nerella
-
నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే సాంబయ్య కన్నుమూత
కరీంనగర్: నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే ఉప్పరి సాంబయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కరీంనగర్ కశ్మీర్గడ్డలో ఉన్న నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. సాంబయ్య 1985లో జనతా దళ్ నుంచి నేరెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మృతికి మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఆయన కుమారుడు ఉప్పరి రవి కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా పొన్నం ఆయనతో ఉన్న జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో ఉప్పరి సాంబయ్య ఎమ్మెల్యేగా ఉన్నారని, విద్యార్థుల పలు సమస్యలను చెబితే వెంటనే స్పందించారని గుర్తుచేసుకున్నారు. సాంబయ్య విలువలతో కూడిన రాజకీయాలు చేశారని చెప్పారు. ఆయన మృతికి డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సంతాపం తెలిపారు. -
వైద్యానికి డబ్బుల్లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మృతి
సాక్షి, కోనరావుపేట (వేములవాడ): సర్పంచ్ అయితేనే లక్షలు సంపాదించుకునే రోజులివి. ఎమ్మెల్యే అయితే తరాలు కూర్చొని తిన్నా.. తరగని ఆస్తి కూడబెట్టుకునే కాలమిది. అలాకాకుండా ప్రజాసేవే పరమావధిగా సాదాసీదా జీవనం సాగించిన ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు అనారోగ్యంతో మంచాన పడి.. చేతిలో చిల్లిగవ్వలేక.. వైద్యం అందక బుధవారం మృతిచెందాడు. చిన్నపాటి రేకులషెడ్డులో ఉంటూ ఆ కుటుంబం కాలం వెళ్లదీస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన కర్రెల్ల నర్సయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. 1957–62 మధ్య అప్పటి నేరెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజాసేవకే అంకితమై ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు. 15 ఏళ్ల కింద నర్సయ్య కన్నుమూయగా, ఆయన కుటుంబం కడుపేదరికంలో బతుకుతోంది. నర్సయ్య కొడుకు ఆనందం (48) గ్రామంలోనే సుతారిగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపులో కణతులున్నాయని వైద్యులు చెప్పడంతో రూ.3 లక్షలు అప్పుచేసి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. మరో రూ.లక్ష అవసరం కాగా, డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేదు. బుధవారం ఇంట్లోనే కన్నుమూశాడు. ఆయనకు భార్య అనిత, కొడుకులు లెనిన్, మధు ఉన్నారు. -
మీ టైమ్ దగ్గర పడింది
సాక్షి, హైదరాబాద్ : ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి కాలం దగ్గర పడింది. అందుకే వికృత చేష్టలకు పాల్పడుతోంది’’అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ బహుజన సమాజం సహించే స్థితిలో లేదన్నారు. నేరెళ్లలో దళిత, గిరిజన, బీసీలను ఇసుక లారీల కింద తొక్కించి, వారి కుటుంబాలను చిత్రహింసలు పెట్టి ఏడాదవుతున్నా బాధితులకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. ‘‘ఇది తెలంగాణ దళిత సమాజాన్నంతటినీ వేధించినట్టే. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంటుంది’’అని చెప్పారు. నేరెళ్ల ఘటనకు, ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన ఘటనకు నిరసనగా ఈ నెలాఖర్లో, లేదా ఆగస్టు తొలి వారంలో సిరిసిల్లలో ‘దళిత గిరిజన ఆత్మగౌరవ సభ’నిర్వహిస్తామని వెల్లడించారు. సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఆహ్వానిస్తామన్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ నేత కె.కె.