ఎలక్షన్ కమిషన్ కార్యాలయం
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందన్న ప్రచారం మిగతా పార్టీలను ఉరకలు పెట్టిస్తోంది. తిరిగి అధికారంలోకి రావాలన్న వ్యూహంలో భాగంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావించిన నేపథ్యంలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందని వార్తలొస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివరలో గడువు ముగియనున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం అసెంబ్లీలతోపాటు ఆ తర్వాత 6 నుంచి 10 మాసాల లోపు గడువు మిగిలి ఉన్న అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా, మహారాష్ట్ర, ఒడిశా శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ఈ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం కసరత్తును ప్రారంభించినట్టు తెలుస్తోంది.
టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ సై : ఈ పరిణామాల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలొస్తాయన్న భావనలో హస్తం నేతలున్నారు. ఈ క్రమంలో డిసెంబర్లో ఎన్నికలొస్తాయని పార్టీ నేతలకు పీసీసీ సమాచారమిస్తూ వారిని సిద్ధం చేస్తోంది. మరోవైపు ఎన్నికలను ఎదుర్కొనడానికి రాష్ట్రంలో పొత్తులపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు కలిసొచ్చే అన్ని పార్టీలతో పొత్తులకు అభ్యంతరం లేదని పీసీసీ ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతోనూ పొత్తుకు అభ్యంతరం లేదని పీసీసీ నేతలు చెబుతున్నారు. అయితే ఎన్నికల పొత్తులపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీదే తుది నిర్ణయమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. మరోవైపు వామపక్ష పార్టీలతో పాటు తెలంగాణ జన సమితి వంటి పార్టీలతో పొత్తులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment