సాక్షి, హైదరాబాద్ : ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి కాలం దగ్గర పడింది. అందుకే వికృత చేష్టలకు పాల్పడుతోంది’’అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ బహుజన సమాజం సహించే స్థితిలో లేదన్నారు. నేరెళ్లలో దళిత, గిరిజన, బీసీలను ఇసుక లారీల కింద తొక్కించి, వారి కుటుంబాలను చిత్రహింసలు పెట్టి ఏడాదవుతున్నా బాధితులకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. ‘‘ఇది తెలంగాణ దళిత సమాజాన్నంతటినీ వేధించినట్టే. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంటుంది’’అని చెప్పారు. నేరెళ్ల ఘటనకు, ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన ఘటనకు నిరసనగా ఈ నెలాఖర్లో, లేదా ఆగస్టు తొలి వారంలో సిరిసిల్లలో ‘దళిత గిరిజన ఆత్మగౌరవ సభ’నిర్వహిస్తామని వెల్లడించారు.
సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఆహ్వానిస్తామన్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ నేత కె.కె.మహేందర్‌రెడ్డిలతో కలిసి నేరెళ్ల బాధితులు గురువారం గాంధీభవన్‌కు వచ్చి ఉత్తమ్‌తో గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఘటన జరిగి ఏడాదైనా బాధితులకు న్యాయం చేయలేదని ఆక్షేపించారు. ‘‘వారిపై కేసులే ఉపసంహరించుకోలేదు. ఏడాది గడుస్తున్నా చార్జిషీట్లూ వేయలేదు. దళితులు, గిరిజనులు, బీసీలను టార్గెట్ చేసి చిత్రహింసల పాలు చేశారు. ఇసుక మాఫియా ద్వారా వేల కోట్లు దోచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ కుటుంబం పనిచేస్తోంది. నేరెళ్ల ఘటన తర్వాత కూడా చాలామంది ఇసుక లారీలకు బలయ్యారు.
కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ తీరు మాత్రం ఎందరు చనిపోయినా పర్లేదు గానీ తమ ధనదాహం ఆగొద్దనేలా వ్యవహరిస్తున్నారు. టీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా రాబందుల్లా జనం మీద పడి దోచుకుంటున్నారు. పోలీస్‌స్టేషన్లలో బట్టలిప్పించి, చెప్పలేని చోట కరెంట్ షాక్‌లిప్పించి కొట్టడం తెలంగాణ సమాజం తలదించుకునే ఘటన. దీనికి బాధ్యుడైన ఎస్పీ విశ్వజిత్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలన్న పిటిషన్ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. కేటీఆర్ చెప్పబట్టే ఇవన్నీ జరిగాయి. లేదంటే ఇంతటి దారుణానికి పాల్పడిన పోలీసులపై చర్యలెందుకు తీసుకోలేదు?’’అని ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబ నిజ స్వరూపాన్ని నేరెళ్ల బాధితుల రూపంలోనయినా తెలంగాణ సమాజం గుర్తించాలన్నారు. దీన్ని కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంటుందని, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందని చెప్పారు. ప్రభుత్వం న్యాయం చేయకుంటే మెడలు వంచేలా కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. నేరెళ్ల బాధితులు కూడా మీడియాతో మాట్లాడారు. పోలీసుల చిత్రహింసలను వివరిస్తూ బోరున విలపించారు.
బకెట్లో కరెంట్ పెట్టి మూత్రం పోయించారు
ఒక్క లారీ యజమాని మీదా, డ్రైవర్ మీదా కేసులు పెట్టట్లేదు. మమ్మల్ని మాత్రం చిత్రహింసలు పెట్టారు. నిద్రపోకుండా కొట్టారు. బకెట్లో కరెంటు పెట్టి మూత్రం పోయించారు. ఇది చేయించింది కేటీఆరే. బయటకు చెపితే ఆడోళ్లను వ్యభిచారం కేసుల్లో పెడతామని, మగోళ్లను గంజాయి కేసుల్లో ఇరికిస్తామని ఎస్పీ బెదిరించాడు. కేటీఆర్ ఇసుక నింపిస్తడు, హరీశ్ పంపిస్తడు, కేసీఆర్ అమ్మిస్తడు. – బాణయ్య, బాధితుడు
కటింగ్ ప్లేయర్‌తో కండ గుంజి కరెంటు పెట్టిర్రు
2017 జూన్ 4 రాత్రి 11 గంటలకు తీసుకెళ్లి పొద్దున నమాజ్ టైం దాకా కొట్టిర్రు. నా చెవులకు, కాళ్లకు కరెంటు పెట్టిర్రు. కటింగ్ ప్లేయర్‌తో కండ గుంజి కరెంటు పెట్టిర్రు. ఇప్పటికీ చెవులు వినపడవు. నడుములు పనిచేయవు. మాట సరిగా రాదు. నాలుగు రోజులు కొట్టారు. మా కుటుంబాలకు పనికిరాకుండా పోయినం
– గంధం గోపాల్, బాధితుడు
పోలీసు కావాలనుకున్న... కానీ కాను
డిగ్రీ పూర్తి చేశాను. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్నా. ఆ రాత్రి వచ్చి పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. కొత్తగా పెళ్లయిందన్నా, కరెంటు పెట్టొద్దని కాళ్లు మొక్కినా వదల్లేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటేనే ఇష్టం లేదు. మాకు న్యాయం జరిగే దాకా పోరాడుతం
– హరీశ్, బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment