![hyderabad flyovers get colourful makeover](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/4545_0.jpg.webp?itok=BafmAyNw)
ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ మార్గాలకు కొత్త సొబగులు
రెండు లక్షల ఎస్‌ఎఫ్‌టీల విస్తీ ర్ణంలో కళకు రూపం
చిత్రాలకు ప్రాణం పోసిన యువ కళాకారుడు ప్రేమ్ ఇస్రమ్
నేపథ్యం ములుగు జిల్లా గిరిజన తాండా
నలుగురికీ స్ఫూర్తిని కలిగిస్తున్న ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి
నగర రహదారుల్లోని గోడలు, అండర్ పాస్ వంతెనలు, ఫ్లై ఓవర్లు అద్భుతమైన చిత్రాలకు వేదికగా నిలుస్తున్నాయి. వాహన చోదకులు, పాదచారులు, అటుగా వెళ్లే ప్రయాణికులను ఈ గోడ చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. సుమారు రెండు లక్షల ఎస్‌ఎఫ్‌టీల విస్తీర్ణంలో పలు చిత్రాలకు ప్రాణం పోసిన యువ కళాకారుడు ప్రేమ్ ఇస్రమ్ ఫ్రేమ్స్ నగరానికి కొత్త సొబగులు అద్దుతున్నాయి. ములుగు జిల్లా గిరిజన తాండా నేపథ్యంలో ఈ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి చిత్రాలు నలుగురికీ స్ఫూర్తిని కలిగిస్తున్నాయి.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/image_454.png)
ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కడ చూసినా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ రోడ్లు అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. రంగు రంగుల చిత్రాలు కొత్త సొబగులు అద్దుతున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో భాగ్యనగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే పలువురు ఫైన్ ఆర్ట్స్ కళాకారులు గోడలపై తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీని కోసం దాదాపు 149 కోట్ల నిధులతో రోడ్లు, కూడళ్లు, వీధులను ప్రత్యేకంగా, అత్యంత సుందరంగా మారుస్తున్నారు. నగరానికి తలమానికమైన హైటెక్ సిటీ, కొండాపూర్, ఇతర ప్రధాన రహదారులు అందమైన పెయింటింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి జోన్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లు, స్ట్రీట్ ఆర్ట్‌లో ఓ యువకుడి కళాత్మకత కృషి దాగి ఉంది. మాసబ్ ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌యూ వేదికగా ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన ప్రేమ్ ఇస్రమ్ (27) కొన్ని ఫ్లై ఓవర్లకు అత్యాధునిక టెక్నాలజీని
ప్రతిబింబించే రంగుల చిత్రాలతో హంగులను అద్దాడు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/image_455.png)
నాలుగు ఫ్లై ఓవర్లు..
హైటెక్ సిటీ నుంచి కూకట్‌పల్లి మార్గంలోని ఫ్లై ఓవర్‌పై సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ, అధునాతన సాంకేతికత, ఈ తరం అధునాతన ఆలోచనలు ప్రతిబింబించే చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. దీనికి సమీపంలోని అయ్యప్ప సొసైటీ – 100 ఫీట్ రోడ్ అండర్ పాస్‌లో ‘బజార్స్ ఆఫ్ హైదరాబాద్’ థీమ్‌తో వేసిన పెయింటింగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వీటన్నింటినీ తన బృందం (15 నుంచి 20 మంది)తో పూర్తి చేశానని, వీరందరూ కూడా తనతో చదువుకున్న జూనియర్స్, ఆర్ట్ ఫ్రెండ్స్ అని ప్రేమ్ తెలిపారు. ఒక ఫ్లై ఓవర్‌పూర్తి చేయడమే కష్టతరమైన నేపథ్యంలో దాదాపు 2 లక్షల ఎస్‌ఎఫ్‌టీల విస్తీర్ణంలో నాలుగు ఫ్లై ఓవర్లు కళాత్మకంగా సుందరీకరించానని పేర్కొన్నాడు. కొత్తగూడ అండర్‌పాస్‌లో ఇండియన్ ఆర్మీ లైఫ్‌స్టోరీని, అదే ప్రాంతంలోని ఫ్లై ఓవర్‌పై అడ్వెంచర్, ట్రావెలింగ్‌కు సంబంధించిన పెయింటింగ్స్ వేశానని వివరించారు.
హాబీగా మొదలై..
ములుగు జిల్లా అటవీ ప్రాంతంలోని నార్లపూర్ అనే మారుమూల గ్రామం మాది. చిన్నప్పుడు ఆర్ట్ పై పెరిగిన మక్కువ ఈ ప్రయాణానికి కారణం. చిన్నతనంలో సమీపంలోని రోడ్లపై చాక్‌పీస్‌తో పెద్ద పెద్ద బొమ్మలు వేసి సంతోషపడే వాడిని. అదే హాబీగా మారి నగరాన్ని అందంగా మార్చే స్థాయికి రావడం ఆనందంగా ఉంది. సాధారణంగా ఆయిల్ పెయింటింగ్ పోట్రేట్స్ వేయడంలో అనుభవజు్ఞడిని.. గతంలో నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా చారిత్రాత్మక అంశాలతో స్ట్రీట్ ఆర్ట్ వేశాను. నగరంలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో నా మూలాలైన ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలపై వేసిన పెయింటింగ్స్‌తో ‘వేరియస్ ఇంప్రెషన్స్’ అనే ప్రత్యేక ప్రదర్శన చేశాను.
– ప్రేమ్ ఇస్రమ్, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment