‘నేరెళ్ల’ బాధితులను ఆదుకుంటాం
అధికార పార్టీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు హామీ
సిరిసిల్ల: నేరెళ్ల బాధితులను టీఆర్‌ఎస్ ఆదుకుంటుందని, మంత్రి కేటీఆర్ ఢిల్లీ నుంచి రాగానే వారిని పరామర్శిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు వెల్లడించారు. వేములవాడలో ఆదివారం ఇద్దరు బాధితులు కోరుగంటి గణేశ్, చీకోటి శ్రీనివాస్‌లను ఎమ్మెల్యే పరామ ర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుక లారీల దహనం, తర్వాతి పరిణామాలు దురదృష్టకరమన్నారు.
ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌తో తాను మాట్లాడానని, ఢిల్లీ నుంచి రాగానే బాధితులను పరా మర్శిస్తారని ఆయన చెప్పారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీపరంగా బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబును కలిసేందుకు వెళ్లిన సందర్భంగా శ్రీనివాస్, గణేశ్ నడిచేందుకు ఇబ్బంది పడ్డారు. ‘పోలీసులు బాగా కొట్టారు సార్.. మేం పేదోళ్లం.. ఆదుకోండి’ అంటూ కన్నీరు పెట్టగా ఎమ్మెల్యే ఓదార్చారు.
నేరెళ్ల బాధితుల్లో చీలిక..
కరీంనగర్ జైలు నుంచి కండిషనల్ బెయిల్‌పై విడుదలైన 8 మంది బాధితుల్లో ఇద్దరు చీలిపోయి అధికార పార్టీ ఎమ్మెల్యే రమేశ్‌బాబును కలిశారు. బాధితులు నేరెళ్లకు చెందిన పెంట బాణయ్య, చెప్యాల బాలరాజు, పసుల ఈశ్వర్‌కుమార్, కోల హరీశ్, గంధం గోపాల్, రామచంద్రాపూర్‌కు చెందిన బత్తుల మహేశ్ ఒక్కటిగా ఉన్నారు.
పరామర్శకు మాయావతి
నేరెళ్ల బాధితులను పరామర్శించేం దుకు బీఎస్పీ అధినేత, మాజీ సీఎం మాయావతి వస్తున్నారని బీఎస్పీ నాయకులు తెలిపారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ నేరెళ్ల బాధితులను పరామర్శించి వెళ్లిన నేపథ్యంలో నేరెళ్ల ఘటన గురించి తెలుకున్న మాయావతి.. ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.