Civilization
-
ఇది కాల పరీక్షలను తట్టుకున్న అపురూప కళ..!
మానవ పరిణామంలోని తొలి నాగరిక కళ చేనేత. నాగరికతల ప్రస్థానంలో ఇది పడుగు పేకల పోగుబంధం. ఇది తరతరాల చేనేత కళాకారుల రంగుల కళ. ఆచ్ఛాదనతో అందానికి మెరుగులు దిద్దే అరుదైన కళ. ఇది కాల పరీక్షలను తట్టుకున్న అపురూప కళ. ఒంటికి హత్తుకుపోయే చేనేత వస్త్రాల సుతిమెత్తదనాన్ని ఆస్వాదించాలనుకోవడం ఒక రంగుల కల.నాగరికతకు తొలి గుర్తు వస్త్ర«ధారణ. వస్త్రాలను తయారు చేసే చేనేత తొలి నాగరిక కళ. చేనేత వెనుక సహస్రాబ్దాల చరిత్ర ఉంది. పత్తి నుంచి నూలు వడికి వస్త్రాలను నేయడం క్రీస్తుపూర్వం 3000 నాటికే విరివిగా ఉండేది. ఉన్ని కంటే పత్తితో వస్త్రాలు నేయడం సులువు కావడంతో వివిధ ప్రాచీన నాగరికతల ప్రజలు చేనేత వస్త్రాలవైపే మొగ్గు చూపేవారు. సింధులోయ నాగరికత వర్ధిల్లిన మొహెంజదారో శిథిలాల్లో ప్రాచీన చేనేతకు సంబంధించిన ఆనవాళ్లు, నాణ్యమైన నూలు దారపు పోగులు, అద్దకానికి ఉపయోగించే రంగుల అవశేషాలు ఉన్న కుండలు దొరికాయి.ఇవి మన దేశంలో చేనేత కళ ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత మరమగ్గాల వినియోగం పెరిగినప్పటి నుంచి చేనేత ప్రాభవం కొంత తగ్గుముఖం పట్టిందేగాని, అదృష్టవశాత్తు కొన్ని ఇతర ప్రాచీన కళల మాదిరిగా అంతరించిపోలేదు. చేనేతకు మన దేశంలో ఇప్పటికీ అద్భుతమైన ఆదరణ ఉంది. కొన్ని నగరాలు, పట్టణాలు ఇప్పటికీ చేనేతకు చిరునామాగా తమ ఉనికి చాటుకుంటున్నాయి. ప్రభుత్వాలు కూడా చేనేతను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం మీ కోసం...మన దేశంలో వారణాసి, చందేరి, జైపూర్, సూరత్, పానిపట్, లక్నో, భదోహీ, అల్మోరా, బాగేశ్వర్, కోటా, మహేశ్వర్, చెన్నై, కంచి, కన్నూర్, కాసర్గోడ్, మైసూరు, మంగళూరు, భాగల్పూర్, బంకా, ముర్షిదాబాద్, బిష్ణుపూర్, ధనియాఖలి, సంబల్పూర్, బరంపురం వంటి ఎన్నో నగరాలు, పట్టణాలు ఇప్పటికీ చేనేత కళను, సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. తమ ప్రత్యేకతను చెక్కుచెదరకుండా నిలుపుకుంటూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2019–20లో విడుదల చేసిన లెక్కల ప్రకారం మన దేశవ్యాప్తంగా 35.22 లక్షల మంది చేనేత కార్మికులు పూర్తిగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు. చేనేత రంగంపై ఆధారపడి పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారిని కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 43 లక్షలకు పైగానే ఉంటుంది. చేనేత రంగంలో నేత, అద్దకం, నేతకు సంబంధించిన ఇతర పనులను చేసే ఈ కార్మికుల్లో దాదాపు 70 శాతం మహిళలే! దేశవ్యాప్తంగా దాదాపు 16 వేల చేనేత సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ సహకార సంఘాల ద్వారా చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు చేరవేయగలగడమే కాకుండా, తమ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతున్నారు.ఫ్యాషన్లలోనూ చేనేత ముద్ర..యంత్రాల ద్వారా తయారయ్యే వస్త్రాల్లోని యాంత్రికతకు భిన్నంగా ఉండటమే చేనేత వస్త్రాల ప్రత్యేకత. అందుకే, ఎన్ని ఫ్యాషన్లు మారుతున్నా, చేనేత వస్త్రాలు తమ ప్రత్యేకతను నిలుపుకుంటూనే వస్తున్నాయి. చేనేత కార్మికుల కళానైపుణ్యం, ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కే వారి సృజనాత్మకత కారణంగా కూడా ఆధునిక ఫ్యాషన్ల పోటీని చేనేత వస్త్రాలు సమర్థంగా తట్టుకుని నిలబడగలుగుతున్నాయి. రంగులు, డిజైన్లు, అద్దకం పద్ధతుల్లో చేనేత కార్మికులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటున్నారు. మన దేశంలో తయారయ్యే చేనేత చీరలు, పంచెలు, తువ్వాళ్లు, దుప్పట్లు, ఇతర వస్త్రాలకు విదేశాల్లో కూడా బాగా గిరాకీ ఉంది.మన దేశం నుంచి అమెరికా, కెనడా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లండ్స్, గ్రీస్, పోర్చుగల్, స్వీడన్, యూఏఈ, మలేసియా, ఇండోనేసియా, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి ఇరవైకి పైగా దేశాలకు చేనేత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మన దేశం నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11.7 బిలియన్ డాలర్లు (రూ. 93,931 కోట్లు) విలువ చేసే చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల కంటే 6.71 శాతం ఎక్కువ. ఆధునిక ఫ్యాషన్ల హవాలోనూ చేనేత వస్త్రాలకు ఆదరణ ఏమాత్రం తగ్గకపోగా, పెరుగుతూ వస్తోందనడానికి ఈ లెక్కలే నిదర్శనం.తెలుగు రాష్ట్రాల్లో చేనేత చిరునామాలు..మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేనేతకు చిరునామాలైన ఊళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పొందూరు మొదలుకొని వెంకటగిరి వరకు, తెలంగాణలో పోచంపల్లి మొదలుకొని గద్వాల వరకు చేనేత కళలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఊళ్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరు పట్టణం ఖద్దరు చేనేతకు చిరకాలంగా ప్రసిద్ధి పొందింది. పొందూరు ఖద్దరు హోదాకు చిహ్నంగా గుర్తింపు పొందింది. పొందూరు ఖద్దరు పంచెలను అమితంగా ఇష్టపడేవారిలో మహాత్మాగాంధీ సహా ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు, అక్కినేని నాగేశ్వరరావు వంటి సినీ ప్రముఖులు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు ఎందరో ఉన్నారు. పొందూరు ఖద్దరు నాణ్యత చూసి ముచ్చటపడిన గాంధీజీ, ఆ నేత మెలకువలను నేర్చుకునేందుకు తన కొడుకు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పొందూరు చేనేత కళాకారులు బల్ల భద్రయ్య, జల్లేపల్లి కాంతమ్మ గత ఏడాది ఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.కాకినాడ జిల్లా ఉప్పాడ చేనేత కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని ఉప్పాడ పరిసరాలకు చెందిన ఎనిమిది గ్రామాల్లోని చేనేత కార్మికులు సంప్రదాయ జాంధానీ చీరల నేతలో అత్యంత నిష్ణాతులు. ఈ గ్రామాల్లో తయారయ్యే చీరలు ఉప్పాడ జాంధానీ చీరలుగా ప్రసిద్ధి పొందాయి. బంగారు, వెండి జరీ అంచులతో రూపొందించే ఉప్పాడ జాంధానీ చీరలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు లభించింది. కర్నూలు జిల్లా కోడుమూరు చేనేత కార్మికులు గద్వాల చీరల నేతకు ప్రసిద్ధి పొందారు. ఇదే జిల్లా ఆదోనిలో చేనేత కార్పెట్లు, యోగా మ్యాట్లు వంటివి తయారు చేస్తున్నారు.అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత కార్మికులు ప్రాచీన కాలంలోనే అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన ఘనత సాధించారు. ఇక్కడి చీరలకు కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) దక్కింది. బంగారు తాపడం చేసిన జరీతో రూపొందించిన ధర్మవరం చీరలకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఫ్యాషన్ ప్రపంచంలో శరవేగంగా వస్తున్న మార్పులకు దీటుగా ఇక్కడి చేనేత కళాకారులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లను రూపొందిస్తూ, తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తున్నారు. తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి పొందింది. ఇక్కడి ఇక్కత్ చీరలు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగేటే మెక్రాన్‌కు పోచంపల్లి ఇక్కత్ చీరను ప్రత్యేకంగా బహూకరించారు. పోచంపల్లిలో తయారయ్యే పట్టు, నూలు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, దుప్పట్లు, రజాయిలు, స్టోల్స్ స్కార్వ్స్, కర్టెన్లు వంటి వాటికి సూడాన్, ఈజిప్ట్, ఇండోనేసియా, యూఏఈ వంటి దేశాల్లో మంచి గిరాకీ ఉంది. పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు రాపోలు రామలింగం 2015లో జాతీయ చేనేత దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడకు వచ్చినప్పుడు పోచంపల్లి చేనేత కళాకారులు భోగ బాలయ్య, సరస్వతి దంపతులు తాము స్వయంగా నేసిన భారత చిత్రపటం గల వస్త్రాన్ని బహూకరించారు.నల్లగొండ జిల్లా పుట్టపాక గ్రామం తేలియా రుమాల్ వస్త్రాల తయారీకి ప్రసిద్ధి పొందింది. నేతకు ముందుగా దారాన్ని నువ్వుల నూనెలో నానబెట్టి తయారు చేసే ఈ వస్త్రాలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు కూడా లభించింది. పుట్టపాక గ్రామం తేలియా రుమాల్ వస్త్రాలతో పాటు దుపియన్ చీరలకు కూడా అంతర్జాతీయ ప్రసిద్ధి పొందింది. పుట్టపాక వస్త్రాలు ఎందరో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల మనసు దోచుకున్నాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వంటివారు పుట్టపాక వస్త్రాలకు ఫిదా అయిన వారే! ఇక్కడి తేలియా రుమాల్ వస్త్రాలు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోను, లండన్ మ్యూజియంలోనూ చోటు సంపాదించుకోవడం విశేషం. పుట్టపాక చేనేత కళాకారులు గజం గోవర్ధన్, గజం అంజయ్య ‘పద్మశ్రీ’ అవార్డు పొందారు. ఇక్కడకు సమీపంలోని ఆలేరుకు చెందిన చింతకింది మల్లేశం ఆసు యంత్రం తయారీకి గుర్తింపుగా ‘పద్మశ్రీ’ పొందారు. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు చేనేత కళాకారులు ‘పద్మశ్రీ’ అవార్డు పొందడం దేశంలోనే అరుదైన విశేషం.మన దేశంలో 5000 ఏళ్ల చరిత్ర!మన దేశంలో చేనేతకు ఐదువేల ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. సింధులోయ నాగరికత కాలం నుంచి ఇక్కడి జనాలు వస్త్రాలను నేసేవారు. ప్రాచీన భారత దేశంలో ప్రతి గ్రామంలోనూ చేనేతకారుల కుటుంబం కనీసం ఒక్కటైనా ఉండేది. పదహారో శతాబ్ది నాటికి చేనేత ఉత్కృష్టమైన కళ స్థాయికి ఎదిగింది. మంచి నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులకు రాజాదరణ ఉండేది. ఎందరో రాజులు తమ విజయగాథల చిత్రాలను చేనేత వస్త్రాలపై ప్రత్యేకంగా నేయించుకునేవారు. మొగల్ పరిపాలన కొనసాగినంత కాలం మన దేశంలో చేనేతకు అద్భుతమైన ఆదరణ ఉండేది.బ్రిటిష్ హయాంలో మరమగ్గాలు ప్రవేశించడంతో చేనేతకు గడ్డురోజులు మొదలయ్యాయి. బ్రిటిష్‌వారు ఇక్కడి నుంచి నూలును ఇంగ్లండ్‌కు తరలించి, అక్కడి మిల్లుల్లో తయారయ్యే వస్త్రాన్ని ఇక్కడకు తీసుకువచ్చి అమ్మేవారు. ఈ పరిస్థితి కారణంగానే ఖద్దరు ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మారాయి. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ‘స్వదేశీ ఉద్యమం’ 1905 ఆగస్టు 7న కలకత్తాలో మొదలైంది. స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఆగస్టు 7ను కేంద్ర ప్రభుత్వం 2015లో జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. స్వదేశీ ఉద్యమంలో భాగంగా అప్పట్లో మహాత్మాగాంధీ స్వయంగా రాట్నం నుంచి నూలు వడికేవారు.అప్పట్లో ఊరూరా ఎంతోమంది స్వాతంత్య్ర సమర యోధులు గాంధీజీ పంథాలోనే రాట్నంపై నూలు వడికి, ఆ నూలుతో నేసిన ఖద్దరు వస్త్రాలనే ధరించేవారు. బ్రిటిష్ పాలన అంతమై దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమ తిరిగి పుంజుకోవడం ప్రారంభమైంది. సంప్రదాయ కుటీర పరిశ్రమగా చేనేత పరిశ్రమ ఈనాటికీ కొనసాగుతోంది. వస్త్రధారణలో వస్తున్న మార్పులను, జనాల అభిరుచుల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ, తనను తాను నవీకరించుకుంటూ చేనేత పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.దేశవ్యాప్తంగా ఉన్న 16 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), 28 చేనేతకారుల సేవా కేంద్రాలు ఏటా జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటాయి. పలుచోట్ల చేనేత వస్త్రాల ప్రదర్శనలను నిర్వహిస్తాయి.చేనేతలో మన ఘనత..– చేనేత చీరలు కేవలం చీరలు మాత్రమే కాదు, ఏ చీరకు ఆ చీరను ఒక కళాఖండంగా పరిగణిస్తారు ఫ్యాషన్ నిపుణులు. అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు తమ సేకరణలో భారత్ చేనేత చీరలను తప్పకుండా చేర్చుకోవడమే మన చేనేత ఘనతకు నిదర్శనం.– ప్రపంచవ్యాప్తంగా వినిగించే చేనేత వస్త్రాల్లో మన దేశంలో తయారైనవి 95 శాతం వరకు ఉంటాయి. చేనేతలో ఇప్పటికీ మనది తిరుగులేని స్థానం.– చేనేత వస్త్రాల తయారీలో బెనారస్ మొదలుకొని కంచి వరకు ఏ ప్రాంతానికి చెందిన వైవిధ్యం ఆ ప్రాంతానికే సొంతం. చేనేత కళలోని ఈ వైవిధ్యం కారణంగానే వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత వస్త్రాలు ప్రత్యేకంగా జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపును సాధించగలిగాయి.– చేనేత పరిశ్రమ మన దేశంలోనే అతిపెద్ద కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. వస్త్రాల రూపకల్పన శైలిలో సంప్రదాయ పరంపర, ప్రాంతీయ వైవిధ్యం, సృజనాత్మకత, అసాధారణ నైపుణ్యం ఫలితంగా మన చేనేత కళాకారులు అంతర్జాతీయంగా కూడా మన్ననలు పొందగలుగుతున్నారు.– భారత గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తున్నది చేనేత రంగమే!– మన దేశం నలుమూలలకు చెందిన 65 చేనేత ఉత్పత్తులకు, ఆరు ఉత్పత్తి చిహ్నాలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ఉంది. ఇన్ని ఉత్పత్తులకు జీఐ లభించడం చేనేత పరిశ్రమ వైవిధ్యానికి నిదర్శనం. -
ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది?
మానవులు భూమిపై అనేక విపత్తులను చవిచూశారు. ప్రతి సంవత్సరం లెక్కలేనంత జనాభా.. భూకంపాలు, వరదలకు బలవుతూవస్తోంది. ఇటీవలి కరోనా విధ్వంసం లక్షలాదిమంది ప్రాణాలను బలిగొంది. అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న విధ్వంసం గురించి విన్నప్పుడు ఎవరికైనా సరే కాళ్ల కింద భూమి కంపించినట్లవుతుంది. నాటి ఆ విపత్తు తీవ్రతకు ఈ భూమండలంపై కేవలం 1,280 మంది మాత్రమే మిగిలారు. ఈ పెను విపత్తు ఎప్పుడు సంభవించింది? మనం చెప్పుకోబోతున్న ఈ సంఘటన తొమ్మిది లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. అంతటి విపత్తులో తమను తాము రక్షించుకోగలిగిన 1,280 మంది మాత్రమే మిగిలారు. వారి కారణంగానే ఈ రోజు ఈ భూమిపై ఎనిమిది బిలియన్ల మంది ప్రజలు జీవించి ఉన్నారని చెబుతారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం జర్మన్ న్యూస్ వెబ్సైట్ డీడబ్ల్యు తెలిపిన వివరాల ప్రకారం మనిషి పూర్వీకులు ఒకప్పుడు విపత్తులకు చాలా దగ్గరగా ఉండేవారు. ఈ విషయాన్ని జన్యు విశ్లేషణ ఆధారంగా జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. మానవ జనాభా దాదాపు అంతరించిపోయిన కాలం ఒకప్పుడు ఏర్పడిందని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిశోధన రెండు లక్షల సంవత్సరాల క్రితం దొరికిన ఆదిమ మానవుల అవశేషాలపై జరిగింది. ఈ పరిశోధన ఎవరు సాగించారంటే.. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన షాంఘై ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఈ పరిశోధన చేసింది. తొమ్మిది లక్షల ముప్పై వేల సంవత్సరాల క్రితం భూమిపై తలెత్తిన ఆ విపత్తు అనంతరం భూమిపై కేవలం 1280 మంది మాత్రమే మిగిలారని పరిశోధకులు కంప్యూటర్ మోడలింగ్ ద్వారా కనుగొన్నారు. నాటి భీకర విపత్తులో 98.7 శాతం మానవ జనాభా నాశనమైందని ఈ పరిశోధన నిర్వహించిన ప్రధాన పరిశోధకుడు హైపెంగ్ లీ వివరించారు. ఇంతకీ నాడు భూమిపై ఏమి జరిగింది? ఈ పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం మంచు యుగంలో భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గడం వల్ల ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది. ఈ మంచు యుగంలో మానవులు దాదాపు అంతరించిపోయారు. అయితే అంతటి దుర్భర పరిస్థితిలోనూ తమను తాము రక్షించుకోవడంలో కొందరు మానవులు విజయం సాధించారు. ఈ మానవులే తదుపరి మానవ నాగరికత అభివృద్ధికి కారణమయ్యారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: తల తీయడం మొదలు తుపాకీతో కాల్చడం వరకూ.. ఏ దేశంలో ఎటువంటి మరణశిక్ష? -
World's Most Dangerous Day: సెకెన్ల వ్యవధిలో ఊహకందని ఘోరం.. 8 లక్షలమంది..
