలను పొందడానికి ఈ ఈవెంట్ ఉపకరిస్తుంది. జీవితాన్ని మార్చగల విద్యావకాశాలను సూచిస్తుంది. విశ్వవిద్యాలయాల్లో చోటు సంపాదించడానికి విదేశీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోడానికి అవసరమైన సమగ్ర సమాచారాన్ని పొందడానికి సహకరిస్తుంది.
– ఫిబ్రవరి 15, ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ
టెక్నాలజీ సభ –2025
సాంకేతిక విద్య పట్ల ఆసక్తి కలిగిన టెక్నాలజీ ఔత్సాహికులకు ఇది హాజరు కావాల్సిన కార్యక్రమం. డిజిటల్ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీలతో పాటు అత్యాధునిక టెక్నాలజీ విశేషాలను కూడా ఇది కవర్ చేస్తుంది. వృత్తి నిపుణులు, విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలకు ఉపకరిస్తుంది. సాంకేతిక భవిష్యత్తును అన్వేషించడానికి చక్కని అవకాశం.
తేదీ: ఫిబ్రవరి 21 నుంచి 23 వరకూ
స్థలం: నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్
గిఫ్ట్స్ అండ్ స్టేషనరీ ఇండియా ఎక్స్‌పో..
సంబంధిత వ్యాపారులైనా లేదా కార్పొరేట్ గిఫ్ట్స్, స్టేషనరీలో తాజా ట్రెండ్‌లపై ఆసక్తి కలిగి ఉన్నా, ఈ ఈవెంట్ సందర్శనీయ ఎంపిక. బహుమతులు, స్టేషనరీ పరిశ్రమలో అందుబాటులో ఉన్న తాజా ఉత్పత్తులు, సేవల గురించి తెలుసుకోవచ్చు.
తేదీ : ఫిబ్రవరి 28 వరకూ..
స్థలం : హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్
స్టార్టప్ పార్టీ..
స్టార్టప్ ప్రయాణంలో అవసరమైన, అర్థవంతమైన సమన్వయాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. ప్యానెల్ చర్చలు–స్వీయ–ప్రమోషనల్ స్టార్టప్ ఈవెంట్స్‌లా కాకుండా స్టార్టప్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి వీలుగా నైపుణ్యాలు అందించే దేశంలోని మొట్టమొదటి కాన్సెప్చువల్ స్టార్టప్ ఈవెంట్ ఇది.
తేదీ : ఫిబ్రవరి 23
సమయం : మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 వరకు
స్థలం : హైటెక్ సిటీ
కుక్‌డుకూ ఫెస్ట్..
చిన్నారులకు విందు, వినోదం, విజ్ఞానాలను అందించే కార్యక్రమం ఇది. స్టోరీ టెల్లింగ్, రచయితలతో సంభాషణలు, హస్తకళలు, చేతి వృత్తుల పరిచయం, పప్పెట్ షోలు, వెంట్రిలాక్విజమ్, క్విజ్, బుక్ ఫెయిర్, ఫుడ్ ఫెస్టివల్స్, ఆటలు, పాటలు, నృత్యాలు.. వంటివి కలగలిపే కార్యక్రమం.
తేదీ : ఫిబ్రవరి 15, 16 (రెండు రోజులు) సమయం : ఉదయం 11 గంటల నుంచి స్థలం : నిథిమ్ క్రికెట్ గ్రౌండ్స్, గచ్చిబౌలి
హమ్‌రాహి.. ఓ గజల్ సాయంత్రం..
ప్రముఖ గాయకుడు హరిహరన్ నగరంలో సంగీతాభిమానులను అలరించనున్నారు. హమ్‌రాహి పేరుతో హిందీ, ఉర్దూ భాషల్లో సాగే గజల్ గానాలాపనతో నగరవాసులను మంత్రముగ్ధులను చేయనున్నారు.
తేదీ : ఫిబ్రవరి 21, స్థలం : శిల్పకళావేదిక సమయం : సాయంత్రం 6.30 గంటల నుంచి
ది సాస్ ఎట్ స్కేల్ 2025..
భవిష్యత్తు పరిశ్రమను, కృత్రిమ మేధస్సు ఎలా రూపాంతరం చెందిస్తుందో తెలిపే ఈవెంట్ ఇది. ఏఐ నిపుణుల నుంచి నేర్చుకోడానికి సారూప్యత కలిగిన వ్యక్తులతో నెట్‌వర్క్
పెంచుకునేందుకు అవకాశం ఇస్తుంది.
తేదీ : ఫిబ్రవరి 15
సమయం : ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు
స్థలం : టీ–హబ్, నాలెడ్జ్ సిటీ రోడ్
ప్రేమికుల రోజున సునీత..
వాలెంటైన్స్‌డే సందర్భంగా ప్రముఖ టాలీవుడ్ గాయని సునీత పాటల కార్యక్రమం నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచనుంది. ప్రేమ చిత్రాల్లో వినసొంపైన టాప్ లవ్ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సునీత.. ప్రేమికుల దినోత్సవాన.. పాటల వాన కురిపించనున్నారు.
తేదీ : ఫిబ్రవరి 14
సమయం : రాత్రి 9గంటల నుంచి
స్థలం : అర్బన్ మాయాబజార్, ఎల్బీనగర్
Comments
Please login to add a commentAdd a comment