- మూడు నెలల్లోగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశం
తెరపైకి రమేశ్‌బాబు పౌరసత్వం
Published Thu, Aug 11 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రహోంశాఖలో పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని మూడు నెలల్లోగా నిర్ణయించాలని దేశ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం ఆదేశించినట్లు మీడియాలో రావడం వేములవాడ నియోజకవర్గంలో చర్చకు దారితీసింది. రమేశ్‌బాబు పౌరసత్వం కేసును విచారించిన జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రహోంశాఖకు సూచిస్తూనే... హైకోర్టుకు నిర్ణయం ప్రకటించాలని ఆదేశించిందని చర్చించుకుంటున్నారు. రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు రమేశ్‌బాబు ఏడాదిపాటు స్వదేశంలో ఉన్నట్లు రుజువు చూపించాలని కోరింది. కేంద్ర హోంశాఖ చేపట్టిన విచారణలో రమేశ్‌బాబు కేవలం 96 రోజులు మాత్రమే స్వదేశంలో ఉన్నట్లు తేలింది. ఇందుకు రమేశ్‌బాబుకు కేంద్ర హోంశాఖ కార్యాలయం షోకాజు నోటీసు జారీ చేసింది. దీంతో ఈ అంశంపై త్రీమెన్ కమిటీని వేయాలని రమేశ్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కమిటీ ముందు ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ హాజరై తన వాదనను వినిపించారు. అప్పట్నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ అంశం తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది. ఈ అంశాన్ని కేవలం మూడు నెలల్లో స్పష్టం చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది.
Advertisement