మనిషి లక్షలాది సంవత్సరాలుగా ఊహికందని ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇటువంటి సమయాల్లో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతుండగా, లెక్కకు అందని సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారుతున్నారు. ఇక నిరాశ్రయులయ్యేవారి సంఖ్య చెప్పనలవి కాదు. ఇప్పుడు మనం ప్రపంచం ఎదుర్కొన్న అత్యంత భారీ విపత్తు గురించి తెలుసుకుందాం. ప్రపంచానికే అత్యంత ప్రమాదకరమైన రోజు.. సైన్స్ అలర్ట్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం 1556 జనవరి 23.. ఆరోజు మానవాళి పెను విపత్తును భీకర భూకంపం రూపంలో ఎదుర్కొంది. కొన్ని సెకెన్ల వ్యవధిలో 8 లక్షలమంది జీవితాలు బుగ్గిపాలయ్యాయి. ఈ ఒక్క ఘటనతో చైనాలో అప్పటివరకూ సంతరించుకున్న నాగరిత సర్వనాశనం అయ్యింది. ఎంత శక్తివంతమైన భూకంపం అంటే.. సాధారణంగా ఎక్కడో ఒకచోట భూకంపం వస్తూనే ఉంటుంది. అయితే 1556 జనవరి 23న సంభవించినంతటి పెను భూకంపం ఇంతవరకూ ఎన్నడూ సంభవించలేదు. సాధారణంగా స్వల్పస్థాయి భూకంపాలు రిక్టర్ స్కేలుపై 2.3 లేదా 3.2గా నమోదవుతుంటాయి. అయితే 1556 జనవరి 23న సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 8.0 నుంచి 8.3 మధ్యలో నమోదయ్యింది. ఇది పెను విపత్తుకు దారితీసింది. భూకంప కేంద్రం నగరం మధ్యలో ఉండటమే ఇంతటి భారీ విపత్తుకు కారణంగా నిలిచింది. మానవ నాగరికత భవిష్యత్‌కు సన్నాహాలు ఈ భారీ వినాశకర భూకంపం భవిష్యత్‌లో ఇటువంటి ఉత్పాతాలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేసేందుకు అవకాశం కల్పించింది. ఈ ఘటన అనంతరం చైనాలో అత్యధికశాతం ఇళ్లను తేలికపాటి కలపతో నిర్మించసాగారు. అయితే ఇప్పటి ఆధునిక సాంకేతికతతో భూకంపాలను ముందుగానే పసిగట్టే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. భూకంపాల నుంచి ఎలా తప్పించుకోవాలనే విధానాలను కనుకొన్నారు. ఇదేవిధంగా తుపానులను, ఇతర ప్రకృతి వైపరీత్యాలను మనిషి ముందుగానే గుర్తించగలుగుతున్నాడు. ఇది కూడా చదవండి: పక్కింట్లో పార్టీ హోరు.. నిద్ర పట్టని ఆమె తీసుకున్న నిర్ణయం ఇదే.. -
జిల్లాలో ఆదిమానవులు నివాసమున్నారా?
జిల్లాలో ఆదిమానవులు నివాసమున్నారా? అడవుల్లో లక్షల ఏళ్ల నాడు ఆవులు, గుర్రాలు, జింకలు తిరుగాడాయా? అంటే అవుననే అంటున్నారు వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు. దాదాపు ఏడు దశాబ్దాలుగా ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. గుండ్లకమ్మ, పాలేరు, మన్నేరు, నాస వాగు పరిసరాల్లో విస్తృత స్థాయిలో పరిశోధనలు చేశారు. తాజాగా పామూరు మండలంలో గుజరాత్ రాష్ట్రం బరోడాలోని ఆర్కియాలజీ మహారాజా సాయాజీరావు యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు చేస్తున్న పరిశోధనల్లో దాదాపు 2.5 లక్షల ఏళ్లనాటి అవశేషాలను గుర్తించారు. హోమో ఎరక్టాస్ అనే తెగకు చెందిన ఆదిమానవులు ఆ అవశేషాలను వినియోగించినట్లు భావిస్తున్నారు. పరిశోధకులతో ముచ్చటించగా ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. వాటి గురించి తెలుసుకుందామా.. ఒంగోలు, సాక్షిప్రతినిధి: నదీ పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికత అభివృద్ధి చెందింది అనేది అందరికీ తెలిసిందే. ఆదిమానవులు నదుల పక్కనే ఉన్న కొండ దిగువ ప్రాంతాల్లో నివాసముంటూ జీవనం సాగించారన్నది చరిత్రకారులు చెబుతూ వస్తున్నారు. అందుకే పరిశోధకులు ఎక్కువగా నదీ పరీవాహక ప్రాంతాలనే ఎంచుకుంటుంటారు. ఈ క్రమంలో జిల్లాలో గుండ్లకమ్మ, పాలేరు, మాకేరు, మన్నేరు వాగులను ఆర్కియాలజీ విభాగానికి చెందిన విద్యార్థులు ఎంచుకున్నారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఆర్కియాలజీ అధికారుల సాయంతో పరిశోధనలు చేస్తున్నారు. మాకేరు, మన్నేరు, పాలేరు..వాటికి అనుబంధ వాగులు కనిగిరి ప్రాంతంలోనే ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పటి నుంచి పరిశోధనలు చేశారు. ఆదిమానవుని ఆనవాళ్లతో పాటు ఆవులు, గుర్రాలు, ఉడుములు, జింకల అవశేషాలు, రాతి పనిముట్లు గుర్తించారు. – 1950లో ఎన్ ఐజాక్ అనే శాస్త్రవేత్త గుండ్లకమ్మ, పాలేరు నది పరివాహక ప్రాంతాల్లో పరిశోధన చేశారు. అప్పట్లో కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా కనిగిరి, కంభం తదితర గ్రామాలు ఉండేవి. ఆయా గ్రామాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పరిశోధన చేశారు. ఆయన సమరి్పంచిన పీహెచ్డీ రికార్డులో ఈ ప్రాంతంలో ఆదిమానవులు నివశించారని ప్రస్తావించారు. అలాగే 1975లో వి.మధుసూదన్ రావు అనే శాస్త్రవేత్త ఆంధ్ర యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. ఈయన పెదఅలవలపాడు, వెలిగండ్ల మండలాల్లోని పాలేరు, మన్నేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించి పరిశోధన పత్రాలను సమరి్పంచారు. అంతేకాకుండా 2004–05 సంవత్సరాల్లో హైదరాబాద్‌కు చెందిన జియాలజిస్ట్‌లు గుండ్లకమ్మ, మన్నేరు ప్రాంతాల్లో పర్యటించారు. ఇండోనేషియాలో బద్దలైన అగ్ని పర్వతాల ఆనవాళ్లకు సంబంధించి, వాటి నుంచి వచ్చే బూడిదను ఈ ప్రాంతాల్లో ఆయన కనిపెట్టారు. ఇది గాలి ద్వారా వచ్చింది. దీని వల్ల జంతు జాతులు అంతరించడం, మానవుల సంఖ్య తగ్గినట్లు నివేదికలున్నాయి. దానికి సంబంధించిన ఆనవాళ్లు (రాతియుగం నాటి పనిముట్లు, జంతు జాలాలు, అవశేషాలు కని్పంచాయి) కూడా ఇక్కడే ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని కందుకూరు సమీపం మాచవరం గ్రామానికి చెందిన దేవర అనిల్ కుమార్ గుజరాత్‌లోని ఆర్కియాలజీ మహారాజా సాయాజీరావు యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన సీనియర్ సమరి్పంచిన పరిశోధనలకు సంబంధించిన రికార్డులు అధ్యయనం చేశారు. అలాగే జిల్లాకు చెందిన ప్రొఫెసర్ కొండా శ్రీనివాసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన సలహాలు, సూచనలతో పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) హైదరాబాద్ వారి ద్వారా జీపీఆర్ సర్వే నిర్వహింపజేసి వారు సూచించిన ప్రాంతంలో మధ్య ప్రాచీన యుగం నాటి, రాతి యుగం నాటి ఆదిమానవుని, జంతు జలాలపై లోతైన పరిశోధన ప్రారంభించిన అనీల్ కుమార్ పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. 2017–18 సంవత్సరాల నుంచి గుండ్లకమ్మ, పాలేరు, మన్నేరు పరివాహక ప్రాంతాలైన సీఎస్‌పురం, డీజీపేట, పెద అలవలపాడు, హనుమంతునిపాడు, సింగరాయకొండ, నెల్లూరు జిల్లాలోని జడదేపి తదితర ప్రాంతాల్లో పరిశోధన చేశారు. కనిగిరిలోని మన్నేరు వాగులో ఎక్కువ శాతం మధ్యప్రాచీన రాతియుగం (70 వేల ఏళ్లు) కాలం నాటి అవశేషాలు, సర్ఫేస్ సర్వేలో (బయటకు కనిపించేవి) నాలుగు కిలోమీటర్ల మేర ఉన్నాయి. నీటి కోత ఎక్కువ జరగడం వల్లే అధిక సంఖ్యలో అవశేషాలు ఉన్నందున మన్నేరు వాగును ఎంచుకున్నట్లు ఆయన చెబుతున్నారు. హనుమంతునిపాడు వద్ద పాలేరులో 2.50 లక్షల ఏళ్ల నాటి రాతి పనిముట్లు లభించాయి. 2019 మన్నేరు వాగులో పరిశోధన చేసి కొన్ని అవశేషాలను గుర్తించారు. 2020లో ఒకటిన్నర నెల తవ్వకాలు జరపగా అక్కడ చాలా ప్రాచీన కాలం నాటి, ఆసక్తికర అవశేషాలు దొరకడంతో పూర్తి స్థాయిలో సైంటిఫిక్‌గా లోతుగా పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పామూరు మండలం మోట్రాలపాడు మన్నేరు వాగులో హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు) చెందిన వారితో జీపీఆర్ (జియోగ్రౌండ్ ఫెనిటిరేటింగ్ రాడార్) కింద రాళ్లు, గుంతలు ఉన్నాయా అనేది తెలుసుకునేందుకు సర్వే చేశారు. డాక్టర్ సక్రమ్, డాక్టర్ ఆనంద్ పాండేల ఆధ్వర్యంలో 12 మంది ఎంఏ విద్యార్థులు ఈ నెల 13, 14, 15 తేదీల్లో సర్వే చేశారు. ఎక్కడెక్కడ అవశేషాలు ఉన్నాయనే దానిపై క్షుణ్ణంగా సర్వే చేసేందుకు వాళ్లు సూచనలు ఇచ్చారు. వాళ్లు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాల్లో జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జీవితాంతం పరిశోధనలు చేస్తా.. జిల్లాలో చారిత్రక విశేషాలను తెలుసుకునేందుకు నిరంతరం సర్వే చేస్తా. ఎన్జీవోలు ఫండింగ్ ఇచ్చి తాను చేస్తున్న పరిశోధనలను ప్రోత్సహిస్తునాŠిన్య. ఆధునిక మానవుల పరిణామ క్రమానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరిగేందుకు, కొత్త విషయాలు వెలుగులోకి వచ్చేందుకు ఈ పరిశోధన ఫలితాలు దోహద పడతాయి. అమెరికాకు చెందిన నేషనల్ జోబ్రోసిక్ సొసైటీ, వెన్నర్ గ్రండ్ ఫౌండేషన్, లీకే ఫౌండేషన్ తదితర సంస్థల ద్వారా ఫండ్ సమకూరింది. లీకే ఫౌండేషన్ వారు ప్రపంచం మొత్తంలో 25 మందికి ఇస్తే ఇండియాలో నాకు మాత్రమే వచ్చింది. తాము చేస్తున్న పరిశోధనకు మోటరాలపాడు సర్పంచ్ మెడబలివి గురవయ్య పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారు. – దేవర అనీల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కందుకూరు వెలుగు చూసిన ఆనవాళ్లివీ.. మోట్రాలపాడు మన్నేరు వాగులో మధ్య ప్రాచీన రాతి యుగం నాటి రాతి పనిముట్లు (ఫ్లెయిట్స్, పాయింట్స్, స్కేపర్స్, బ్యోరింగ్స్, బోరఫ్, లిబల్బా టెక్నాలజీకి చెందిన పనిముట్లు) ఓఎస్ఎల్, యురీనియం సీరిస్ ద్వారా 70 వేల ఏళ్ల నాటివిగా గుర్తించారు. అలాగే 40, 50 వేల ఏళ్ల నాటి వైల్డ్, మచ్చిక జాతికి చెందిన ఆవులు, జింకలు, గుర్రాలు, ఉడుముల (వైల్డ్ జాతికిచెందిన) దంతాలు, ఎముకలు, ఇతర అవశేషాలను కనుగొన్నారు. ఈ అవశేషాలు ఒకే ప్రాంతంలో (మన్నేరు వాగు ప్రాంతం) సర్ఫేస్‌గా (పైన కనిపించేవి) సుమారు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఎక్కువ శాతం ఉన్నాయి. అంతేగాక ఇక్కడ వాగు కోతలు జరిగాయి. దీంతో పూర్తి స్థాయిలో ఇక్కడే పరిశోధన చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని అత్యున్నత ల్యాబ్‌లో.. కేవలం సర్వేతో కాకుండా .. తవ్వకాల్లో దొరికిన సాంపిల్స్, ఆనవాళ్లను ప్రపంచంలోని అత్యున్నత ల్యాబ్‌లకు పంపించి వాటి వివరాలను తెలుసుకుంటున్నారు. అవి ఎంత పురాతనమైనవి, ఏ కాలం నాటివి, ఎన్నేళ్ల కిందటివి అన్న వివరాలను సేకరిస్తున్నారు. గుజరాత్‌లోని ఇస్రో ల్యాబ్, ఆ్రస్టేలియా, పోర్చుగల్, హార్వర్డ్ యూనివర్శిటీ, యూఎస్ఏ (అర్బనా)లోని ల్యాబ్‌లకు పంపి అవి ఏకాలం నాటివి అని సాంకేతికంగా నిర్ధారణ చేస్తున్నారు. -
మాటా మంచీ
మనుషులకున్నదీ, ఇతర ప్రాణులకు లేనిదీ ఒక్క ఆలోచనాశక్తే కాదు, మాట కూడా! మాట శ్రుతిమించితే వివాదమవుతుంది, అతి అయితే వాచలత అవుతుంది, అదుపులో ఉంటే విజ్ఞతవుతుంది, రసాత్మకమైతే కవిత్వమవుతుంది, జనహితైషి అయిన ఒక మహనీయుని అంతరంగపు లోతుల్లోంచి ఉబికి వచ్చినప్పుడు అశేషజనావళిని కదిలించే మంత్రమవుతుంది. మాట అనేది మంచి, చెడుల కలబోత, రెండంచుల కత్తి! మనిషిని మనుషుల్లోకి తెచ్చి సామాజికుణ్ణి చేసినదీ,సంభాషణకు ఉపక్రమింపజేసినదీ, ఆ సంభాషణ నుంచి సంఘటిత కార్యంవైపు నడిపించినదీ,అందుకు అవసరమైన వ్యవస్థల అభివృద్ధికి దోహదమైనదీ, మాటే. ఆ క్రమంలోనే మాటకు వ్యాక రణం పుట్టింది, ఉచితానుచితాలనే హద్దులు ఏర్పడ్డాయి, ఆ హద్దుల నుంచి నాగరికత వచ్చింది. మనిషి చరిత్రలో ఇంతటి మహత్తర పాత్ర వహించిన మాట విలువ రానురాను పాతాళమట్టానికి పడిపోవడం నేటికాలపు విషాదం. ఏ రంగంలో చూసినా అసత్యాలు, అర్ధసత్యాల స్వైరవిహారం మాట విలువను దిగజార్చివేసింది. దుస్సాధ్యమని చెప్పదలచుకున్నప్పుడు ‘మాటలు కా’దంటూ మాటను చులకన చేస్తాం. మన కన్నా ప్రాచీనులే మాటను ముత్యాలమూటగా నెత్తిన పెట్టుకుని గౌరవించారు. బహుముఖమైన దాని విలువను గుర్తించి మహత్తును ఆపాదించారు. దానినుంచే మాంత్రికత, వరాలు, శాపాలు పుట్టాయి. మామూలు మాట కన్నా ముందు కవితాత్మక వాక్కు పుట్టిందని మానవ పరిణామ శాస్త్రవేత్తలు తేల్చారు. కొన్ని సమాజాల్లో మామూలు సంభాషణ కూడా కవితాత్మకంగా ఉండేదని ప్రముఖ పురాచరిత్ర అధ్యయనవేత్త జార్జి థామ్సన్ అంటూ, ఐరిష్ సమాజాన్ని ఉదహరిస్తాడు. రాత వచ్చాకే మాట తలరాత మారింది. మాట మంచిని, మర్యాదను, పొదుపును, అర్థవంతతను పదే పదే బోధించే అవసరం తలెత్తింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కాలు జారితే తీసుకోగలం కానీ, మాట జారితే తీసుకోలేం, పెదవి దాటితే పృథివి దాటుతుంది –వంటి సామెతలు, నుడికారాలు, సూక్తులు ప్రతి వాఙ్మయంలోనూ కొల్లలు. ‘మనిషికి మాటే గొప్ప అలంకారం, మిగతా అలంకారాలన్నీ నశించిపోయేవే’నని హెచ్చరిస్తాడు భర్తృహరి. మాటను అబద్ధంతో కలుషితం చేయడానికి నిరాకరించి రాజ్యాన్ని, ఆలుబిడ్డలను సైతం కోల్పోవడానికి హరిశ్చంద్రుడు సిద్ధపడ్డాడు. మహాత్మాగాంధీకి స్ఫూర్తినిచ్చిన కథలలో అదొకటి. గయుడు కృష్ణుని ఆగ్రహానికి గురైన సంగతి తెలియక రక్షిస్తానని అతనికి మాట ఇచ్చిన అర్జునుడు, దానిని నిల బెట్టుకోడానికి తన బహిఃప్రాణమైన కృష్ణునితోనే యుద్ధం చేశాడు. లిఖిత సంప్రదాయం ఏర్పడని, లేదా పూర్తిగా వేళ్లూనుకొనని రోజుల్లో నోటిమాటగానే అన్ని వ్యవహారాలూ జరిగేవి. ఆర్థికమైన లావాదేవీలలో మాటే వేయి ప్రామిసరీ నోట్ల విలువను సంతరించుకునేది. అలెగ్జాండర్ దండయాత్ర కాలంలో మనదేశాన్ని సందర్శించిన ఒక గ్రీకు చరిత్రకారుడు, ఇక్కడ రుణసంబంధమైన అన్ని ఒప్పందాలూ నోటిమాటగా జరగడం చూసి ఆశ్చర్యపోయాడు. పురాణ, ఇతిహాసాలలో మాట నిలకడతోపాటు, మాటసొంపుకు, నేర్పుకే ప్రాధాన్యం. రామాయణంలోని హనుమంతుడు అటువంటి సుగుణాలరాశి. రాముడికీ, సుగ్రీవుడికీ స్నేహసంధానం చేసింది అతనే. అతని వాక్చతురతను ఉగ్గడించడానికే కాబోలు, వ్యాకరణ పండితుణ్ణి చేశారు. దాదాపు ప్రతి దేశమూ, ప్రతి ఇతర దేశంతోనూ పాటించే దౌత్యనీతికి మాటే గుండెకాయ. దౌత్యచతురత ఇప్పుడు ఒక ప్రత్యేకవిద్యగా అభివృద్ధి చెందింది. మహాభారతాన్నే చూస్తే, వివిధ సందర్భాలలో ద్రుపదుని పురోహితుడు, విదురుడు, సంజయుడు, కృష్ణుడు కురుపాండవుల మధ్య రాయబారం నెరిపారు. రాజనీతి కుశలతే కాక, అవతలి పక్షానికి సూటిగా తేటగా, ఎక్కువ తక్కు వలు కాకుండా సందేశాన్ని చేరవేసే మాటనేర్పే అందుకు వారి అర్హత. ధృతరాష్ట్రునికి గాంధారి నిచ్చి పెళ్లి చేయాలన్న ప్రతిపాదనను భీష్ముడు ఒక మాటకారితోనే గాంధారరాజు సుబలుడికి పంపుతాడు. కుండిన నగరానికి వచ్చి రాక్షస పద్ధతిలో తనను ఎత్తుకెళ్లి వివాహమాడమన్న సందేశాన్ని అగ్నిద్యోతనుడనే పురోహితుని ద్వారా రుక్మిణి కృష్ణునికి పంపుతుంది. రాజ్యం కోల్పోయి అడవుల పాలైన తన భర్త నలుని జాడ కనిపెట్టడానికి దమయంతి, అతనికి మాత్రమే అర్థమయ్యే ఒక సందే శమిచ్చి దానిని సమర్థంగా అందించగల వ్యక్తినే పంపుతుంది. పర్షియన్లకు, గ్రీకులకు యుద్ధం వచ్చినప్పుడు స్పార్టాన్ల సాయాన్ని అర్థిస్తూ గ్రీకులు ఫిలిప్పైడ్స్ అనే వ్యక్తిని దూతగా పంపుతారు. మాట నేర్పుతోపాటు వేగంగా నడవగలిగిన ఫిలిప్పైడ్స్ కొండలు, గుట్టలవెంట మైళ్ళ దూరం నడిచి వెళ్ళి స్పార్టాన్లకు ఆ సందేశం అందించి తిరిగి వచ్చి యుద్ధంలో పాల్గొంటాడు. విచిత్రంగా ఇతనికీ, సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళి సీతను చూసొచ్చిన హనుమంతుడికీ పోలికలు కనిపిస్తాయి. మాటల మహాసముద్రంలో సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం వగైరా అనర్ఘరత్నాలే కాదు; మనుషుల మధ్యా, మతాల మధ్యా విరోధం పెంచి విధ్వంసం వైపు నడిపించే తిమింగలాలూ ఉంటాయి. మంచి, మర్యాద, విజ్ఞత, వివేకం ఉట్టిపడేలా నిరంతరం తీర్చిదిద్దుకునే మాటతోనే వాటిని తరిమి కొట్టగలం. రకరకాల కాలుష్యాల నుంచి మాటను విడిపించి తిరిగి మంత్రపూతం, అర్థవంతం చేయడం కూడా ఒక తరహా పర్యావరణ ఉద్యమమే. నూరు అబద్ధాల మధ్య ఒక నిజం కూడా అబద్ధంగా మారిపోయే దుఃస్థితి నుంచి మాటను రక్షించకపోతే ఇంతటి మానవ ప్రగతీ అబద్ధమైపోతుంది. -
అసమాన ప్రశ్నలు
ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది? ఈ అసమానతలకు కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఒక శాస్త్రవేత్తకు వస్తే? ఆయన చరిత్రకారుడు కూడా అయితే! జియోగ్రాఫర్, ఆర్నిథాలజిస్ట్ లాంటి అదనపు అర్హతలు కూడా ఉంటే? ఇలాంటి ప్రశ్నలకు బహు వృత్తులు, ప్రవృత్తులు కలగలిసినవారే జవాబులు చెప్పగలరు. ఒకానొక సముద్రపు ఒడ్డు నడకలో అమెరికన్ రచయిత జేరెడ్ డైమండ్ (జ.1937)ను ఒక నల్లజాతి యువకుడు, పాపువా న్యూ గినియా దీవులకు చెందిన ‘యాలి’ ఇలా నిలదీశాడు: ‘మీ తెల్లవాళ్ల దగ్గర అంత ‘కార్గో’(వస్తు సామగ్రి) ఉన్నప్పుడు, మా దగ్గర అది ఎందుకు లేదు?’ ఈ అన్వేషణలో భాగంగా ఏళ్లపాటు చేసిన పరిశోధనతో జేరెడ్ డైమండ్ రాసిన పుస్తకం ‘గన్స్, జెర్మ్స్ అండ్ స్టీల్: ద ఫేట్స్ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్’. శీర్షికలోనే సమాధానాలను నిలుపుకొన్న ఈ పుస్తకం సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం 1997లో వచ్చింది. ఆ తర్వాత దీని ఆధారంగానే ఇదే పేరుతో ‘ఎన్జీసీ’ ఛానల్ డైమండ్ హోస్ట్‌గా మూడు భాగాల డాక్యుమెంటరీ కూడా నిర్మించింది. సులభంగా కనబడే ఈ ప్రశ్నలకు జవాబులు అంత సులభంగా దొరకవు. వీటికి సమాధానాలు కూడా వర్తమానమో, సమీప గతమో చెప్పలేదు. అందుకే చరిత్ర, పూర్వ చరిత్ర యుగంలోకి డైమండ్ మనల్ని తీసుకెళ్తారు. మనుషులందరూ ఆహార సేకరణ దశలోనే ఉన్న తరుణంలో పదమూడు వేల ఏళ్ల క్రితం ‘మధ్య ప్రాచ్యం’లో మొదటిసారి వ్యవసాయం మొదలైంది. బార్లీ, గోదుమ పండించారు. ఎప్పుడైతే మిగులు పంట సాధ్యమైందో అక్కడ మనుషుల వ్యాపకాలు ఇతరాల వైపు మళ్లాయి. అలా మానవాళి మొదటి నాగరికత నిర్మాణం జరిగింది. చిత్రంగా పాపువా న్యూ గినియాలో ఇప్ప టికీ వ్యవసాయం మొదలుకాలేదు. అక్కడివాళ్లు తెలివైనవాళ్లు కాదనా? ఏ చెట్టు ఏమిటో, ఏ పుట్టలో ఏముందో చెప్పగలిగేవాళ్లు; ఎంతదూరమైనా బాణాన్ని గురిచూసి కొట్టేవాళ్లు తెలివైనవాళ్లు కాక పోవడం ఏమిటి? ఏ పంటలైతే మధ్యప్రాచ్యంలో నాగరికతకు కారణమయ్యాయో, అవి ఇక్కడ పెరగవు. ఆ భౌగోళిక పరిమితి వల్ల వాళ్లు ఇంకా ఆహార అన్వేషణ దశలోనే ఉన్నారు. అందుకే మనుషులను ‘అసమానంగా’ ఉంచుతున్న కీలక కారణం భౌగోళికత అంటారు డైమండ్. ‘ఫెర్టయిల్ క్రెసెంట్’(సారవంతమైన చంద్రవంక)గా పిలిచే ఈ యురేసియా ప్రాంతంలోనే జంతువులను మచ్చిక చేసుకోవడం కూడా జరిగింది. ఇవి గొప్ప అదనపు సంపదగా పనికొచ్చాయి. ఆవు, ఎద్దు, గొర్రె, మేక, గుర్రం, గాడిద, పంది లాంటి పద్నాలుగు పెంపుడు జంతువుల్లో ఒక్క లామా(పొట్టి ఒంటె; దక్షిణ అమెరికా) తప్ప పదమూడు ఈ ప్రాంతం నుంచే రావడం భౌగోళిక అనుకూలతకు నిదర్శనంగా చూపుతారు డైమండ్. మనుషుల విస్తరణ కూడా సరిగ్గా ఆ భౌగోళిక రేఖ వెంబడి, అంటే ఏ ప్రాంతాలు వీటికి అనుకూలంగా ఉన్నాయో వాటివెంటే జరిగింది. మరి ఒకప్పుడు మొదటి నాగరికత వర్ధిల్లిన మధ్య ప్రాచ్యం ఇప్పుడు ప్రపంచంలోనే సంపన్న ప్రాంతంగా ఎందుకు లేదు? భౌగోళికత ఒక కారణం అవుతూనే, దాన్ని మించినవి కూడా ఇందులో పాత్ర పోషిస్తున్నాయన్నది డైమండ్ సిద్ధాంతం. అయితే భౌగోళికత ప్రతికూలంగా కూడా పరిణమించవచ్చు. కరవు కాటకాలు ఓ దశలో మధ్యప్రాచ్యాన్ని తుడిచిపెట్టాయి కూడా! వారికి తెలియకుండానే ఐరోపావాసుల పక్షాన పనిచేసినవి సూక్ష్మ క్రిములని చెబుతారు డైమండ్. ఇతర ప్రాంతాలకు విస్తరించే క్రమంలో జరిగిన పోరాటాల్లో, ఆ పోరాటాల కంటే ఎక్కువగా వీరి నుంచి వ్యాపించిన సూక్ష్మక్రిముల వల్ల ‘మూలజాతులు’ నశించాయి. దానిక్కారణం – వేల సంవత్సరాల జంతువుల మచ్చిక వల్ల వాటి నుంచి వచ్చే సూక్ష్మక్రిముల నుంచి వీరికి నిరోధకత ఏర్పడింది. కానీ అలాంటి సంపర్కం లేని అమెరికన్ జాతులు దాదాపు తొంభై ఐదు శాతం నశించిపోయాయి. ముఖ్యంగా ‘స్మాల్‌పాక్స్’(మశూచి) కోట్లాది మంది ప్రాణాలు తీసింది. ఇంక ఎప్పుడైతే ఉక్కు వాడకంలోకి వచ్చిందో, ఆ ఉక్కుతో ముడిపడిన తుపాకులు రావడం ప్రపంచ గతినే మార్చేసింది. ఆ తుపాకుల వల్లే యూరప్ దేశాలు ప్రపంచాన్ని తమ కాలనీలుగా మార్చుకోగలిగాయి. ముఖ్యంగా ఆఫ్రికాలోని ప్రాచీన నాగరిక సమాజాలు, అవెంతటి ఘన సంస్కృతి కలిగినవి అయినప్పటికీ తుపాకుల ముందు నిలవలేకపోయాయి. అక్కడి నుంచి ఎంతో అమూల్యమైన సంపద తరలిపోయింది. మరి ఐరోపావాసులకు ప్రతికూలతలుగా పరిణమించినవి ఏవీ లేవా? ఏ భౌగోళిక రేఖ వెంబడి ప్రయాణిస్తూ వారికి అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండే ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’(దక్షిణాఫ్రికా)లో మనగలిగారో, దాన్ని దాటి ఆఫ్రికాలోని ఉష్ణ మండలం వైపు విస్తరించినప్పుడు కేవలం మలేరియాతో కోట్లాదిమంది చచ్చిపోయారు. ప్రపంచం స్థిరంగా ఆగిపోయేది కాదు. భౌతిక ప్రమాణాల రీత్యా ప్రపంచంలో అసమానతలు స్పష్టంగా కనబడుతుండవచ్చు. కానీ మొన్న కోవిడ్ మహమ్మారి సమయంలో ఐరోపా, అమెరికా అల్లాడిపోయాయి. అదే పేద దేశాలు అంత ప్రభావితం కాలేదు. కాబట్టి అసమానత అనేది కూడా ఒక చరాంకం కావొచ్చు. ఒకే సమాజంలోనే కొందరు ధనికులుగా, ఇంకొందరు పేదవాళ్లుగా ఎందుకు ఉండిపోతున్నారు? ఒకే ఇంటిలోనే ఇద్దరన్నదమ్ములు భిన్న స్థాయుల్లోకి ఎందుకు చేరుతున్నారు? ఈ మొత్తంలో మానవ ప్రయత్నానికి ఏ విలువా లేదా? అందుకే డైమండ్ జవాబులు మరీ సరళంగా ఉన్నాయేమో అనిపించక మానదు. కానీ మార్గదర్శులు వాళ్ల జీవితాలను రంగరించి కొన్ని సమాధానాలు చెబుతారు. వాటి వెలుగులో సమాజం మరిన్ని జవాబులు వెతకాల్సి ఉంటుంది. ఎందుకంటే మానవ సమాజం అనేది మానవ స్వభావం అంత సంక్లిష్టమైనది. -
కేవలం మూడున్నర గంటల్లో మట్టి ఇళ్లను నిర్మిస్తున్న ఇటలీ.. కారణం తెలుసా..
మన పూర్వికులు మట్టితో కట్టిన ఇళ్లలో జీవించారు. సైన్స్ అభివృద్ధిచెందని కాలంలో మట్టి ఇళ్లను నిర్మించుకుని నివాసమున్నారు. ఐతే టెక్నాలజీపై ప్రపంచానికే పాఠాలు చెప్పగల ఈ సంపన్న దేశంఎందుకో మట్టితో ఇళ్లను కట్టుతోంది. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.. ఇటలీలోని రావెన్న ప్రాంతంలో కుండ ఆకారంలో బంకమట్టితో ఇళ్లు కడుతున్నారు. అచ్చం.. మన పూర్వికుల ఇళ్లమాదిరి కట్టేస్తున్నారు. వీటిని టెల్కా హౌసులు అని అంటారు. అంతేకాదు 3డీ ప్రింటింగ్ సహాయంతో కేవలం మూడున్నర గంటల్లో వీటిని నిర్మిస్తున్నారు. 645 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ఈ గుండ్రని ఇళ్ల లోపల బెడ్ రూం, బాత్ రూం, లివింగ్ రూములతో సకల సౌకర్యాలతో కూడి ఉన్నాయి. ఈ డోమ్ హౌస్‌ల నిర్మాణాల వెనుక గొప్ప సందేశం కూడా ఉందండోయ్! వీటిని నిర్మించాలనే ఆలోచన సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ మారియో కుసినెల్లా నుండి ఉద్భవించింది. ఇళ్లు లేనివారు వీటిని వాడుకోవచ్చట కూడా. రాబోయో రోజుల్లో ఇంకా తక్కువ సమయంలో కట్టేస్తానంటున్నాడు మారియో. ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణ హిత ఇళ్లివి (ఎకో ఫ్రెండ్లీ హౌస్). ప్రకృతి విపత్తుల్లో ఒక వేళ ఇవి కూలిపోతే 3డి ప్రింటింగ్‌తో తిరిగి నిర్మించుకోవచ్చిన మారియో చెబుతున్నాడు. విపత్తు సంభవించే ప్రాంతాలకు ఇటువంటి ఇళ్లు మంచి ఎంపిక అని మారియో చెప్పారు. జీరో కార్భన్ కన్స్ట్రక్షన్ ఆవిష్కరణ కోసం ఈ ప్రాజెక్ట్ ఎంపిక చేయబడింది. ఈ ప్రాజెక్ట్ క్లైమాట్ ఛేంజ్ సమ్మిట్‌లో కూడా ప్రదర్శించబడింది. చదవండి: కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా? -
సంస్కృతికి జానపదమే మూలం
సాక్షి, బెంగళూరు: ఏ దేశ నాగరికత, సంస్కృతికైనా ఆ దేశంలోని జానపద విజ్ఞానమే మూలమని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భాష, కళలు, చేతివృత్తులు, పనిముట్లు, దుస్తులు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, వైద్యం, పంటలు, సంగీతం, నృత్యం, ఆటలు, హావభావాలన్నింటి సమాహారమే జానపద విజ్ఞానమని ఆయన తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పలువురు జానపద కళాకారులు అంతర్జాల వేదిక ద్వారా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జానపద సంపద లేకుండా భాషాభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి జరగవని.. ఆ రెండింటి పుట్టుక జానపదం నుంచే మొదలైందన్నారు. అమ్మ పాడే లాలిపాటలు, అలసట తెలియకుండా పాడుకునే శ్రామికుల గీతాలు, జీవితాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక తత్త్వాలు ఇలా ఏ సాహిత్యాన్ని చూసినా జానపద వాసన స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అలాంటి విలువైన జానపద సంపదను సంరక్షించుకుంటూ భాషా సంస్కృతులను నిరంతరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రామీణ ప్రజల జీవితాల నుంచే జానపద కళలు పుట్టాయని చెప్పారు. వీధినాటకాలు, తోలుబొమ్మలాటలు, బుర్రకథలు, యక్షగానాలు, జముకుల కథలు, పగటి వేషాలు వంటి వందలాది జానపద కళారూపాలు ఆ రోజుల్లో పల్లె ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచాయని చెప్పారు. తన బాల్యంలో పండుగ రాగానే తోలుబొమ్మలాట, కోలాటాలు, సంక్రాంతి సమయంలో హరిదాసులు, గంగిరెద్దులతో ఊరంతా కోలాహలంగా ఉండేదన్నారు. సినిమా, టీవీ, రేడియోల్లో జానపదాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ప్రముఖ జానప ద గాయకుడు దామోదరం గణపతి రావు, జానపద పరిశోధకులు డాక్టర్ సగిలి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
ముప్పు ఉంటే భారత్ యుద్ధం చేస్తుంది!
న్యూఢిల్లీ: జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ అక్టోబర్ 24న రిషికేష్‌లో చేసిన వ్యాఖ్యలు ఏ దేశాన్నో లేక ఏ పరిస్థితినో ఉద్దేశించిన చేసినవి కావని అధికారులు సోమవారం వివరణ ఇచ్చారు. అవి రిషికేష్‌లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారతదేశ నాగరికత గురించి ఆధ్యాత్మిక ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు అని వివరించారు. రిషికేష్‌లోని పారమార్ధ నికేతన్ ఆశ్రమంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ధోవల్ పాల్గొన్నారు. అక్కడ భక్తులను ఉద్దేశించి భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని గురించి ప్రసంగించారు. స్వామి వివేకానంద బోధనలను ప్రస్తావించారు. ‘భారతదేశం ఇప్పటివరకు ఎవరిపైనా దాడి చేయలేదు. దీని గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే, దేశానికి ముప్పు ఉందని భావిస్తే.. కచ్చితంగా భారత్ దాడి చేస్తుంది. ఎందుకంటే దేశాన్ని రక్షించడం చాలా ముఖ్యమైన విషయం. ప్రమాదం ఉందని భావిస్తే పోరాటం చేస్తుంది. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా, విస్తృత ప్రయోజనాలు లక్ష్యంగా ఆ పోరాటం ఉంటుంది. మన భూభాగంపై కానీ, ఇతరుల భూభాగంపై కానీ భారత్ పోరాడుతుంది. కానీ, అది స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రం కాదు.. విస్తృత ప్రయోజనాలు కేంద్రంగానే యుద్ధం చేస్తుంది’ అని ధోవల్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. తూర్పు లద్ధాఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాను ఉద్దేశించే ధోవల్ ఆ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నాయి. దాంతో, అధికారులు ధోవల్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. -
యుగాంతం కథ ఏంటి?
అసలే కరోనాతో ఓ వైపు ప్రపంచం గజగజవణికిపోతుంటే ఏప్రిల్ 19న ప్రపంచం కనుమరుగవుతోందని పిడుగు లాంటి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతరిక్షం నుంచి వస్తున్న ఓ పెద్ద గ్రహశకలం భూమి నుంచి దూసుకెళ్తుందని, అప్పుడు యుగాంతం తప్పదని అంటున్నారు. అయితే దీంట్లో వాస్తవమెంత..? ఇప్పుడే ఈ ప్రచారం ఎందుకు తెరపైకి వచ్చిందని అంతా చర్చించుకుంటున్నారు. 2020 సంవత్సరంలో ఓ భారీ గ్రహ శకలం భూమికి సమీపంగా వెళ్తుందని మూడేళ్ల క్రితం నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అదే విషయాన్ని పట్టుకొని ఇప్పుడు కొంత మంది భూమి అంతం కాబోతోందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి 2వేల అడుగుల పరిమాణం ఉన్న జేఓ25 అనే గ్రహశకలం భూమి నుంచి 1.8 మిలియన్ కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లనుందని నాసా పేర్కొంది. ఇది చంద్రుడి నుంచి భూమికి గల మధ్య దూరానికి 4.6 రెట్లు దూరంలో పయనించనుంది. కనుక భూమిని తాకే అవకాశమే లేదని నాసా స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ కారణంగా ఎటువంటి ప్రమాదం లేదని , వదంతులు నమ్మవద్దని సూచించింది. చదవండి: ఆస్టరాయిడ్ సమీపానికి నాసా నౌక 2004 సెప్టెంబర్‌లో టౌటాటిస్ అనే గ్రహశకలం భూమి నుంచి 4 లూనార్లతో దూసుకెళ్లింది. అయితే ఏప్రిల్ 19న భూమిని సమీపించబోయే గ్రహశకలం అంతకంటే పెద్దదని తెలుస్తోంది. కావాలనుకుంటే భూమి నుంచి దూరంగా వెళ్లే క్రమంలో రాత్రివేళ టెలిస్కోపు సాయంతో ఈ గ్రహశకలాన్ని చూడవచ్చని కూడా తెలిపింది. కాగా.. గడిచిన 400ఏళ్లలో కానీ.. రాబోయే మరో 500 ఏళ్లలో కానీ భూమికి ఇంత సమీపంలోకి రానున్న గ్రహశకలం మరేది ఉండబోదని మాత్రం నాసా స్పష్టం చేసింది. -
గ్రామీణ వారసత్వమే మన సంపద
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ వారసత్వం దేశానికి వెలకట్టలేని సంపద అని ప్రముఖ జర్నలిస్టు, రచయిత, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ పేర్కొన్నారు. ఆధునికత, నాగరికత పేరుతో అంతరించిపోతున్న గ్రామీణ సంస్కృతి, జీవనం, విలువలు, సంప్రదాయాలను కాపాడుకుని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ‘పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా’(పరి) పేరుతో శనివారం జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మంథన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హస్తకళలు, చేతివృత్తులు, గ్రామీణ భాషలు, లిపులు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం, అంతరించిపోతున్న అరుదైన కళలు, భాషలు, వంటకాలు తదితరాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో ‘పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా’పేరుతో డిజిటల్ జర్నలిజమ్ ఫ్లాట్‌ఫామ్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పాలగు మ్మి చెప్పారు. దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ఔత్సాహికులు, పాత్రికేయులు, 1000 మంది వాలంటీర్లు ఇందులో భాగస్వాముల య్యారన్నారు. కనుమరుగవుతున్న గ్రామీ ణ భాషలు, లిపులు, కళలు రికార్డు చేసి వెలుగులోకి తెస్తున్నామని, లక్షకు పైగా మరాఠీ గ్రామీణ గీతాలు, జనపదాలు వెలుగులోకి తెచ్చామని, ఇంకా బ్రతికి ఉన్న కొద్దిమంది స్వాతంత్ర సమరయోదుల అనుభవాలను ప్రజలకు పరిచయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రపంచీకరణ పేరుతో గ్రామీణ విధ్వంసం ఆమోదయోగ్యం కాదన్నారు. గ్రామీణ చేతివృత్తులు ,అరుదైన కళలను ముందు తరాలకు అందించాలనే లక్ష్యంతో లాభాపేక్ష లేకుండా ఈ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పలు గ్రామీణ ప్రాంతాల్లోని చేనేతకారులు, కేరళ మలబార్‌లోని కళాసీలు జీవనాధారం కోల్పోయారని, 50 ఏళ్లలో 200 గ్రామీణ భాషలు వాడుకలో లేకుండా పోయాయని సాయి నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. సువిశాల భారతంలో వివిధ ముఖకవళిలకలతో ఉండే ప్రజలను పరిచయం చేయడానికి ‘ఫేస్ డైవర్సిటి’పేరుతో దేశంలోని అన్ని జిల్లాల నుండి జిల్లాకు ముగ్గురు చొప్పన ఫోటోలు సేకరించి అందుబాటులో ఉంచే ప్రాజెక్ట్ కూడా ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో మంథన్ ప్రతినిధి అజయ్‌గాంధీ సహ పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు. -
స్త్రీలోక సంచారం
న్యూయార్క్‌లోని బుష్విక్ ప్రాంతంలో ఉన్న ‘హౌస్ ఆఫ్ ఎస్’ అనే పబ్‌కు వెళ్లిన ఓహియోలోని భారతీయ సంతతి అమెరికన్ యువతి అంకితా మిశ్రా.. పబ్‌లోని టాయ్‌లెట్స్ గుదుల గోడలపై ఉన్న హిందూ దేవతల చిత్రాలను చూసి దిగ్భ్రాంతి చెందారు. ‘‘గత నెలలో ఫ్రెండ్స్‌తో కలిసి ‘హౌస్ ఆఫ్ ఎస్’లో నౌట్ ఔట్‌కి వెళ్లాను. ఆ పబ్‌లోని వి.ఐ.పి.ల బాత్రూమ్కి వెళ్లినపుపడు.. లోపలి గోడలపై కాళీ మాత, సరస్వతి, శివుడు, విఘ్నేశ్వరుల బొమ్మలు కనిపించాయి. షాక్ తిన్నాను’’ అని ఆనాటి తన అనుభవాన్ని చెబుతూ.. పబ్ యాజమాన్యానికి హైందవ సంస్కృతి గొప్పతనాన్ని వివరించడంతో పాటు.. ఇతర మతస్థుల మనోభావాలను కించపరచడం నాగరికత అని గానీ, కళ అని గానీ అనిపించుకోదు’’ అంటూ అంకిత పెద్ద మెయిల్ పెట్టారు. ‘స్టాండప్ యువర్సెల్ఫ్’ అనే క్యాంపెయిన్‌తో మహిళలకు దేశవ్యాప్తంగా ఒక లక్ష ‘స్టాండ్ అండ్ పీ’ (నిలుచుని మూత్రవిసర్జన చేయడానికి అనువైన) సాధనాల ఉచిత పంపిణీ.. వరల్డ్ టాయ్‌లెట్ డే సందర్భంగా నవంబర్ 19న మొదలైంది. మురికిగా ఉండే పబ్లిక్ టాయ్లెట్లో మూత్రవిసర్జనకు అవస్థలు పడుతూ ‘కూర్చోవడం’ నుంచి విముక్తి కల్పిస్తూ, ఢిల్లీ ఐ.ఐ.టి. విద్యార్థులు కనిపెట్టిన శాన్ఫీ (శానిటేషన్ ఫర్ ఫిమేల్) అనే ఈ అట్టముక్క సాధనంతో మహిళలు నిలుచునే మూత్ర విసర్జన చేయవచ్చు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ శాన్ఫీలు ఒక్కోటి పది రూపాయలకే లభ్యం అవుతాయట. -
మన మూలాలు ఎక్కడ ?
సాక్షి, హైదరాబాద్ : భారత ఉప ఖండం చరిత్రకు సంబంధించిన ప్రధాన ప్రశ్నలతో పాటు, భారతీయ నాగరికతపై చేసిన వివిధ సూత్రీకరణలపై చర్చకు సమాధానాలు కనుక్కునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 92 మంది శాస్త్రజ్ఞులు రూపొందించిన ‘ ఓ నూతన పత్రం’ దీనికి మార్గం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే ‘ది జెనోమిక్ ఫార్మేషన్ ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా’ శీర్షికతో ఆన్లైన్లో పోస్టయిన ఈ పత్రంలో జన్యుశాస్త్రం మొదలుకుని ఉప ఖండంలో ప్రాచీన నివాసితుల వంశ పారంపర్య వివరాల వరకు పరిశీలించారు. అన్ని ప్రతిష్టాత్మక సంస్థలే... మనదేశ నాగరికతపై కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఉపకరించే ఈ పత్రాన్ని తయారు చేయడంలో హైదరాబాద్‌లోని సీసీఎంబీ మొదలుకుని హార్వర్డ్, ఎంఐటీ, ద రష్యన్ అకాడమి ఆఫ్ సైన్సెస్, ద బీర్బల్ సహాని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెన్ (లక్నో), ద దక్కన్ కాలేజీ, ద మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్, ద ఇనిస్టిట్యూట్ ఫర్ ఆర్కియాలాజికల్ రిసెర్చ్ ఇన్ ఉజ్బెకిస్తాన్... ఇలా 92 ప్రపంచప్రసిద్ధి పొందిన శాస్త్ర,సాంకేతిక, పరిశోధన సంస్థలకు చెందిన వారు భాగస్వాములయ్యారు. ఈ అధ్యయనానికి సహ డైరెక్టర్లుగా వ్యవహరించిన వారిలో జన్యుశాస్త్ర నిపుణుడు డేవిడ్ రీచ్ కూడా ఉన్నారు. అధ్యయనం ఇలా... వందేళ్ల క్రితం నాటి ప్రజల డీఎన్ఏ శాంపిళ్లతో (612 మంది ప్రాచీన పౌరులు) జన్యువుల ఆధారంగా ఈ పరిశీలన నిర్వహించారు. ఇందులో దక్షిణాసియా మొదలుకుని తూర్పు ఇరాన్, ప్రస్తుత ఉజ్బెకిస్తాన్‌లోని తురాన్, తుర్కెమినిస్తాన్, తజికిస్తాన్, ఖజకిస్తాన్‌లకు చెందిన వారి నమూనాలున్నాయి. మొత్తం 612 జన్యువుల్లో 362 మంది డీఎన్ఏలను తొలిసారి పరీక్షించారు. ఈ జన్యువుల నుంచి తీసుకున్న డేటాను ప్రస్తుతం దక్షిణాసియాలోని 246 విలక్షణ గ్రూపులతో సహా పైన పేర్కొన్న ఆయా ప్రాంతాల వ్యక్తుల సమాచారంతో పోల్చి చూశారు. దేనికోసమీ పరిశోధన ? మధ్య, దక్షిణాసియాలలో ప్రజలు ఎలా స్థిరపడ్డారు ? అన్న విషయంపై అంచనాకు వచ్చేందుకు తగిన స్థాయిలో పురాతన డీఎన్ఏతో పాటు పరిశీలన కొరవడింది. దీనికి సంబంధించి అనేక సూత్రీకరణలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని దక్షిణాసియాలోని రాజకీయాలతో ముడిపెట్టి చేసినవీ ఉన్నాయి. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి బలం చేకూర్చేలా నీలికళ్ల శ్వేతజాతీయులు గుర్రాలపై ఉపఖండానికి వచ్చి తమకు ఎదురైనా ప్రతీ దేశంపై విజయం సాధించారన్నది వీటిలో భాగంగా ఉన్నాయి. దీనికి పూర్తి విరుద్ధ వాదననను హిందుత్వవాదులు తీసుకొచ్చారు. భారత–ఐరోపా భాషలన్నీ భారత్ నుంచే పశ్చిమానికి వ్యాపించాయనే సూత్రీకరణా ఉంది. స్త్రీల నుంచి స్ల్రీలకు బదిలీ అయ్యే మైటోకాండ్రియల్ డీఎన్ఏ మన ఉపఖండ ప్రత్యేకతగా ఉంది. కొన్ని వేల సంవత్సరాలుగా స్థానికులు( ఇండీజీనియస్) భారత్‌లో ఉన్నారని ఈ పరిశీలన సూచిస్తోంది. అయితే పురుషుల నుంచి పురుషులకు బదిలీ అయ్యే ‘వై’ క్రోమోజోమ్‌ల ప్రాతిపదికన పశ్చిమ యూరో ఆసియన్లు, ఇరాన్ పీఠభూమి, మధ్య ఆసియన్లతో భారత్‌కు ఎక్కువ సంబంధాలున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో అసలు సింధు నాగరికతకు చెందిన ప్రజలెవరన్న ప్రశ్న ముందుకొచ్చింది. వారికి ద్రవిడియన్లుగా ముద్రపడ్డవారితో లేక ఆర్యుల వలసల కారణంగా దక్షిణాదికి పరిమితమైన వారితో వీరికి సంబంధాలున్నాయా ? లేదా వారే ఆర్యులా ? వారే క్రమంగా దక్షిణాదికి తరలివచ్చారా అన్న ప్రశ్నలకు జవాబులు ఈ అధ్యయనంలో లభించవచ్చునని భావిస్తున్నారు. కనుక్కున్నది ఏమిటీ ? ఈ అధ్యయనంలోని జన్యుపరమైన అంచనా ప్రకారం ప్రాచీన భారతం... ఉత్తర, దక్షిణ ప్రాంతాల ప్రజల పూర్వీకులను రెండు ప్రత్యేక బృందాలుగా విభజించారు. ప్రస్తుత యూరోపియన్లు, తూర్పు ఆసియన్ల మాదిరిగా ఈ బృందాలు రెండు కూడా ఒక దానికి ఒకటి పూర్తిగా భిన్నమైనవని పేర్కొన్నారు. అయితే ఈ రెండు జాతులు కూడా ఎక్కడి నుంచి వచ్చాయన్నది ప్రశ్న. వివిధ కాంబినేషన్లలో మూడు బృందాలు కలగలిసి పోయి ఈ రెండు జాతులు ఏర్పడడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. అవి... –ఈ అధ్యయనంలో దక్షిణ భారత ప్రాంత పూర్వీకులుగా పేర్కొన్నవారు (దక్షిణాసియాలో వేట ప్రధాన వృత్తిగా ఉన్న వారు) ఉపఖండంలో అతి ప్రాచీన ప్రజలని తేల్చారు. వీరికి ఆధునిక అండమాన్ ద్వీప ప్రజలతో సారూప్యతలున్నాయి. –ఇరాన్‌కు చెందిన రైతులు ఉపఖండానికి వలస వచ్చారు. వారి ద్వారా గోధుమలు, బర్లీ వంటి పంట పద్ధతులు ఇక్కడకు వచ్చాయి. – మధ్య ఆసియా నుంచి ఉత్తర అప్ఘనిస్తాన్ వరకున్న ప్రాంతంలోని ప్రజలు (ఆర్యులుగా గతంలో పిలిచేవారు) భారత్‌కు వలస వచ్చినవారిలో ఉన్నారు. వీరితో పాటు దక్షిణ ఆసియాతో సంబంధాలున్న ముఖ్యమైన జనాభా సింధు నాగరికతకు చెందినదిగా భావిస్తున్నారు.సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజలు చాలా మటుకు భారత జనాభాకు వారధిగా నిలుస్తూ దక్షిణాసియా పూర్వీకులకు సంబంధించి ప్రధాన వనరుగా నిలుస్తున్నట్టు ఈ అథ్యయనం పేర్కొంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నాగరికతను మింగేసిన వాతావరణం!
భారతదేశంలో వేల ఏళ్ల కిందే ఎంతో అద్భుతమైన నాగరికతలు విలసిల్లాయి. సింధు, వేదకాలపు నాగరికతలు పెద్ద నగరాలు, ఇళ్లు, సామాజిక ఏర్పాట్లు, మెరుగైన వ్యవసాయ పద్ధతులతో వందల ఏళ్లు సుభిక్షంగా వర్ధిల్లాయి. కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి అంతర్థానమైపోయాయి. దీనికి కారణం వాతావరణ మార్పులేనని ఇప్పటికే అంచనా వేసినా... ముఖ్యంగా నైరుతి రుతుపవనాల అస్తవ్యస్తతే ఆ నాగరికతలను అంతం చేసిందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రస్తుతం భూతాపం, వాతావరణ మార్పులు ప్రమాదకరంగా పరిణమిస్తున్న నేపథ్యంలో.. వాటి వల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనే దానికి సింధు, వేదకాలపు నాగరికతల అంతర్థానమే తార్కాణంగా నిలవనుంద – సాక్షి నాలెడ్జ్ సెంటర్ రుతుపవనాల వల్లేనా..? సింధు, వేదకాలపు నాగరికతలు ఎలా అంతరించాయనే దానిపై ఇప్పటికే అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆర్యుల దండయాత్రలు మొదలుకొని.. సరస్వతి నది అంతర్వాహినిగా మారిపోవడం, కరువుల వరకు ఎన్నో విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఆ సమయంలో ఆర్యుల దండయాత్ర లేదని డీఎన్ఏ పరీక్షలతో ఇప్పటికే రుజువైంది. సరస్వతి నది దిశ మార్చుకుందని.. ఫలితంగా హరప్పా, మొహంజొదారో నగరాల ప్రాంతంలో కరువు వచ్చి నాగరికత అంతరించిందన్న వాదనకు పూర్తిస్థాయి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఆశీష్ సిన్హా వినూత్న కోణంలో ఈ చిక్కుముడిని విప్పే ప్రయత్నం చేశారు. పురాతన గుహల్లోని రసాయనాలను విశ్లేషించి... మన దేశానికి ఆయువు పట్టు అయిన నైరుతి రుతుపవనాలు అప్పట్లో ఎలా ఉండేవో అంచనా వేశారు. సుమారు 5,700 ఏళ్లకు సంబంధించిన అంచనాలు పరిశీలించగా... రుతుపవనాలు దీర్ఘకాలం బలహీన పడిన సందర్భాల్లోనే ఈ రెండు నాగరికతలు విచ్ఛిన్నమై, చివరకు అంతరించాయని నిర్ధారించారు. వేదకాలం గురించి ఇప్పుడెందుకు? ఎప్పుడో వేల ఏళ్ల కింద కరువు కాటకాలతో రెండు నాగరికతలు అంతమైతే.. వాటి గురించి ఇప్పుడెందుకన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే నైరుతి రుతుపవనాల తీరుపై ప్రస్తుతం మన వద్ద 150 ఏళ్ల సమాచారం మాత్రమే ఉంది. దాన్ని పరిశీలిస్తే వరుసగా రెండు మూడేళ్లకు మించి కరువొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. మరి వరుసగా దశాబ్దాల పాటు కరువు కాటకాలు ఏర్పడితే పరిస్థితి ఏమిటన్నది సింధు, వేదకాలపు నాగరికతలను పరిశీలిస్తే తెలిసే అవకాశముంది. భూతాపం, వాతావరణ మార్పుల వంటి తాజా పరిణామాలను పరిశీలిస్తే... భవిష్యత్‌లో ఆ తరహా పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని ఆశీష్ సిన్హా చెబుతున్నారు. ఢిల్లీ సహియా గుహల్లో పరిశోధన ఢిల్లీకి ఉత్తరంగా 200 కిలోమీటర్ల దూరంలో సహియా గుహలున్నాయి. గంగా నదికి కొంచెం ఎగువన ఉన్న ప్రాంతమిది. అందువల్ల నైరుతి రుతుపవనాల్లో తేడా వస్తే.. అంటే కరువు వస్తే ఆ ప్రభావం ఎక్కువగా ఉండే చోటు ఇది. సముద్ర మట్టానికి 1,200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహల్లో స్టాల్గమైట్స్ ఉన్నాయి. చుక్కలు చుక్కలుగా నీళ్లు పడుతున్నప్పుడు కాలక్రమంలో అవి ఘనీభవించి ఏర్పడేవే స్టాల్గౖ మెట్స్. వర్షం పడినప్పుడు భూమిలోకి ఇంకిన నీరు.. ఈ గుహల్లో చుక్కలు చుక్కలుగా పడుతుంటుంది. ఆ నీరు ఘనీ భవించేటపుడు జరిగే రసాయన చర్యల వల్ల వాటిలో వేర్వేరు ఆక్సిజన్ ఐసోటోపులు (ఆక్సిజన్ పరమాణువులే అయినా.. వాటిల్లోని అనుఘటకాల సంఖ్య వేర్వేరుగా ఉండేవి) ఏర్పడతాయి. అంటే వానలు ఎక్కువగా పడితే ఒకలా.. లేదంటే మరోలా ఈ ఐసోటోపులు ఏర్పడతాయి. ఈ ఐసోటోపుల నిష్పత్తిని గణించిన ఆశీష్.. గతంలో అక్కడే ఏయే సమయాల్లో వర్షపాతం ఎలా ఉండేదో అంచనా వేశారు. మొత్తం గా విశ్లేషించగా వానలు కురవడం తగ్గిపోవడానికి.. నాగరికతలు అంతరించడానికి మధ్య సంబంధం స్పష్టమైంది. వానల వెంటే నాగరికత ఆశీష్ పరిశోధన ప్రకారం.. ఇప్పటికి సుమారు 4,550–3,850 ఏళ్ల మధ్య వర్షాలు విస్తారంగా కురిశాయి. ఆ సమయంలోనే సింధు నాగరికత వ్యవసాయాధార సమాజం నుంచి మహానగర నాగరికతగా మారినట్లు చరిత్ర చెబుతోంది. తరువాతి కాలంలో దీర్ఘకాలం కరువు కొనసాగడంతో ప్రజలు నగరాలు వదిలి వర్షపాతం ఎక్కువగా ఉన్న గంగా నది పరీవాహక ప్రాంతానికి వలస వెళ్లారని ఆశీష్ విశ్లేషిస్తున్నారు. ఇక వేదకాలపు సమాజం విషయానికొస్తే.. సుమారు 3,400 ఏళ్ల క్రితం వర్షాలు బాగా కురుస్తున్న సమయంలో సింధు నాగరికత ప్రాంతం నుంచి గంగా మైదానాలకు వలసలు పెరిగాయి. అవే వేదకాలపు నాగరికతగా అభివృద్ధి చెందినట్లు ఆశీష్ చెబుతున్నారు (ఈ చొరబాట్లు ఆర్యులవని ఆయన అంచనా). మళ్లీ సుమారు 300 ఏళ్ల తరువాత రుతుపవనాలు బాగా బలహీనపడటంతో.. అప్పటి ప్రజలు ఇంకా తూర్పు ప్రాంతం వైపు వలస వెళ్లారు. అక్కడ 600 ఏళ్లపాటు వేదకాలపు నాగరికత కొనసాగింది. తరువాత తిరిగి రుతుపవనాలు బలహీనపడినప్పుడు వేదకాలపు సమాజం మహా జనపదాలుగా విడిపోయి.. క్రమేపీ అంతరించినట్లు అంచనా. -
అన్నం ముద్ద మనిషి హక్కు
ఆహార హక్కు మనిషి కనీస హక్కు. భూమిపై పడిన ప్రతి ఒక్కరికీ భూమిపై మొలకెత్తిన ప్రతి గింజను పొందే నైతిక హక్కు ఉంది. నార్మన్ బొర్లాగ్ ఇలా అంటాడు : ‘‘నీ పక్కవాడు తినకుండా పడుకుంటే నీకా రోజు నిద్ర పట్టకూడదు. ‘బాగున్నావా’ అని అడిగే బదులు, ‘తిన్నావా?’ అని అడుగు. అప్పుడు వాడు నిజంగా ఎలా ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చెయ్యాలో తెలుస్తుంది. ఆకలి భయంతో సగం ప్రపంచం సూర్యోదయానికి భయపడుతూ లేస్తున్నప్పుడు నీ నాగరికతకు అర్థం లేదు. దేవుడిపై నీ విశ్వాసానికి అర్థం లేదు. ఆకలి భయంతో సగం ప్రపంచం.. కన్నీటిని కూడా పొదుపుగా ఖర్చు చేస్తున్నప్పుడు నువ్వు ప్రబోధించే శాంతి సామరస్యాలకు అర్థమేలేదు’’ అని. మనిషి ఆహారపు హక్కును కాపాడే ప్రయత్నం చేసిన అమెరికన్ వ్యవసాయ నిపుణుడు నార్మన్ బోర్గాగ్. ఆకలిగా ఉన్నవారికి ఇంత ముద్దను పెట్టడం కూడా మానవ హకుల్ని పరిరక్షించడం కిందికే వస్తుంది. (రేపు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం) -
తెరపైకి రమేశ్‌బాబు పౌరసత్వం
మూడు నెలల్లోగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశం వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రహోంశాఖలో పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని మూడు నెలల్లోగా నిర్ణయించాలని దేశ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం ఆదేశించినట్లు మీడియాలో రావడం వేములవాడ నియోజకవర్గంలో చర్చకు దారితీసింది. రమేశ్‌బాబు పౌరసత్వం కేసును విచారించిన జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రహోంశాఖకు సూచిస్తూనే... హైకోర్టుకు నిర్ణయం ప్రకటించాలని ఆదేశించిందని చర్చించుకుంటున్నారు. రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు రమేశ్‌బాబు ఏడాదిపాటు స్వదేశంలో ఉన్నట్లు రుజువు చూపించాలని కోరింది. కేంద్ర హోంశాఖ చేపట్టిన విచారణలో రమేశ్‌బాబు కేవలం 96 రోజులు మాత్రమే స్వదేశంలో ఉన్నట్లు తేలింది. ఇందుకు రమేశ్‌బాబుకు కేంద్ర హోంశాఖ కార్యాలయం షోకాజు నోటీసు జారీ చేసింది. దీంతో ఈ అంశంపై త్రీమెన్ కమిటీని వేయాలని రమేశ్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కమిటీ ముందు ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ హాజరై తన వాదనను వినిపించారు. అప్పట్నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ అంశం తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది. ఈ అంశాన్ని కేవలం మూడు నెలల్లో స్పష్టం చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. -
కుటిలం... కడు జటిలం
సోల్ / కపటం ‘నరుడు మదిలో దొంగ... నాల్క బూతుల బుంగ... కడుగజాలదు గంగ’ అన్నాడు ఆరుద్ర. ఇది కాలాతీత సత్యం. మానవుల్లో మెజారిటీ వర్గానిది ఇదే స్వభావం. పైన కనిపించేది ఒకటి, లోన ఉండేది మరొకటి. ప్రపంచంలో నాగరికత మొదలైన నాటి నుంచే మనుషుల్లో కపట స్వభావం మొదలై ఉంటుంది. నాగరికత నవీనతను సంతరించుకుంటున్న కొద్దీ ఇది మరింత విస్తరిస్తూ వస్తోంది. కొద్దిమంది రుజువర్తనులను మినహాయిస్తే మనుషులందరిలోనూ కొద్దో గొప్పో కపట స్వభావం ఉండనే ఉంటుంది. పెద్దమనుషులు ఈ స్వభావాన్ని ముద్దుగా ‘లౌక్యం’ అంటారు. అలా చెప్పుకుంటూ కల్తీలేని తమ కపట స్వభావాన్ని ‘లౌక్యం’గా కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. అంతేకాదు, కల్లకపటాలెరుగని అమాయక జీవులను, అన్నీ తెలిసినా ముక్కుసూటిగా ముందుకుపోయే మనుషులను చూసి ఇలాంటి పెద్దమనుషులు తెగ జాలిపడిపోతుంటారు కూడా. ‘పంచతంత్రం’ పెద్దపులి కపట స్వభావుల కుట్రలు, కుతంత్రాలు రాచరిక కాలంలోనూ ఉండేవి. కపట స్వభావులైన మేధావి మంత్రులు, ధూర్త సేనానుల కారణంగా గద్దెకు ముప్పు ఏర్పడిన సందర్భాలూ లేకపోలేదు. అయితే, ఆ సత్తెకాలంలో పామర జనులు అమాయకంగానే ఉండేవాళ్లు. కల్లకపటాల కల్తీకి కొంత దూరంగానే ఉండేవాళ్లు. కపట నాటకాలన్నీ పాలక వర్గాల్లోనే ఎక్కువగా జరిగేవి. మనుషుల్లోని కపట స్వభావంపై రాజులకు తగినంత అవగాహన, అలాంటి స్వభావాన్ని కట్టడి చేయగల సామర్థ్యం ఉంటే తప్ప సజావుగా రాజ్యం చేయలేరని అప్పట్లోనే కొందరు మహానుభావులు గ్రహించారు. రాజ్య సుస్థిరత కోసం, శాంతిభద్రతల కోసం భావి రాజులకు ఇలాంటి విషయాల్లో శిక్షణ కూడా ఇచ్చేవారు. విష్ణుశర్మ అనే పెద్దాయన రాజకుమారులకు చెప్పిన ‘పంచతంత్రం’ ఇలాంటి శిక్షణలో భాగమే. విష్ణుశర్మ చెప్పిన ‘పంచతంత్రం’లోని పెద్దపులి... ‘పాంథుడా ఇటు రమ్ము’ అంటూ బాటసారికి బంగారు కడియాన్ని ఎరచూపిన సన్నివేశం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ కథలోని పెద్దపులి కల్తీలేని కపటానికి తిరుగులేని ఉదాహరణ. డెమోక్రసీలో హిపోక్రసీ ఇప్పుడంతా ప్రజాస్వామిక యుగం. ఈ యుగం అంతా ప్రజలదే. వాస్తవికతలు ఎలా ఉన్నా, సాంకేతికంగా పాలకులూ వాళ్లే, పాలితులూ వాళ్లే. ప్రజాస్వామిక కపట నాటకాలన్నింటికీ ప్రజలు సూత్రధారులు కాకపోయినా, వాటిలో అనివార్య పాత్రధారులు. ఎంతైనా, డెమోక్రసీలో హిపోక్రసీదే రాజ్యం. అందువల్ల పాలకుల కపట స్వభావాన్ని ప్రజలు కూడా కొద్దో గొప్పో వంట పట్టించుకుని, ఆ విధంగా ముందుకు పోతున్నారు. ఓట్లు వేయడానికి బీరూ బిర్యానీలతో పాటు నోట్లు కూడా నిర్మొహమాటంగా తీసుకుంటున్నారు. ప్రజలే ఈ రీతిలో ముదిరిపోతే ప్రజా ప్రతినిధులుగా మనల్నేలుతున్న నాయకులు మాత్రం తక్కువ తింటారా? వాళ్లకు గల ఆకాశహర్మ్యాల విలువలను కూడా లెక్కల్లో అట్టడుగు అంకెల్లోనే చూపిస్తారు. నిరాడంబరతపై ప్రవచనాలు ఇస్తూనే, దేస్సేవ స్కీములో భాగంగా కోట్లాది రూపాయల ప్రత్యేక వాహనాలను, సాయుధ భద్రతా వలయాన్నీ సమకూర్చుకుంటారు. ప్రజల క్షేమాన్ని ఆలోచించే ఖర్చుకు వెనుకాడకుండా అధికారిక భవంతులకు వాస్తు మార్పులు చేయిస్తుంటారు. ‘కపట’పురాణం పురాణేతిహాసాల్లోనూ మనుషుల్లోని కపట స్వభావానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. నాటి రాజతంత్రంలోనూ, రణతంత్రంలోనూ కుతంత్రాల పాత్ర కూడా ఉండేది. జగద్గురువుగా జేజేలందుకున్న శ్రీకృష్ణుడిని కపటనాటక సూత్రధారిగా నిందిస్తారు కొందరు. పాండవులను గెలిపించడం కోసం శ్రీకృష్ణుడు వేసిన ఎత్తులను, జిత్తులను తప్పుపడతారు వారు. అయితే, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు జగన్నాటక సూత్రధారి అని, ఆయన లీలలన్నీ ధర్మసంస్థాపన కోసమేనని ముముక్షువులైన మహానుభావులు కొనియాడుతారు. ఉద్దేశం ఏదైనా, ఆయన అనుసరించిన మార్గం సరికాదని తప్పుపడతారు ముక్కుసూటి వాదులు. కృష్ణుడి సంగతి సరే, కౌరవుల పక్షాన ఉన్న శకుని కపట స్వభావానికి ఎవర్గ్రీన్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తాడు. లక్క ఇంటి దహనం, మాయాద్యూతం వంటి ఘట్టాల వెనుక శకుని మంత్రాంగమే కీలకం. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి తన చెల్లెలు గాంధారిని కట్టబెట్టిన భీష్ముడిపై పగతో కురువంశ వినాశనం కోసమే శకుని ఇదంతా చేశాడని, అందుకే కౌరవుల పంచన చేరి, అడుగడుగునా వాళ్లను రెచ్చగొట్టి కురుక్షేత్ర యుద్ధానికి పురిగొల్పాడని కూడా ప్రతీతి. చరిత్ర పుటల్లో... మౌర్యరాజ్య స్థాపనకు ముందు మగధను ఏలిన నందుల వద్ద మంత్రిగా పనిచేసిన రాక్షసామాత్యుడు కుతంత్రాల్లో ఆరితేరిన వాడు. అతగాడి అండ చూసుకునే మూర్ఖులైన నందులు అహంకారంతో విర్రవీగి చెలరేగారు. అర్థశాస్త్ర విశారదుడైన చాణక్యుడిని పరాభవించారు. తోక తొక్కిన తాచులా పగబట్టిన చాణక్యుడు శపథం పట్టి మరీ నందులను నాశనం చేశాడు. తన శిష్యుడైన చంద్రగుప్తుడిని గద్దెపెకైక్కించి, మౌర్యరాజ్య స్థాపనకు నాంది పలికాడు. రాక్షసామాత్యుడి అండలో ఉన్న నందుల నాశనానికి చాణక్యుడు కూడా కపట మార్గాన్నే అనుసరించాడు. కుటిల నీతినే పాటించి, కౌటిల్యుడిగా ప్రసిద్ధికెక్కాడు. లక్ష్యం మంచిదైనప్పుడు మార్గం ఎలాంటిదైనా ఫర్వాలేదనేది కౌటిల్యుడి మతం. ఇక ఆధునిక చరిత్రలో మేకియవెలీ అనే మహానుభావుడు రాజనీతిలో కాపట్యాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. ద్రోణుడికి ఏకలవ్యుడిలా ఆధునిక యుగంలోని రాజకీయాల్లో రాణిస్తున్న మహానుభావులందరూ మేకియవెలీ దొరగారికి అంతేవాసులే! బయటకు వాళ్లు ఎన్ని నీతిచంద్రికలను వల్లిస్తున్నా, లోలోపల మాత్రం ‘కపటం శరణం గచ్ఛామి’ అనేదే వారి నినాదం. - సాక్షి ఫ్యామిలీ -
సిగరెట్టుకు గొలుసుకట్టు
పీఛేముడ్ పొగాకుతో ‘చుట్ట’రికం మనుషులకు శతాబ్దాల కిందటే మొదలైనా, ఇరవయ్యో శతాబ్దంలో ఇది కొత్తపుంతలు తొక్కింది. పొగచుట్టలు నాజూకుదేరి సిగరెట్లుగా రూపాంతరం చెందాయి. ఇవి నవనాగరికతకు నిదర్శనాలుగా మారాయి. మన దేశంలో ఇంకా పొడవాటి లంక పొగాకు చుట్టలు రాజ్యమేలుతున్న కాలంలో పడమటి దేశాల్లో సిగరెట్ల ఫ్యాషన్ మొదలైంది. ఆడా మగా తేడా లేకుండా వాటిని ఊది పారేసేవారు. మరీ విచిత్రంగా అప్పటి వైద్యులు కూడా పొగతాగడం వల్ల చాలా జబ్బులు నయమవుతాయని చెప్పేవారు. సిగరెట్ తయారీ కంపెనీలు డాక్టర్ల సిఫారసులతో కూడిన ప్రకటనలు గుప్పించేవి. ఫలితంగా ఆ కాలంలో పడమటి ప్రపంచంలో మెజారిటీ జనాభాకు పొగ పీల్చనిదే ఊపిరాడని పరిస్థితి దాపురించింది. కొందరు పొగరాయుళ్లు ఒక సిగరెట్టుతో తృప్తి పడేవారు కాదు. ఒకటి వెంట మరొకటి... వెనువెంటనే ముట్టించేవారు. వాళ్ల శ్వేతకాష్టదహన క్రతువుకు నిద్రపోయే సమయంలో మాత్రమే విరామం దొరికేది. అలాంటి పరిస్థితుల్లో గొలుసుకట్టు పొగరాయుళ్ల కోసం ఒక సాధనం అందుబాటులోకి వచ్చింది. ఒక ప్యాకెట్ సిగరెట్లను ఏకకాలంలో అందులో ఒకటొకటిగా దట్టించి, ముట్టించి ధూమమేఘాలను సృష్టించే పరికరం అరచేతుల్లోకి చేరింది. ఆ పరికరమే ఈ ఫొటోలో కనిపిస్తున్న సిగరెట్ హోల్డర్. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అనే ప్రచారం మొదలవడంతో ఈ పరికరం ప్రాచుర్యం పొందక ముందే అంతరించింది. -
ఎ‘వరి’ది?
తిండి గోల భారతదేశానికి వ్యవసాయకదేశమని పేరు. వరి ఆధారిత కేంద్రమై విరాజిల్లుతోంది మనదేశమే. సింధు, హరప్పానాగరికతల కాలంలోనూ ఈ పంట మూలాలు మన దేశాన ఉన్నట్టు ఎన్నో చారిత్రక ఆధారాలు, వరిపంట మూలాలు భారత్‌లోనే ఉన్నాయని, వరికి జన్మస్థలం భారతదేశమేనని నిరూపించే తిరుగులేని సాక్ష్యాధారాలు మన శాస్త్రజ్ఞుల వద్ద ఉన్నాయి. ప్రపంచ వరి దిగుబడి మొత్తం పరిశీలిస్తే ఒక్క ఆసియా ఖండంలోనే 87 శాతం వరి పండుతుంది. ప్రపంచంలో ఎక్కువ వరి పంట సాగు విస్తీర్ణం ఉన్న దేశంగా భారత్‌కే గుర్తింపు ఉంది. దాదాపు నాలుగున్నర కోట్ల హెక్టార్లలో వరి సాగు ఇక్కడ జరుగుతోంది. కిందటేడాది కోటీ అరవై లక్షల టన్నుల దిగుబడిని సాధించిన చైనా ఆ తరువాతి స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనాకేంద్రం (ఐఎఆర్ఐ)కి చెందిన బయోటెక్నాలజిస్టుల బృందం వరి పంట మూలాలు, వరి పంట అభివృద్ధి, దిగుబడి బాగా ఉండే సరికొత్త వంగడాల గురించి విస్తృత పరిశోధనలు నిర్వహించింది. వీరు తమ పరిశోధనలలో వరి మూలాలు భారత్‌లోనే ఉన్నాయని, ఇది సంపూర్ణంగా స్వదేశీ పంట అని, దీని హక్కులు పూర్తిగా భారత్‌కు చెందినవేనని తెలిపారు. -
టూకీగా ప్రపంచ చరిత్ర 77
మెసొపొటేమియాకు సమాంతరంగా నడిచిన నాగరికత ఈజిప్టుది. క్రీ.పూ 5500 కాలంలో, నైలునది ఎగువప్రాంతాన నగరాల నిర్మాణానికి పూనుకున్న ఈజిప్షియన్లు స్థానికులు కాదేమోనని కొందరి అనుమానం. ఎందుకంటే. క్రీ.పూ. 5000కు ముందు ఆ ప్రాంతంలో నివసించిన మనుషుల అవశేషాలకూ, తరువాతి కాలం అవశేషాలకూ వ్యత్యాసం కనిపిస్తుండడం వల్ల ఆదిమకాలం తరహా సంప్రదాయం ఒక్కసారిగా అంతరించి, పైపొరల్లో ఎదిగిన మనుషుల సంప్రదాయంలోని అవశేషాలు బయటపడుతున్న కారణంగా వీళ్ళు మెసొపొటేమియా నుండి వచ్చిన వలసలై ఉండొచ్చని అనుమానం. దేవాలయాలూ, చిత్రలేఖనం వంటి నేర్పుల్లో మెసొపొటేమియాతో ఈజిప్టుకు పోలికలూ ఉన్నాయి, తేడాలూ ఉన్నాయి. నైలునదీ ప్రాంతంలో రాతికి కొరతలేని కారణంగా ఇక్కడి దేవాలయాలు రాతికట్టడాలు. ఈ దేవుళ్ళ ఆకారాలు వేరు, పేర్లు వేరు. అక్కడిలాగే ఇక్కడ కూడా అర్చకుల ఏలుబడిలో నగరపాలన మొదలైంది గానీ, పెద్ద ఆలస్యం కాకుండా ముగిసి, రాజవంశాల ఏలుబడికి సమాజం గెంతేసింది. అనాది నుండి ఈజిప్టు పాలకులు ‘ఫ్యారో’లుగా ప్రసిద్ధి. ఈ పాలకుల ప్రత్యేకత ఏమంటే - వీళ్ళు దేవుని సేవకులు కాదు; స్వయంగా దేవతామూర్తులు. క్రీ.పూ. 3వ శతాబ్దంలో నివసించిన ‘మ్యానెథో (క్చ్ఛ్టజిౌ)’ పేరుగల అర్చకుడొకాయన, అనాది కాలం నుండి తన జీవితకాలం దాకా పరిపాలించిన రాజులందరిని 30 వంశాలుగా విభజించాడు. ఆ వంశాలకు విడివిడి పేర్లు లేకపోవడంతో, 1వది, 2వది, 3వది అంటూ లెక్కించడం ఆనవాయితీగా రూపొందింది. ఉత్తర, దక్షిణ నైలునదీ ప్రాంతాలను ఏకం జేసి, ఈజిప్టు మొత్తాన్ని ఒకే సామ్రాజ్యంగా నెలకొల్పిన ఘనతను అతడు ‘మెనెస్’ పేరుగల ప్రభువుకు ఆపాదించాడు. ఐతే, చారిత్రక పరిశోధనల్లో అలాంటి పేరుండే చక్రవర్తి ఆనవాళ్ళు దొరకలేదు. ‘నేర్మెర్ ప్యాలెట్ మీద, రాజలాంఛనాలు ధరించి వేటినో ఏకం చేస్తున్న భంగిమలో కనిపించే క్రీ.పూ. 3150 నాటి ‘ఫ్యారో నేర్మర్’ చక్రవర్తే ఆ మెనెస్ అయ్యుండొచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. అత్యంత విస్తారమైన ప్రాచీన నాగరికతగా పేరుగాంచిన ‘సింధూ’ పీఠభూమి పరిపాలనా విధానం గురించి చెప్పేందుకు ఎంతైనా ఉందిగానీ, నిరూపించేందుకు ఆధారాలు శూన్యం. తవ్వకాల్లో బయటపడిన కట్టడాల్లో స్మారకచిహ్నాలుగానీ, రాజమందిరాలుగానీ, దేవాలయాలుగానీ మచ్చుకైనా కనిపించవు. చక్కని వ్యూహరచనతో నిర్మితమైన పట్టణాలూ, ప్రతి ఇంటిని అనుసంధానం చేసే మురుగునీటి తరలింపు సౌకర్యం, ప్రామాణీకరించబడిన తూనికలూ, కొలతలూ తదితర విధానాలు పరిపాలన లేకుండా జరిగేవిగావు. అది ఏ తరహా పాలో తెలుసుకునేందుకు గోరంత ఆధారం లేదు. ఆలయాలు గానీ, అర్చక వ్యవస్థగానీ లేకపోవడంతో సింధూ ప్రాంతీయుల ఆధ్యాత్మిక భావాలను గురించి తెలుసుకునేందుకు వీలుపడటం లేదు. ముద్రికల మీద అస్పష్టంగా ఉన్న బొమ్మల ఆధారంగా వాళ్ళు ‘పశుపతి’ని ఆరాధించేవాళ్ళని అన్వయిస్తున్నారేగానీ, యోగ ముద్రలో కూర్చోనున్నట్టు కనిపించే బొమ్మలను దేవుళ్ళతోనూ పోల్చుకోవచ్చు, కళావికాస ప్రయత్నంగానూ భావించొచ్చు. క్రీ.పూ. 5వ శతాబ్దం వాడైన హెరొడొటస్ మొదలు క్రీ.శ.1900 దాకా ఏ చరిత్రకారునికి సింధూ నాగరికత మీద దృష్టి పడకపోయేందుకు కారణం అందులోని పౌరజీవితం నోచుకున్న ప్రశాంతత. వంచితే వంగిపోయేంత బలహీనమైన బరిసెలు, కొన్ని కత్తులు తప్ప అక్కడ ఇతర ఆయుధాల జాడ కనిపించదు. డాలు, ఖడ్గం వంటి పరికరాలు లేకుండా ఆ బరిసెలతో యుద్ధాలు చెయ్యడం సాధ్యపడదు. కొన్ని పట్టణాల చుట్టూ బలమైన గోడలు కనిపించినా, వాటి ప్రయోజనం అనూహ్యమైన వరదను అడ్డుకునేందుకే తప్ప ఆత్మరక్షణ కోసం కట్టుకున్నవిగా కనిపించదు. ఈజిప్టుకుమల్లే సింధూ పీఠభూమిది స్వయం సంరక్షిత నైసర్గిక స్వరూపం. ఉత్తరంలో హిమాలయ పర్వతాలు; పడమట బెలూచీ పర్వతాలు; దక్షిణాన అరేబియా సముద్రం, వింధ్య పర్వతాలు; తూర్పుదిశ నుండే యమునా గంగా మైదానం దట్టమైన అరణ్యం. అందువల్ల, పరాయి దండయాత్రల బెడద ఈ ప్రాంతానికి లేదు. రాచకుటుంబాల మధ్య అధికారం కోసం జరిగిన కుమ్ములాటల వల్ల చరిత్రకారుల దృష్టిని ఆకర్షించగలిగింది ఈజిప్టు. ఇతరుల దృష్టిని ఆకర్షించగల సంఘటనే సింధూ నాగరికతలో కనిపించదు. క్రీ.పూ. 1500 ప్రాంతంలో హఠాత్తుగానూ, మూకుమ్మడిగానూ, వారసులనైనా మిగల్చకుండా ఈ నాగరికత ఎలా, ఎందుకు అంతరించిందో అంతుదొరకని చిక్కుముడిగా మిగిలిపోయింది. ఆ నాగరికులు మిగిలించిపోయిందల్లా, ‘వాళ్ళు మావాళ్ళే’ నని భారతదేశంలో ఏవొక్కడైనా ఎగబడగల హక్కు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 47
నాగరికత దొరికిన ముద్రికా పరికరాల్లో ఎక్కువభాగం ‘స్టీటైట్’ అనే సబ్బు రాయితో తయారైనవి. వాటి మీది సంకేతాలను డిసెఫర్ చేసేందుకు ఇంతదాకా చేసిన ప్రయత్నాలు వమ్ముకావడంతో, వాటి అంతరార్థం చేతికి చిక్కడం లేదు. వాటి నడక కుడినుండి ఎడమకు సాగుతుందని మాత్రమే ఇప్పటికి తెలుసుకోదగిన సమాచారం. అసలు అది లిపే కాదనే అభిప్రాయం కూడా వినపడుతున్నా, అంకెలూ అక్షరాలూ లేకుండా వేల సంవత్సరాల పర్యంతం విదేశీ వ్యాపారం వీలుపడదు కాబట్టి, ఏదోవొక వ్రాత సింధూ నాగరికులకు ఉండే తీరాలనేది బలమైన వాదన. వ్రాతకు ఉపరితలంగా వాళ్ళు ఏతరహా సరకును వినియోగించారో ఆధారాలు లేవు. తాళపత్రం వంటి సున్నితమైన సరుకునే వాడివుంటే ఇకమీదట కూడా ఆనవాళ్ళు దొరక్కపోవచ్చు. మెసొపొటేమియన్లు ‘మెలూహా’గా వ్యవహరించిన ప్రాంతం సింధూ పీఠభూమేనని చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య నడిచిన వాణిజ్యం గురించి మనకు తెలుస్తున్న సమాచారమంతా మెసొపొటేమియా రికార్డులో దొరికిందే. సింధూ ఎగుమతుల్లో ప్రధానమైనవిగా మనకు తెలుస్తున్నది - రంగురాళ్ళతో తయారైన అలంకార సామగ్రి, చముర్లు, ఏనుగు దంతం, నూలుబట్టలూ, కలప. చముర్లలో అవిసెనూనె, నువ్వుల నూనె ప్రధానమైనవి. నువ్వుల నూనెకు మెసొపొటేమియన్లు వాడిన ‘ఎళు’ అనే మాట, దక్షిణభారతంలోని తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో అదే పదార్థానికి అదే మాట ఇప్పటికీ నిలిచి వుండడం గమనార్హం. పలురకాల కలప దిగుమతుల్లో కర్జూరపు మొద్దులు ఉన్నట్టు నమోదుకావడం చోద్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే, కర్జూరం అక్కడి పంటేగాని ఇక్కడి పంట కాదు. ఈ ప్రాంతంలో ఉండేవి ఈతచెట్లు, తాటిచెట్లు. ఈత మొద్దులను కలపగా వాడరు కాబట్టి, బహుశా అవి తాటిమొద్దులై ఉండొచ్చు. శంకుగవ్వలూ, దంతం, సిరామిక్ మట్టితో తయారైన గాజులు అక్కడి స్త్రీలకు అపురూపమైన అలంకరణ సామగ్రి. ఆ సంప్రదాయం పశ్చిమాసియాలో ఇప్పటికీ స్థిరంగా నిలిచిపోయేందుకు కారణం సింధూ నాగరికులే. మొదట్లో ఈ సరుకుల రవాణా పర్వతలోయల గుండా భూమార్గంలో ఇరాన్ మీదుగా మెసొపొటేమియా చేరేది. కొంతకాలం తరువాత భూమార్గం పూర్తిగా వదిలేసి సింధూవాసులు సముద్రమార్గం ఎంచుకున్నారు. నౌకల ద్వారా ఒకేసారి పెద్దమోతాదులో సరుకులను తీసుకుపోగల వీలు, దళారుల బెడద తప్పి స్వయంగా వ్యాపారం నడుపుకోవడంలోని ప్రయోజనం, రాజకీయ కల్లోలాల మూలంగా ఏర్పడే ఆటంకాలు లేకపోవడం వంటి సదుపాయాలు వాళ్లను సముద్రయానానికి ప్రోత్సహించింది. ఇప్పటి సింధురాష్ట్రంలోని మక్రాన్, కచ్ ప్రాంతంలోని పబూమత్, సౌరాష్ట్రలోని కుంటసి, లోథాల్ పట్టణాలు ప్రధానమైన ఓడరేవులుగా ఉండేవి. ఇక్కడ బయలుదేరే నౌకలకు మొదటి మజిలీ ఒమాన్‌లోని మగాన్ రేవుపట్టణం. తరువాతిది బహ్రైన్ దీవిలోని క్వాలాయెట్ అల్ బహ్రైన్ పట్టణం. ఇంత భారీ ఎగుమతులకు దీటుగా సింధూ నాగరికులు దిగుమతి చేసుకున్న సరుకులేవో సంపూర్ణంగా తెలియడంలేదు. ఇక్కడ దొరకనివల్లా లోహాలూ, ఖర్జూరాలూ, నాణ్యమైన ఉన్నిబట్టలు. అంత విలువైన ఎగుమతులకు ఈ కొద్దిపాటి దిగుమతులు దీటు కావు. గవ్వలూ, తాబేళ్ళూ, ఎండుచేపలు దిగుమతుల్లో ఉన్నట్టు ఆధారాలున్నాయి. సుదీర్ఘమైన సముద్రతీరం ఇక్కడే ఉండగా వాటి అవసరం ఎందుకొచ్చిందో తెలీదు. బహుశా, ఈ తీరంలో దొరకని ప్రత్యేక తరహా చేపలూ గవ్వలూ తెచ్చుకోనుండొచ్చు. క్రీ.పూ. 18వ శతాబ్దం నుండి ఈ రెండు ప్రాంతాల మధ్య జరిగిన వ్యాపారం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఇరాన్, ఈజిప్టు, అనటోలియాల పోటీని తట్టుకోలేక ఎగుమతులు మందగించడంతో, విదేశీ వ్యాపారమే జీవనాధారంగా ఎదిగిన హరప్పా, మొహెంజదారో వంటి నగరాలు ప్రాభవాన్ని కోల్పో యాయి. బ్రతుకుదెరువుకోసం అక్కడి పౌరులు నగరాలను వదిలేసి, వ్యవసాయం దిశగా వృత్తిని మార్చుకున్నట్టు కనిపిస్తుంది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 44
నాగరికత అతలాకుతలమైన భూగోళపు ఉపరితలం కుదురుబాటుకు చేరుకుంటున్న తరుణంలో మానవుని పరిణామంలో ‘నాగరికత’ మోసెత్తింది. ఏ పదివేల సంవత్సరాలకు పూర్వమో విల్లనమ్ములు చేత్తో పట్టుకుని దశదిశలా విస్తరించిన మానవునితో మనకు ‘సంస్కృతి’ ప్రారంభం కాగా, నాగలి పట్టిన మానవునితో నాగరికత మొదలయింది. సంస్కృతి వేరు, నాగరికత వేరు. ఉమ్మడి ఆచార విశ్వాసాలు సంస్కృతి; ఉమ్మడిగా అనుభవించే సౌకర్యాలు నాగరికత. సంస్కృతి సంచార జాతుల్లోనూ ఉంటుంది. నాగరికత స్థిరనివాసుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఏడాది పొడవునా నీటికి కొరత ఉండని జీవనదులను ఆశ్రయించి క్రీ.పూ.7000 ప్రాంతంలో నాగరిక నివాసాలు మొదలైనట్టు మనకు దొరుకుతున్న ఆధారాలు నిరూపిస్తున్నాయి. చిత్రమేమిటంటే - ఈ రెండు దశలూ కొత్తరాతియుగం అంతర్భాగాలే. లోహం గురించి అప్పటికి తెలీకపోవడంతో, కర్రు లేని నాగలితో సాగిందే సేద్యం; రాతి కొడవలితో బరుక్కున్నదే కోత! అతి పురాతనమైన నాగరికతలుగా ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాల్లో బహు విస్తారమైనవి - 1. మెసొపొటేమియా, 2. ఈజిప్టు, 3. సింధూ, 4. చైనా నాగరికతలు. వీటిల్లో ముందుగా చెప్పుకోదగింది ‘మెసొపొటేమియా’. యూఫ్రాటెస్,టైగ్రిస్ పేరుగల రెండు నదుల మధ్య విస్తరించిన ప్రాంతం కావడంతో దీనికి ఆ పేరొచ్చింది. ఈ నదుల మూలంగా, సిరియా మొదలు పర్షియల్ గల్ఫ్వరకు చాపంలా విస్తరించిన పీఠభూమి (ఫెర్టైల్ క్రిసెంట్) ప్రపంచంలోకెల్లా అత్యంత సారవంతమైనదిగా ప్రసిద్ధి. చరిత్రకు పితామహుడైన ‘హెరొడోటస్’ ప్రకారం, ఆ భూముల్లో విత్తిన ప్రతి గోధుమ గింజ రెండు వందల రెట్లు ఫలసాయం ఇచ్చేదట. అంతేగాదు, ఆరోజుల్లోనే గోధుమను ఇరుగారు పండించేవాళ్ళనీ, కోతలు పూర్తయిన తరువాత ఆ పొలాల్లో పశువులకు మేత పుష్కలంగా దొరికేదనీ, ఖర్జూరం మొదలు ఎన్నోరకాల పండ్ల చెట్లు ఆ ప్రాంతంలో విస్తారంగా ఉండేవనీ బైబిల్ కాలంనాటి చరిత్రకారులు చెబుతున్నారు. హెరొడోటస్ నాటికి గోధుమ బహుళ ప్రచారం పొందిన పంట కావచ్చుగానీ, తొలితరం వ్యవసాయదారునికి ఆ పైరును గురించి అవగాహన లేదు. అప్పట్లో తెలిసిన తృణధాన్యాలు జొన్న, బార్లీ మాత్రమే. గోధుమను తెలుసుకునేందుకు మరో రెండువేల సంవత్సరాలు పట్టింది. ఆహారంలో భాగంగా పప్పుదినుసులు ఎప్పుడు మొదలయ్యాయో చెప్పలేం గానీ, పలురకాల పప్పుధాన్యాలు మెట్టపైర్లుగా మెసొపొటేమియాలో ప్రవేశించాయి. వాళ్ళ వ్యవసాయం తడిపైర్లకు మాత్రమే పరిమితం కాలేదనీ, అది బహుముఖంగా విస్తరించిందనీ ఈ పప్పుదినసులు నిరూపిస్తున్నాయి. వీటిల్లో ‘నువ్వులు’ కూడా ఉండడం మరింత అపురూపం. నువ్వుల నుండి వచ్చింది ‘నూనె’. సంస్కృతంలో ‘తిల’ నుండి వచ్చింది ‘తైలం’. నూనెనిచ్చే పదార్థాలకు నువ్వుగింజ మొదటిది కావడంతో, ఆ తరువాత ఏ గింజనుండి అలాంటి పదార్థం లభించినా దాన్ని నూనెగానే వ్యవహరిస్తున్నాము - అవిసె నూనె, ఆవనూనె, కుసుమనూనె, వేరుసెనగ నూనె - ఇలా. మరో మూడువేల సంవత్సరాల తరువాత సింధూనది తీరంనుండి దిగుమతులు మొదలయ్యేవరకూ ‘పత్తి’ని గురించి మెసొపొటేమియాకు తెలీదు. దుస్తులుగా వాళ్ళు ధరించినవి ఉన్నితోనూ, నారతోనూ తయారైన బట్టలు. ‘మగ్గం’ ఇంకా అందుబాటులోకి రానందున, పడుగునూ పేకనూ చేతికర్రల సహాయంతో మార్చుకుంటూ నేసేదే నేత. లడక్, మేఘాలయా ప్రాంతాల్లో ఇప్పటికీ ఈతరహా నేత మనకు కనిపిస్తుంది. వాడుకునే దినుసులన్నీ ఒకే తావులో పండవు కాబట్టి ప్రయత్నం లేకుండా ప్రవేశించిన విధానం ‘వస్తుమార్పిడి’. దరిమిలా, సంతల రూపంలో వర్తకానికి పునాది ఏర్పడింది. వర్తకం అనగానే ప్రామాణికమైన కొలతలూ, తూకాలూ అవసరమౌతాయి. ఒకే పరిణామంలో తయారుచేసుకున్న గంపలతోనూ, ఇంచుమించు ఒకే బరువుండే గుండ్రాళ్ళతోనూ బహుశా వాళ్ళు ఆ అవసరాన్ని తీర్చుకోనుండొచ్చు. గింజకూ గింజకూ తూకంలో తేడా స్వల్పాతిస్వల్పమైన కారణంగా గురువింద గింజలను ఇటీవలి కాలందాకా బంగారు తూకానికి వినియోగించడం మనం చూసేవున్నాం. రచన: ఎం.వి.రమణారెడ్డి -
నేలమ్మా.. మన్నించమ్మా!
జీవానికి మూలాధారమైన నేలతల్లి నిర్లక్ష్యమై వట్టి పోతోంది. సకల జీవకోటికీ స్తన్యం పడుతున్న నేలమ్మే నాగరికతకు పునాది. మానవులతోపాటు భూమిపైన, భూమి లోపల సకల జీవులకూ ప్రాణాధారం భూమాతే. అన్నదాత చేతుల మీదుగా మన కంచాల్లోకి వస్తున్న ఆహారంలో 99% భూమాత ప్రసాదమే! ఆహారం, నీరు, వాతావరణం, జీవవైవిధ్యం, జీవితం.. వీటన్నిటికీ ప్రాణ దాతైన భూమాతతో సజీవ సంబంధాన్ని కొనసాగించడంలో మనం ఘోరంగా విఫలమయ్యాం. అందుకే.. అంతటి చల్లని తల్లికే పుట్టెడు కష్టం వచ్చిపడింది. సాగు భూమిలో 25% ఇప్పటికే నిస్సారమైంది. జీవాన్ని.. సేంద్రియ పదార్థాన్ని కోల్పోయింది. చౌడు తేలింది. చట్టుబండైంది. నీటిని గ్రహించే శక్తి నశించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. పంటల సాగుకు పనికిరాకుండా పోయింది.. నాశనమవుతూనే ఉంది.. ప్రతి ఏటా రెండున్నర కోట్ల ఎకరాల్లో సుసంపన్నమైన నేల నాశనమైపోతున్నది. అంటే.. ప్రతి నిమిషానికి 30 ఫుట్‌బాల్ కోర్టులంత మేర సారవంతమైన భూమి పనికిరాకుండా పోతోంది. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) నివేదిక ప్రకారం.. నేలతల్లి ప్రాణాలను అనుక్షణం మనమే చేజేతులా తోడేస్తున్నాం. ఈ విధ్వంసం అంతా వ్యవసాయం పేరిట సాగిపోతోంది.. జీవనాధారంగా ప్రారంభమైన వ్యవసాయం.. విచక్షణారహితంగా వాడుతున్న వ్యవసాయ రసాయనాల వల్లనే ముఖ్యంగా నేల నిర్జీవమవుతోంది. తల్లి ఆరోగ్యం పాడైతే బిడ్డ బాగుంటుందా? అతిగా రసాయనిక అవశేషాలున్న ఆహారం తిన్న నేలతల్లి బిడ్డల ఆరోగ్యం కూడా అంతకంతకూ క్షీణిస్తోంది. మానవాళి మనుగడ సజావుగా సాగాలంటే.. నెత్తికెక్కిన కళ్లను నేల లోతులకు మళ్లించాలి. వనరుల విధ్వంసం ఆగాలంటే.. పారిశ్రామిక దేశాలు రుద్దిన సాంద్ర వ్యవసాయ పద్ధతిని వదిలేసి, ప్రకృతికి దగ్గరవ్వాలని ఎఫ్ఏవో మొత్తుకుంటున్నది. ఆహార భద్రత, పర్యావరణ వ్యవస్థలకు భూమి ఆరోగ్యం ప్రాణావసరమన్న స్పృహను పాలకుల్లో, ప్రజల్లో రగిలించడం తక్షణావసరం. ఇందుకోసమే 2015ను ‘అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అంతర్జాతీయ భూముల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5(రేపు) నుంచే భూముల పరిరక్షణకు పాలకులు, రైతులు, ప్రతి మనిషీ కదలాలని పిలుపునిచ్చింది. భూసారాన్ని పునరుద్ధరించుకుంటూనే నిశ్చింతగా జీవనాధారమైన పంటల సాగుకు ప్రపంచమంతా కంకణబద్ధులు కావాల్సిన తరుణమిది. వాతావరణ మార్పుల ప్రతికూల పరిస్థితుల మధ్య తెలుగు రాష్ట్రాలు ఈ అంశంపై తీక్షణంగా దృష్టిసారించాలి. భూసార విధ్వంసక విధానాలకు, అసపవ్య సాగు పద్ధతులకు పాతరేద్దాం.. ప్రకృతికి కీడు చేయని పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న ఆదర్శ అన్నదాతలకు జేజేలు పలుకుదాం.. నిస్సారమైన నేలకు తావు లేని రోజు కోసం అందరం ఉద్యమిద్దాం. జీవిత కాలంలో సెంటీమీటరు నేలను కూడా మనం సృష్టించలేం. అలాంటప్పుడు భూమిని పాడు చేసే హక్కు మనకెక్కడిది? ఆ తల్లి స్తన్యం తాగి రొమ్ము గుద్దడం మాని, నేలమ్మను పరిరక్షించుకుంటే పోయేదేమీ లేదు.. ఆహారోత్పత్తి 58% పెరగటం(ఎఫ్ఏఓ అంచనా) తప్ప! మనిషి పనుల మూలంగా నేలమ్మ చాలా వేగంగా సారాన్ని కోల్పోతూ సాంఘిక, ఆర్థిక, ఇతర సమస్యలకు దారితీస్తోంది. నేలను అపసవ్యమైన రీతుల్లో అతిగా వినియోగించడం మనుగడకే ఎసరు తెస్తోంది. హరిత విప్లవ కాలంలో ముందుకొచ్చిన సాంద్ర వ్యవసాయ పద్ధతుల వల్ల గత ఆరు దశాబ్దాలుగా నేల గతమెన్నడూ ఎరుగనంతగా పతనమైంది. అవసరానికి మించి దున్నడం, ఏదో ఒకే పంటను సాగు చేయడం, సేంద్రియ ఎరువులు చాలినంతగా వేయకపోవడం, రసాయనిక ఎరువులతోపాటు కలుపు మందులను విచ్చలవిడిగా వాడటం, కాలువ నీటి వాడకంలో అపసవ్య పోకడలు.. ఇవీ భూములు నాశనం కావడానికి ముఖ్య కారణాలని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఆహారోత్పత్తి వ్యవస్థే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దేశంలో 12 కోట్ల 10 లక్షల హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది. ఇందులో 2 కోట్ల 28 లక్షల హెక్టార్ల సాగు భూమి కేవలం రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడడం వల్ల నిర్జీవమై సాగుకు పనికిరాకుండా పోయింది. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చే క్రమంలో మన దేశంలో సాగు భూమి తగ్గిపోతున్నది. 1951లో ప్రతి మనిషికీ 1.19 ఎకరాల చొప్పున సాగు భూమి అందుబాటులో ఉండేది. ఇది 1991 నాటికి 40 సెంట్లకు తగ్గింది. 2035 నాటికి 20 సెంట్లకు తగ్గేలా ఉంది. ఉత్పాదకతను కోల్పోతున్న లక్షల హెక్టార్లు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 రకాల భూములున్నాయి. మెట్ట, మాగాణి అనే తేడా లేకుండా అన్ని రకాల భూముల్లోనూ సారం అంతకంతకూ తగ్గిపోతూ పంటల దిగుబడి క్షీణిస్తోంది. తెలంగాణ (భూముల్లో 29 శాతం) లో 34 లక్షల హెక్టార్ల భూమి ఏదో ఒక రకంగా ఉత్పాదక శక్తిని కోల్పోయిందని తాజా అంచనా. ఆంధ్రప్రదేశ్ (భూముల్లో 36 శాతం)లోని 58 లక్షల హెక్టార్ల భూములు నిస్సారంగా మారాయి. సేంద్రియ కర్బనం 0.5 శాతానికి అడుగంటిందని అంచనా. దీన్ని 2 శాతానికి పెంచుకోవడమే లక్ష్యంగా బహుముఖ వ్యూహాలను ప్రభుత్వం అమల్లోకి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, వీటిని రైతు దగ్గరకు తీసుకెళ్లే యంత్రాంగమే అరకొరగా ఉంది. రైతుకు సాంద్ర వ్యవసాయాన్ని అలవాటు చేసిన ప్రభుత్వం.. దాని ద్వారా ఏర్పడిన భూసార సమస్యను అధిగమించే సులభమైన, ఆచరణాత్మక పద్ధతులను రైతులకు అందించలేని స్థితిలో ఉండిపోవడం విషాదకర వాస్తవం. దిక్కుతోచని బడుగు రైతు మనుగడకే ఇది పెనుశాపంగా పరిణమించింది. ఫ్రాంక్లిన్ డెలొనొ రూజ్వెల్ట్ ఇలా అన్నారు: ‘భూములను నాశనం చేసుకునే దేశం, తనను తాను నాశనం చేసుకుంటుంది’. ప్రస్తుతం మన భూములు, మన దేశం పరిస్థితి ఇలాగే ఉంది. ప్రత్యామ్నాయాల అడుగుజాడలు.. ప్రభుత్వం చేష్టలుడిగినంత మాత్రాన అన్నదాతలు అక్కడే ఆగిపోరు. తమ సమస్యలకు తామే పరిష్కారాలు వెతుక్కుంటూనే ఉంటారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడడం పూర్తిగానో, పాక్షికంగానో మానేసి.. స్థానిక వనరులతోనే ఖర్చు తక్కువతో కూడిన ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. భూసారాన్ని పెంపొందించుకుంటూనే పంట దిగుబడులనూ పెంచుకుంటున్నారు. టన్నులకొద్దీ పశువుల ఎరువుల అవసరం లేకుండానే కొత్త పద్ధతుల్లో తక్కువ పశువులతోనే ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వాలు అత్యాధునికమైనవన్న భ్రమలో విదేశీ నమూనా ఎండమావుల వెంటపడకుండా.. మన రైతుల అనుభవంలో నిగ్గుతేలిన మేలైన, ప్రకృతికి అనుగుణమైన ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై దృష్టిపెట్టాలి. మట్టిలోనే పుట్టి మట్టిలోనే బతుకుతూ సమాజానికి మూడు పూటలా తిండి పెడుతున్న అచ్చమైన రైతుల అనుభవాల నుంచి బేషజాల్లేకుండా నేర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అన్నదే అసలు ప్రశ్న. మన భూముల, మన రైతుల, వినియోగదారుల భవిష్యుత్తు, ఆరోగ్యం- ఈ ప్రశ్నకు వచ్చే సమాధానంపైనే ఆధారపడి ఉంది. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ భూసారాన్ని రక్షించుకునేలా సాగు మారాలి ఉత్పాదకత పెరగాలంటే భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచాలి. రసాయనిక, సేంద్రియ, జీవన ఎరువులు కలిపి వాడాలి. 25-50% పోషకాలను సేంద్రియ, జీవన ఎరువుల ద్వారా అందించాలి. భూసారాన్ని పరిరక్షించుకునే విధంగా వ్యవసాయ పద్ధతులు మార్చుకోవాలి. కౌలు, యువ రైతులకు అవగాహన కలిగించేందుకు విస్తరణ వ్యవస్థను పటిష్టం చేయాలి. సూక్ష్మజీవుల ద్వారా పోషకాలను అందించడంపై దృష్టిపెట్టాలి. సూక్ష్మజీవుల గురించి మనకు తెలిసింది ఒక శాతమే. అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం సందర్భంగా ఈ అంశాలపై శ్రద్ధ చూపాలి. పరిశోధన ఫలితాలను రైతులకు అందించడానికి విస్తృత కృషి జరగాలి. సాయిల్ రిసోర్సెస్ మ్యాపింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు ఉపకరిస్తాయి. - డా. డి. బాలగురవయ్య, ప్రధాన శాస్త్రవేత్త, భూవిజ్ఞాన శాస్త్ర విభాగం, ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ), హైదరాబాద్ ప్రకృతి వ్యవసాయంతోనే భూముల పునరుజ్జీవనం! మట్టి మొక్కలకు పునాది. ప్రకృతిసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలో జీవరాశి (వానపాములు, సూక్ష్మజీవులు, పురుగులు, శిలీంధ్రాలు, ఇంకా మట్టిలో ఉండే అనేక ప్రాణులు) నిరంతరాయంగా పోషకాలను మొక్కల వేళ్లకు అందిస్తాయి. కానీ గత అరవయ్యేళ్లుగా రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, శిలీంధ్రనాశనులు, కలుపుమందులు వాడుతుండడం వల్ల మట్టిలో ఉండాల్సిన వానపాములు, ఇతర జీవరాశి నాశనమై భూమి నిస్సారమైపోయింది. ఏదైనా ఎరువును బయటి నుంచి అధికంగా తెచ్చి వేస్తేనే గానీ పంట పండని దుస్థితి నెలకొంది. ఇప్పుడు మనం రసాయనిక ఎరువులు, పురుగుమందులు, సూక్ష్మపోషకాలు పొలంలో వేయకుండా పంటలు పండించాలనుకుంటే.. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా మట్టిలోని జీవరాశిని, వానపాములను తిరిగి ఆహ్వానించాలి. ప్రకృతి మనకు అందించిన ఈ అద్భుతమైన వ్యవసాయ విజ్ఞానానికి అడ్డుచెప్పే వారెవరూ ఇప్పుడు లేరు..ప్రాణావసరం కాబట్టి! - సుభాష్ పాలేకర్, ప్రకృతి వ్యవసాయోద్యమ సారధి, మహారాష్ట్ర (‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం - 1’ పుస్తకం నుంచి) నడుస్తుంటే మట్టి పెళ్లలు గుచ్చుకునేవి..! పచ్చిరొట్ట ఎరువులు, ఘనజీవామృతం, జీవామృతం వాడుతూ 6 ఎకరాల్లో నాలుగేళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తున్నా. సేంద్రియ కర్బనం 0.5% నుంచి 0.95%కు పెరిగింది. అంతకుముందు పొలంలో చెప్పుల్లేకుండా నడిస్తే మట్టిపెళ్లలు గుచ్చుకునేవి. ఇప్పుడు నడి ఎండాకాలంలోనూ చెప్పుల్లేకుండా హాయిగా నడవొచ్చు. ఎకరానికి బీపీటీ ధాన్యం 28-30 బస్తాల దిగుబడి వస్తోంది. మా పొలం తుపాన్లు తట్టుకొని పడిపోకుండా నిలబడింది. నేల తేమ ఆరిపోదు. తక్కువ నీరే సరిపోతున్నది. - కోగంటి రవికుమార్ (80192 59059), సేంద్రియ రైతు, ఇందుపల్లి, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా సేంద్రియ కర్బనం 3% నుంచి 0.5%కి తగ్గింది.. జీవామృతం, పంచగవ్య, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువుల ద్వారా సేంద్రియ వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తున్నాం. భూముల్లో సేంద్రియ కర్బనం 50 ఏళ్ల నాడు 3% ఉండే 0.5%కి తగ్గింది. దీన్ని కష్టపడి 1%కి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులను చైతన్యవంతం చేస్తున్నాం. 8 ఏళ్లలో సేంద్రియ సాగు విస్తీర్ణం 5% నుంచి 25%కి పెరిగింది. సేంద్రియ ముడి బియ్యంతోపాటు సేంద్రియ పాలూ అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగ దారుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, వైద్య ఖర్చులు 50% తగ్గాయి. రైతులంతా సేంద్రియ సాగుకు మళ్లితే ఆసుపత్రుల అవసరమే ఉండదు. ప్రతి రైతుకూ నాటు ఆవు లేదా దూడైనా ఉండాలి. - కే సాంబశివరావు (97011 08511), సేంద్రియ సాగు సమన్వయకర్త, ప్రభుత్వ రైతు శిక్షణా కేంద్రం, విజయవాడ -
విధానాలు మారితేనే భూమి పదిలం!
