మనుషులకున్నదీ, ఇతర ప్రాణులకు లేనిదీ ఒక్క ఆలోచనాశక్తే కాదు, మాట కూడా! మాట శ్రుతిమించితే వివాదమవుతుంది, అతి అయితే వాచలత అవుతుంది, అదుపులో ఉంటే విజ్ఞతవుతుంది, రసాత్మకమైతే కవిత్వమవుతుంది, జనహితైషి అయిన ఒక మహనీయుని అంతరంగపు లోతుల్లోంచి ఉబికి వచ్చినప్పుడు అశేషజనావళిని కదిలించే మంత్రమవుతుంది.
మాట అనేది మంచి, చెడుల కలబోత, రెండంచుల కత్తి! మనిషిని మనుషుల్లోకి తెచ్చి సామాజికుణ్ణి చేసినదీ,సంభాషణకు ఉపక్రమింపజేసినదీ, ఆ సంభాషణ నుంచి సంఘటిత కార్యంవైపు నడిపించినదీ,అందుకు అవసరమైన వ్యవస్థల అభివృద్ధికి దోహదమైనదీ, మాటే. ఆ క్రమంలోనే మాటకు వ్యాక రణం పుట్టింది, ఉచితానుచితాలనే హద్దులు ఏర్పడ్డాయి, ఆ హద్దుల నుంచి నాగరికత వచ్చింది.
మనిషి చరిత్రలో ఇంతటి మహత్తర పాత్ర వహించిన మాట విలువ రానురాను పాతాళమట్టానికి పడిపోవడం నేటికాలపు విషాదం. ఏ రంగంలో చూసినా అసత్యాలు, అర్ధసత్యాల స్వైరవిహారం మాట విలువను దిగజార్చివేసింది.
దుస్సాధ్యమని చెప్పదలచుకున్నప్పుడు ‘మాటలు కా’దంటూ మాటను చులకన చేస్తాం. మన కన్నా ప్రాచీనులే మాటను ముత్యాలమూటగా నెత్తిన పెట్టుకుని గౌరవించారు. బహుముఖమైన దాని విలువను గుర్తించి మహత్తును ఆపాదించారు. దానినుంచే మాంత్రికత, వరాలు, శాపాలు పుట్టాయి.
మామూలు మాట కన్నా ముందు కవితాత్మక వాక్కు పుట్టిందని మానవ పరిణామ శాస్త్రవేత్తలు తేల్చారు. కొన్ని సమాజాల్లో మామూలు సంభాషణ కూడా కవితాత్మకంగా ఉండేదని ప్రముఖ పురాచరిత్ర అధ్యయనవేత్త జార్జి థామ్సన్ అంటూ, ఐరిష్ సమాజాన్ని ఉదహరిస్తాడు.
రాత వచ్చాకే మాట తలరాత మారింది. మాట మంచిని, మర్యాదను, పొదుపును, అర్థవంతతను పదే పదే బోధించే అవసరం తలెత్తింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కాలు జారితే తీసుకోగలం కానీ, మాట జారితే తీసుకోలేం, పెదవి దాటితే పృథివి దాటుతుంది –వంటి సామెతలు, నుడికారాలు, సూక్తులు ప్రతి వాఙ్మయంలోనూ కొల్లలు. ‘మనిషికి మాటే గొప్ప అలంకారం, మిగతా అలంకారాలన్నీ నశించిపోయేవే’నని హెచ్చరిస్తాడు భర్తృహరి.
మాటను అబద్ధంతో కలుషితం చేయడానికి నిరాకరించి రాజ్యాన్ని, ఆలుబిడ్డలను సైతం కోల్పోవడానికి హరిశ్చంద్రుడు సిద్ధపడ్డాడు. మహాత్మాగాంధీకి స్ఫూర్తినిచ్చిన కథలలో అదొకటి. గయుడు కృష్ణుని ఆగ్రహానికి గురైన సంగతి తెలియక రక్షిస్తానని అతనికి మాట ఇచ్చిన అర్జునుడు, దానిని నిల బెట్టుకోడానికి తన బహిఃప్రాణమైన కృష్ణునితోనే యుద్ధం చేశాడు.
లిఖిత సంప్రదాయం ఏర్పడని, లేదా పూర్తిగా వేళ్లూనుకొనని రోజుల్లో నోటిమాటగానే అన్ని వ్యవహారాలూ జరిగేవి. ఆర్థికమైన లావాదేవీలలో మాటే వేయి ప్రామిసరీ నోట్ల విలువను సంతరించుకునేది. అలెగ్జాండర్ దండయాత్ర కాలంలో మనదేశాన్ని సందర్శించిన ఒక గ్రీకు చరిత్రకారుడు, ఇక్కడ రుణసంబంధమైన అన్ని ఒప్పందాలూ నోటిమాటగా జరగడం చూసి ఆశ్చర్యపోయాడు.
పురాణ, ఇతిహాసాలలో మాట నిలకడతోపాటు, మాటసొంపుకు, నేర్పుకే ప్రాధాన్యం. రామాయణంలోని హనుమంతుడు అటువంటి సుగుణాలరాశి. రాముడికీ, సుగ్రీవుడికీ స్నేహసంధానం చేసింది అతనే. అతని వాక్చతురతను ఉగ్గడించడానికే కాబోలు, వ్యాకరణ పండితుణ్ణి చేశారు.
దాదాపు ప్రతి దేశమూ, ప్రతి ఇతర దేశంతోనూ పాటించే దౌత్యనీతికి మాటే గుండెకాయ. దౌత్యచతురత ఇప్పుడు ఒక ప్రత్యేకవిద్యగా అభివృద్ధి చెందింది. మహాభారతాన్నే చూస్తే, వివిధ సందర్భాలలో ద్రుపదుని పురోహితుడు, విదురుడు, సంజయుడు, కృష్ణుడు కురుపాండవుల మధ్య రాయబారం నెరిపారు. రాజనీతి కుశలతే కాక, అవతలి పక్షానికి సూటిగా తేటగా, ఎక్కువ తక్కు వలు కాకుండా సందేశాన్ని చేరవేసే మాటనేర్పే అందుకు వారి అర్హత.
ధృతరాష్ట్రునికి గాంధారి నిచ్చి పెళ్లి చేయాలన్న ప్రతిపాదనను భీష్ముడు ఒక మాటకారితోనే గాంధారరాజు సుబలుడికి పంపుతాడు. కుండిన నగరానికి వచ్చి రాక్షస పద్ధతిలో తనను ఎత్తుకెళ్లి వివాహమాడమన్న సందేశాన్ని అగ్నిద్యోతనుడనే పురోహితుని ద్వారా రుక్మిణి కృష్ణునికి పంపుతుంది. రాజ్యం కోల్పోయి అడవుల పాలైన తన భర్త నలుని జాడ కనిపెట్టడానికి దమయంతి, అతనికి మాత్రమే అర్థమయ్యే ఒక సందే శమిచ్చి దానిని సమర్థంగా అందించగల వ్యక్తినే పంపుతుంది.
పర్షియన్లకు, గ్రీకులకు యుద్ధం వచ్చినప్పుడు స్పార్టాన్ల సాయాన్ని అర్థిస్తూ గ్రీకులు ఫిలిప్పైడ్స్ అనే వ్యక్తిని దూతగా పంపుతారు. మాట నేర్పుతోపాటు వేగంగా నడవగలిగిన ఫిలిప్పైడ్స్ కొండలు, గుట్టలవెంట మైళ్ళ దూరం నడిచి వెళ్ళి స్పార్టాన్లకు ఆ సందేశం అందించి తిరిగి వచ్చి యుద్ధంలో పాల్గొంటాడు. విచిత్రంగా ఇతనికీ, సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళి సీతను చూసొచ్చిన హనుమంతుడికీ పోలికలు కనిపిస్తాయి.
మాటల మహాసముద్రంలో సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం వగైరా అనర్ఘరత్నాలే కాదు; మనుషుల మధ్యా, మతాల మధ్యా విరోధం పెంచి విధ్వంసం వైపు నడిపించే తిమింగలాలూ ఉంటాయి.
మంచి, మర్యాద, విజ్ఞత, వివేకం ఉట్టిపడేలా నిరంతరం తీర్చిదిద్దుకునే మాటతోనే వాటిని తరిమి కొట్టగలం. రకరకాల కాలుష్యాల నుంచి మాటను విడిపించి తిరిగి మంత్రపూతం, అర్థవంతం చేయడం కూడా ఒక తరహా పర్యావరణ ఉద్యమమే. నూరు అబద్ధాల మధ్య ఒక నిజం కూడా అబద్ధంగా మారిపోయే దుఃస్థితి నుంచి మాటను రక్షించకపోతే ఇంతటి మానవ ప్రగతీ అబద్ధమైపోతుంది.
మాటా మంచీ
Published Mon, Apr 3 2023 12:01 AM | Last Updated on Mon, Apr 3 2023 12:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment