writing
-
అక్షరం..అపు రూపం..
‘సార్.. నా రాత ఒకప్పుడు ముత్యాలు పేర్చినట్టుండేది. ఇప్పుడు కోడి కెలికినట్టు ఉంటోంది’.. ‘మేడమ్.. ప్లీజ్, అర్జెంట్‌గా నా రైటింగ్ స్టైల్ బాగవ్వాలి.. లేకపోతే చెక్‌బుక్ మీద సంతకం కూడా సరిగా రావడం లేదు’.. ‘అమ్మో.. నాలుగు పేజీలు రాయాలట.. నా వల్ల కావడం లేదు. ఎప్పుడో కాలేజీ రోజుల్లో అంటే ఓకే. ఇప్పుడు రాయడం ఎంత కష్టంగా ఉందో’ ఇలాంటి అభ్యర్థనలతో హ్యాండ్ రైటింగ్ నిపుణులను సంప్రదిస్తున్నవారు నగరంలో పెరిగారు. చేతిరాత అధ్వాన్నంగా మారిందని కొందరు, నాలుగులైన్లు రాస్తే చేతులు నొప్పులు పుడుతున్నాయని మరికొందరు.. ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ నగరవాసులు రైటింగ్ డాక్టర్స్/ గ్రాఫాలజిస్ట్లను కలుస్తున్నారు. ‘గతంలో చిన్నపిల్లలు, కాలేజీ విద్యార్థులు మాత్రమే తమ రైటింగ్ స్కిల్స్‌ను మెరుగుపరచాలని వచ్చేవారు. ఇప్పుడు మధ్యవయస్కులు, ఉద్యోగస్తులు, గృహిణులు వస్తున్నారు’ అని చేతిరాత నిపుణులు డాక్టర్ రణధీర్ కుమార్ చెబుతున్నారు. ఇచ్చట నేను క్షేమం.. అచ్చట మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తా.. ఇలా ఆప్యాయత ఉట్టిపడే అక్షరాలతో అల్లుకున్న అనుబంధాల లేఖలు లేవు. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ అంటూ చూపుల్ని పంచుకున్న ప్రేమలేఖలూ లేవు. ఎందుకంటే.. ఇప్పుడు చేతిరాతలే లేవు.. బుడిబుడి అడుగులు వేసే వయసులో పలక, బలపం చేతబట్టి ‘అ ఆ ఇ ఈ’ లను దిద్దడం నేర్చుకున్నాం. బలపం నుంచి పెన్సిళ్లు, పెన్నులు, కాగితాలు, పుస్తకాలు.. ఇలా అక్షరాలు ఆసీనులయ్యే ఆసనాలు, ఆవిష్కరించే సాధనాలు మారేకొద్దీ.. మన చేతిరాత మరింత మెరుగులు దిద్దుకుంది. మన చేతుల్లో నుంచి ఊపిరి పోసుకున్న గీత మన తలరాతను సైతం దిద్దగలిగింది. అంతటి చరిత్ర ఉన్న అక్షరం ఇప్పుడు వంకర్లు పోతోంది. రాత.. గీత తప్పుతోంది. చేతిరాత చెదిరి ‘పోయేకాలం’ వచ్చేసింది.. డిజిటల్ కోరల్లో చిక్కిన చేతిరాత.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రాస్తున్నాం కానీ.. రాత ఏదీ.. మనం పేపర్ మీద పెన్ను పెట్టి ఎన్ని రోజులైంది? బహుశా కొన్ని నెలలు గడిచినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో కదా? ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకుంటే మనకే అర్థమవుతుంది. చేతిరాతకు ఎంతగా దూరమవుతున్నామో.. ఒకప్పటికన్నా ఇప్పుడే మనం ఎక్కువగా రాస్తున్నాం. అయితే పెన్నుతోనో.. పెన్సిల్‌తోనో కాదు. కేవలం కీబోర్డ్‌తోనే అనేది అక్షర సత్యం. కంప్యూటర్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు.. ఇవన్నీ చేతిరాత అంతాన్నే కోరుతున్నాయి. పచారీ సామాన్ల జాబితా నుంచి సమావేశంలో నోట్స్ రాసుకోవడం వరకూ.. పుట్టిన రోజు శుభాకాంక్షల నుంచి పోయిన రోజు సంతాప సందేశాల వరకూ అన్నీ టెక్ట్స్ మెసేజ్‌లో, మెయిల్స్, మరొకటో దీంతో రాయాల్సిన అవసరం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఫలితంగా అష్టకష్టాలూ పడి నేర్చుకున్న ‘మనదైన’ చేతిరాత మనల్ని వీడిపోతోంది. చరిత్ర చూసుకుంటే చేతిరాత పత్రాలు సృష్టించిన ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ప్రేమలు అంకురించడం దగ్గర్నుంచి యుద్ధాలు ప్రారంభించడం వరకూ సమస్యలు పరిష్కరించడం దగ్గర్నుంచి శాంతి నెలకొల్పడం వరకూ సంచలనాలను సృష్టించడం దగ్గర్నుంచి స్వేచ్ఛా స్వాతం్రత్యాలు అందించడం వరకూ.. అన్నిట్లో చేతి రాత పత్రాల ప్రాధాన్యత మనకు స్పష్టంగా కనబడుతుంది.‘రైట్’ ఈజ్ బ్రైట్.. హ్యాండ్ రైటింగ్ బావున్నంత మాత్రాన నాలుగు మార్కులు పడితే పడతాయేమో.. అంతకు మించి ఏం లాభంలే.. అని తీసి పారేసే విషయం కాదిది. కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి సంస్థలు.. ఉద్యోగులను నియమించుకునే సమయంలో వారి విద్యార్హతలు, ప్రవర్తనా తీరుతెన్నులతో పాటు వ్యక్తి చేతిరాతను తద్వారా వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తూ.. పనితీరును, సామర్థ్యాలను విశ్లేíÙంచి అనంతరం ఉద్యోగిగా అవకాశం ఇవ్వడం ఇప్పుడు నగరంలోని కార్పొరేట్ కల్చర్‌లో సర్వ సాధారణం. చేతిరాతను విశ్లేíÙంచేందుకు దాదాపు ప్రతి కంపెనీ ఒక గ్రాఫాలజిస్ట్ను అందుబాటులో ఉంచుకుంటోందంటే సంస్థలు ఈ విషయానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏమిటో తెలుస్తుంది.చేతిరాతతో చెప్పుకోదగ్గ విజయాలు.. చేతిరాత మార్చుకునే ప్రక్రియ మన జీవనశైలిని కూడా మార్చుకునేందుకు ఉపకరిస్తుందని గ్రాఫాలజిస్ట్‌లు చెబుతున్నారు. సహజంగా వచ్చే కొన్ని ప్రవర్తనాలోపాలను రాసే తీరుతో మార్చుకోచ్చని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు రాయడం ద్వారానే చదవడం నేర్చుకుంటారు. కొన్ని పరిశోధనల ప్రకారం రాయడం అలవాటున్నవారి ఆలోచనలు, రాయడం అలవాటు లేనివారితో పోలిస్తే మరింత సృజనాత్మకంగా ఉంటాయి. అదే విధంగా కీబోర్డ్‌తో పోల్చుకుంటే రాసేటప్పుడు బ్రెయిన్ పనిచేసే తీరు భిన్న ఫలితాలు అందిస్తుంది. డైరీ రాయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని వ్యాధి నిరోధకత పెరుగుతుందని పరిశోధనల విశ్లేషణ.రాతే వ్యక్తిత్వానికి దిక్సూచి.. నిత్య జీవితంలో వాడకం తగ్గడం వల్ల మనం చేతిరాతను మర్చిపోతున్నాం. అకస్మాత్తుగా ఏదైనా అవసరం వస్తే అప్పటికప్పుడు నాలుగు లైన్లు రాయడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ మమ్మల్ని సంప్రదిస్తున్నవారు ఇటీవల పెరిగారు. చేతిరాత మనిషి వ్యక్తిత్వానికి దిక్సూచి వంటిది. దాన్ని పోగొట్టుకోవడం తెలివైన పనికాదు. అవసరమైన చోట కంప్యూటర్లు వినియోగిస్తూనే రాతను కాపాడుకునే నేర్పును మనం అలవర్చుకోవాలి. – డా.రణదీర్కుమార్, గ్రాఫాలజిస్ట్సర్వే జనా ‘లిఖి’నో భవంతు.. డాక్మెయిల్ అనే బ్రిటిష్ కంపెనీ చేసిన సర్వే పరిశీలిస్తే.. ఆధునికుల్లో సగటున ఓ వ్యక్తి 41 రోజులకు నాలుగులైన్లు రాయాల్సిన అవసరం పడడం లేదట. అలాగే ప్రతి ముగ్గురిలో ఒకరికి ఆరు నెలలపాటు కలం పట్టే ఖర్మే పట్టడం లేదట. ప్రతి ఏడుగురిలో ఒకరు తమ హ్యాండ్ రైటింగ్ మారిన తీరు తమకే అవమానకరంగా మారిందన్నారు. గత కొంత కాలంగా తమ చేతిరాత గుర్తించదగిన రీతిలో మారిపోయిందని సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది చెప్పారు. ‘చేతిరాత అవసరం తగ్గుతున్నప్పటికీ, టెక్నాలజీతో సంబంధం లేకుండా కూడా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యాలను ప్రజలు నిలబెట్టుకోవాల్సిందే’ అని డాక్మెయిల్ కంపెనీ డైరెక్టర్ బ్రాడ్వే వ్యాఖ్యానించడం గమనార్హం.చేజారనివ్వకుండా.. నిద్రకు ముందు ప్రతి రోజూ కాసేపైనా డైరీ రాయడం అలవాటుగా మార్చుకోండి. ఆలోచనలకు ఎప్పటికప్పుడు అక్షరరూపం ఇవ్వడానికి ప్రయతి్నంచండి. చిన్న చిన్న కథలు, ఉత్తరాలు స్వయంగా రాయండి. మన లక్ష్యాలను, కలలను తరచూ పేపర్‌పై పెడుతుండాలి. మనకు బాగా ఇషు్టలైనవారికి చేతిరాతతో శుభాకాంక్షలు పంపడం అలవాటు చేసుకోండి. రాయలేక పోతున్నా.. చదువుకునేటప్పుడు నా చేతిరాత చాలా బావుండేదని అందరూ మెచ్చుకునేవారు. ఉద్యోగంలో చేరాక రాయాల్సిన అవసరం తగ్గిపోయింది. మధ్య మధ్యలో సరదాగా ఏదైనా రాసినా, నా రాత నాకే నచ్చన మానేశాను. అనుకోకుండా ఈ మధ్యే ఒక కోర్సులో జాయిన్ అయ్యి, అక్కడ నోట్స్ రాసుకోడానికి నానా కష్టాలు పడ్డాను. పెన్ను సజావుగా కదలడానికి. దాదాపు నెలరోజులు పట్టింది. – సిహెచ్.వంశీ, సాఫ్ట్వేర్ ఇంజినీర్ -
లియాండర్ పేస్... ప్రముఖ డ్యాన్సర్!
‘ఎక్స్’యూజర్ పృథ్వీ తన చిన్నారి మేనకోడలు వర్క్‌బుక్ నుంచి పోస్ట్ చేసిన స్నాప్‌చాట్ నెట్‌లోకంలో నవ్వులు పూయిస్తోంది. ఈ వర్క్‌బుక్‌లో‘మ్యాచ్ ది ఫాలోయింగ్’ శీర్షిక కింద ఎడమవైపు ప్రముఖుల పేరు, కుడివైపు ఆయా రంగాలకు సంబంధించిన బొమ్మలు ఇచ్చారు. ఏ వ్యక్తి ఏ రంగానికి చెందిన వారో జత చేయాలి. విరాట్ కోహ్లీ–క్రికెటర్, లతా మంగేష్కర్–సింగర్... ఇలా అన్నిటికీ కరెక్ట్‌గానే జత చేసింది ఆరు సంవత్సరాల చిన్నారి. అయితే లియాండర్ పేస్ దగ్గరే వచ్చింది పేచీ. ప్రభుదేవాతో పాటు లియాండర్ పేస్‌ను కూడా డ్యాన్సర్‌ని చేసింది. ఇది చూసి సరదాకారులు ఊరుకుంటారా ఏమిటి? మీమ్సే మీమ్స్! -
వెంటనే ఉత్తరం రాస్తే.. ఈ బహుమతి మీకే..!
ఆదిలాబాద్: నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్, ఈ–మెయిల్స్, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నారు. ఐదు దశాబ్దాల ముందుకు వెళ్తే ఉత్తర ప్రత్యుత్తరాలు కేవలం లేఖల ద్వారానే జరిగాయి. దూరప్రాంతాల్లో ఉన్న వారి క్షేమ సమాచారాన్ని ఉత్తరం, టెలిఫోన్, టెలిగ్రామ్ ద్వారా తెలుసుకునే పరిస్థితి ఉండేది. సెల్‌ఫోన్ వినియోగం.. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడకం తర్వాత సమాచార వ్యవస్థలో విప్లవం వచ్చిందని చెప్పవచ్చు. నేటి తరానికి ఇంచుమించుగా ఉత్తరం అంటే తెలియని పరిస్థితి ఉంది. అందుకే ఉత్తరాన్ని తిరిగి పరిచయం చేసేందుకు, తెలిసిన వారికి మరోసారి గుర్తు చేసేందుకు తపాలాశాఖ నడుం బిగించింది. లేఖరులకు పోటీ పెడుతోంది. ‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’.. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉత్తరాలకు ప్రాధాన్యం తగ్గింది. దూర ప్రాంతాల్లో ఉన్న వారి క్షేమ సమాచారం తెలియజేయాలన్నా, వ్యాపార అవసరాల ని మిత్తం సమాచారం పంపించాలన్నా ఒకప్పుడు పె న్ను, పేపరు తీసుకుని లేఖలు రాసేవారు. ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కానరాదు. మొబైల్ ఫోన్ ద్వారా స మస్త సమాచారాన్ని క్షణాల్లో వివిధ మార్గాల్లో చేరవేస్తున్నారు. ఫోన్లోనే ప్రత్యక్షంగా వాయిస్ కాల్, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఖండాంతరాల్లో ఉన్న వారితో సైతం వీడియో కాల్ ద్వారా మాట్లాడే పరిస్థితి ఉండడంతో లేఖల ద్వారా ఉత్తర, ప్రత్యుత్తరాలు మర్చిపోయిన పరిస్థితి ఉంది. ఒకప్పటి సమాచార సాధనమైన ఉత్తరాన్ని నేటి యువతరానికి గుర్తు చేసేందుకు తపాలా శాఖ లేఖారచన పోటీలకు శ్రీకారం చుట్టింది. ‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’ అనే అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ‘థాయి ఆఖర్’ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. బహుమతులు ఇలా.. రెండు కేటగిరీల వారీగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విజేతలను ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ఒక్కో విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి 12 మందికి మించకుండా ప్రథమ రూ.25 వేలు, ద్వితీయ రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5వేలు, జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ రూ.50 వేలు, ద్వితీయ రూ.25 వేలు, తృతీయ రూ.10 వేల నగదు అందజేస్తారు. సద్వినియోగం చేసుకోవాలి.. పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సదవకాశం. వయసుతో పనిలేకుండా ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇచ్చిన అంశానికి సంబంధించి స్వదస్తూరితో వ్యాసం రాసి పోస్ట్ చేయాలి. – ఎన్.అనిల్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తపాలా శాఖ పర్యవేక్షకులు రెండు విభాగాల్లో.. ఈ పోటీల్లో భారతదేశ పౌరులు పాల్గొనవచ్చు. 18 ఏళ్ల లోపు వారికి ఒక కేటగిరీ, ఆపై వారిని మరో కేటగిరీగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో వ్యాసం రాయవచ్చు. డిజిటల్ విధానంలో పాలన, మౌలిక సదుపాయాలు, అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ తదితర అంశాలను అందులో పొందుపర్చారు. ఎ4 సైజ్ పేపరుపై రాసి ఎన్వలప్ కవర్లో పంపించవచ్చు. ఎన్వలప్ కవర్ అయితే వెయ్యి పదాలకు మించకుండా, ఇన్‌ల్యాండ్ లెటర్ అయితే 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్స్ సాధనాల్లో టైప్ చేసిన లేఖలను పోటీకి అనుమతించరు. వ్యాసం చేతితో మాత్రమే రాసి పంపించాలి. లేఖలు పంపించేవారు వారి వయసును నిర్ధారిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. పోటీలో గెలిస్తే వారి వయస్సు, ఐడీ ధ్రువీకరణకు అవసరమైన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రాసిన ఉత్తరాలను ఎస్పీవోఎస్, ఆదిలాబాద్ డివిజన్ చిరునామాకు అక్టోబరు 31లోగా పంపించాలి. -
మాటా మంచీ
మనుషులకున్నదీ, ఇతర ప్రాణులకు లేనిదీ ఒక్క ఆలోచనాశక్తే కాదు, మాట కూడా! మాట శ్రుతిమించితే వివాదమవుతుంది, అతి అయితే వాచలత అవుతుంది, అదుపులో ఉంటే విజ్ఞతవుతుంది, రసాత్మకమైతే కవిత్వమవుతుంది, జనహితైషి అయిన ఒక మహనీయుని అంతరంగపు లోతుల్లోంచి ఉబికి వచ్చినప్పుడు అశేషజనావళిని కదిలించే మంత్రమవుతుంది. మాట అనేది మంచి, చెడుల కలబోత, రెండంచుల కత్తి! మనిషిని మనుషుల్లోకి తెచ్చి సామాజికుణ్ణి చేసినదీ,సంభాషణకు ఉపక్రమింపజేసినదీ, ఆ సంభాషణ నుంచి సంఘటిత కార్యంవైపు నడిపించినదీ,అందుకు అవసరమైన వ్యవస్థల అభివృద్ధికి దోహదమైనదీ, మాటే. ఆ క్రమంలోనే మాటకు వ్యాక రణం పుట్టింది, ఉచితానుచితాలనే హద్దులు ఏర్పడ్డాయి, ఆ హద్దుల నుంచి నాగరికత వచ్చింది. మనిషి చరిత్రలో ఇంతటి మహత్తర పాత్ర వహించిన మాట విలువ రానురాను పాతాళమట్టానికి పడిపోవడం నేటికాలపు విషాదం. ఏ రంగంలో చూసినా అసత్యాలు, అర్ధసత్యాల స్వైరవిహారం మాట విలువను దిగజార్చివేసింది. దుస్సాధ్యమని చెప్పదలచుకున్నప్పుడు ‘మాటలు కా’దంటూ మాటను చులకన చేస్తాం. మన కన్నా ప్రాచీనులే మాటను ముత్యాలమూటగా నెత్తిన పెట్టుకుని గౌరవించారు. బహుముఖమైన దాని విలువను గుర్తించి మహత్తును ఆపాదించారు. దానినుంచే మాంత్రికత, వరాలు, శాపాలు పుట్టాయి. మామూలు మాట కన్నా ముందు కవితాత్మక వాక్కు పుట్టిందని మానవ పరిణామ శాస్త్రవేత్తలు తేల్చారు. కొన్ని సమాజాల్లో మామూలు సంభాషణ కూడా కవితాత్మకంగా ఉండేదని ప్రముఖ పురాచరిత్ర అధ్యయనవేత్త జార్జి థామ్సన్ అంటూ, ఐరిష్ సమాజాన్ని ఉదహరిస్తాడు. రాత వచ్చాకే మాట తలరాత మారింది. మాట మంచిని, మర్యాదను, పొదుపును, అర్థవంతతను పదే పదే బోధించే అవసరం తలెత్తింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కాలు జారితే తీసుకోగలం కానీ, మాట జారితే తీసుకోలేం, పెదవి దాటితే పృథివి దాటుతుంది –వంటి సామెతలు, నుడికారాలు, సూక్తులు ప్రతి వాఙ్మయంలోనూ కొల్లలు. ‘మనిషికి మాటే గొప్ప అలంకారం, మిగతా అలంకారాలన్నీ నశించిపోయేవే’నని హెచ్చరిస్తాడు భర్తృహరి. మాటను అబద్ధంతో కలుషితం చేయడానికి నిరాకరించి రాజ్యాన్ని, ఆలుబిడ్డలను సైతం కోల్పోవడానికి హరిశ్చంద్రుడు సిద్ధపడ్డాడు. మహాత్మాగాంధీకి స్ఫూర్తినిచ్చిన కథలలో అదొకటి. గయుడు కృష్ణుని ఆగ్రహానికి గురైన సంగతి తెలియక రక్షిస్తానని అతనికి మాట ఇచ్చిన అర్జునుడు, దానిని నిల బెట్టుకోడానికి తన బహిఃప్రాణమైన కృష్ణునితోనే యుద్ధం చేశాడు. లిఖిత సంప్రదాయం ఏర్పడని, లేదా పూర్తిగా వేళ్లూనుకొనని రోజుల్లో నోటిమాటగానే అన్ని వ్యవహారాలూ జరిగేవి. ఆర్థికమైన లావాదేవీలలో మాటే వేయి ప్రామిసరీ నోట్ల విలువను సంతరించుకునేది. అలెగ్జాండర్ దండయాత్ర కాలంలో మనదేశాన్ని సందర్శించిన ఒక గ్రీకు చరిత్రకారుడు, ఇక్కడ రుణసంబంధమైన అన్ని ఒప్పందాలూ నోటిమాటగా జరగడం చూసి ఆశ్చర్యపోయాడు. పురాణ, ఇతిహాసాలలో మాట నిలకడతోపాటు, మాటసొంపుకు, నేర్పుకే ప్రాధాన్యం. రామాయణంలోని హనుమంతుడు అటువంటి సుగుణాలరాశి. రాముడికీ, సుగ్రీవుడికీ స్నేహసంధానం చేసింది అతనే. అతని వాక్చతురతను ఉగ్గడించడానికే కాబోలు, వ్యాకరణ పండితుణ్ణి చేశారు. దాదాపు ప్రతి దేశమూ, ప్రతి ఇతర దేశంతోనూ పాటించే దౌత్యనీతికి మాటే గుండెకాయ. దౌత్యచతురత ఇప్పుడు ఒక ప్రత్యేకవిద్యగా అభివృద్ధి చెందింది. మహాభారతాన్నే చూస్తే, వివిధ సందర్భాలలో ద్రుపదుని పురోహితుడు, విదురుడు, సంజయుడు, కృష్ణుడు కురుపాండవుల మధ్య రాయబారం నెరిపారు. రాజనీతి కుశలతే కాక, అవతలి పక్షానికి సూటిగా తేటగా, ఎక్కువ తక్కు వలు కాకుండా సందేశాన్ని చేరవేసే మాటనేర్పే అందుకు వారి అర్హత. ధృతరాష్ట్రునికి గాంధారి నిచ్చి పెళ్లి చేయాలన్న ప్రతిపాదనను భీష్ముడు ఒక మాటకారితోనే గాంధారరాజు సుబలుడికి పంపుతాడు. కుండిన నగరానికి వచ్చి రాక్షస పద్ధతిలో తనను ఎత్తుకెళ్లి వివాహమాడమన్న సందేశాన్ని అగ్నిద్యోతనుడనే పురోహితుని ద్వారా రుక్మిణి కృష్ణునికి పంపుతుంది. రాజ్యం కోల్పోయి అడవుల పాలైన తన భర్త నలుని జాడ కనిపెట్టడానికి దమయంతి, అతనికి మాత్రమే అర్థమయ్యే ఒక సందే శమిచ్చి దానిని సమర్థంగా అందించగల వ్యక్తినే పంపుతుంది. పర్షియన్లకు, గ్రీకులకు యుద్ధం వచ్చినప్పుడు స్పార్టాన్ల సాయాన్ని అర్థిస్తూ గ్రీకులు ఫిలిప్పైడ్స్ అనే వ్యక్తిని దూతగా పంపుతారు. మాట నేర్పుతోపాటు వేగంగా నడవగలిగిన ఫిలిప్పైడ్స్ కొండలు, గుట్టలవెంట మైళ్ళ దూరం నడిచి వెళ్ళి స్పార్టాన్లకు ఆ సందేశం అందించి తిరిగి వచ్చి యుద్ధంలో పాల్గొంటాడు. విచిత్రంగా ఇతనికీ, సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళి సీతను చూసొచ్చిన హనుమంతుడికీ పోలికలు కనిపిస్తాయి. మాటల మహాసముద్రంలో సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం వగైరా అనర్ఘరత్నాలే కాదు; మనుషుల మధ్యా, మతాల మధ్యా విరోధం పెంచి విధ్వంసం వైపు నడిపించే తిమింగలాలూ ఉంటాయి. మంచి, మర్యాద, విజ్ఞత, వివేకం ఉట్టిపడేలా నిరంతరం తీర్చిదిద్దుకునే మాటతోనే వాటిని తరిమి కొట్టగలం. రకరకాల కాలుష్యాల నుంచి మాటను విడిపించి తిరిగి మంత్రపూతం, అర్థవంతం చేయడం కూడా ఒక తరహా పర్యావరణ ఉద్యమమే. నూరు అబద్ధాల మధ్య ఒక నిజం కూడా అబద్ధంగా మారిపోయే దుఃస్థితి నుంచి మాటను రక్షించకపోతే ఇంతటి మానవ ప్రగతీ అబద్ధమైపోతుంది. -
ఆల్ ఉమెన్ టీమ్
కొన్ని నాటకాలు మన జీవితాల్లో నుంచే నడిచొస్తాయి. మన జీవితాన్ని కొత్తగా చూపుతాయి. ఆలోచనలకు పదును పెడతాయి. ఆల్–ఉమెన్ బృందం ‘దేఖ్ బహెన్’ అచ్చంగా అలాంటి నాటకమే! తల్లి, కూతురు, భార్య, సోదరి, ప్రియురాలు... ఇలా రకరకాల పాత్రలలో ఉన్న మహిళలకు సంబంధించిన నాటకం దేఖ్ బహెన్. ఎనభై నిమిషాల నిడివిగల ఈ ఆల్–ఉమెన్ ప్లే రకరకాల మహిళలకు సంబంధించి రకరకాల భావోద్వేగాల సమ్మేళం. జీవితంలోని తీపి, చేదుల కలయిక. అస్త అరోర, ప్రీతి చావ్లా, ప్రేరణ చావ్లా, శిఖా తల్పానియా, తహీరనాథ్ కృష్ణన్ ఈ నాటకంలో నటించారు. ‘రచన అనేది సులువైన పనేమీ కాదు. కత్తి మీద సాము. కొన్నిసార్లు మనతో మనమే పోరాడవలసి ఉంటుంది. ఇది కఠినమైన ప్రయాణమే అయినప్పటికీ మంచి అనుభూతిని కలిగించే ప్రయాణం. ఎన్నో విలువైన జ్ఞాపకాలను పదిలంగా భద్రపరుచుకునే ప్రయాణం’ అంటుంది ప్లే రైటర్ దిల్షాద్ ఎడిబమ్ ఖురానా. నాటక రచనలో ఖురానాకు కో–రైటర్ తహీరనాథ్ క్రిష్ణన్ సహకరించారు. ఈ ఆప్తమిత్రులు నాటకరచన సమయంలో కొన్నిసార్లు ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకుంటారు. అలా అని మొండిగా వ్యవహరించరు. ఒకరి కాన్సెప్ట్ మరొకరికి నచ్చితే మళ్లీ ఆప్తమిత్రులు అవుతారు.‘నాటక రచనలో ఇద్దరు వ్యక్తులు పాలుపంచుకున్నప్పుడు వాదోపవాదాలు సహజమే. అలా ఉంటేనే నాటకం బలంగా వస్తుంది. కొన్ని విషయాల్లో మా ఇద్దరి ఆలోచనల్లో తేడా ఉన్నప్పటికీ అనేక విషయాల్లో మేము ఒకేలా ఆలోచిస్తాం. ఇదే మా బలం’ అని కో–రైటర్ తహీరనాథ్ క్రిష్ణన్ గురించి చెబుతుంది దిల్షాద్. ‘మహిళల బృందానికి సంబంధించిన నాటకం ఇది. నేల విడిచి సాము చేయని నాటకం. హృదయానికి దగ్గరయ్యే నాటకం. రంగస్థలంపై కనిపించే దృశ్యాలు మనల్ని నిజజీవిత దృశ్యాలతో మమేకమయ్యేలా చేస్తాయి. కొత్తగా ఆలోచించేలా చేస్తాయి. అతి నాటకీయత లేకుండా డైలాగులు సహజంగా ఉంటాయి’ అంటుంది కో–రైటర్ తహీరనాథ్ కృష్ణన్. ముంబైకి చెందిన ప్రేరణ చావ్లా ఈ నాటకానికి దర్శకత్వం వహించింది. ‘నన్ను సవాలు చేసే పనులను నెత్తికెత్తుకోవడం అంటే నాకు మొదటి నుంచి ఇష్టం. ఈ నాటకానికి డైరెక్టర్‌గా బాధ్యత తీసుకోవడం కూడా అలాంటిదే. టీమ్ నన్ను బలంగా నమ్మింది. ఆ నమ్మకమే నాకు మరింత బలాన్ని ఇచ్చింది. గొప్ప నటులతో పనిచేయాలనే నా కల దేఖ్ బహెన్ నాటకంతో నిజమైంది’ అంటుంది ప్రేరణ చావ్లా. నాటక రిహార్సెల్ కార్యక్రమాలు ముంబైలో మిలిటరీ క్రమశిక్షణ ప్రమాణాలతో సాగాయి. ‘మూస విధానంలో ఈ నాటకాన్ని రూపొందించలేదు. మహిళలకు సంబంధించిన అన్ని కోణాలను వ్యక్తీకరించే నాటకం ఇది’ అంటున్నారు నిర్మాత ఆకర్ష్. ఆకర్ష్ తప్ప ఈ నాటకానికి సంబంధించిన దర్శకులు, సాంకేతిక నిపుణులు, డిజైనర్లు, నటులు అందరూ మహిళలే. ‘స్క్రిప్ట్ నచ్చిన తరువాత నాటకం విషయంలో జోక్యం చేసుకోలేదు. వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాను. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ నాటకం గొప్పగా వచ్చేలా చేశారు. ఈ నాటకం ద్వారా మేము ముందడుగు వేసినట్లుగా భావిస్తున్నాం’ అంటున్నాడు ఆకర్ష్. -
రూ.2000, 500 నోట్లపై ఏమైనా రాస్తే చెల్లవా? ఇదిగో క్లారిటీ..
రూ.2000, 500, 200, 100 కరెన్సీ నోట్లపై పెన్నుతో లేదా పెన్సిల్‌తో ఏమైనా రాస్తే అవి చెల్లవని, ఆర్బీఐ మార్గదర్శకాల్లో ఇది ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది ఇదే నిజమే అని నమ్ముతున్నారు. అయితే ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. 2000, 500 సహా అన్ని కరెన్సీ నోట్లపై ఏమైనా రాసినా అవి అన్ని బ్యాంకుల్లో చెల్లుతాయని చెప్పింది. దీన్ని ఎవరూ నమ్మవద్దని సూచించింది. అయితే పెన్ను లేదా పెన్సిల్‌తో నోట్లపై రాయడం వల్ల వాటి మన్నిక కాలం తగ్గే అవకాశం ఉందని, అందుకే సాధ్యమైనంత వరకు ఏమీ రాయవద్దని సూచించింది. కరెన్సీ నోట్లపై ఏమైనా రాసి ఉన్నా వాటిని ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా 2020లోనే జారీ చేసింది. అయితే కొంతమంది ఈ విషయంపై అవగాహన లేక కరెన్సీ నోట్లపై ఏమైనా రాసి ఉంటే అవి చెల్లవేమో అని భయపడి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇవన్నీ అవాస్తవమని ట్విట్టర్లో పోస్టు చేసింది. Does writing anything on the bank note make it invalid❓#PIBFactCheck ✔️ NO, Bank notes with scribbling are not invalid & continue to be legal tender ✔️Under the Clean Note Policy, people are requested not to write on the currency notes as it defaces them & reduces their life pic.twitter.com/V8Lwk9TN8C — PIB Fact Check (@PIBFactCheck) January 8, 2023 ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కరెన్సీ నోట్లపై పెన్ను, పెన్సిల్‌తో ఏమైనా రాసి ఉన్నా, సిరా మరకలు కన్పించినా అవి చెల్లుతాయి. వినియోగదారులు అవసరమైతే వీటీని తీసుకెళ్లి బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అలాగే నాణేలను కూడా ఇచ్చి కరెన్సీ నోట్లుగా తీసుకోవచ్చు. చదవండి: 'మీ టీ నేను తాగను.. విషం కలిపి ఇస్తే? అఖిలేశ్ యాదవ్ వీడియో వైరల్ -
జీతం రూ.70 వేలు ..చదవ లేరు..రాయలేరు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నిరక్షరాస్యులు ఎక్కువైపోయారు. జీతం రూ.50వేల నుంచి రూ.70 వేలు తీసుకుంటున్నా... ఇంగ్లిష్‌లో చిన్న పదం కూడా రాయలేని పరిస్థితి. దీంతో పాలనా పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనుల్లో తీవ్ర జాప్యం ఎస్కేయూలో దాదాపు 40 మంది జూనియర్ అసిస్టెంట్లు తమ ‘డిజిగ్నేషన్’ కూడా ఇంగ్లిష్‌లో సరిగా రాయలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం ఒక లెటర్‌ను టైప్ చేసి ఉన్నతాధికారులకు పంపడం కూడా వీరికి చేతకాదు. ఒకప్పుడు డైలీ వేజ్ కింద వారంతా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగాన్ని పరి్మనెంట్ చేసుకుని రికార్డు అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి దక్కించుకున్నారు. అయితే అందుకు తగ్గ నైపుణ్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైనా ఫైల్ డ్రాఫ్టింగ్ చేసి ఉన్నతాధికారులకు పంపలేకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇటీవలే వీరందరికీ ప్రత్యేకంగా కంప్యూటర్ నైపుణ్యం పెంపొందించేలా శిక్షణ ఇచ్చినప్పటికీ, అభ్యసించలేక వెనుకబడ్డారు. దీంతో వారందరినీ నైపుణ్యం లేని విధుల్లో నియమించాలని ఉన్నతాధికారులు భావించారు. అయితే జూనియర్ అసిస్టెంట్ల కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో వారిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై వర్సిటీ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. (చదవండి: బాబు పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడ?) -
పాతికేళ్ల ‘కాలమ్’గా రాస్తూనేవున్నా!
25 సంవత్సరాలు అనేది ఆసక్తికరమైన వయస్సును సూచిస్తుంది. మీరు ఈ వయసులోనే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అన్ని బార్ల తలుపులు మీకోసం తెరుచుకుంటాయి. మిమ్మల్ని ఎవరూ ఇక అబ్బాయిగా భావించరు. 18 లేదా 21 ఏళ్ల వయసులో మిమ్మల్ని మీరు ‘యంగ్’ అని పరిగణించుకోవచ్చు. కానీ 25 ఏళ్ల వయసులో మీరు వయోజనుల కిందే లెక్క. గత 25 ఏళ్లుగా నేను కాలమ్ రాస్తూనే ఉన్నాను. ప్రతి వారం నా వ్యాసం వచ్చేది. తాము చదివింది ప్రజలు ఇష్టపడ్డారనే నేను భావిస్తున్నాను. కానీ ఇన్నేళ్లుగా కాలమ్ ఉనికిలో ఉండటం అనేది ఇక ఆశ్చర్యం కలిగించదు. అయితే పాఠకులకు ఇన్నేళ్లు సుపరిచితం కావడం ఎంతో ఇష్టమైన విషయం కదా! బహుశా ఇన్నేళ్లలో నేను రాస్తూవచ్చిన కంటెంట్ మారుతూ ఉండి ఉండవచ్చు. మొదట్లో నా రాతల్లో శైశవ దశ ఉండేది. నాలో ఒక భాగం వయోజనుడే ఉంటాడు కానీ మరొక భాగం పిల్లాడి గానే ఉంటాడు. కానీ నేను రుషిలాగా నటిస్తుంటాను. సిల్లీ జోక్స్ వేస్తున్నప్పుడు నాలో చిలిపితనం సులువుగా ఆవరిస్తుంటుంది. కాలమ్ ఇంతకాలం కొనసాగినందుకు ఈ జోక్స్, చిలిపితనమే కారణం అయి ఉండవచ్చని నా అనుమానం. ఒక వారం నా వ్యాసం మీకు ఆసక్తి కలిగించకపోతే మరోవారం తప్పక మీకు ఆసక్తికరంగా ఉండి ఉంటుంది. నేను ఇన్నేళ్లుగా నిత్యం ప్రతివారం ఎలా రాస్తూ వస్తున్నారని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు. 1997 జూలై 6న నా కాలమ్ ఒక దినచర్యలా ప్రారంభమైంది. నాటి ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్‌తో డిన్నర్ చేస్తున్న జ్ఞాపకాలను అది గుర్తు చేసింది. ఆయన నాకు ఆహ్వానం పంపినప్పుడు నేనెంత సంతోషించానంటే దాన్ని అసలు దాచుకోలేకపోయాను. విచారకరమైన విషయం ఏమిటంటే, అరకొర విషయాలే తప్ప దాంట్లో పెద్దగా నివేదించడానికి నా వద్ద సమాచారం ఏదీ లేకుండా పోయింది. నన్ను నేను ప్రదర్శించుకోవడమే నా నిజమైన ఉద్దేశంగా ఉండేది. సంవత్సరాలు గడిచే కొద్దీ నా కాలమ్ అనేక దిశల్లో మెరుగుపడుతూ వచ్చింది. చాలా కాలంపాటు ఒకే పత్రికలో నా కాలమ్ ప్రయాణించింది (‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రికలో ‘సండే సెంటిమెంట్స్’ పేరిట వచ్చింది). వారాంతపు అనుబంధ సంచికల్లో వెనుక పేజీలో అది మొదలైంది. ఆ సమయంలో అది ఒక డైరీగా ఉండేది. తర్వాత ఆ పత్రిక అనుబంధ సంచికను కూడా మెయిన్ పేపర్లో కలిపేయడంతో అప్పటి నుంచి నా కాలమ్ కూడా అక్కడే కొనసాగింది. ఇక్కడే అనేకమంది జ్ఞానులు నా చుట్టూ ఉండటంతో నా కాలమ్ ప్రస్తుతం రూపంలో మెరుగుపడింది. దాని సైజ్ రీత్యా అది సింగిల్ ఇష్యూ కాలమ్గానే ఉంటూ వచ్చింది. స్థలాభావం కారణంగా నా కాలమ్ సైజ్ కూడా తగ్గిపోతూవచ్చింది. దీంతో అది ఒక ‘స్ప్లింట్ ఐడెంటిటీ’ని సాధించింది. ఈ స్కిజోఫ్రెనియా నేను రెండు స్వరాలతో మాట్లాడేలా చేసింది. ఆరోజు ప్రధాన సమస్యలపై సీరియస్ ప్రతిఫలనాలను ఒక స్వరం ప్రకటిస్తే, మరొక స్వరం జోకులతో, అసంబద్ధ ఆలోచనలతో కొనసాగేది. గత పాతికేళ్లుగా నేను ప్రతి వారమూ నా కాలమ్ రాస్తూ వచ్చాను. ఒక్క వారం కూడా నేను రాయడం మానలేదు. ఒకే ఒక వారం మాత్రం నాటి సంపాదకుడితో చిన్నపాటి గొడవ కారణంగా దాని ప్రచురణ ఆ వారానికి ఆగిపోయింది. దాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. దాన్ని గుర్తుంచు కోకపోతేనే ఉత్తమంగా ఉంటుంది. కానీ నా కారణంగా నా కాలమ్ గత పాతికేళ్లుగా ఆగిపోలేదు అని చెప్పడానికే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఒక అంచనా ప్రకారం నేను ఇప్పటికి నా కాలమ్‌లో పది లక్షల పదాలను రాసి ఉంటాను. నా కాలమ్‌లోని కొన్ని కథనాలను వివిధ ప్రచురణ సంస్థలు సంకలనాలుగా ప్రచురించాయి. రెండు సంకలనాలను విజ్డమ్ ట్రీ వాళ్లు ప్రచురిస్తే, మూడోది హార్పర్ కాలిన్స్ సంస్థ ప్రచురించింది. ప్రశాంతమైన సాయంవేళల్లో ఆ పుస్తకాలను నేను తడుముతూ ఉంటాను. నేను మొదట కాలమ్ రాయడం ప్రారంభించినప్పటికంటే అదే విషయాన్ని ఇప్పుడు ఎంత బాగా రాయగలిగి ఉండేవాడిని అని నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. వయస్సు నన్ను ఎదిగించి ఉండవచ్చు. ఈ క్రమంలో నేను జ్ఞానినయ్యానని నా నమ్మకం. మొదట్లో చాలా తేలిగ్గా రాస్తూ పోయేవాడిని. కానీ క్రమంగా నా కాలమ్ రాయాలంటే గట్టి కృషి చేయాల్సి వచ్చింది. ఒకోసారి అది నాకు ఎంతో ఇబ్బందికరంగా కూడా మారేది. సంవత్సరాలపాటు నేను రాస్తూ వచ్చిన ఈ కాలమ్‌ను నామట్టుకూ ఎంతగానో ఆస్వాదించాను. ఎందుకంటే అవి పాఠకుల కోసం రాసినవి కదా! పాఠకుల ప్రశంసను కోరుకోవడం కంటే మించినది నాకు ఏదీ లేదు. పాఠకులతో పాటు నా సహోద్యోగులు కూడా సహకరిస్తూ వచ్చారు కాబట్టే ఇంత సుదీర్ఘ కాలం నా ఈ కాలమ్ కొనసాగింది. ఇంతకాలం నా కాలమ్‌ను చదివి నందుకు ఆదరించినందుకు, నాకు మద్దతి చ్చినందుకు పాఠకులందరికీ ధన్యవాదాలు. (క్లిక్: తరతరాలనూ రగిలించే కవి) - కరణ్ థాపర్ సీనియర్ పాత్రికేయులు -
ఇది కరోనా నై‘పుణ్యమే’
సాక్షి, హైదరాబాద్: పిల్లల చదువును కరోనా అల్లకల్లోలం చేసింది. చదవడం, రాయడం వంటి నైపుణ్యాలను దెబ్బతీసింది. తల్లిభాషలోనూ తల్లడిల్లిపోతున్నారు. ఇలాంటి విస్మయం కలిగించే నిజాలెన్నో నేషనల్ ఇండిపెండెన్స్ స్కూల్స్ అలయెన్స్(నిసా), తెలంగాణ రిజిస్టర్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రాస్మా) సర్వేలో వెల్లడయ్యాయి. కరోనా తర్వాత క్లాస్‌లకు హాజరవుతున్న 44.6 శాతం విద్యార్థులకు చదవడం కష్టంగా ఉందని, 32.8 శాతం మందిలో ఆత్మవిశ్వాసం లోపించిందని నిసా, ట్రాస్మా సర్వేలో వెలుగుచూశాయి. ఆన్లైన్ విధానంలో నష్టపోయిన విద్యను నేర్చుకునేందుకు 45.1 శాతం మంది తిరిగి ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని కోరుతున్నట్టు తేలింది. సర్వే నివేదికను ట్రాస్మా మంగళవారం వెల్లడించింది. కరోనాకాలంలో నెలకొన్న విద్యారంగం నష్టంపై ఈ రెండుసంస్థలు కలసి దేశవ్యాప్తంగా ఇటీవల సర్వే జరిపాయి. అన్నిప్రాంతాల విద్యార్థులు, సంస్థల ప్రతినిధులను కలిశారు. 3–5 తరగతులు, 8వ తరగతి విద్యార్థుల నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణప్రాంతాల్లో 30 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం మంది మాతృభాషలో ఇబ్బంది పడుతున్నట్టు తేలింది. 3వ తరగతిలో 28 శాతం, 5వ తరగతిలో 25 శాతం, 8వ తరగతిలో 2 శాతం మందిలో ఈ సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో 14 శాతం చదవడం, 17 శాతం రాయడంలో వెనుకబడి ఉన్నట్టు తేలింది. పట్టుతప్పిన చదువు... ►ఆంగ్లభాషలో విద్యార్థుల ప్రమాణాలు 35 శాతం మేర పడిపోయాయి. 3వ తరగతి విద్యార్థులు ఒకటో తరగతి నైపుణ్యాల స్థాయికి తగ్గిపోయారు. పట్టణాల్లో ఆంగ్ల భాషలో చదివే నైపుణ్యం కొరవడింది. 40% మంది 5వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్‌లో అర్థం చేసుకోలేనిస్థితిలో ఉన్నారు. ఐదో తరగతి పట్టణ విద్యార్థులు ఇంగ్లిష్ చదవడంలో ఇబ్బంది పడుతున్నారు. ►44 శాతం విద్యార్థులు గణితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. 42 శాతం 5వ తరగతి విద్యార్థులు గణితంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. గణితంలో ప్రతి ముగ్గురు విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ►ఆన్లైన్ బోధనలో 83.9 శాతం మంది యూట్యూబ్, దూరదర్శన్, టీ–శాట్‌కు ప్రాధాన్యమిచ్చారు. 12 శాతం మందికి ఇంటర్నెట్ లేకపోవడం వల్ల క్లాసులు వినలేకపోయారు. ఆన్లైన్ బోధనపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత కన్పించింది. 44.6 శాతం విద్యార్థులు ప్రస్తుత పరిస్థితుల్లో తరగతిగదుల్లో చదవడం కష్టంగా ఉందని చెబుతున్నారు. ►కరోనా వల్ల 32.8 శాతం మంది ఆత్మ విశ్వాసంతో చదువు కొనసాగించడంలేదు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేస్తాం: వినోద్‌కుమార్ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యా ర్థుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందని, త్వరలోనే సానుకూల నిర్ణయం ప్రకటిస్తుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేషనల్ ఇండిపెండెన్స్ స్కూల్స్ అలయెన్స్ (నిసా), తెలంగాణ రిజిస్టర్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రాస్మా) ఇటీవల కరోనా కాలంలో విద్యా ప్రమాణాలపై నిర్వహించిన సర్వే నివేదికను వినోద్ మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా గ్రామీణ ప్రాంతాలకు విద్య చేరువ కాలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకాలంలో గత రెండేళ్లుగా విద్యారంగానికి జరిగిన నష్టాన్ని ఉపాధ్యాయులు పూడ్చాలని, బ్రిడ్జ్ కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అన్ని స్థాయిల్లోనూ విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలనే ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ట్రాస్మా సలహాదారు డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ 98 శాతం గ్రామీణ విద్యార్థులు ఆన్లైన్ విద్యపై మక్కువ చూపడం లేదన్నారు. కరోనా మూలంగా విద్యార్థులకు ఆంగ్ల భాష మీద పట్టు తగ్గిందని, రాత నైపుణ్యానికి దూరమయ్యారని, ఈ నష్టాన్ని పూడ్చకపోతే భవిష్యత్‌లో విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
రాత.. దాత
రోజులో కొన్ని గంటల సమయం మనది కాదనుకుంటే.. చూపులేని వారికి వెలుగు దారి చూపొచ్చు. మరచిపోయిన పరీక్ష హాలుని మరోసారి గుర్తు తెచ్చుకుంటూనే మరొకరికి ‘చే’యూత అందించిన గొప్ప జ్ఞాపకాన్ని మిగుల్చుకోవచ్చు. అందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న మార్గం అంధ విద్యార్థులకు పరీక్షల్లో రాత సాయం. సాక్షి, సిటీబ్యూరో:అటు ఎండలతో పాటు ఇటు పరీక్షల వేడి కూడా నగరంలో రాజుకుంటోంది. రెండు రోజుల్లో ఇంటర్ పరీక్షలు మొదలు కానుండగా, పదో తరగతి పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సబ్జెక్టుల రికార్డింగ్స్ దగ్గర్నుంచి పరీక్షలు రాసే విషయం వరకూ ‘చే’యూత ఇచ్చేవారి కోసం అంధ విద్యార్థులు అన్వేషిస్తున్నారు. కొండంత చీకటిని పారదోలడంలో తమకు గోరంత సాయంగా, స్కైబ్స్గా పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నారు. తిప్పలు వర్ణణాతీతం.. అంధ విద్యార్థుల సమస్యలు చెబితే అర్థమయ్యేవి కావు. ముఖ్యంగా పరీక్షల సమయంలో వారి తిప్పలు వర్ణనాతీతం. అన్ని కష్టాలున్నా చదువుకోవాలనే వారి తపన చూస్తే ఎటువంటి వారికైనా మనసు కరగకమానదు. ఆర్థికంగా కాకపోయినా, అవసరమైన వారికి ఏదో ఒక రూపంలోసేవ చేద్దాం అనుకున్నవారికి స్క్రైబ్స్ఓ మంచి అవకాశం. నగరంలోని బేగంపేట, దిల్సుఖ్నగర్, దారుషిఫా, మలక్‌పేట.. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్, హోంలలో అంధ విద్యార్థులు స్క్రైబ్స్ కోసం నిరీక్షిస్తున్నారు. సహాయకుల కొరత.. రెమ్యూనరేషన్ నామమాత్రంగా ఉండటం, చెల్లించే పద్ధతిలో లోపాల కారణంగా స్క్రైబ్స్‌గా వచ్చేందుకు ఎక్కువ మంది సముఖత చూపడం లేదు. మరోవైపు కొందరు కేవలం డబ్బుల గురించి మాత్రమే స్క్రైబ్‌గా చేసే వ్యక్తికి ఉన్న విషయ పరిజ్ఞానం, విద్యార్హతల సమాచారం గురించి తెలియక తాము చెప్పిన ఆన్సర్లు సరిగా రాయగలరో లేదోనని అంధ విద్యార్థులు ఆందోళనకు లోనవుతున్నారు. ‘నాకు స్క్రైబ్‌గా స్కూల్ అటెండర్‌ను నియమించారు. అతడికి స్పెల్లింగ్‌లు కూడా సరిగా రాక బాధలు పడ్డా’నని ఓ విద్యార్థ వాపోయాడు. ‘గ్రూప్–2 పరీక్ష రాస్తున్నప్పుడు సహాయకుడిగా వచ్చిన వ్యక్తికి కనీస పరిజ్ఞానం కూడా లేదు. దాంతో ఆ పరీక్షల్లో 450 మార్కులకు బదులు కేవలం 223 మాత్రమే వచ్చాయి’ అని మరో అంధ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. తమ సహాయకులకు ప్రభుత్వం రెమ్యునరేషన్ ఇస్తుందనే విషయం చాలా మంది అంధ విద్యార్థులకు తెలియకపోవడంతో అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. స్వచ్ఛందంగా రావా(యా)లి.. సమస్యలున్నా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో చదివే వారికి ప్రభుత్వ పరంగా కొంత అండ ఉంటే ఆర్ఫాన్ హోమ్స్ వగైరాల్లో ఆశ్రయం పొందుతూ చదువుకునే అంధ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వీరి పరీక్షలకు సంబంధించి ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి, అర్హత కలిగిన స్క్రైబ్స్ కొరతను తీర్చడానికి, స్వచ్ఛంద సేవకుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి స్క్రైబ్స్‌గా పనిచేయడానికి వచ్చేవారిని ప్రోత్సహించాలని, వారి పేర్లను నమోదు చేసుకుని అవసరానికి అనుగుణంగా వారిని ఉపయోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ‘స్వచ్ఛంద సేవకుల్ని స్క్రైబ్స్‌గా ప్రభుత్వం ప్రోత్సహించాలి. రాష్ట్రస్థాయిలో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసి సేవాగుణమున్న గృహిణులు, ఐటీ ఉద్యోగులకు తర్ఫీదు ఇవ్వాలి’ అని ఆసరా ఎన్జీఓ అధ్యక్షుడు ఆర్.జగదీష్‌బాబు అభిప్రాయపడ్డారు. స్క్రైబ్స్‌గా సేవలందించాలంటే.. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఐడీ ప్రూఫ్, పదవ తరగతి మెమో ఉండి తెలుగు బాగా చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ప్రశ్నలు స్క్రైబ్స్ చదివి చెబితే సమాధానాలు విద్యార్థులు చెబుతారు. అందుకని ఒకటికి రెండుసార్లు ప్రశ్న చదివి వినిపించాలి. మిగతా వారితో పోలిస్తే అంధ విద్యార్థులకు పరీక్ష పూర్తి చేసేందుకు అరగంట సమయం అదనంగా ఇస్తారు. కేవలం ఒక పరీక్ష మాత్రమే రాస్తానన్నా, అన్ని పరీక్షలూ రాస్తామన్నా అవకాశం ఇస్తారు. ఏదేమైనా.. స్వచ్ఛందంగా సేవ అందించడం కాదు.. ఖచ్చితంగా పరీక్ష సమయానికి వెళ్లగలగడం అంటేనే చెప్పాలి. లేకపోతే అనవసరంగా ఓ విద్యార్థి జీవితానికే పరీక్షగా మిగులుతారు. రాసాయం చేశా.. ఓ ఎన్జీఓ వాళ్లు స్క్రైబ్స్ కావాలంటే వెళ్లి కలిశాను. అలా ఆర్బీఐ పరీక్షకు అటెండ్ అయిన ఓ అంధుడి కోసం స్క్రైబ్‌గా స్వచ్ఛందంగా రాశాను. ఆ తర్వాత ఎస్బీఐ క్లర్క్ కోసం రాశా. మరో 2 సార్లు రాశాను. పరీక్ష రాయడం కోసం ఆఫీసుకు సెలవు పెట్టాల్సి వచ్చింది. అయినా సరే అనుకుని రాశాను. ఇప్పటికీ ఏ మాత్రం అవకాశం ఉన్నా స్క్రైబ్‌గా సర్వీస్ అందిస్తా.– నరేష్, చార్టెర్డ్ అకౌంటెంట్ ఐదేళ్లుగా.. మా స్నేహితులతో పాటు నేను కూడా ఐదేళ్లుగా స్వచ్ఛందంగా స్క్రైబ్ సేవలందిస్తున్నా. అంధులకు మన వంతుగా దారి చూపడంలో గొప్ప ఆత్మసంతృప్తి లభిస్తుంది. – భారతి -
భార్య కావలెను
మొన్న సుబ్బారావు కనిపించాడు. నమస్తే చెల్లెమ్మా... అని ఉత్సాహంగా పలకరించాడు. ఏమిటి సంగతి అనంటే డివోర్స్ అయిపోయిందట మంచి అమ్మాయి ఉంటే చూడమ్మా చేసుకుంటాను అన్నాడు. మళ్లీ మనవాడికి మంచి భార్య కావాలన్నమాట. నేను కూడా ఒకరికి భార్యనే. ఇద్దరు పిల్లల తల్లినే. కానీ ఈ సుబ్బారావు శాల్తీ తగిలినప్పటి నుంచి నా బుర్రలో కూడా ఒక పురుగు తొలుస్తూ ఉంది. నాక్కూడా ఒక భార్య ఉంటే ఎంత బాగుంటుంది? అవును. మీరు సరిగ్గానే విన్నారు. నాక్కూడా ఒక భార్య ఉంటే ఎంత బాగుంటుంది. ఎందుకు అంటారా? చెప్తా వినండి. నాకు భార్య కావాలి. నేను మళ్లీ ఏ ఉస్మానియా లోనో, సెంట్రల్ యూనివర్సిటీ లోనో చేరి నా చదువును తిరగదోడి సరిగా చదివి ఆ చదువుతో నాలుగు డబ్బులు సంపాదించే యోగ్యతను తెచ్చుకుని నా కాళ్ల మీద నేను నిలబడదలుచుకున్నాను కనుక నాకో భార్య కావాలి. నేను తెల్లారి పుస్తకాలు పట్టుకుని చదువుకు పోతే నా పిల్లలను ‘నాన్నా.. కన్నా’ అని లేపి, ముద్దు చేసి, బాత్రూమ్లో ఫలానాది కడిగి, బ్రష్ చేయించి, స్నానానికి శుభ్రంగా వొళ్లు రుద్ది, బ్రెడ్ తినిపించి, స్కూల్ బ్యాగులు ఈ భుజాన ఒకటి ఆ భుజాన ఒకటి తగిలించుకుని మెట్లు దిగి బస్ దాకా నడిచి పిల్లలను ఎక్కించి వచ్చే భార్య కావాలి. వాళ్లు అమ్మా జ్వరం అంటే హాస్పిటల్‌కి ఫోను కొట్టి ఫలానా డాక్టర్ అపాయింట్ ఉందేమో చెప్తారా అండీ అని వినమ్రంగా అడిగే భార్య కావాలి. స్స్... పంటి నొప్పి అనగానే ఊబర్ బుక్ చేసి అమీర్‌పేట దాకా వెళ్లి మంచి డెంటల్ హాస్పిటల్లో చూపించుకుని వచ్చే భార్య కావాలి. ‘అమ్మా... నా ఫ్రెండు ప్రహ్లాద్గాడు వాళ్ల నాన్నతో కలిసి ఈ సమ్మర్‌కు సింగపూర్ వెళుతున్నాడట’ అని చిన్నబుచ్చుకుంటే ‘వెళితే వెళ్లనీయమ్మా... మనం ఎంచక్కా మీ నానమ్మ ఊరు జగ్గయ్యపేట వెళదాం’ అని వాళ్లలో సంతోషమూ ఆత్మవిశ్వాసమూ నింపి వాళ్లను తల ఎత్తుకు తిరిగేలా చేసే భార్య కావాలి. నేను వెళుతూ వెళుతూ ఒక క్షణం గడప దగ్గర నిలబడి ఏదైనా సాయం కావాలా అని మాటవరసకు అడిగితే ‘ఇవన్నీ ఉండే తలనొప్పులేలేండి. మీకెందుకు మీరెళ్లండి’ అని చిరునవ్వు చెదరకుండా చెప్పే భార్య కావాలి. అయితే ఆమె కాస్తో కూస్తో పని చేయాలండోయ్. ఆఫీసుకు ఇలా వెళ్లి అలా వచ్చేయాలి. లేట్ అవర్స్ గీట్ అవర్స్ జాన్తా నై. కావాలంటే ఒక గంట పని తగ్గించుకుని నా కోసం నా పిల్లల కోసం టైమ్ స్పెండ్ చేయాలి. అలాంటి భార్యే కదా నాకు కావాలి. ఇక నాక్కావలసిన భార్య నుంచి నేను కాసింత మంచి వంటను ఆశించడం తప్పంటారా? రొయ్యలు, వంకాయ కలిపి రుచిగా తియ్యగూర చేసే భార్యను, మిరియాల చారు కాచినప్పుడు తప్పకుండా గుర్తు పెట్టుకుని వడియాలు కాల్చి ఇచ్చే భార్యను, ఈ మనిషికి లేత సొరకాయ కూరంటే మహా ఇష్టం సుమండీ అని తెచ్చి కాసింత పాలుబోసి వండి పెట్టే భార్యను కోరుకోవడం ఏ మాత్రం అత్యాశ కాదంటే కాదు. నాకు కష్టం కలక్కుండా పిల్లలకు అంతరాయం కలక్కుండా విసుక్కోకుండా జిడ్డోడే ముఖంతో కనిపించకుండా ఇప్పుడే స్నానం చేసి రెడీ అయినట్టుగా వంట చేసుకుంటూ కనిపించే భార్య కావలెను. ఇక డీమార్ట్‌కు రా, మోర్‌కు రా, మెట్రోకు రా అని ఆమె పిలిచేది లేదు. నేను వెళ్లేదీ లేదు. ఇంటికి ఏయే సరుకులు కావాలో ఆమెకు తెలియదా? మధ్య నేను పుల్ల పెట్టాలా? కాని– ఇవన్నీ తను చేసుకుంటూ తన లోకంలో ఉంటే కాదనను కాని నాకింత నడుము పట్టేసినప్పుడు, మెడ పీకేస్తున్నప్పుడు, పడిశంతో ముక్కు ఎర్రగా అయిపోయినప్పుడు ‘అయ్యో... ఏమిటండీ ఇలాగా’ అంటూ ఆగమాగం అయిపోయి నాకోసం లీవు పారేసి నా నొప్పి తన నొప్పిగా భావించి కూచునే భార్య నాకు తప్పనిసరిగా కావాలి. ఇంటి శుభ్రత పట్ల తనకు పట్టింపు ఉండాలి. ఈ ఇంటిని ఎప్పుడూ నేను శుభ్రంగా ఉంచుకుంటాను దీనికి ఎవ్వరి సహాయం అక్కర్లేదు అనే ఆత్మాభిమానం నాక్కాబోయే భార్యకు ఉండాలి. ఇక సంవత్సరానికి ఒకసారి అరకో, హార్సిలీహిల్సో వెళతాము కదా. అప్పుడు ‘ఏయ్ పిల్లలూ... డిస్ట్రబ్ చేయకండి’ అని వాళ్లను బంతాటకు దూరం తీసుకెళ్లి నన్ను మాత్రం చెట్టు కింద రిలాక్స్డ్గా పడుకుని కొబ్బరి నీళ్లు తాగేలా చేసే మంచి భార్య నాకు కావాలి.ఇక సంఘంలో నా మర్యాద నిలబెట్టే భార్య ఉండాలని ఎవరు మాత్రం అనుకోరు చెప్పండి. గెస్టులు వస్తారనగా టపాటపా ఇల్లు సర్దేసి, సోఫా కవర్లు మార్చేసి, ఫ్లవర్ వాజుల్లో కొత్త పూలు పెట్టేసి, రూమ్ స్ప్రేలు కొట్టేసి, పిల్లలూ బుద్ధిగా ఉండాలమ్మా అని వాళ్లకు జాగ్రత్తలు చెప్పేసి, ఎవరెవరికి ఏ పదార్థం ఇష్టమో వండి పెట్టేసి, డ్రింక్స్లోకి ఈ స్నాక్స్ కావాలా ఆ స్నాక్స్ కావాలా అని కర్టెన్ పట్టుకు నిలబడి అడిగేసి, యాష్ ట్రేలను తళతళలాడేట్టు టీపాయ్ మీద పెట్టేసి, గెస్ట్‌లు వచ్చాక ప్రతి మాట అనుమతి కోసం నా వైపు చూస్తూ నా మెచ్చుకోలును పొందే భార్య నాకు కావాలి. ఇదొకటా. ఒక్కోసారి ‘నాకు బోర్ కొడుతుందోయ్ ఫ్రెండ్స్‌తో పోతున్నా రాత్రికి రాను’ అనంటే ‘అదెంత మాట అలాగే’ అనే భార్య నాకు కావాలి. ఇక రాత్రి పూట ‘ఊహూ’ ‘నోనో’ అనే భార్య నాకు నచ్చదు. పిలిచినప్పుడు రావాలి. చెప్పినట్టు వినాలి. నేను టీవీ చూసీ చూసీ సెల్లో గడిపీ గడిపీ తను గాఢనిద్రలో ఉండగా లేపి రమ్మన్నా నిద్ర కళ్లతో అయినా సరే రావాలి. కాని నాకు మూడ్ లేనప్పుడు పిలవకూడదు. తనకు కావాలను కున్నప్పుడు పిలవకూడదు. అలా చేస్తే నాకు చాలా చెడ్డ కోపం వస్తుందని గ్రహించి మసలుకునే భార్య నాకు కావాలి.సరే. నాకు చదువు అయిపోయింది. ఉద్యోగం వచ్చేసింది. డబ్బులొస్తున్నాయ్. ఇక నోర్మూసుకుని ఇంట్లో కూచో... నన్నూ పిల్లలను చూసుకో అనంటే అలాగేనండీ అని పల్లెత్తు మాట అనని భార్య కావాలి. సరేనబ్బా. ఇది కూడా చెప్పేస్తా. ఇన్‌కేస్ నాకు ఈ భార్య కంటే ఇంకో మంచి భార్య కాదగ్గ అమ్మాయి కనిపించిందనుకోండి.. ఈమెను వదిలిపెట్టి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించా లనుకున్నాననుకోండి... అప్పుడు ఎల్లెల్లవో అని ఇంటి నుంచి పంపేస్తే డివోర్స్ ఇచ్చేస్తే నా కొత్త జీవితం కోసం పిల్లలను తీసుకుని కిక్కురు మనకుండా నిష్క్రమించే ఉత్తమురాలైన భార్య నాకు కావాలి.భార్య వల్ల ఇన్ని సౌలభ్యాలు ఉండగా భార్యను మీరు వద్దంటారా? నేను వద్దంటానా? చెప్పండి. కథ ముగిసింది. అమెరికన్ స్త్రీ హక్కుల కార్యకర్త జూడీ బ్రాడీ రాసిన వ్యంగ్య రచన ఇది. 1971లో చేసిన ఈ రచన అప్పటి నుంచి కొన్ని వందలసార్లు పత్రికలలో ప్రచురితం అవుతూనే ఉంది. నేటికీ ప్రాసంగికత కలిగి ఉంది. ‘ఇంటికి వెళ్లి ఏ సంగతీ ఉత్తరం రాస్తాం’ అనే మాటకు మించిన హింసాత్మకమైన మాట ఉందా? ఎస్ చెప్పాల్సింది మగపెళ్లివాళ్లు. ఎగిరి గంతెయ్యాల్సింది ఆడపెళ్లివాళ్లు. షరతులు చెప్పాల్సింది అబ్బాయి. ఓకే చెప్పాల్సింది అమ్మాయి. పెళ్లయ్యాక వేధించాల్సింది అబ్బాయి వేదన పడాల్సింది అమ్మాయి. ద్వంద్వ ప్రమాణాలు పేరుకుపోయిన వ్యవస్థ పెళ్లి. అందులో ఏ శ్రమ చట్టం లేని కార్మికురాలు భార్య. ఈ అసంఘటిత వర్గం ఏకమైతే యజమాని పరిస్థితి ఏమిటో. -
పిచ్చి రాతల డాక్టర్
మనం కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు మన గుర్తుగా అక్కడున్న ఏదైనా రాళ్లపై కానీ చెట్టుపై కానీ మన పేర్లు రాసుకుంటాం. ఇది చాలా మంది చేసే పనే. అయితే ఈ అలవాటు డాక్టర్లకు ఉంటే..! ఏం చేస్తారు వాళ్లు కూడా ఏదైనా చెట్టునో రాయినో చూసుకుని పేరు రాసేస్తారని అనుకుంటున్నారా..? అయితే ఓ డాక్టర్ మాత్రం మీ అంచనాలను తలకిందులు చేసి ఓ రోగి కాలేయంపై పేరు రాసుకున్నాడు..! ఒక్కరిపై కాదు ఇద్దరు రోగుల కాలేయాలపై..! బ్రిటన్‌కు చెందిన సైమన్ బ్రమ్హాల్ ప్రముఖ శస్త్రచికిత్స నిపుణుడు. 2013లో ఓ మహిళ, ఓ పురుషుడికి కాలేయ మార్పిడి ఆపరేషన్ చేశాడు. అంతటితో ఆగకుండా వారి కాలేయాలపై తన పేరును సంక్షిప్తంగా ‘ఎస్బీ’ అని రాసుకున్నాడు. ఆపరేషన్ చేసేటప్పుడు బ్లీడింగ్ జరగకుండా వాడే ఆర్గాన్ కాంతి కిరణాల ద్వారా ఈ పేరును రాసుకున్నాడు. తర్వాత ఆ మహిళకు మరో ఆపరేషన్ చేసిన ఇంకో డాక్టర్ ఈ విషయాన్ని గుర్తించడంతో బయటికి పొక్కింది. ఈ నేపథ్యంలో సైమన్‌పై కేసు నమోదు కావడంతో కోర్టు ముందు దోషిగా నిలుచున్నాడు.. -
చేతిరాత..భవితకు బాట
పరీక్షల్లో ఆకట్టుకునే అక్షరాలు మార్కులు పెరిగే అవకాశం రాయవరం : అక్షరాలు కంటికి ఇంపుగా కనిపించేలా ఉండాలి. అందమైన దస్తూరి చూసేవారిని ఆకట్టుకుంటుంది. జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే వారి మనస్సును హత్తుకునేలా ఉంటే మార్కులు వేసేలా ప్రేరేపిస్తుంది. అదే పరీక్షల్లో విజేతగా నిలుపుతుంది. మరో రెండు రోజుల్లో పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల్లో అక్షరాలను ముత్యాల్లా రాసే వారు పరీక్షల్లో 20 శాతం అధిక మార్కుల సాధనతో పాటు వారి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమాధానాలు రాయడంపై సూచనలు పాటిస్తే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. అక్షరాలను రాయాలిలా.. పేజీకి పై భాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచి పెట్టి రాయాలి. పేజీకి కుడివైపు అర అంగుళం ఖాళీ విడిచి పెట్టి రాయవాలి. ఇలా ఉంటే మూల్యాంకన సమయంలో ఉపాధ్యాయునికి జవాబులు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని స్కూళ్లలో విద్యార్థులు గీతల పేజీల నోట్‌బుక్‌లో జవాబులు రాస్తుంటారు. పరీక్షల్లో మాత్రం గీతల్లేని పేపర్లపై రాయాల్సి ఉంటుంది. అలాంటి విద్యార్థులు తెలుపు కాగితాలపై సాధన చేయాలి. జవాబుల్లో ఏదైనా ముఖ్యమైన పదాలు ఉంటే వాటి కింద నల్లటి పెన్సిల్‌తో గీతగీయాలి. విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం అచ్చు పుస్తకాలు ఇవ్వకుండా ముఖ్యమైన సమాధానాలను చేతితో రాయించాలి. జవాబు పత్రంలో వేసే బొమ్మల్లోని భాగాన్ని ఒకవైపు సరళరేఖలను గీసి భాగాల పేర్లు రాస్తే మేలు. లేదా వాటి నంబర్లు ఇచ్చి ఒకవైపు రాయాలి. పరీక్ష పత్రంతో ప్రశ్నలు సెక్షన్ల వారీగా ఉంటాయి. ఇచ్చిన సమయాన్ని భాగాలుగా విడగొట్టి ఆ సమయంలోనే జవాబులు రాయడం పూర్తిచేయాలి. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినవి.. జవాబు రాసే తీరు పరీక్ష పేపరు దిద్దడానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. సమాధానాలు టీచరుకు తెలుసునని గుర్తించాలి. జవాబు పత్రం ఆకట్టుకోవాలంటే పేజీకి 18–19లైన్లకు మించకూడదు. జవాబు పత్రంలోని తొలి లైన్ రాసే సమయంలో మార్జిన్ లైన్‌ను చూస్తూ సమాంతరంగా రాయకపోతే మిగిలిన లైన్లు వంకర్లు తిరుగుతాయి. గీత చివరి వరకు రాస్తూ చివరికి వెళ్లగానే అక్కడ సగం పదంగానీ, మరో సగాన్ని కిందలైన్లో రాస్తుంటారు. దీంతో దిద్దే వారికి ఆ పూర్తి పదం ఏమిటో అర్థం కాదు. పదం పూర్తిగా రాయాలి. ప్రశ్నపత్రంలో బాగా ఒత్తిపట్టి మరీ రాస్తే రెండో వైపు అక్షరాలు కన్పిస్తూ గందరగోళం మారుతుంది. కొద్ది సేపు రాయగానే వేళ్లు నొప్పి పుడతాయి. అందుకే తేలికగా అందంగా రాయాలి. అంకెలు రాసేటప్పుడు స్పష్టత లేకపోతే ఉపాధ్యాయుడు అర్థం చేసుకోలేక మార్కులు వేయరు. సామాన్యశాస్త్రంలో బొమ్మల్ని గీస్తే ఆ చిత్రంలోని భాగాన్ని గుర్తించడంలో ఒక క్రమపద్ధతి పాటించాలి. పాయింట్ల వారీగా... పరీక్షల్లో రాసే అక్షరాలు అర్థమయ్యేలా ఉంటే మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడు ముగ్దుడై మార్కులు వేస్తాడు. లేదంటే వెనకడుతారు. సమాధానాల్లో దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి. సంగ్రహ ప్రశ్నలకు సమాధానాలు సులభంగా రాయాలి. ఇచ్చి ప్రశ్నలను పూర్తిగా అర్థం చేసుకుని రాయాలి. స్టోరీ రైటప్‌లో మంచి మార్కులు సాధించాలంటే ఇచ్చిన హింట్‌ను బాగా చదివి అర్థం చేసుకుని రాయాలి. ప్రశ్నలకు జవాబులు పాయింట్ల వారీగా రాస్తే మార్కులు బాగా వస్తాయి. జవాబులకు మధ్యలో ఉప శీర్షికలు పెట్టాలి. ముఖ్య విషయాలను అండర్లైన్ వేసుకోవాలి. బిట్‌పేపరు రాసే సమయంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. -
నేల‘రాత’లకు స్వస్తి
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు అన్ని కేంద్రాల్లోనూ ఫర్నీచరు ఏర్పాటు అక్రమాలకు పాల్పడితే జైలుకే 25 యాక్ట్ పక్కాగా అమలు జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ ‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నాం.. ఇకపై నేల ‘రాత’లకు స్వస్తి పలకనున్నాం. ఈ ఏడాది విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించనున్నాం. ఫర్నీచరు సదుపాయంపై ప్రత్యేక ప్రాధాన్యత తీసుకున్నాం.. ఇప్పటికే విద్యాశాఖ కమిషనరు, జిల్లా కలెక్టర్, ఆర్జేడీ తదితర అధికారులు పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని జిల్లా విద్యాశాఖాధికారి పగడాల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క పరీక్ష కేంద్రంలోనూ విద్యార్థులు కింద కూర్చొని పరీక్ష రాయకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేసినట్లు ఆయన ‘సాక్షి’ కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 193 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 49,555 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సాక్షి : చాలా కేంద్రాల్లో ఫర్నీచర్ సమస్య ఉంది. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు? డీఈఓ : ఫర్నీచరు కొరత వాస్తవమే కొన్ని కేంద్రాల్లో ఫర్నీచర్ అసలే లేదు. అలాంటి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల నుంచి సర్దుబాటు చేస్తున్నాం. పరీక్ష ప్రారంభమయ్యే నాటికి ఏ ఒక్క కేంద్రంలోనూ సమస్య ఉత్పన్నం కాదు. సాక్షి : దూర ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలకు చేరుకోవాలంటే రవాణా సౌకర్యం సరిగా లేదు. విద్యార్థుల సమస్యలపై మీరేమంటారు? డీఈఓ : ఈ విషయంలో ఆర్టీసీ అధికారులకు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏ కేంద్రానికి ఏఏ గ్రామాల నుంచి విద్యార్థులు వస్తారనే వివరాలు ఆర్టీసీ అధికారులు తీసుకున్నారు. విద్యార్థులకు అనుకూలంగా ఆయా రూట్లలో బస్సులు నడుపుతారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాక్షి : సీఓలు, డీఓలు, ఇన్విజిలేషన్ డ్యూటీలు పూర్తయ్యాయా? డీఈఓ : చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించాం. అవసరం కంటే కూడా పది శాతం అదనంగా నియమించాం. వివరాలను హైదరాబాద్‌కు పంపాం. ఇన్విజిలేటర్ల నియామకాలు పూర్తయ్యాయి. సెంటర్ కాపీలు, వ్యక్తిగత కాపీలు ఆయా ఎంఈఓలకు అందజేశాం. పరీక్ష ముందురోజు వారికి అందజేస్తారు. విధులకు నియమించిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా పని చేయాల్సిందే. నియామక ఉత్తర్వులను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయం. సాక్షి : మాస్ కాపీయింగ్, చూచిరాతను నియంత్రిస్తారా? డీఈఓ : ఈ విషయంలో ప్రభుత్వం ఈసారి చాలా సీరియస్‌గా ఉంది. పరీక్షల విధుల్లో ఉన్న ఏ స్థాయివారైనా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే జైలుకు పంపడం ఖాయం. ఇంతకాలమూ పరీక్షల విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిని సస్పెండ్ చేయడం.. లేదంటే పరీక్షల విధుల నుంచి తప్పించడం.. మహా అయితే ఇంక్రిమెంట్లలో కోత విధించడం వంటి చర్యలు ఉండేవి. ఈసారి అలాకాదు..1997 నాటి యాక్ట్ 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేయనున్నాం. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదుతో పాటు ఆర్నెళ్ల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.5 వేలు నుంచి రూ. లక్ష వరకు జరిమానా ఉంటుంది. సాక్షి : డీఈఓ స్థాయిలో తొలిసారి ‘పది’ పరీక్షలు నిర్వహిస్తున్నారు కదా? ఎలాంటి అనుభూతి ఉంది? డీఈఓ : డిప్యూటీ డీఈఓగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనేకమార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణలో పాలుపంచుకున్నాను. ఆ అనుభవం చాలా ఉపయోగపడుతోంది. అందరి సహకారంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూస్తాననే నమ్మకం ఉంది. సాక్షి : గతేడాది జిల్లాలో మంచి ఫలితాలొచ్చాయి. ఈసారి ఎలా ఎలాంటి ఫలితాలు వస్తాయి? డీఈఓ : గతేడాదికంటే ఈసారి మెరుగైనా ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉంది. ఎందుకంటే తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమలవుతోంది. దీనిపై విషయ నిపుణులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు విస్త్రత అవగాహన కల్పించారు. అది చాలా ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది. -
