కొన్ని నాటకాలు మన జీవితాల్లో నుంచే నడిచొస్తాయి. మన జీవితాన్ని కొత్తగా చూపుతాయి. ఆలోచనలకు పదును పెడతాయి. ఆల్–ఉమెన్ బృందం ‘దేఖ్ బహెన్’ అచ్చంగా అలాంటి నాటకమే!
తల్లి, కూతురు, భార్య, సోదరి, ప్రియురాలు... ఇలా రకరకాల పాత్రలలో ఉన్న మహిళలకు సంబంధించిన నాటకం దేఖ్ బహెన్. ఎనభై నిమిషాల నిడివిగల ఈ ఆల్–ఉమెన్ ప్లే రకరకాల మహిళలకు సంబంధించి రకరకాల భావోద్వేగాల సమ్మేళం. జీవితంలోని తీపి, చేదుల కలయిక. అస్త అరోర, ప్రీతి చావ్లా, ప్రేరణ చావ్లా, శిఖా తల్పానియా, తహీరనాథ్ కృష్ణన్ ఈ నాటకంలో నటించారు.
‘రచన అనేది సులువైన పనేమీ కాదు. కత్తి మీద సాము. కొన్నిసార్లు మనతో మనమే పోరాడవలసి ఉంటుంది. ఇది కఠినమైన ప్రయాణమే అయినప్పటికీ మంచి అనుభూతిని కలిగించే ప్రయాణం. ఎన్నో విలువైన జ్ఞాపకాలను పదిలంగా భద్రపరుచుకునే ప్రయాణం’ అంటుంది ప్లే రైటర్ దిల్‌షాద్ ఎడిబమ్ ఖురానా. నాటక రచనలో ఖురానాకు కో–రైటర్ తహీరనాథ్ క్రిష్ణన్ సహకరించారు.
ఈ ఆప్తమిత్రులు నాటకరచన సమయంలో కొన్నిసార్లు ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకుంటారు. అలా అని మొండిగా వ్యవహరించరు. ఒకరి కాన్సెప్ట్ మరొకరికి నచ్చితే మళ్లీ ఆప్తమిత్రులు అవుతారు.‘నాటక రచనలో ఇద్దరు వ్యక్తులు పాలుపంచుకున్నప్పుడు వాదోపవాదాలు సహజమే. అలా ఉంటేనే నాటకం బలంగా వస్తుంది. కొన్ని విషయాల్లో మా ఇద్దరి ఆలోచనల్లో తేడా ఉన్నప్పటికీ అనేక విషయాల్లో మేము ఒకేలా ఆలోచిస్తాం. ఇదే మా బలం’ అని కో–రైటర్ తహీరనాథ్ క్రిష్ణన్ గురించి చెబుతుంది దిల్‌షాద్.
‘మహిళల బృందానికి సంబంధించిన నాటకం ఇది. నేల విడిచి సాము చేయని నాటకం. హృదయానికి దగ్గరయ్యే నాటకం. రంగస్థలంపై కనిపించే దృశ్యాలు మనల్ని నిజజీవిత దృశ్యాలతో మమేకమయ్యేలా చేస్తాయి. కొత్తగా ఆలోచించేలా చేస్తాయి. అతి నాటకీయత లేకుండా డైలాగులు సహజంగా ఉంటాయి’ అంటుంది కో–రైటర్ తహీరనాథ్ కృష్ణన్.
ముంబైకి చెందిన ప్రేరణ చావ్లా ఈ నాటకానికి దర్శకత్వం వహించింది. ‘నన్ను సవాలు చేసే పనులను నెత్తికెత్తుకోవడం అంటే నాకు మొదటి నుంచి ఇష్టం. ఈ నాటకానికి డైరెక్టర్‌గా బాధ్యత తీసుకోవడం కూడా అలాంటిదే. టీమ్ నన్ను బలంగా నమ్మింది. ఆ నమ్మకమే నాకు మరింత బలాన్ని ఇచ్చింది. గొప్ప నటులతో పనిచేయాలనే నా కల దేఖ్ బహెన్ నాటకంతో నిజమైంది’
అంటుంది ప్రేరణ చావ్లా. నాటక రిహార్సెల్ కార్యక్రమాలు ముంబైలో మిలిటరీ క్రమశిక్షణ ప్రమాణాలతో సాగాయి. ‘మూస విధానంలో ఈ నాటకాన్ని రూపొందించలేదు. మహిళలకు సంబంధించిన అన్ని కోణాలను వ్యక్తీకరించే నాటకం ఇది’ అంటున్నారు నిర్మాత ఆకర్ష్. ఆకర్ష్ తప్ప ఈ నాటకానికి సంబంధించిన దర్శకులు, సాంకేతిక నిపుణులు, డిజైనర్‌లు, నటులు అందరూ మహిళలే.
‘స్క్రిప్ట్ నచ్చిన తరువాత నాటకం విషయంలో జోక్యం చేసుకోలేదు. వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాను. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ నాటకం గొప్పగా వచ్చేలా చేశారు. ఈ నాటకం ద్వారా మేము ముందడుగు వేసినట్లుగా భావిస్తున్నాం’ అంటున్నాడు ఆకర్ష్.
Comments
Please login to add a commentAdd a comment