
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీలోని మదీనా, అబ్బాస్ టవర్స్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.
వివరాల ప్రకారం.. పాతబస్తీలోని దివాన్‌దేవిడిలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మదీనా, అబ్బాస్ టవర్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో భవనం నాలుగో అంతస్తులోని వస్త్ర దుకాణం నుంచి వచ్చిన మంటలు.. పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా వ్యాపించాయి.
ఎగిసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