మహేందర్‌రెడ్డిలతో కలిసి నేరెళ్ల బాధితులు గురువారం గాంధీభవన్‌కు వచ్చి ఉత్తమ్‌తో గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఘటన జరిగి ఏడాదైనా బాధితులకు న్యాయం చేయలేదని ఆక్షేపించారు. ‘‘వారిపై కేసులే ఉపసంహరించుకోలేదు. ఏడాది గడుస్తున్నా చార్జిషీట్లూ వేయలేదు. దళితులు, గిరిజనులు, బీసీలను టార్గెట్ చేసి చిత్రహింసల పాలు చేశారు. ఇసుక మాఫియా ద్వారా వేల కోట్లు దోచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ కుటుంబం పనిచేస్తోంది. నేరెళ్ల ఘటన తర్వాత కూడా చాలామంది ఇసుక లారీలకు బలయ్యారు. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ తీరు మాత్రం ఎందరు చనిపోయినా పర్లేదు గానీ తమ ధనదాహం ఆగొద్దనేలా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా రాబందుల్లా జనం మీద పడి దోచుకుంటున్నారు. పోలీస్స్టేషన్లలో బట్టలిప్పించి, చెప్పలేని చోట కరెంట్ షాక్లిప్పించి కొట్టడం తెలంగాణ సమాజం తలదించుకునే ఘటన. దీనికి బాధ్యుడైన ఎస్పీ విశ్వజిత్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలన్న పిటిషన్ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. కేటీఆర్ చెప్పబట్టే ఇవన్నీ జరిగాయి. లేదంటే ఇంతటి దారుణానికి పాల్పడిన పోలీసులపై చర్యలెందుకు తీసుకోలేదు?’’అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ నిజ స్వరూపాన్ని నేరెళ్ల బాధితుల రూపంలోనయినా తెలంగాణ సమాజం గుర్తించాలన్నారు. దీన్ని కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంటుందని, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందని చెప్పారు. ప్రభుత్వం న్యాయం చేయకుంటే మెడలు వంచేలా కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. నేరెళ్ల బాధితులు కూడా మీడియాతో మాట్లాడారు. పోలీసుల చిత్రహింసలను వివరిస్తూ బోరున విలపించారు. బకెట్లో కరెంట్ పెట్టి మూత్రం పోయించారు ఒక్క లారీ యజమాని మీదా, డ్రైవర్ మీదా కేసులు పెట్టట్లేదు. మమ్మల్ని మాత్రం చిత్రహింసలు పెట్టారు. నిద్రపోకుండా కొట్టారు. బకెట్లో కరెంటు పెట్టి మూత్రం పోయించారు. ఇది చేయించింది కేటీఆరే. బయటకు చెపితే ఆడోళ్లను వ్యభిచారం కేసుల్లో పెడతామని, మగోళ్లను గంజాయి కేసుల్లో ఇరికిస్తామని ఎస్పీ బెదిరించాడు. కేటీఆర్ ఇసుక నింపిస్తడు, హరీశ్ పంపిస్తడు, కేసీఆర్ అమ్మిస్తడు. – బాణయ్య, బాధితుడు కటింగ్ ప్లేయర్‌తో కండ గుంజి కరెంటు పెట్టిర్రు 2017 జూన్ 4 రాత్రి 11 గంటలకు తీసుకెళ్లి పొద్దున నమాజ్ టైం దాకా కొట్టిర్రు. నా చెవులకు, కాళ్లకు కరెంటు పెట్టిర్రు. కటింగ్ ప్లేయర్‌తో కండ గుంజి కరెంటు పెట్టిర్రు. ఇప్పటికీ చెవులు వినపడవు. నడుములు పనిచేయవు. మాట సరిగా రాదు. నాలుగు రోజులు కొట్టారు. మా కుటుంబాలకు పనికిరాకుండా పోయినం – గంధం గోపాల్, బాధితుడు పోలీసు కావాలనుకున్న... కానీ కాను డిగ్రీ పూర్తి చేశాను. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్నా. ఆ రాత్రి వచ్చి పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. కొత్తగా పెళ్లయిందన్నా, కరెంటు పెట్టొద్దని కాళ్లు మొక్కినా వదల్లేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఇష్టం లేదు. మాకు న్యాయం జరిగే దాకా పోరాడుతం – హరీశ్, బాధితుడు -
నేరెళ్ల దళితులపై దాడి రాజ్యహింసే
♦ టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలు ♦ ఇసుక మాఫియాను అరికట్టాలని డిమాండ్ ♦ రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం బిచ్చగాళ్లు చేసిందని విమర్శ సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై పోలీసుల దాడి రాజ్యహింసేనని టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం అభివర్ణిం చింది. థర్డ్ డిగ్రీ జరిపిన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు, బాధితులకు న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇసుక మాఫియాను అరికట్టి, దళితులకు న్యాయం కోసం పోరాడుతామన్నారు.ఆది వారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా హాజరయ్యారు. సమావేశంలో చేసిన తీర్మానా లను టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ మీడియా కు వివరించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై గుజరాత్లో దాడిని సమా వేశం ఖండించినట్లు వారు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో వారంలో 60మంది చిన్నపిల్లలు చనిపోవడం అక్కడి బీజేపీ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమని విమర్శించారు. రీడిజైన్ పేరుతో టీఆర్ఎస్ లూఠీ నీళ్ళు, నిధులు, నియామకాల నినాదాన్ని టీఆర్ఎస్ నీరుగార్చిందని మల్లు రవి, దాసోజు శ్రవణ్ విమర్శించారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయకున్నా సభ్యులు, చైర్మన్ జీతాలను 3 రెట్లు పెంచుకు న్నారన్నారు. రైతును రాజు చేస్తామన్న ప్రభుత్వం వారిని బిచ్చగాళ్లు చేసిందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రభుత్వం భారీగా లూఠీకి పాల్పడుతోందని శ్రవణ్ ఆరోపించారు. రైతులకు రుణాలివ్వాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం తీర్మానించినట్లు పేర్కొన్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు నీటి విడుదలకు పార్టీ పరంగా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర పార్టీకి సాంస్కృతిక విభాగం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించామని మల్లు రవి, శ్రవణ్ తెలిపారు. బూత్, గ్రామ, మండల, డివిజన్,జిల్లా స్థాయి, అనుంబంధ విభాగాల కమిటీలను సెప్టెంబర్ నెలాఖరులోగా భర్తీ చేయాలని సూచించామన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌కి సాంస్కృతిక విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీలో రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రాహుల్ సందేశ్ యాత్రలు నిర్వహిస్తామని, గడపగడపకూ కాంగ్రెస్ పార్టీ నినాదంతో ముందుకెళ్తామ న్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారం లోకి తీసుకురావడానికి సమావేశంలో దిశా నిర్దేశం జరిగిందన్నారు. ఇన్చార్జి కార్యదర్శి సతీశ్ జార్కోలి, సీఎల్పీ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేతలు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. -
నేరెళ్ల ఘటనలో తొలివేటు..
► సీసీఎస్ ఎస్సై రవీందర్ సస్పెండ్ ఆదినుంచీ వివాదాస్పదుడే.. ► ఇల్లంతకుంట నుంచి నేరెళ్ల ఘటన వరకు.. నేరెళ్ల దళితులపై పోలీసుల ‘థర్డ్‌డిగ్రీ’ ప్రయోగం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా.. బాధ్యుడైన సీసీఎస్ ఎస్సై బి.రవీందర్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావం తర్వాత శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసుల పనితీరు ప్రశంసనీయంగా ఉండగా.. నేరెళ్ల ఘటనతో అప్రతిష్టపాలైంది. సీసీఎస్ ఎస్సై రవీందర్ తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. సిరిసిల్ల: ఇల్లంతకుంటలో ఎస్సైగా పనిచేసిన సమయంలోనే రవీందర్ వివాదాస్పదుడిగా మారాడు. ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దొరికిపోయాడు. దీంతో అక్కడి మహిళలు ఫిర్యాదు మేరకు అప్పటి డీఎస్పీ దామెర నర్సయ్య విచారణ జరిపి ఎస్పీకి నివేదిక ఇచ్చారు. దీంతో రవీందర్ ను లా అండ్ ఆర్డర్ నుంచి తప్పించి కరీంనగర్ ఎస్పీ కార్యాలయానికి సరెండర్ చేశారు. చొప్పదండిలో పనిచేస్తున్న సమయంలో న్యాయంకోసం ఠాణాకు వచ్చే మహిళల సెల్‌నంబర్లు తీసుకుని రహస్యంగా ఫోన్ చేసి వేధించేవాడని అపవాదు ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావంతో రవీందర్‌ను జిల్లాకు కేటాయించారు. జిల్లా పోలీస్ బాస్‌తో సఖ్యతగా ఉండడంతో టాస్క్‌ఫోర్స్ టీంకు పర్యవేక్షకుడిగా నియమించారు. కొద్దిరోజుల క్రితం నకిలీ బంగారం విక్రయించేవారిని పట్టుకునేందుకు కర్ణాటక రాష్ట్రం వెళ్లి.. అక్కడ పోలీసులమని చెప్ప కుండానే.. మిస్‌ఫైర్ చేశాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. పోలీస్ బాస్ అండతో ఉత్సాహంగా పనిచేసిన రవీందర్ నేరెళ్ల ఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించి.. పోలీస్‌మార్క్‌ను చూపెట్టాడు. అది ఆయన మెడకు చుట్టుకుంది. ప్రభుత్వానికి తలనొప్పి..: నేరెళ్ల ఘటనలో సిరిసిల్ల పోలీసుల తీరు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. జూలై 2న తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో ఇసుక లారీ ఢీకొని భూమయ్య మరణించిన నాటినుంచి మంత్రి కేటీఆర్ వేములవాడకు గోప్యంగా వచ్చి వెళ్లేంతవరకూ సిరిసిల్ల ప్రాంతంలో పోలీసుల తీరు చర్చకు తెరలేపింది. సీఎం కేసీఆర్ సహా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి కేటీఆర్ నేరెళ్ల ఘటనను సమర్థించే ప్రయత్నం చేశారు. సమస్య జాతీయస్థాయికి వెళ్లే ప్రమాదం సమీపించడంతో సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఎస్సై రవీందర్‌పై తొలివేటు వేశారు. -
నేరెళ్ల ఘటనలో ఎస్ఐ రవీందర్ సస్పెండ్
సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సిరిసిల్ల సీసీఎస్ ఎస్ఐ రవీందర్‌ను గురవారం డీఐజీ సస్పెండ్ చేశారు. నేరెళ్ల ఘటనలో ఎస్ఐ రవీందర్ అతిగా ప్రవర్తించినట్టు తేలడంతో సస్పెండ్ చేసినట్టు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇసుక లారీలకు నిప్పు పెట్టిన ఘటనలో నేరెళ్లకు చెందిన కొంత మందిని పోలీసులు అరెస్టు చేసి, తీవ్రంగా హింసించారనేది ఆరోపణ. చిత్రహింసలకు గురైనవారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. As promised, the Inspector who was found to have used excessive force according to the DIG's report has been suspended https://t.co/ExvZxiwaev — KTR (@KTRTRS) 10 August 2017 -
‘నేరెళ్ల’పై ఎన్హెచ్ఆర్సీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ఢిల్లీ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్లకు చెందిన దళితులపై పోలీసుల దాడి వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. నేరెళ్ల ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదుచేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్ఎస్ కుంతియా, టీపీసీసీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు మంగళవారం ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ కార్యాలయంలో ఫిర్యాదు దాఖలుచేశారు. బాధితులను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారని, బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించాల్సిందిగా కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది. -
‘నేరెళ్ల’ బాధితులను ఆదుకుంటాం
అధికార పార్టీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు హామీ సిరిసిల్ల: నేరెళ్ల బాధితులను టీఆర్ఎస్ ఆదుకుంటుందని, మంత్రి కేటీఆర్ ఢిల్లీ నుంచి రాగానే వారిని పరామర్శిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు వెల్లడించారు. వేములవాడలో ఆదివారం ఇద్దరు బాధితులు కోరుగంటి గణేశ్, చీకోటి శ్రీనివాస్‌లను ఎమ్మెల్యే పరామ ర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుక లారీల దహనం, తర్వాతి పరిణామాలు దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌తో తాను మాట్లాడానని, ఢిల్లీ నుంచి రాగానే బాధితులను పరా మర్శిస్తారని ఆయన చెప్పారన్నారు. టీఆర్ఎస్ పార్టీపరంగా బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబును కలిసేందుకు వెళ్లిన సందర్భంగా శ్రీనివాస్, గణేశ్ నడిచేందుకు ఇబ్బంది పడ్డారు. ‘పోలీసులు బాగా కొట్టారు సార్.. మేం పేదోళ్లం.. ఆదుకోండి’ అంటూ కన్నీరు పెట్టగా ఎమ్మెల్యే ఓదార్చారు. నేరెళ్ల బాధితుల్లో చీలిక.. కరీంనగర్ జైలు నుంచి కండిషనల్ బెయిల్‌పై విడుదలైన 8 మంది బాధితుల్లో ఇద్దరు చీలిపోయి అధికార పార్టీ ఎమ్మెల్యే రమేశ్‌బాబును కలిశారు. బాధితులు నేరెళ్లకు చెందిన పెంట బాణయ్య, చెప్యాల బాలరాజు, పసుల ఈశ్వర్‌కుమార్, కోల హరీశ్, గంధం గోపాల్, రామచంద్రాపూర్‌కు చెందిన బత్తుల మహేశ్ ఒక్కటిగా ఉన్నారు. పరామర్శకు మాయావతి నేరెళ్ల బాధితులను పరామర్శించేం దుకు బీఎస్పీ అధినేత, మాజీ సీఎం మాయావతి వస్తున్నారని బీఎస్పీ నాయకులు తెలిపారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ నేరెళ్ల బాధితులను పరామర్శించి వెళ్లిన నేపథ్యంలో నేరెళ్ల ఘటన గురించి తెలుకున్న మాయావతి.. ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. -
అదే ధైర్యంతో ఉద్యమించండి
నేరెళ్ల ఘటనపై మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ సాక్షి, హైదరాబాద్: ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నేరెళ్ల గ్రామ ప్రజలు, దాని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేర్కొన్నారు. మాఫియాకు వ్యతిరేకంగా మరింత ధైర్యంగా పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. వనరుల పరిరక్షణ ఉద్యమంలో నేరెళ్ల ప్రజల పోరాటం తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శం అవుతుందని శుక్ర వారం ఓ లేఖలో పేర్కొన్నారు. కోస్తాంధ్ర పెట్టుబడి దారులు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని కొండలు, గుట్టలు, గోదావరి ఇసుకను తరలించి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ రెండు జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలు, వాళ్ల కుటుంబాలు ఇసుక మాఫియా నడుపుతున్నారని, వీళ్లందరికీ నాయ కుడు మంత్రి కేటీఆర్ అని దుయ్యబట్టారు. వనరులను తరలించడానికి టీఆర్ఎస్ మాఫియాను తయారు చేసిందన్నారు. ఆ మాఫియాను అడ్డుకుంటున్న ప్రజలను బెదిరింపులకు గురిచేయడమే కాకుండా యాక్సిడెంట్ల పేరుతో హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. -
నేరెళ్ల దళితులపై ఎందుకింత కక్ష?
గరగపర్రు గాయం మానక ముందే మరోసారి దళితులపై అగ్రవర్ణ ఆధిపత్యం విరుచుకుపడింది. కాకుంటే ఈసారి తెలంగాణ వంతుగా మారింది. కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల రాజన్న జిల్లాలో అమాయకులైన దళితులపై ఖాకీ క్రౌర్యం విరుచుకుపడడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా దందా ఎప్పటి నుంచో యథేచ్ఛగా సాగుతోంది. అడ్డుకోవాల్సిన సర్కారు, మాఫియాకే వత్తాసు పలికింది. అధికారికంగానే ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా సమయంలో రాజన్న సిరి సిల్ల జిల్లాలోని జిల్లేల్ల, నేరెళ్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. లారీలకు బలై, గత ఏడాదిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. యమపాశంలా మారిన లారీల రాకపోకలను బంద్ చేయించాలని కోరుతూ పెద్దఎత్తున ఉద్యమించారు ప్రజలు. ఈ సమయంలో అక్కడున్న లారీలు తగులబడ్డాయి. దీంతో భారీగా బలగాలను మోహరింపజేసి లాఠీచార్జీ చేయించారు. నేరెళ్ల గ్రామం మీద పడి దళితులను అరెస్టులు చేశారు. ఇళ్ల మీద పడి ఈడ్చుకొచ్చారు. అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, జిల్లా ఎస్పీ సమక్షంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ద్వారా దేశం తలదించుకునేలా చేశారు. ఈ ఘటనలో దళితులను పాశవికంగా కొట్టడం దారుణం. లారీలు తగులపెట్టడం నేరమైతే, దాన్ని ఎవరు చేశారో దర్యాప్తు చేసి నిరూపించి వారిని కోర్టులో హాజరు పరిచి, చట్ట ప్రకారం శిక్షించాలి. అంతేగాని దళితులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం ఘోరం. దీంట్లో జిల్లా ఎస్పీ పాల్గొనడం, దళితులను కులం పేరుతో దూషిస్తూ చావుదెబ్బలు కొట్టడమేగాక, ఈ విషయం బయటపెడితే మీ ఆడవాళ్లపై వ్యభిచార కేసులు పెడతానని బెదిరించడం ఏ రకమైన ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థో పాలకులే చెప్పాలి. ఏ పని చేయడానికీ పనికి రాకుండా కొట్టి, వారిని రిమాండ్‌కు పంపడం పోలీసు వ్యవస్థకే మచ్చ. ఒక జైలరే వారిపై హింసను చూసి జైలులో చేర్చుకోలేమని నిరాకరించాడంటే, కరీం నగర్ పోలీసుల వికృతపోకడలకు వేరే సాక్ష్యమేల? తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇంతటి దుర్మార్గం ఏనాడూ లేదు. ఇది గరగపర్రు కంటే అమానుషమైనది. అక్కడైనా కనీసం వెలేసి వదిలేశారు. మరి ఇక్కడేమో పోలీసులను పెట్టి మరీ నరకం చూపించారు. తెలంగాణ పాలకులు దళితులపైన కక్ష గడుతున్న తీరు ప్రతి గుండెను రగిలిస్తోంది. ఇందుకోసమేనా తెలంగాణను సాధించుకున్నదనే ప్రశ్న ఉదయిస్తున్నది. నిజానికి తెలంగాణ సాధనకోసం ప్రాణాలిచ్చిన బలిదానాల్లో కింది కులాల వారే అధికం. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు తమను తాము కాల్చుకొని ఉద్యమాన్ని రగిలించారు. ఇప్పుడు వారి త్యాగాలకు విలువలేకపోగా, దళిత బహుజన సమాజం పట్ల అధికారికంగా రాజ్యహింస కొనసాగుతోంది. ఈ సంఘటనపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి, దళితులపై కక్షపూరితంగా వ్యవహరించి, దాడి చేసిన పోలీసు అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలి. దళితులను కులంపేరుతో దూషించినందుకు ఎస్పీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. వారిని విధులనుంచి తప్పించి, బాధితులైన దళితులకు, బీసీలకు నష్ట పరిహారం అందించాలి. ప్రభుత్వం దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే రానున్న 2019 ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం నేర్పడం ఖాయం. డా‘‘ పసునూరి రవీందర్, కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత ‘ 77026 48825 -
కాంగ్రెస్ నేతలవి లత్కోరు రాజకీయాలు
► మండిపడిన మంత్రి కేటీఆర్ ► జైరాం రమేశ్, దిగ్విజయ్, ఉత్తమ్‌లవి లేకి మాటలు ► నేరెళ్ల ఘటనపై దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకులు లత్కోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని, సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో జరిగిన ఘటనపై ఉన్నవీ లేనివీ ప్రచారం చేస్తున్నారని మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. 