mla ramesh babu
-
‘పెట్టుబడి సాయం’ రైతునిధికే ఇస్తా
వేములవాడ: తనకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయభూములపై అందే పెట్టుబడి సాయం రూ.1.20 లక్షలను రైతునిధికి విరాళంగా అందజేస్తానని వేములవాడ శాసనసభ్యుడు సీహెచ్ రమేశ్‌బాబు ప్రకటించారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, రైతుబంధు పథకం ద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం ప్రారంభం కాబోతుందన్నారు. రాష్ట్రంలోని భూస్వాములు పెద్ద మనసు చేసుకుని చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు వారికి వచ్చే పెట్టుబడి సాయాన్ని రైతునిధికి అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ నామాల ఉమ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వైఫల్యంతోనే నీటి సమస్య
కథలాపూర్(వేములవాడ): వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు వైఫల్యంతోనే నియోజకవర్గంలోని గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని పోసానిపేట గ్రామంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగునీటికి ప్రజలు, సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయిన లేదని మండిపడ్డారు. కలిగోట సూరమ్మ రిజర్వాయర్‌ను నింపి అక్కడి నుంచి కథలాపూర్, మేడిపెల్లి మండలాల చెరువులకు నీరు వదలాలని ప్రజలతో కలిసి ఆందోళనలు చేసినా.. మా మాట వినకపోవడం, ప్రభుత్వానికి, పాలకులకు ముందుచూపు లేకపోవడంతో ఈ దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. మిషన్‌భగీరథ పథకాన్ని అడ్డుపెట్టుకొని నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో బోరుబావులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. సమావేశంలో కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి, బీజేవైఎం మండలాధ్యక్షుడు పులి హరిప్రసాద్, నాయకులు వెలిచాల సత్యనారాయణ, కాయితి నాగరాజు, ప్రసాద్, సురేశ్ పాల్గొన్నారు. -
‘నేరెళ్ల’ బాధితులను ఆదుకుంటాం
అధికార పార్టీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు హామీ సిరిసిల్ల: నేరెళ్ల బాధితులను టీఆర్ఎస్ ఆదుకుంటుందని, మంత్రి కేటీఆర్ ఢిల్లీ నుంచి రాగానే వారిని పరామర్శిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు వెల్లడించారు. వేములవాడలో ఆదివారం ఇద్దరు బాధితులు కోరుగంటి గణేశ్, చీకోటి శ్రీనివాస్‌లను ఎమ్మెల్యే పరామ ర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుక లారీల దహనం, తర్వాతి పరిణామాలు దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌తో తాను మాట్లాడానని, ఢిల్లీ నుంచి రాగానే బాధితులను పరా మర్శిస్తారని ఆయన చెప్పారన్నారు. టీఆర్ఎస్ పార్టీపరంగా బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబును కలిసేందుకు వెళ్లిన సందర్భంగా శ్రీనివాస్, గణేశ్ నడిచేందుకు ఇబ్బంది పడ్డారు. ‘పోలీసులు బాగా కొట్టారు సార్.. మేం పేదోళ్లం.. ఆదుకోండి’ అంటూ కన్నీరు పెట్టగా ఎమ్మెల్యే ఓదార్చారు. నేరెళ్ల బాధితుల్లో చీలిక.. కరీంనగర్ జైలు నుంచి కండిషనల్ బెయిల్‌పై విడుదలైన 8 మంది బాధితుల్లో ఇద్దరు చీలిపోయి అధికార పార్టీ ఎమ్మెల్యే రమేశ్‌బాబును కలిశారు. బాధితులు నేరెళ్లకు చెందిన పెంట బాణయ్య, చెప్యాల బాలరాజు, పసుల ఈశ్వర్‌కుమార్, కోల హరీశ్, గంధం గోపాల్, రామచంద్రాపూర్‌కు చెందిన బత్తుల మహేశ్ ఒక్కటిగా ఉన్నారు. పరామర్శకు మాయావతి నేరెళ్ల బాధితులను పరామర్శించేం దుకు బీఎస్పీ అధినేత, మాజీ సీఎం మాయావతి వస్తున్నారని బీఎస్పీ నాయకులు తెలిపారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ నేరెళ్ల బాధితులను పరామర్శించి వెళ్లిన నేపథ్యంలో నేరెళ్ల ఘటన గురించి తెలుకున్న మాయావతి.. ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. -
ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన పోలీస్ వాహనం
సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం వద్ద బుధవారం పెను ప్రమాదం తప్పింది. ఆలయం వద్ద బుధవాదం ఉదయం ఎమ్మెల్యే రమేష్‌బాబు వాహనాన్ని పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే వాహనం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్పగాయాలైనట్టు సమాచారం. క్షతగాత్రులను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. -
తెరపైకి రమేశ్‌బాబు పౌరసత్వం
మూడు నెలల్లోగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశం వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రహోంశాఖలో పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని మూడు నెలల్లోగా నిర్ణయించాలని దేశ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం ఆదేశించినట్లు మీడియాలో రావడం వేములవాడ నియోజకవర్గంలో చర్చకు దారితీసింది. రమేశ్‌బాబు పౌరసత్వం కేసును విచారించిన జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రహోంశాఖకు సూచిస్తూనే... హైకోర్టుకు నిర్ణయం ప్రకటించాలని ఆదేశించిందని చర్చించుకుంటున్నారు. రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు రమేశ్‌బాబు ఏడాదిపాటు స్వదేశంలో ఉన్నట్లు రుజువు చూపించాలని కోరింది. కేంద్ర హోంశాఖ చేపట్టిన విచారణలో రమేశ్‌బాబు కేవలం 96 రోజులు మాత్రమే స్వదేశంలో ఉన్నట్లు తేలింది. ఇందుకు రమేశ్‌బాబుకు కేంద్ర హోంశాఖ కార్యాలయం షోకాజు నోటీసు జారీ చేసింది. దీంతో ఈ అంశంపై త్రీమెన్ కమిటీని వేయాలని రమేశ్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కమిటీ ముందు ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ హాజరై తన వాదనను వినిపించారు. అప్పట్నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ అంశం తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది. ఈ అంశాన్ని కేవలం మూడు నెలల్లో స్పష్టం చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. -
నీటి కోసం ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు
కథలాపూర్ (కరీంనగర్): వేసవిలో నీటి సమస్యతో సతమతమవుతున్న మహిళలు కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబును నిలదీశారు. కథలాపూర్ మండలం చింతకుంట, దూలూరు చెరువుల్లో మిషన్ కాకతీయ పనుల ప్రారంభోత్సవానికి రమేశ్‌బాబు వెళుతుండగా... తాండ్రియాల్ గ్రామం వద్ద స్థానిక మహిళలు ఆయనను అడ్డుకున్నారు. తాగు నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. గ్రామంలోని బోర్లన్నీ ఎండిపోవడంతో సమీప పొలాల్లోని బోర్ల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నామని ఎమ్మెల్యేకు వివరించారు. రెండు రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.