రచనలు అపోహలు కలిగించేలా ఉండొద్దు
* రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసేలా జర్నలిస్టుల రచనలు ఉండాలి: సీఎం * తెలంగాణ ఉద్యమానికి విద్యుత్ సమస్యే బీజం వేసింది * అమర్ ‘డేట్లైన్ హైదరాబాద్’ వ్యాసాల సంకలనాన్ని ఆవిష్కరించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ పురోభివృద్ధికి దోహదం చేసేలా జర్నలిస్టుల రచనలు సాగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. అపోహలు కలిగించే విధంగా రచనలు ఉండకూడదని, అభివృద్ధికి నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా ఉండాలన్నారు. కొన్ని వార్తలు బాధ కలిగిస్తున్నాయని, నిజాలు విశ్లేషిస్తే బాగుటుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై వచ్చిన విశ్లేషణలను ప్రస్తావిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. గురువారం రవీంద్రభారతిలో సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ‘డేట్లైన్ హైదరాబాద్’ శీర్షికతో రాసిన వ్యాసాల సంకలనాన్ని సీఎం ఆవిష్కరించారు. జర్నలిజంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ప్రజాతంత్ర’ పత్రిక 18వ వార్షికోత్సవ కార్యక్రమంలో అమర్ ఈ సంకలనాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ.. అమర్ రాసిన పుస్తకం గొప్పగా ఉందని, తనను విమర్శిస్తూ రాసిన పుస్తకాన్ని తానే ఆవిష్కరించానని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి విద్యుత్ సమస్యే బీజం వేసిందని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చే కరెంటు శ్లాబ్ రేటును రూ.18 నుంచి రూ.35కు పెంచటంపై అప్పటి సీఎం చంద్రబాబుకు లేఖ రాశానని, ఇదే ఉద్యమానికి నాంది ప్రస్తావన అయిందన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ఏడాది ముందు మూడున్నర వేల గంటలపాటు తెలంగాణ ఉద్యమంపై మేధోమథనం జరిపినట్లు సీఎం చెప్పారు. ఈ సందర్భంగా పలు ఛలోక్తులతో అప్పటి కరెంటు సమస్యతోపాటు ట్రాన్స్ఫార్మర్లు పొందటానికి రైతులు పడిన ఇబ్బందులను సీఎం వివరించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతిరోజూ సీనియర్ పాత్రికేయులతోపాటు 100 నుంచి 150 మంది ప్రముఖలతో చర్చించిన పలు అంశాలను గుర్తుచేశారు. ఉద్యమ కాలంలో ప్రజాతంత్ర పత్రిక రాసిన పలు అంశాలను సీఎం ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ... ‘డేట్లైన్ హైదరాబాద్’ అందరూ చదవదగిన పుస్తకం అన్నారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. పత్రిక, టీవీ, ఉద్యమం, ఆంగ్లంలో జర్నలిస్టుగా అమర్ విజయం సాధించారన్నారు. ప్రజాహితం కోరి అమర్ ముక్కుసూటిగా రచనలు చేశార న్నారు. ఏ వ్యాఖ్య చేసినా ధర్మబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి చేయాల్సి ఉంటుందన్నారు. నిజాయితీ గల చరిత్రకారుడుగా చెప్పినట్లుగా అమర్ వ్యాసాలున్నాయని కొనియాడారు. మన తెలంగాణ ఎడిటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ పుస్తకం జర్నలిస్టులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అమర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 2,500 మంది జర్నలిస్టుల ఇళ్ల కోసం సీఎం 100 ఎకరాలు ఇవ్వడాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. సభలో ముఖ్య అతిథులకు అమర్, ఆయన సోదరులు ఘనంగా సన్మానించారు. అనంతరం అమర్‌ను హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు సత్కరించారు. -
‘రాత’ బాగలేకపోయినా... శైలి బాగుండాలి
ఎగ్జామ్ టిప్స్ ⇒ కనీసం రెండు కాపీల హాల్‌టికెట్స్ రెడీ చేసుకోవాలి. హాల్‌టికెట్‌తో పాటు పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్... వంటివి సరైన రీతిలో సిద్ధం చేసుకోవాలి. పరీక్ష హాల్లో ఏదీ ఎవరినీ అడిగే పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలి. ⇒ జవాబులు రాయడంలో నాణ్యమైన శైలిని ప్రదర్శించడం ముఖ్యం. అవసరమైనంత మార్జిన్లు వదలడం, ప్రశ్నల నంబర్లు సరిగా రాయడం, ప్రతి ప్రశ్న-సమాధానానికి మధ్యలో తగినంత స్థలం వదలడం, సబ్ హెడ్డింగ్స్‌కు, ముఖ్యమైన నిర్వచనాలకు అండర్లైన్ చేయడం మీ జవాబు పత్రాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతుంది. మీ చేతిరాత అంత అందంగా లేకపోయినప్పటికీ పై జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఆ లోపం చాలా వరకూ కనుమరుగవుతుంది. ⇒ అండర్ లైన్ చేయడానికి రెడ్ ఇంక్ వినియోగించవద్దు. మరేదైనా కలర్ ఫర్వాలేదు. తప్పులు గుర్తించడానికి, మార్కులు ఇవ్వడానికి ఎగ్జామినర్ రెడ్ ఇంక్ వినియోగిస్తారు. కాబట్టి విద్యార్థులు రెడ్ ఇంక్ వాడకూడదు. ⇒ విద్యావిధానంలో పరీక్షలనేవి ఒక భాగం. వీటి పట్ల సానుకూల దృక్పథం పెంచుకుంటే మీలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ⇒ ఈ సమయంలో కొంత మంది స్నేహితులు అప్రధానమైన అంశాలను ప్రస్తావించి మీలో భయాన్ని రేకెత్తించే ప్రయత్నం చేయవచ్చు. వాటిని పట్టించుకోకండి. మీ మానసికస్థైర్యాన్ని వినియోగించుకుంటూ పెద్దలు, ఉపాధ్యాయుల సలహా సూచనల మేరకు కృషిచేయండి. ⇒ విద్యార్థులు ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. కేవలం నీళ్ళు మాత్రమే కాకుండా పండ్లు, జావ వంటివి తీసుకోవాలి. -
మాతృభాషను శ్వాసించిన మాననీయుడు!!
సందర్భం మాతృమూర్తి మీద ఎం త ప్రేమ ఉందో, మాతృ భాష మీద అంతే ప్రేమ ఉండేది శ్రీపాద సుబ్రహ్మ ణ్యశాస్త్రిగారికి. తన రచన ల ద్వారా స్త్రీలలో ఆలోచ నాశక్తిని పెంపొందించాల నే ఉద్దేశంతో మధ్యతరగ తి ఆడవాళ్లు ఇళ్లలో మాట్లా డుకునే భాషనే, తన రచనా భాషగా ఎంచుకున్నారా యన. హిందీని వ్యతిరేకించడంలో ఉద్దేశం ఆ భాష మీద కోపం కాదు. ఆ భాష వల్ల తెలుగుకి అపకారం జరుగుతోందనే! తమ ప్రబుద్ధాంధ్ర పద్యరచనలు పంపించవద్దన్నది వాటి మీద కోపంతో కాదు! వచ న రచనైతే ఎక్కువ మందికి చేరుతుందనే అభి లాషతో! సంస్కృతాంధ్రాలు తప్ప ఆయనకి పాశ్చా త్య భాషలతో సంబంధం లేకపోవడం మన అదృ ష్టం. అందుకే చక్కటి, చిక్కటి తెలుగు సాహిత్యాన్ని అందించారు. ‘తెలుగువాళ్లకు మాత్రమే శ్రీపాద రచనలు చదివే అదృష్టం’ ఉంది అన్నారు మల్లాది రామకృష్ణశాస్త్రి. తెలుగు ఆప్యాయతలు తెలుసుకోవా లన్నా ఆయన రచనలే ఆధారాలు అన్నారు. ‘కొత్త చూపు’ చిన్న కథ నిజంగా మనకు కొత్త చూపును కలిగిస్తుంది. ఆ కథలో మగపెళ్లివారు ఆడ పెళ్లివారిని రకరకాల కోరికలు కోరుతారు. ఆడపెళ్లి వారు అన్నింటికీ అంగీకరిస్తారు. అప్పు డు పెళ్లికూతురు అన్నపూర్ణ ఏమని ప్రశ్నిస్తుందంటే, ‘నాకు జవాబు చెప్పం డి. ఉత్తర భారత భూముల్లో మన వాళ్లెందరికో అలాంటిది తటస్థపడుతోంది. తెలుగు స్త్రీలకిది చావుబతుకుల సమస్య. మేమిది చూసీ చూడకుండా విడిచి పెట్టడానికి వల్లకాదు. మరి మీ కళ్ల ఎదుట మీఆత్మీయులకున్నూ అలాంటిదే తట స్థపడితే, తరవాత మాట ఏదయినా ముందు కళ్లు మూసుకుని శత్రువుల మీద పడగలరా?’ అంతేకాదు, అన్నపూర్ణ ‘తెనుగు కన్యలం మేమి ప్పుడు చూసుకోవలిసిన సరియోగ్యత చక్కదనం కాదు. చదువూ కాదు. ఐశ్వర్యం అసలు కానేకాదు. ఇవన్నీ తెనుగు యువతిని బానిసను చేశాయి’ అంటుంది. వారు ఎంతటి స్త్రీ పక్షపాతో తెలుసుకోవ డానికి ఈ రెండు విషయాలు చాలు. ఆయనకు వీరేశలింగం పంతులు గారంటే వల్ల మాలిన అభిమానం. తన ‘అరికాళ్ల కింద మంటలు’ రచనలో కం దుకూరి సంస్కరణకు అక్షర ప్రోత్సాహ మిచ్చారు. పుట్టింటిలోని బాధల్ని భరిం చలేక ఒక వితంతువు రాత్రిపూట ఇంటి బయటికొచ్చి జట్కా అతడితో కందు కూరి ఉంటున్న తోటకు వెళ్లాలని చెబు తుంది. తల చెడిన తన కూతురుకు పంతులు గారు పునర్జన్మ ఇచ్చారన్న కృతజ్ఞతతో, అక్కడికి వెళ్లడానికి తనకేమీ ఇవ్వవద్దంటాడతను. పైగా నీకూ ఆయన దగ్గర మేలు జరుగుతుందని హామీ ఇస్తాడు. వీరేశ లింగంనే పాత్రగా చేసి రచనలు చేశారు శ్రీపాద. ‘కలుపు మొక్కలు,’ ‘జూనియర్ కాదు అల్లుడు,’ ‘జాగ్రత్తపడవలసిన ఘట్టాలు,’ ‘తులసి మొక్క’ వంటి శాస్త్రిగారి కథలు స్త్రీకి మంచి భవిష్యత్తు కోరు తూ రాసినవే. ఆయన దిగిన ఫొటోలో భార్య కూర్చు ని ఉండటం, ఆయన నిల్చుని ఉండటమే ఆయన సంస్కరణకి తార్కాణం. స్త్రీల పట్ల ఇంతటి అభిమా నం పెంచుకోవడానికి తల్లీ, భార్యే కారణం. శ్రీపాదవారికి తల్లి అంటే దేవత కంటే ఎక్కువ అభిమానం. ఎందుకంటే వైదిక విద్యను వ్యతి రేకించడంతో ఎన్నోసార్లు తండ్రి ఆగ్రహానికి గురైతే తల్లి అనేక విధాలా సహకరించి, కల్లోల సమయంలో కూడా ఆయన కవితా సాధనకి బలం చేకూర్చారు. ఇక భార్య సంగతి చెప్పనే అక్కరలేదు. జీవిత చరమాంకంలో మిత్రుడు పురిపండా వారికి ఉత్తరం రాస్తూ ‘నా భార్య నన్ను అనేక విధా లా కాపాడింది. చిన్నప్పట్నుండి దాన్ని కష్టపెట్టాను, సుఖపెట్టలేకపోయాను, ఈ అంతిమ దశలో ఇక ఆ ఊసే లేదు కదా... సాపు చేసిన నా రచనలన్నింటినీ ఏదో ఒక ధరకు అమ్మేసి నాగేశ్వరరావు గారికి బాకీ ఉన్న రూ. 4 వేల చిల్లర ఇచ్చేసి, అదనంగా ఏమన్నా మిగిలితే దానిని నా భార్యకివ్వండి. నా కుటుంబం చెట్టుకింద ఉంది..’ అంటూ బాధపడ్డారు. తెలుగు భాషా సాహిత్యాలకి ఎన్నో సేవలు అం దించిన ఆ మహనీయుడి చివరి ఘడియలు అలా గడిచాయంటే తెలుగు భాషా సాహిత్యాభిమానులం దరం తలలు వంచుకోవలసిందే! (నేడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 124వ జయంతి) (వ్యాసకర్త రచయిత, విమర్శకుడు మొబైల్: 9391343916) డా. వేదగిరి రాంబాబు -
ఆ నవల మిగిల్చిన అనుభవం పులుపు...
తీపి: తీపి అనగానే నాకు వెంటనే గుర్తొచ్చేది పోతన ‘భాగవతం’. ‘బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి ’... పోతన ప్రతి పద్యంలో ఒక లయ ఒక రుచి. చదవడం కూడా సులువు. తీపి అంటే నిస్సంకోచంగా పోతన భాగవతమే. పులుపు: నాకు సంబంధించినంత వరకు నా రచన ‘అనైతికం’. దీన్ని చాలా ఎక్స్పెక్ట్ చేసి రాశాను. స్త్రీవాదానికి సంబంధించినంత వరకు మంచి పీస్ అనుకున్నాను. కానీ అది స్త్రీవాదులని ముద్ర వేసుకున్నవాళ్లకే ఎక్కువ నచ్చలేదు. అది పాఠకులకు కూడా అంతగా ఎక్కలేదు కమర్షియల్‌గా. బట్ వన్ ఆఫ్ ది గుడ్ బుక్స్ యాజ్ ఫర్ యాజ్ మై వర్క్స్ ఆర్ కన్సర్న్డ్. ఈ పుస్తకం నాకు అనుభవం మిగిల్చిన పులుపుగా చెప్పుకోవచ్చు. వగరు: రామాయణ విషవృక్షం. నా వరకు నాకు రామాయణమంటే చాలా తాదాత్మ్యతతో కూడిన పుస్తకం. వాస్తవికత, ప్రస్తుతానికున్న సమాజానికి అది కరెక్టా కాదా ఇవన్నీ కాదు.. వాల్మీకి వర్ణనలు, అందులోని శిల్పం, శైలి, క్యారెక్టరైజేషన్.. దాన్ని కూడా రంధ్రాన్వేషణ చేసే రచయిత్రి... ఆ రచన.. నిజంగా వగరే! ఉప్పు: దీనికి ఒక పుస్తకం అని కాకుండా సమాజం మారాలి... సమాజం మారాలి అంటూ సాగే పుస్తకాలన్నీ ఉప్పే. మారాల్సింది సమాజం కాదు మనుషులు. మనుషులు మారాలంటే ఓ వ్యక్తిత్వం, ఓ సిన్సియారిటీ, బిలాంగింగ్‌నెస్, జీవితంపట్ల ఒక అవగాహన... ఇవన్నీ ఉంటే సమాజం దానంతటదే మారుతుంది. అలా కాకుండా తమ కష్టాలన్నిటికీ సమాజాన్ని నిందిస్తూ, తమ రచనలన్నిట్లో సమాజాన్ని తిట్టే పుస్తకాలు అవసరమేమో కానీ పాఠకులను ఎందుకొచ్చిందిరా భగవంతుడా అని అనుకునే స్టేజ్‌కి తీసుకెళ్లే అలాంటి రచనలన్నీ నాకు ఉప్పు కిందే లెక్క. కారం: త్రిపురనేని గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’, ‘మెరుపుల మరకలు’, కొడవటిగంటి ‘చదువు, రంగనాయకమ్మ ‘బలిపీఠం’... ఇవన్నీ కారం కిందే లెక్క. ఇవన్నీ చదువుతుంటే ఇదంతా నిజం కదా అనిపిస్తుంది కానీ ఒరకమైన మంట కూడా ఉంటుంది. తొందరగా జీర్ణమవ్వవు. అలాగని అవి లేకపోతే చప్పగా ఉంటుంది. చేదు: ఇటీవల ఒక రచయిత రాస్తున్నాడు... తన స్నేహితుల్లో ఉండే వ్యసనాలు, చెడు గుణాలను వాళ్ల పేర్లు పెట్టి రాస్తున్నాడు. వాళ్లలో కొంతమంది చచ్చిపోయారు కూడా. ఆ రచయిత, ఆ పుస్తకం పేరు చెప్పడం కూడా చేదు. ముక్తాయింపు: ఏ భాషలోనూ లేని సొగసు తెలుగుది. నాకు తెలిసినంతలో తెలుగులో తప్ప మరే భాషలోనూ ‘పద్యం’ లేదు. నలభై పైగా అక్షరాలతో, ఇరవై పైగా వత్తుల సపోర్ట్‌తో, పదిగుణింతాల కలయికతో, మూడొందల పైగా కాంబినేషన్లతో, గణాల, యతుల, ప్రాసల, విభక్తుల, చందస్సుల అల్లికతో, సమాసాలకారంతో, సంధుల తీపితో.. అందుకే ఓయమ్మో.. తెలుగంత గిలిగింత తనువంత పులకింత జగమంతా వెతికినా కనపడదు. అదొక ఉగాది పచ్చడి! - యండమూరి వీరేంద్రనాథ్ సేకరణ: రమా సరస్వతి -
కొద్దిగా తీరిక చిక్కాకే... అవన్నీ!
‘‘సంగీతం, రచన... ఈ రెండింటికీ వయసుతో సంబంధం లేదు. మనసులో ఇష్టం, ఆలోచనల్లో కొత్తదనం ఉంటే చాలు. ఏ వయసులోనైనా ఇవి చేయొచ్చు’’ అని శ్రుతీహాసన్ అంటున్నారు. కొన్ని ఆల్బమ్స్‌కి సంగీతం సమకూర్చడంతో పాటు, పాటలు కూడా పాడారామె. శ్రుతి పాటలు, కవితలు కూడా రాస్తుంటారు. కథా నాయికగా చేయాలంటే చాలామంది మీద ఆధారపడాల్సి ఉంటుందనీ, కానీ సంగీతం, రచనలకు ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదనీ శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘కథానాయికగా ఓ పాత్రలో ఒదిగిపోవాలంటే, మేకప్‌మ్యాన్ చేసే మేకప్, హెయిర్ స్టయిలిస్ట్ చేసే కేశాలంకరణ చాలా ముఖ్యం. అలాగే, పాత్రకు తగ్గట్టు కాస్ట్యూమ్ డిజైనర్ సెలక్ట్ చేసే డ్రెస్ వేసుకోవాలి. ఆ తర్వాత డెరైక్టర్ చెప్పినట్లు చేస్తే, కెమెరామ్యాన్ చిత్రీకరిస్తారు. తెరపై కనిపించాలటే ఇంతమంది మీద ఆధారపడాలి. అదేగనక కథలూ, కవితలూ రాయాలనుకోండి... మన బుర్ర, కొన్ని కాగితాలు, కలం చాలు. ట్యూన్స్ తయారు చేయాలన్నా అంతే! సంగీత పరికరాలుంటే మనకు నచ్చిన ట్యూన్ రెడీ చేసుకోవచ్చు. అదే నాయిక పాత్రలనుకోండి... కొన్నేళ్ల తర్వాత చేయలేం. అది తెలుసు కాబట్టే, ఇప్పుడు బిజీగా సినిమాలు చేస్తున్నాను. కొంచెం తీరిక చిక్కాక సంగీతం, రచనలపై దృష్టి సారిస్తా’’ అన్నారు. -
పాట వెనుక కథ 5th Oct 2014
-
పాట వెనుక కథ 28th Sept 2014
-
పాట వెనుక కథ 20th Sept 2014
-
పాట వెనుక కథ 13th Sept 2014
-
పాట వెనుక కథ - వెన్నెలకంటి
-
అక్షరం నేర్పని సాక్షరం
జోగిపేట: సాక్షర భారత్ పథకానికి 2010లో శ్రీకారం చుట్టారు. మండలంలోని 21 గ్రామాలకు గాను కోఆర్డినేటర్లను నియమించి, సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలని బాధ్యతలను అప్పగించారు. దీనికోసం గ్రామ కో ఆర్డినేటర్లకు ప్రభుత్వం నుంచి నెలకు రూ.2వేల వేతనం అందుతోంది. వీరందరినీ సమన్వయపరచడానికి మండల కో ఆర్డినేటర్‌ను నియమించి రూ.5వేల వేతనం చెల్లిస్తోంది. వీరంతా కలిసి నిరక్షరాస్యులైన మహిళలు, పురుషులకు ఉదయం, సాయంత్రం వేళలో చదవడం, రాయడం నేర్పించాలి. కానీ ‘అసలు సెంటర్లు తెరుచుకుంటే కదా.. అక్షరాలు నేర్పేది’ అని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి సరిగ్గా నడుస్తున్నాయో.. లేదో..? అనే విషయాన్ని మండల కో ఆర్డినేటర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంసీఓలు తనిఖీకి వచ్చినప్పుడు పంచాయతీ రిజిస్టర్లో సంతకం పెట్టాలి. కానీ వీరు ఇవేమీ ఖాతరు చేయడం లేదు. ఇది వీసీఓలకు అలుసుగా మారింది. పలు గ్రామాల్లో కనీసం సాక్షర భారత్ కేంద్రం బోర్డు కూడా ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. గత ఏడాది నవంబర్ మాసంలో ప్రార ంభమైన నాలుగో దశ ఈ సంవత్సరం మే నెలతో ముగిసింది. ప్రస్తుతం ఐదో దశ కొనసాగుతోంది. గ్రామ కోఆర్డినేటర్లకు నెల నెల సమావేశాలు నిర్వహించి ఎంత మంది వయోజనులు వస్తున్నారో తెలుసుకుని మండల కో ఆర్డినేటర్లు బోధనకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. కేంద్రాల్లో కనిపించని మెటీరియల్... మండలంలోని ఆయా గ్రామాల్లో గల సాక్షర భారత్ కేంద్రాల్లో ప్రభుత్వం సరఫరా చేసిన మెటీరియల్ పక్కదారి పట్టినట్లు ఆరోపణలున్నాయి. కుర్చీలు, క్యారం బోర్డులు, చెస్, కైలాసం, కార్పేట్లు ఇతర ఆట వస్తువులు చాలా కేంద్రాల్లో కనిపించడంలేదు. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కేంద్రాల్లో దినపత్రికల జాడ లేకుండా పోయింది. వీటికి మాత్రం నెలనెలా బిల్లు చెల్లిస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సెంటర్లు కొనసాగేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.