125 ఏళ్ల ముసలి నక్క కాంగ్రెస్ పార్టీ అని, దళితుల సంక్షేమంపై ఆ పార్టీ మాట్లాడట మంటే.. మేకలు, గొర్రెల సంక్షేమం కోసం తోడేళ్లు సమావేశం పెట్టుకున్నట్టేనని వ్యాఖ్యా నించారు. దళితులపై జరిగిన అకృత్యాలపై చార్జిషీటు వేయాల్సి వస్తే.. అందులో ఏ1 ముద్దాయి కాంగ్రెస్ మాత్రమేనని, కాంగ్రెస్ జెండాకు ఉన్న రక్తం మరకలన్నీ దళితుల వేనని విమర్శించారు. మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కేటీఆర్ పేర్కొ న్నారు. ‘‘కాంగ్రెస్ పాలనంతా ఇసుకాసురుల పాలనే. కాంగ్రెస్ పాలనలో 2007–08 నుంచి 2014–15 మధ్య ఇసుక ద్వారా వచ్చిన అత్యధిక ఆదాయం రూ.10 కోట్లు మాత్రమే. అదే మా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2015–16లో రూ.374.88 కోట్లు, 2016–17లో రూ.435 కోట్లు, 2017–18లో ఇప్పటివరకు రూ.200 కోట్లు ఆదాయం సమకూరింది. అంటే సగటున ఏటా రూ.400 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తే.. కాంగ్రెస్ పాలనలోని పదేళ్లలో రూ.4 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి. ఈ లెక్కన ఎవరి కాలంలో ఇసుక మాఫియా ఉందో అర్థం కావడం లేదా?..’’ అని నిలదీశారు. కాంగ్రెస్ నేతల తీరు ‘లూట్– ఝూట్–స్కూట్ (దోపిడీ–అబద్ధం–పారిపోవడం)’లా ఉందని విమర్శించారు. అక్రమ ఇసుక దందా నియం త్రణలో భాగంగా ఒక్క సిరిసిల్ల జిల్లాలోనే రెండు వందల కేసులు నమోదు చేశామని.. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. శాంతిభద్రతల కోసమే... పోలీసుల కోసం కొనుగోలు చేసిన వాహనాల (ఇన్నోవాల) విషయంగా కాంగ్రెస్ నాయ కుడు జైరాం రమేశ్ దిగజారుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. కొత్త రాష్ట్రం కాబట్టి శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట యంత్రాంగం ఉండాలనే పోలీసు శాఖను ఆధునీకరించామని.. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ డీజీఎస్‌ఎన్‌డీ ద్వారా యూపీఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన ధరల మేరకే వాహనాల కోసం నేరుగా ఫ్యాక్టరీకి ఆర్డర్ ఇచ్చామన్నారు. కానీ జైరాం రమేశ్ అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు కంపెనీ ఉందో చూపిస్తే దానిని జైరాం రమేశ్, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలకు రాసిస్తానని కేటీఆర్ పేర్కొ న్నారు. ఇక లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవచేసే సంస్థలకు మినహాయిం పులు ఇవ్వడం అన్ని ప్రభుత్వాలు చేసేదేనని.. ఆ తరహాలోనే వెంకయ్యనాయుడు కుమార్తె స్వర్ణ భారతి ట్రస్ట్ మినహాయింపులు ఇచ్చామని చెప్పారు. సమావేశంలో మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, షిండే, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్తినే వాగొద్దు! కాంగ్రెస్ నేతలు ఆధారాలుంటే బయట పెట్టాలని, ఉత్తినే టీవీల ముందు వాగొ ద్దని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రు లు ఎందుకు రాజీనామా చేయాలని నిలదీశారు. నేరెళ్ల ఘటనలో కేసులు నమోదైన 12 మందిలో దళితులు నలుగురు మాత్రమేనని చెప్పారు. దళితులపై దాడులు జరిగాయంటూ కాం గ్రెస్ దిక్కుమాలిన రాజకీయాలకు పాల్ప డుతోందని మండి పడ్డారు. ‘‘సిరిసిల్లకు పోతామంటున్నారు. పోయి ఏం చెబు తారు? మా (కాంగ్రెస్) దగుల్బాజీ పాలన లో సిరిశాలను ఉరిశాలగా మార్చామని చెబుతారా? సిరిసిల్లలో ఎన్కౌంటర్లతో నెత్తురు పారించామని చెబుతారా?’’అని మండిపడ్డారు. -
నేరెళ్ల ఘటనపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులను థర్డ్ డిగ్రీతో హింసించిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే వైస్ చైర్మన్, సభ్యుడు రాములుకు కూడా ఫిర్యాదు చేశారు. త్వరలోనే సిరిసిల్ల వస్తామని కమిషన్ హామీ ఇచ్చింది. ఇసుక లారీలతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదనలో ప్రశ్నించిన, లారీలను దగ్ధం చేసిన గ్రామస్తులను పోలీసులు పాశవికంగా కొట్టిన విషయం విదితమే.