![bjp would strengthen in telangana: kishan reddy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/KISAN.jpg.webp?itok=2vCDxJFm)
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కార్పొరేటర్లంతా పూర్తి సమయం కేటాయించాలని కిషన్ రెడ్డి కోరారు. వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికలకు.. ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చే పథకాలు, ప్రజలకు చేకూరే లబ్ధి, ప్రాజెక్టులు, నిధులను వివరించాలని కోరారు.
జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠం సాధిస్తే.. అనంతరం రాష్త్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందనే సంకేతాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్టాండింగ్ కమిటీపై మరోమారు సమావేశమై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పాలకవర్గంపై అవిశ్వాస తీర్మానంపై బీఆర్‌ఎస్, ఎంఐఎంలు ఎలా వ్యవహరిస్తాయో చూసి.. దానికనుగుణంగా బీజేపీ వ్యూహం ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా.. పార్టీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించారు.
కేజ్రీవాల్ ఓటమితో బీఆర్‌ఎస్‌లో కలకలం
బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలతో జతకట్టాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సూచించడంపై కేంద్రమంత్రి, జి.కిషన్‌రెడ్డి స్పందించారు. ‘లిక్కర్ స్కామ్ భాగస్వామి’ అయిన కేజ్రీవాల్ ఓడిపోవడంతో.. బీఆర్‌ఎస్ పార్టీలో కలవరం మొదలైందని, అందుకే పాత దోస్తు అయిన కాంగ్రెస్‌తో మరోసారి బహిరంగంగా జతకట్టేందుకు కేటీఆర్ బహిరంగ ఆహ్వానం పలికారని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment