
రాయడం మర్చిపోతున్న ఆధునికులు
అన్నింటికీ కీప్యాడ్ మంత్రమే జపిస్తున్న వైనం
రాతకు సాధనే శరణ్యమంటున్న గ్రాఫాలజిస్ట్‌లు
టెక్నాలజీ రాకతో వాయిస్ టైపింగ్ వైపు దృష్టి
అవసరార్థం రాయాల్సి వస్తే తప్పని అవస్థలు
‘సార్.. నా రాత ఒకప్పుడు ముత్యాలు పేర్చినట్టుండేది. ఇప్పుడు కోడి కెలికినట్టు ఉంటోంది’.. ‘మేడమ్.. ప్లీజ్, అర్జెంట్‌గా నా రైటింగ్ స్టైల్ బాగవ్వాలి.. లేకపోతే చెక్‌బుక్ మీద సంతకం కూడా సరిగా రావడం లేదు’.. ‘అమ్మో.. నాలుగు పేజీలు రాయాలట.. నా వల్ల కావడం లేదు. ఎప్పుడో కాలేజీ రోజుల్లో అంటే ఓకే. ఇప్పుడు రాయడం ఎంత కష్టంగా ఉందో’ ఇలాంటి అభ్యర్థనలతో హ్యాండ్ రైటింగ్ నిపుణులను సంప్రదిస్తున్నవారు నగరంలో పెరిగారు. చేతిరాత అధ్వాన్నంగా మారిందని కొందరు, నాలుగులైన్లు రాస్తే చేతులు నొప్పులు పుడుతున్నాయని మరికొందరు.. ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ నగరవాసులు రైటింగ్ డాక్టర్స్/ గ్రాఫాలజిస్ట్‌లను కలుస్తున్నారు. ‘గతంలో చిన్నపిల్లలు, కాలేజీ విద్యార్థులు మాత్రమే తమ రైటింగ్ స్కిల్స్‌ను మెరుగుపరచాలని వచ్చేవారు. ఇప్పుడు మధ్యవయస్కులు, ఉద్యోగస్తులు, గృహిణులు వస్తున్నారు’ అని చేతిరాత నిపుణులు డాక్టర్ రణధీర్ కుమార్ చెబుతున్నారు.
ఇచ్చట నేను క్షేమం.. అచ్చట మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తా.. ఇలా ఆప్యాయత ఉట్టిపడే అక్షరాలతో అల్లుకున్న అనుబంధాల లేఖలు లేవు. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ అంటూ చూపుల్ని పంచుకున్న ప్రేమలేఖలూ లేవు. ఎందుకంటే.. ఇప్పుడు చేతిరాతలే లేవు.. బుడిబుడి అడుగులు వేసే వయసులో పలక, బలపం చేతబట్టి ‘అ ఆ ఇ ఈ’ లను దిద్దడం నేర్చుకున్నాం. బలపం నుంచి పెన్సిళ్లు, పెన్నులు, కాగితాలు, పుస్తకాలు.. ఇలా అక్షరాలు ఆసీనులయ్యే ఆసనాలు, ఆవిష్కరించే సాధనాలు మారేకొద్దీ.. మన చేతిరాత మరింత మెరుగులు దిద్దుకుంది. మన చేతుల్లో నుంచి ఊపిరి పోసుకున్న గీత మన తలరాతను సైతం దిద్దగలిగింది. అంతటి చరిత్ర ఉన్న అక్షరం ఇప్పుడు వంకర్లు పోతోంది. రాత.. గీత తప్పుతోంది. చేతిరాత చెదిరి ‘పోయేకాలం’ వచ్చేసింది.. డిజిటల్ కోరల్లో చిక్కిన చేతిరాత.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
రాస్తున్నాం కానీ.. రాత ఏదీ..
మనం పేపర్ మీద పెన్ను పెట్టి ఎన్ని రోజులైంది? బహుశా కొన్ని నెలలు గడిచినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో కదా? ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకుంటే మనకే అర్థమవుతుంది. చేతిరాతకు ఎంతగా దూరమవుతున్నామో.. ఒకప్పటికన్నా ఇప్పుడే మనం ఎక్కువగా రాస్తున్నాం. అయితే పెన్నుతోనో.. పెన్సిల్‌తోనో కాదు. కేవలం కీబోర్డ్‌తోనే అనేది అక్షర సత్యం. కంప్యూటర్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు.. ఇవన్నీ చేతిరాత అంతాన్నే కోరుతున్నాయి. పచారీ సామాన్ల జాబితా నుంచి సమావేశంలో నోట్స్ రాసుకోవడం వరకూ.. పుట్టిన రోజు శుభాకాంక్షల నుంచి పోయిన రోజు సంతాప సందేశాల వరకూ అన్నీ టెక్ట్స్ మెసేజ్‌లో, మెయిల్స్, మరొకటో దీంతో రాయాల్సిన అవసరం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఫలితంగా అష్టకష్టాలూ పడి నేర్చుకున్న ‘మనదైన’ చేతిరాత మనల్ని వీడిపోతోంది. చరిత్ర చూసుకుంటే చేతిరాత పత్రాలు సృష్టించిన ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ప్రేమలు అంకురించడం దగ్గర్నుంచి యుద్ధాలు ప్రారంభించడం వరకూ సమస్యలు పరిష్కరించడం దగ్గర్నుంచి శాంతి నెలకొల్పడం వరకూ సంచలనాలను సృష్టించడం దగ్గర్నుంచి స్వేచ్ఛా స్వాతం్రత్యాలు అందించడం వరకూ.. అన్నిట్లో చేతి రాత పత్రాల ప్రాధాన్యత మనకు స్పష్టంగా కనబడుతుంది.
‘రైట్’ ఈజ్ బ్రైట్..
హ్యాండ్ రైటింగ్ బావున్నంత మాత్రాన నాలుగు మార్కులు పడితే పడతాయేమో.. అంతకు మించి ఏం లాభంలే.. అని తీసి పారేసే విషయం కాదిది. కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి సంస్థలు.. ఉద్యోగులను నియమించుకునే సమయంలో వారి విద్యార్హతలు, ప్రవర్తనా తీరుతెన్నులతో పాటు వ్యక్తి చేతిరాతను తద్వారా వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తూ.. పనితీరును, సామర్థ్యాలను విశ్లేíÙంచి అనంతరం ఉద్యోగిగా అవకాశం ఇవ్వడం ఇప్పుడు నగరంలోని కార్పొరేట్ కల్చర్‌లో సర్వ సాధారణం. చేతిరాతను విశ్లేíÙంచేందుకు దాదాపు ప్రతి కంపెనీ ఒక గ్రాఫాలజిస్ట్‌ను అందుబాటులో ఉంచుకుంటోందంటే సంస్థలు ఈ విషయానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏమిటో తెలుస్తుంది.
చేతిరాతతో చెప్పుకోదగ్గ విజయాలు..
చేతిరాత మార్చుకునే ప్రక్రియ మన జీవనశైలిని కూడా మార్చుకునేందుకు ఉపకరిస్తుందని గ్రాఫాలజిస్ట్‌లు చెబుతున్నారు. సహజంగా వచ్చే కొన్ని ప్రవర్తనాలోపాలను రాసే తీరుతో మార్చుకోచ్చని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు రాయడం ద్వారానే చదవడం నేర్చుకుంటారు. కొన్ని పరిశోధనల ప్రకారం రాయడం అలవాటున్నవారి ఆలోచనలు, రాయడం అలవాటు లేనివారితో పోలిస్తే మరింత సృజనాత్మకంగా ఉంటాయి. అదే విధంగా కీబోర్డ్‌తో పోల్చుకుంటే రాసేటప్పుడు బ్రెయిన్ పనిచేసే తీరు భిన్న ఫలితాలు అందిస్తుంది. డైరీ రాయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని వ్యాధి నిరోధకత పెరుగుతుందని పరిశోధనల విశ్లేషణ.
రాతే వ్యక్తిత్వానికి దిక్సూచి..
నిత్య జీవితంలో వాడకం తగ్గడం వల్ల మనం చేతిరాతను మర్చిపోతున్నాం. అకస్మాత్తుగా ఏదైనా అవసరం వస్తే అప్పటికప్పుడు నాలుగు లైన్లు రాయడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ మమ్మల్ని సంప్రదిస్తున్నవారు ఇటీవల పెరిగారు. చేతిరాత మనిషి వ్యక్తిత్వానికి దిక్సూచి వంటిది. దాన్ని పోగొట్టుకోవడం తెలివైన పనికాదు. అవసరమైన చోట కంప్యూటర్లు వినియోగిస్తూనే రాతను కాపాడుకునే నేర్పును మనం అలవర్చుకోవాలి.
– డా.రణదీర్‌కుమార్, గ్రాఫాలజిస్ట్
సర్వే జనా ‘లిఖి’నో భవంతు..
డాక్‌మెయిల్ అనే బ్రిటిష్ కంపెనీ చేసిన సర్వే పరిశీలిస్తే.. ఆధునికుల్లో సగటున ఓ వ్యక్తి 41 రోజులకు నాలుగులైన్లు రాయాల్సిన అవసరం పడడం లేదట. అలాగే ప్రతి ముగ్గురిలో ఒకరికి ఆరు నెలలపాటు కలం పట్టే ఖర్మే పట్టడం లేదట. ప్రతి ఏడుగురిలో ఒకరు తమ హ్యాండ్ రైటింగ్ మారిన తీరు తమకే అవమానకరంగా మారిందన్నారు. గత కొంత కాలంగా తమ చేతిరాత గుర్తించదగిన రీతిలో మారిపోయిందని సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది చెప్పారు. ‘చేతిరాత అవసరం తగ్గుతున్నప్పటికీ, టెక్నాలజీతో సంబంధం లేకుండా కూడా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యాలను ప్రజలు నిలబెట్టుకోవాల్సిందే’ అని డాక్‌మెయిల్ కంపెనీ డైరెక్టర్ బ్రాడ్‌వే వ్యాఖ్యానించడం గమనార్హం.
చేజారనివ్వకుండా..
నిద్రకు ముందు ప్రతి రోజూ కాసేపైనా డైరీ రాయడం అలవాటుగా మార్చుకోండి.
ఆలోచనలకు ఎప్పటికప్పుడు అక్షరరూపం ఇవ్వడానికి ప్రయతి్నంచండి.
చిన్న చిన్న కథలు, ఉత్తరాలు స్వయంగా రాయండి.
మన లక్ష్యాలను, కలలను తరచూ పేపర్‌పై పెడుతుండాలి.
మనకు బాగా ఇషు్టలైనవారికి చేతిరాతతో శుభాకాంక్షలు పంపడం అలవాటు చేసుకోండి.
రాయలేక పోతున్నా..
చదువుకునేటప్పుడు నా చేతిరాత చాలా బావుండేదని అందరూ మెచ్చుకునేవారు. ఉద్యోగంలో చేరాక రాయాల్సిన అవసరం తగ్గిపోయింది. మధ్య మధ్యలో సరదాగా ఏదైనా రాసినా, నా రాత నాకే నచ్చన మానేశాను. అనుకోకుండా ఈ మధ్యే ఒక కోర్సులో జాయిన్ అయ్యి, అక్కడ నోట్స్ రాసుకోడానికి నానా కష్టాలు పడ్డాను. పెన్ను సజావుగా కదలడానికి. దాదాపు నెలరోజులు పట్టింది.
– సిహెచ్.వంశీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
Comments
Please login to add a commentAdd a comment