కోల్పోతున్న వనరులను తనంతట తానే సమకూర్చుకునే సహజ శక్తి భూమికి ఉంది. ఈ శక్తిని రసాయనిక వ్యవసాయం కుంగదీస్తున్నది. ఫలితంగా నాగరికతకు మూలమైన భూమాత నిస్సారమవుతోంది. ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రకృతికి హాని చేయని సాగు పద్ధతులెన్నో అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వం పనిగట్టుకొని విస్మరిస్తోంది. ఏ కోణం నుంచి చూసినా మనం భూముల్ని ఎంతో గౌరవిస్తాం. అందువల్ల భూగోళాన్ని భూమాతగా భావిస్తుంటాం. మానవులతో సహా అన్ని జీవరాశులు రూపుదిద్దుకోవడానికి భూమాత ఒక వేదికగా కొనసాగడమే దీనికి కారణం. మన నాగరికత, సంస్కృతి భూమి చుట్టూ తిరుగుతుంటాయి. మన నాగరికత, సంస్కృతి ప్రారంభ కాలం నుంచి మనకు అవసరమైన మేర మాత్రమే భూముల(ప్రకృతి) నుంచి ఆహారాన్ని, ఇతర అవసరాలను తీర్చుకునేవాళ్లం. ఆ మేరకే ఉత్పత్తి చేసే వాళ్లం. కోల్పోయిన వనరులను ప్రకృతి తిరిగి తనంతట తానే పునరుజ్జీవింప చేసుకునేది. పశుపోషణ సేద్యంలో ముఖ్య భాగంగా కొనసాగింది. అలా శతాబ్దాలు గడచినా భూమి ఉత్పాదకత, ఆరోగ్యం ఏమీ క్షీణించలేదు. కానీ, సొంత వినిమయానికి కాక కేవలం లాభాపేక్షతో ‘సంపాదించి ఆస్తులను కూడబెట్టుకోవడానికి’ ప్రకృతి వనరులను వేగంగా కొల్లగొట్టడం దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. కోల్పోతున్న వనరులను ప్రకృతి తనంతట తాను పునరుజ్జీవింప చేయలేని స్థితికి చేరింది. పారిశ్రామిక రసాయనిక వ్యవసాయ పద్ధతుల వల్ల భూమాత తిరిగి కోలుకోలేని విధంగా క్షీణిస్తోంది. ఒకప్పుడు భూమాతపై ఎంతో విశ్వాసంతో ఆధారపడిన మనం ఇప్పుడు ఆస్థాయిలో ఆధారపడలేకపోతున్నాం. పర్యావరణాన్ని రక్షించే సేద్యం మేలు ఈ నేపథ్యంలో పంటలు పండించే ప్రక్రియను తిరిగి ప్రకృతిలో భాగంగా మార్చుకొని సుస్థిరాభివృద్ధిని సాధించాలి. అదెలాగన్నదే నేడు మన ముందున్న ప్రధాన ప్రశ్న. దీనికి సమాధానంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, ప్రకృతిలో భాగంగా సేద్యం కొనసాగాలి. సేద్య భూముల్లో పెద్ద ఎత్తున సేంద్రియ పదార్థాలను కలపడం మినహా మరో పద్ధతి లేదు. అయితే, ఇప్పుడు మన సేద్యం ప్రధానంగా 5 ఎకరాల లోపు విస్తీర్ణం గల చిన్న కమతాలలో కొనసాగుతోంది. పైగా, సేద్య భూమిపై ఏ హక్కూలేని కౌలు సేద్యం వేగంగా విస్తరిస్తోంది. కౌలు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తక్షణం లాభాన్ని చేకూర్చే సేద్య పద్ధతులను, సాంకేతికాలను వినియోగిస్తున్నారే తప్ప.. దీర్ఘకాలంలో భూమి ఉత్పాదకతకు అవసరమైన సేంద్రియ ఎరువుల వాడకంపై శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా, భూముల ఉత్పాదకత రోజురోజుకూ క్షీణిస్తున్నది. భూసారం పెంపుపై రైతులకు దీర్ఘకాల ఆసక్తి కలిగించేలా సర్కారూ చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదు. కార్పొరేట్ సేద్యం నష్టదాయకం ప్రపంచీకరణ దృష్ట్యా ప్రభుత్వం కార్పొరేట్ సేద్యానికే మొదటి ప్రాధాన్యతనిస్తున్నది. కార్పొరేట్ యాజమాన్యాలు కూడా తక్షణ అధిక లాభాల్నిచ్చే భారీ యాంత్రీకరణకు, రసాయనిక ఎరువులు, ఇతర రసాయనాల వాడకానికే ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప సేంద్రియ ఎరువులను వాడుతూ దీర్ఘకాలంలో భూమి ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు. అందువల్ల కార్పొరేట్ అనుకూల విధానాలను పునరంచనా వేసి.. సుస్థిర వ్యవసాయోత్పత్తికి దోహదపడే విధంగా వాటిని మార్చాలి. రసాయనిక వ్యవసాయం వల్ల వాతావరణంలో వస్తున్న మార్పుల దుష్పలితాలను తుపాన్లు, అకాల వర్షాలు, వరదలు, అనావృష్టి, కరవు కాటకాల రూపంలో ప్రతి సంవత్సరమూ అనుభవిస్తూనే ఉన్నాం. వాతావరణం వేడెక్కడానికి ప్రధాన కారకులు అభివృద్ధి చెందిన దేశాలే. వాతావరణ మార్పులను నిలువరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సిద్ధాంత రీత్యా అంగీకారం తెలుపుతూనే.. తమ వంతు బాధ్యతలు తీసుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు పూర్తిగా అంగీకరించడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఈ భారాన్ని భరించాలని ఒత్తిడి చేస్తున్నాయి. కానీ, తుపాన్లు వరదలు, కరవు కాటకాల వల్ల జరుగుతున్న నష్టాలు స్థానిక స్వభావం కలవి. వీటి దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి స్థానికంగానే గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల మన దేశం గట్టి చర్యలు తీసుకోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్పొరేట్ అనుకూల విధానాలు మారాలి మన దేశంతో సహా 30 దేశాల నుంచి దాదాపు 600 మంది ఉన్నతస్థాయి శాస్త్రజ్ఞులు, విధాన నిర్ణేతలు 2008లో సమావేశమై ఈ చర్యలపై చర్చించారు. సుస్థిర వ్యవసాయోత్పత్తికి వ్యవసాయ రసాయనాలు దోహదపడవనీ, సేంద్రియ ఎరువులను వాడాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. వచ్చే 50 ఏళ్లలో చింతలేని వ్యవసాయానికి తగిన సాంకేతికాలు.. చిన్న కమతాల రైతులకు అనుకూలంగా ఉన్నాయి. వీటిని అమలు చేయడానికి సంసిద్ధత తెలుపుతూ భారతదేశం సంతకం చేసింది. కానీ, కార్పొరేట్ సేద్యాన్ని ప్రోత్సహించే విధానాలనే ప్రభుత్వం కొనసాగిస్తోంది. చిన్న కమతాల స్థాయిలో సేంద్రియ ఎరువుల వాడకంపై రైతుల్లో ఆసక్తిని కలిగించడానికి ప్రభుత్వం విధానాలను మార్చాలి. వాతావరణ మార్పుల్ని, వాటి దుష్ర్పభావాలను గమనంలో ఉంచుకొని భారత ప్రభుత్వం 2011లో వాతావరణ ఒడుదొడుకులను తట్టుకునే వ్యవసాయ జాతీయ పరిశోధనా సంస్థను స్థాపించింది. దీనికి అనుగుణమైన విజ్ఞానం, ఎన్నో సాంకేతికాలు, సాగు పద్ధతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిని అమల్లోకి తేవడంపై భారత ప్రభుత్వం ఆసక్తి చూపటం లేదు. సుస్థిర వ్యవసాయాభివృద్ధికి, భూమి ఉత్పాదకత పెంచటానికి అందుబాటులో ఉన్న సాంకేతికాల అమలుపై దృష్టి కేంద్రీకరించాలి. సేంద్రియ ఎరువుల లభ్యత పెంచి భూముల సారాన్ని పెంచేందుకు దోహదపడాలి. భూముల్ని ప్రైవేటు ఆస్తులుగా చూడకుండా.. జాతీయ సంపదగా పరిగణించాలన్న స్పృహను కలిగించాలి. ‘అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం-2015’ ఈ దిశలో ఆలోచింపచేయటానికి దోహదపడాలి. (వ్యాసకర్త: విశ్రాంతాచార్యులు, భూవిజ్ఞాన శాస్త్ర విభాగం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం) -
జంషెడ్పూర్... భారత కలల నగరం
గాంధీ చెప్పారు. ఇప్పుడు మోడీ కూడా చెప్పారు. శుభ్రత అనేది నాగరికతకు సూచికని, ఆరోగ్యానికి హేతువని. వారు చెప్పింది సామాజిక శుభ్రత గురించి. అయితే ‘సామాజిక శుభ్రత’ అనే మాట వినిపిస్తే ఎంతసేపూ మనకు సస్యశ్యామలంగా ఉండే హర్యానాలోని చంఢీఘర్, లేక రాజరికపు ఆనవాళ్లున్న మైసూరు.. ఇవే ఎందుకు గుర్తొస్తాయి? మన చెవిన పెద్దగా పడని ఒక అందమైన, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన నగరం కూడా ఒకటుంది. అదే జంషెడ్పూర్ (జార్ఖండ్). ఈ పేరును మనం బాగా విన్నా కూడా, తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. నిర్మాణం ‘‘ఏ దేశమైతే ఇనుముపై ఆధిపత్యం సాధిస్తుందో, ఆ దేశం బంగారంపై కూడా ఆధిపత్యం సాధిస్తుంది.’’ స్కాట్లాండ్ తత్వవేత్త థామస్ కార్లైల్ 1867లో ఈ వాక్యం చెప్పి ఉండకపోతే ‘జంషెడ్పూర్’ అనే ఒక నగరం మన దేశంలో ఉండేదే కాదేమో! బరోడా పారిశ్రామికవేత్త జంషెడ్జీ నెస్సర్వాన్జీ టాటా ఈ వాక్యంతో ప్రభావితమై ఒక స్టీల్ ప్లాంట్ స్థాపించాలని నిశ్చయించుకున్నారు. దానికోసం కొందరు నిపుణులను నియమించి దేశంలో ఇనుప ఖనిజ నిల్వలుండి, పక్కనే ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం ఉన్న ప్రాంతాన్ని కూడా వెతకండి అని సూచించారు. వారు మూడు సంవత్సరాల పాటు భారతదేశంలో జరిపిన అధ్యయనాల ఫలితంగా ఇనుముతో పాటు మాంగనీస్, లైమ్, బొగ్గు గనులున్న ‘సాక్‌చి’ (నేటి జంషెడ్పూర్) అనే గ్రామం గురించి వారికి తెలిసింది. ఆ గ్రామపరిధిలో విలువైన గనులు, సముద్రమట్టానికి దాదాపు 140 మీటర్ల ఎత్తులో చక్కటి వాతావరణం ఉన్న చోటానాగ్పూర్ పీఠభూమి వారిని బాగా ఆకట్టుకుంది. పైగా చుట్టూ రెండు నదులు. అటువంటి సాక్‌చి ప్రాంతాన్ని పరిశీలించిన టాటా ఇంతకంటే అనువైన ప్రదేశం దొరకదని అక్కడ ఒక మంచి ఊరుని నిర్మించమని సూచించారు. కొత్తగా నిర్మించే నగరం ఎలా ఉండాలని ఆయన కలగన్నారో తెలుసా? ఇరువైపులా చెట్లతో కూడిన విశాలమైన రహదారులు, అవికూడా త్వరగా పెరిగే లక్షణం గల చెట్లు, నిర్మించే ప్రతి భవన, వ్యాపార సముదాయంలో విశాలమైన లాన్‌తో కూడిన కాంపౌండ్లు, ఫుట్‌బాల్, హాకీ తదితర క్రీడలకు ప్రతి పెద్ద కాలనీల్లో స్థలాలు, ప్రతి కాలనీలో పార్కులు, అక్కడక్కడా కొన్ని పెద్ద పార్కులు, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన వాతావరణంలో విశాలమైన స్థలంలో గుడి, మసీదు, చర్చి కచ్చితంగా ఉండేలా పట్టణాన్ని రూపొందించమని ఆయన సూచించారు. కలలు చాలామంది కంటారు. కానీ టాటా కన్న కల నిజమైంది. ఆయన కోరినట్టే పట్టణం నిర్మితమైంది. ఒక చిత్రకారుడు గీసిన అందమైన చిత్రంలా రూపుదిద్దుకుంది ఆ పట్టణం. ఆయన అంత క్రాంతదర్శి కాబట్టే బ్రిటిష్ పాలకులు కూడా ఆయన దృష్టికి ముగ్ధులై సాక్‌చి పట్టణానికి టాటా పేరు మీదుగానే జంషెడ్పూర్ అని పెట్టారు. సహజమైన నీటి వనరులు వినియోగించుకుని కృత్రిమ సరస్సులను కూడా నిర్మించారిక్కడ. నగరం ప్రత్యేకతలు సుమారు 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జంషెడ్పూర్ చక్కటి వాతావరణం ఉన్న నివాస ప్రాంతం. భారతదేశపు మొట్టమొదటి ‘ప్లాన్డ్ ఇండస్ట్రియల్ సిటీ’. సమృద్ధిగా ఉపాధినిచ్చే జంషెడ్‌పూర్‌లో అత్యధికులు ఉద్యోగులే. ఉద్యోగులు కాకుండా ఎవరైనా ఉన్నారంటే వారు కొందరు కాంట్రాక్టర్లు, అక్కడి ఉద్యోగులకు అవసరమైన వస్తువులు, సదుపాయలు, సేవలు అందించే వ్యక్తులు, చిన్న వ్యాపారులు. ఈ నగరానికి ఉన్న కొన్ని విశిష్టతల కారణంగా ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా మారింది. దీనికింకా చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించిన నగరం. జనాభా పది లక్షలు దాటినా నగరపాలక సంఘం లేని నగరం.భారతదేశంలో సంపన్న నగరం. అంటే (ఏడాదికి పదిలక్షలు ఆపైన ఆదాయం వచ్చేవాళ్లు అత్యధికంగా ఉన్న నగరం.స్థానికులు అతితక్కువగా ఉండి, అన్నిరాష్ట్రాల ప్రజలు పెద్దసంఖ్యలో ఉన్న నగరం. భాషాపరంగా ఏర్పడిన సంఘాల ద్వారా కమ్యూనిటీ లివింగ్ ఉన్న ఏకైక నగరం. ప్రభుత్వ ప్రమేయం లేకుండా అత్యంత పరిశుభ్రంగా ఉన్న నగరం. ప్రపంచంలోని వంద వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. తూర్పు ఉత్తర భారతంలో కోల్‌కతా, పాట్నా తర్వాత పెద్దనగరం. జార్ఖండ్ రాష్ర్టంలో తూర్పు సింగ్భమ్ జిల్లా కేంద్రమే అయినా, ఇది మాత్రం రాష్ర్టంలో భౌగోళికంగా, జనాభా పరంగా అతిపెద్ద నగరం. ఈ నగరానికి చాలాపేర్లున్నాయి. టాటా, స్టీల్ సిటీ, టాటానగర్, జాంపాట్, జమ్స్టెర్డామ్, ఇండియా పిట్స్బర్గ్ ఇలా అనే కరకాలుగా పిలుస్తారు.